మెదక్/టౌన్/రూరల్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ ఫలితంగానే అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ మంజూరైందని రాష్ర్ట మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సునీతారెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైల్వేలైన్ ఏర్పాటు కోసం కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద 50 శాతం నిధులు ఇచ్చేందుకు, భూమిని సమకూర్చేందుకు సంసిద్ధత తెలిపార న్నారు.
రైల్వేలైన్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లిం చేందుకు గాను రూ.25 కోట్లతో రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మెదక్ ఎంపీ విజయశాంతితోపాటు రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, రైల్వే సాధన సమితి కృషి వల్ల మెదక్ ప్రజల కల నెరవేరిందన్నారు. ఈ లైన్ ఏర్పాటుతో పేదలకు, యువతకు, నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ ప్రాంత రైతులకు రసాయన ఎరువుల సరఫరాకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నా లైన్ సాధించా: విజయశాంతి
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రైల్వేలైన్ కోసం 2009 నుంచి ఎంతగానో కృషి చేసినట్టు ఎంపీ విజయశాంతి అన్నారు. తన ఎంపీ లాడ్స్ నుంచి కోటి రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. మెదక్ నుంచి ఎంతోమంది ఎంపీలు గెలుపొందినా రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయలేకపోయారన్నారు. ఇంతవరకు ముగ్గురు సీఎంలు, ఆరుగురు రైల్వే మంత్రులు, ముగ్గురు జీఎంలు మారినప్పటికీ తాను పట్టువదలకుండా కృషిచేసి రైల్వేలైన్ సాధించినట్టు చెప్పారు.
సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదు..
శంకుస్థాపన కోసం 3 నెలలుగా సీఎం అపాయింట్‌మెంట్ ఠమొదటిపేజీ తరువాయి
అడుగుతున్నా అవకాశం దొరకలేదని చెప్పారు. తెలంగాణ, సమైక్యవాదాల వివాదంలో తనను పట్టించుకోలేదన్నారు. అటు ప్రత్యేక రాష్ర్టం కోసం పోరాటం చేస్తూనే ఇటు రైల్వే సాధన కోసం కృషి చేశానన్నారు. రైల్వేలైన్‌లో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ పరంగా ఆశించిన మేర పరిహారం చెల్లించేలా చూస్తానని తెలిపారు.
రెండేళ్లలో పూర్తి చేస్తాం: జీఎం
రైలు మార్గాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని రైల్వే జీఎం శ్రీవాత్సవ్ తెలిపారు. రైల్వేశాఖ ఏటా 110 మిలియన్ టన్నుల గూడ్స్‌ను, 307 మిలియన్ల ప్రయాణికులను రవాణా చేస్తుందన్నారు. రూ.10 వేల కోట్ల ఆదాయం సమకూరుస్తుందన్నారు. రైల్వేసాధన సమితి అధ్యక్షుడు సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ. రైల్వేలైన్ కోసం తాము 14 యేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కలెక్టర్ స్మితా సబర్వాల్, రైల్వే అధికారులు, ఆర్డీఓ వనజాదేవి, సర్పంచ్ వెల్ముల మహేశ్వరి సిద్ధిరాములు పాల్గొన్నారు.
రైల్వే లైన్ మంజూరు వైఎస్ పుణ్యమే..
Published Mon, Jan 20 2014 12:15 AM | Last Updated on Mon, Aug 27 2018 9:16 PM