
‘‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలోని అమ్మ పాత్రకి విజయశాంతిగారు ఒప్పుకోవడం వల్లే నేను ఈ సినిమా చేశాను. అమ్మలను గౌరవించడం మన బాధ్యత. వాళ్ల కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. మా సినిమాని అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాం’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్, సయీ మంజ్రేకర్ జోడీగా, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘నాయాల్ది..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను సోమవారం నరసరావుపేటలో రిలీజ్ చేశారు మేకర్స్. రఘురాం సాహిత్యం అందించిన ఈ పాటని నకాష్ అజీజ్, సోనీ కొమాండూరి పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘ఈ వేడుక చూస్తుంటే పాట రిలీజ్‌లా లేదు.. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సక్సెస్‌మీట్‌లా ఉంది’’ అన్నారు. ‘‘పల్నాటి పౌరుషం కల్యాణ్‌రామ్‌గారి క్యారెక్టర్‌లో కనిపిస్తుంది’’ అన్నారు ప్రదీప్ చిలుకూరి. ‘‘ఈ సాంగ్‌ను పల్నాడులో లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉంది’’ అని అశోక్ వర్ధన్ చెప్పారు.
ఎన్టీఆర్.. సీఎం..సీఎం
ఈ పాట ఈవెంట్‌కి కల్యాణ్‌రామ్ వచ్చింది మొదలు ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. హీరో ఎన్టీఆర్ ఫ్లెక్సీని ప్రద ర్శిస్తూ సీఎం.. సీఎం.. అనే నినాదాలతో హోరెత్తించారు.