న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపిన విజయసాయి రెడ్డి.. అరకు రైలుకు విస్టాడోమ్ కోచ్‌ల సంఖ్య పెంచమని కోరినట్లు పేర్కొన్నారు.
రైల్వేమంత్రిని కలిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ .. ‘ఏపీకి రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయమన్నాం. ఏపీలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరాం. రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశాం. వాల్తేర్ డివిజన్‌ను కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరాం. సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషన్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాం’ అని తెలిపారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంచితే, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల నుంచి సంతకాలు సేకరించిన విషయాన్ని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేక సమితితో కలిసి ఎంపీల సంతకాల జాబితాను ప్రధానికి ఇస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment