
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/O Vyjayanthi Movie). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. మిశ్రమ స్పందన మధ్య సినిమా తొలిరోజు దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిందంతా మంగళవారం లోపు తిరిగి వచ్చేస్తుందని కళ్యాణ్ రామ్ ధీమాగా ఉన్నాడు. అయితే విజయశాంతి మాత్రం సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చినవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదే మా హెచ్చరిక..
శనివారం ఏర్పాటు చేసిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సక్సెస్ మీట్‌లో విజయశాంతి (Vijayashanthi) మాట్లాడుతూ.. సినిమాను ఖూనీ చేద్దామనుకునే వారికి మా హెచ్చరిక.. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసే వారు తమ పద్దతి మార్చుకోవాలి. కొంత మంది కావాలనే శాడిజంతో సినిమాల్ని ఇబ్బండిపెడుతున్నారు. ప్రతి ఒక్క మూవీ ఆడాలనేది మా కోరిక. బాగున్న సినిమాను బాగా లేదని, బాగోలేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం ఏంటి? చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తారు. సినిమా నచ్చకపోతే చూడకండి, నిశ్శబ్దంగా ఉండండి.
సినీ ఇండస్ట్రీని బతికించండి
సినిమా నచ్చలేదని.. ఖూనీ చేద్దామని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. థియేటర్లలో ప్రజలు మా మూవీ చూసి అద్భుతంగా ఉందంటున్నారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి.. అంతేకానీ మంచి చిత్రాలను చంపే హక్కు మీకు లేదు. సినిమా ఇండస్ట్రీని బతికించండి. సినిమాను చంపేస్తే కొన్ని జీవితాలు పోతాయి. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను జీవితంలో క్షమించకూడదు అని విజయశాంతి పేర్కొంది.
చదవండి: నటుడి పరిస్థితి విషమం.. కాలేయదానం చేస్తానన్న కూతురు..