
టైటిల్ : అర్జున్ సన్నాఫ్ వైజయంతి
నటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి, సయీ మంజ్రేకర్,పృథ్వి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులు
నిర్మాణ సంస్థలు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
ఎడిటింగ్: తమ్మిరాజు
దర్శకత్వం, కథ: ప్రదీప్ చిలుకూరి
స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
విడుదల: ఏప్రిల్ 18, 2025
విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మాస్ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఎలా ఉంది..? ప్రీరిలీజ్ వేడుక సమయంలో ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఈ మూవీ కళ్యాణ్ కెరీర్‌లో ఒక స్పెషల్‌గా మిగిలుతుందా..? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి..?
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ చాలా సినిమాల మాదిరే రొటిన్ స్టోరీ.. ఇందులో తల్లీకొడుకుల మధ్య బలమైన ఎమోషన్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో వైజయంతి IPS (విజయశాంతి) డ్యూటీలో భాగంగా ఎన్‌కౌంటర్ చేస్తూ తెరపైకి ఎంట్రీ ఇస్తుంది. వైజయంతి ఒక కఠినమైన, నిజాయితీతో కూడిన పోలీసు అధికారిణిగా ఉంటుంది. తన కుమారుడు అర్జున్ (కల్యాణ్‌రామ్) కూడా నిజాయితీగల IPS ఆఫీసర్ కావాలని, తన అడుగుజాడల్లో నడుస్తాడని ఆశిస్తుంది. అయితే, ఒక మాఫియా డాన్‌తో ఊహించని ఎదురుదెబ్బ అర్జున్‌ను మరో దారిలో నడిచేలా చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా అర్జున్ నేరస్థుడు కాకపోయినా, ప్రజలను రక్షించడానికి స్థానిక మాఫియాను ఎదుర్కొనే ఆయుధంగా అర్జున్ మారతాడు.
అర్జున్ చేస్తున్న మంచిపనిని చూసిన పృథ్వి తన పోలీస్ ఉద్యోగాన్ని పక్కనపెట్టి అతనితో పాటుగా అడుగులేస్తాడు. అలా వారిద్దరూ ఒక పెద్ద గ్యాంగ్‌నే ఏర్పాటు చేస్తారు. ఏకంగా పోలీస్ వ్యవస్థనే సవాల్ చేసేంతలా అర్జున్ గ్యాంగ్ బలోపేతం అవుతుంది. ఇవన్నీ అర్జున్‌కు తన తల్లితో విభేదాలకు దారితీస్తాయి.. దీంతో అర్జున్ వెళ్తున్న దారి ఎంతమాత్రం కరెక్ట్ కాదంటూ ఆమె హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏకంగా అర్జున్‌ను ఇంటి నుంచి బయటకు పంపేసి ఒంటరిగానే ఉంటుంది. అర్జున్ తరువాత విశాఖలోని ఒక కాలనీకి వెళ్లి అక్కడే ఉంటూ నగరంలోనే టాప్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు.
పేదలజోలికి వచ్చిన వారందరిని వేటాడుతూ ముందుకు వెళ్తుంటాడు. ఐపీఎస్‌కు సెలక్ట్ అయిన అర్జున్ ప్రజల కోసం కత్తి ఎందుకు పట్టాడు..? ఉద్యోగ రిత్యా ఎన్నో ఎన్‌కౌంటర్లు చేసిన వైజయంతిని నేరస్థుల నుంచి అర్జున్ ఎలా కాపాడుకుంటాడు. డ్రగ్స్ మాఫీయా అర్జున్ తండ్రిని ఎందుకు చంపుతుంది..? చివరకు తన ప్రాణాలను కాపాడిన కొడుకునే వైజయంతి ఎందుకు జైలుకు పంపుతుంది..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ సినిమా కథ చాలా పాత కథే.. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి అని చెప్పవచ్చు. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె దుమ్మురేపారు. తల్లి ఎంత స్థాయిలో ఉన్నా తన బిడ్డ భవిష్యత్ చాలా ముఖ్యం అని ఇందులో చక్కగా చూపించారు. కథలో భాగంగా వైజాక్ కమీషనర్‌గా శ్రీకాంత్ రావడంతో కథలో స్పీడ్ అందుకుంటుంది. గతంలో వైజయంతి టీమ్‌లో అతను పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉంటుంది. ఒక సిన్సియర్ ఆఫీసర్ కుమారుడు గ్యాంగ్‌స్టర్ అవడం ఏంటి..? అని అర్జున్ గతం తెలుసుకుంటాడు. కానీ, ఆ సీన్లు ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' సినిమా కథ పాతదే అయినా సరే అభిమానులను మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. దర్శకుడు కూడా మాస్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఫస్టాఫ్ కొంతమేరకు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, రెండవ భాగంలోకి కథ వెళ్ళే కొద్దీ పాత తరహా కథనే చూపిస్తున్నాడని అభిప్రాయం అందరిలో కలుగుతుంది. మాస్ యాక్షన్ బ్లాక్‌లు బాగానే టేకింగ్ చేసిన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కథ చెప్పడంలో చాలా వరకు తడబడ్డాడని చెప్పవచ్చు. సులువుగా ఉన్న కథను కొత్తగా చెప్పే క్రమంలో స్క్రీన్‌ప్లే దెబ్బతిందని అర్థం అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన బీజీఎమ్ పీక్స్‌లో ఉంటుంది. కానీ, పాటల విషయంలో పెద్దగా మ్యూజిక్ ప్రభావం లేదు.
ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు, తర్వాత వచ్చే సీన్లకు కల్యాణ్‌రామ్ అభిమానులు పండుగ చేసుకుంటారు. ఆ సమయంలో థియేటర్స్ దద్దరిల్లడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. క్లాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ మాస్ ఆడియన్స్‌ను మాత్రం మెప్పిస్తుంది. కంటెంట్ ఆధారంగా సినిమా చూసే వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్ పోటీ పడి నటించారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్ బలం ఎమోషన్.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' కట్టిపడేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
అర్జున్‌గా కల్యాణ్ రామ్ మంచి నటనను కనబరిచాడు. వైజయంతిగా విజయశాంతి దుమ్మురేపింది. ఇద్దరూ భావోద్వేగ, యాక్షన్ సన్నివేశాలలో ఎంతమాత్రం నిరాశపరచలేదు. ఈ వయసులోనూ విజయశాంతి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె వంద శాతం న్యాయం చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మరికొంత సమయం పాటు స్క్రీన్ మీద కనిపించి ఉండుండే బాగుండని అభిమానులకు కలుగుతుంది. అర్జున్ భార్య చిత్ర పాత్రలో సాయి మంజ్రేకర్ పరిదిమేరకు మాత్రమే ఉంటుంది. పఠాన్ పాత్రలో సోహైల్ ఖాన్ పాత్ర చిత్రీకరణ చాలా పేలవంగా ఉంటుంది. విలన్‌గా భారీ ఎలివేషన్స్‌కు మాత్రమే ఆయన పాత్ర ఉంటుంది.
శ్రీకాంత్ కమిషనర్‌గా చాలా బాగా చేశాడు. తనకు ఇచ్చిన పాత్రలో సమర్థవంతంగా నటించాడు. హీరోకు ఎప్పుడు వెన్నంటి ఉండే మిత్రులలో ఒకరిగా పృథ్వీ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ సినిమా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది. బడ్జెట్ మేరకు నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాస్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో మెప్పించాడు. కానీ, కథ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. అర్జున్ S/O వైజయంతి సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అభిమానులకు పండుగలాంటి సినిమా అవుతుంది. కామన్ ఆడియన్స్‌కు మాత్రం చివరి 30 నిమిషాలు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.