బాన్సువాడ, న్యూస్‌లైన్ : రెండేళ్ల క్రితమే ‘బోధన్-బీదర్’ రైల్వే లైన్ సర్వే పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా బీదర్ వరకు రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. బోధన్ నుంచి బీదర్‌కు 163 కిలోమీటర్ల దూరం ఉండగా, జిల్లాలో ఈ మార్గం సుమారు 55 కిలోమీటర్లు ఉంటుంది. 2010 మార్చి బడ్జెట్‌లో ఈ సర్వే కోసం అప్పటి రైల్వే మంత్రి మమ తా బెనర్జీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2011 జూన్ తొమ్మిదిన దక్షిణ మధ్య రైల్వే ముఖ్య కార్యనిర్వహణ అధికా రి సర్వే నిమిత్తం రూ. 10 లక్షల విలువ చేసే టెండర్ల ను ఖరారు చేశారు. తర్వాత ఎనిమిది నెలలలోనే సర్వే పూర్తయింది. బాన్సువాడ-బోధన్ ప్రధాన రహదారికి సుమారు మూడు కిలోమీటర్ల వ్యత్యాసంలో సర్వే నిర్వహించి, హద్దు రాళ్లను పాతారు. దశలవారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గమధ్యంలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితులను అంచనా వేశారు. కొల్లూరు వాగుకు కూతవేటు దూరంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే పేరిట రాళ్లు పాతారు.
ఐదు దశాబ్దాల డిమాండ్
బోధన్-బీదర్ రైల్వేలైన్ ఏర్పాటు డిమాండ్ సుమారు ఐదు దశాబ్దాలుగా ఉంది. 1964లోనే దీని కోసం అప్పటి ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేశారు. 2003లో ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ మరోమారు ఈ రైల్వే లైన్ గురించి ప్రతిపాదన చేశారు. సర్వే కోసం నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. లోక్‌సభ ఎన్నికలలు జరిగిన ప్రతిసారీ అభ్యర్థులు ఈ రైల్వేలైన్‌నే ప్రధాన హామీగా ఇస్తున్నారు. 2004 ఎన్నికలలో ఇదే హామీ ఇచ్చిన మధుయాష్కీగౌడ్ ఎంపీగా గెలిచిన తర్వాత పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. నియోజకవర్గా ల పునర్విభజనలో భాగంగా బాన్సువాడ, జుక్కల్‌తోపాటు ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలు జహీరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లో కలపడంతో, ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన సురేష్ షెట్కార్ ఈ రైల్వేలైన్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. దీంతో 2010-11 రైల్వే బడ్జెట్‌లో మమతా బెనర్జీ సర్వేకు అనుమతించారు.
రైల్వే లైన్‌తో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి
బోధన్-బీదర్ రైల్వే మార్గం ఏర్పడితే దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాలు వ్యా పార, వాణిజ్య రంగాలలో అభివృద్ధి చెందుతాయి. జాన్కంపేట నుంచి బోధన్ వ రకే ఉన్న ఈ రైలు మార్గాన్ని బీదర్ వరకు పొడిగిస్తే బోధన్‌తో పాటు మార్గమధ్యం లో ఉన్న రుద్రూర్, వర్ని, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్ ద్వారా బీదర్ వర కు గల ప్రాంతాలకు మేలు జరుగుతుంది. కర్ణాటక ప్రజలతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. బోధన్ రైల్వేలైన్ బిజీగా మారుతుంది. బోధన్-బాన్సువాడ-ని జాంసాగర్- జోగిపేట-సంగారెడ్డి మీదుగా చేగుంట వరకు రైల్వే లైన్ ఏర్పాటు చే యాలనే డిమాండ్ కూడా ఉంది. సికింద్రాబాద్-నిజామాబాద్ లైన్‌కు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోనే నిధులు
నేను చేసిన కృషితోనే బోధన్-బీదర్ రైల్వేలైన్ సర్వే పూర్తయింది. కేంద్రం తదుపరి నిధులు కేటాయించాలంటే, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇవ్వాలి.ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. త్వరలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రం లోనే 50 శాతం నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. అప్పుడే పనులు ప్రారంభమవుతాయి. -సురేష్ షెట్కార్, ఎంపీ, జహీరాబాద్
బోధన్-బీదర్ రైలు వచ్చేనా!
Published Fri, Nov 22 2013 4:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement