సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో రైల్వే ప్రాజెక్టులకు భారీగానే కేటాయింపులు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. గత మూడు బడ్జెట్‌లలో లైన్లు, రైళ్ల పరంగా నిరాశే కలిగినా, కేటాయింపులు కొంత మెరుగ్గానే ఉన్నాయి. కానీ, తెలంగాణలో రైల్వేపరంగా ఉన్న డిమాండ్లతో పోలిస్తే, ఇవి సరిపోవు. దీంతో ప్రతీ బడ్జెట్ ఇంకా మెరుగ్గా ఉంటుందన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.
బడ్జెట్ ముందు ఎంపీలతో భేటీ అయ్యి వారి నుంచి అధికారులు ప్రతిపాదనలు స్వీకరిస్తారు. కానీ ఈసారి అలాంటి భేటీ దక్షిణమధ్య రైల్వే నిర్వహించలేదు. తను కూడా ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపలేదని తెలిసింది.
ఆయా రైల్వే లైన్లు ఇలా....
ఆర్మూరు–ఆదిలాబాద్ : ఈ లైన్ కీలకం. దీనికోసం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయంబాపూరావు, బండి సంజయ్ లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు.
►15 ఏళ్ల క్రితం పటాన్‌చెరు–ఆదిలాబాద్ లైన్ మంజూరైంది. ఆర్మూరు– నిర్మల్ మీదుగా సాగాల్సిన దీని నిడివి. 317 కి.మీ. ఇందుకు రూ.3771 కోట్లు ఖర్చవుతుదని అంచనా వేశారు. కానీ, ఆ తర్వాత దానిని కేంద్రం పక్కనపెట్టింది.
►పెద్దపల్లి–నిజామాబాద్ లైన్ పూర్తయిన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన పట్టాలెక్కింది. కరీంనగర్–నిజామాబాద్ లైన్‌లో ఉన్న ఆర్మూరు స్టేషన్ నుంచి కొత్త లైన్ మొదలై ముద్ఖేడ్–నాగ్‌పూర్ లైన్‌లో ఉన్న ఆదిలాబాద్ స్టేషన్‌తో అనుసంధానమవుతుంది. దీని నిడివి 300 కి.మీ., రూ. 2800 కోట్ల అంచనాతో 2017లో ఈ లైన్ మంజూరైంది. సర్వే పూర్తయ్యాక పనులు పట్టాలెక్కిలేదు. దీనికి నిధులు కేటాయించాలన్న ఒత్తిడి పెరిగింది.
వికారాబాద్–కృష్ణా: తెలంగాణ సీఎం మొదలు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టు వికారాబాద్–కృష్ణా లైను. గత బడ్జెట్‌లో ఫైనల్ లొకేషన్ సర్వే కూడా మంజూరైనా పనులు మొదలు కాలేదు.
►వికారాబాద్–పరిగి–కొడంగల్–దౌలతాబాద్–మక్తల్–నారాయణపేట్–కృష్ణా మీదుగా 122 కి.మీ.మేర కొనసాగే ఈ ప్రాజెక్టుకు రూ.2196 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రైల్వే కనెక్టివిటీ లేని కొత్త ప్రాంతాలకు ఆ రవాణా వసతి కల్పిస్తుంది. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జీఎంతో సీఎం భేటీ అయి దీనిపై చర్చించారు. ఈ రెండు తెలంగాణకు కీలక ప్రాజెక్టులు కావటంతో వీటి కేటాయింపులపై ఆశలు పెరుగుతున్నాయి.
రాష్ట్రానికొచ్చేసరికి....
మనోహరాబాద్–కొత్తపల్లి లైన్‌కు, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి భారీగానే కేటాయింపులుంటాయని, కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు కూడా ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. భద్రాచలం–కొవ్వూరు, రామగుండం–మణుగూరు ప్రాజెక్టు విషయంలోనూ ఒత్తిడి పెరుగుతోంది. ఎంఎంటీఎస్ రెండోదశ, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు విషయంలో రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉంది.
గత బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం రూ.13786.19 కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటా రూ.4418 కోట్లు. 2022–23లో కేటాయించిన మొత్తం రూ.8349.75 కోట్లు. ఇందులో తెలంగాణ వాటా రూ.3048 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment