తెరపైకి బాలాజీ డివిజన్
రాజంపేట: తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ఊరిస్తోంది. డివిజన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. గుంతకల్ రైల్వే డివిజన్ నుంచి వేరు చేసి బాలాజీ డివిజన్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటులో భాగంగా లైన్లను విడగొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కడప వరకు బాలాజీ డివిజన్‌ను విస్తరించేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది. ఇదే జరిగితే కడప రైల్వేలకు మహర్ధశ కలిగినట్లే. గుంతకల్ రైల్వే డివిజన్‌లో కడప రైల్వేల విషయంలో వివక్ష ఉందన్న విమర్శలు ఉన్నాయి. బాలాజీ డివిజన్‌లోకి కడప విలీనం కావడమే మేలు అన్న భావనలో జిల్లా వాసులు ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కొత్త రైల్వే జోన్‌కు అంకురార్పణ జరగనున్న క్రమంలో కొత్త డివిజన్లను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తున్న క్రమంలో బాలాజీ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కాళ్లొచ్చాయి.
అందరూ సానుకూలమే..
బాలాజీ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి కార్మికసంఘాల నేతలు, ఉన్నతాధికార్ల నుంచి రైల్వేబోర్డు అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం బాలాజీ డివిజన్ ఏర్పాటుకు అనుకూలంగా నివేదికలు కూడా వెళ్లాయని కార్మికవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేశంలోనే పుణ్యక్షేత్రంగా తిరుపతి విరాజిల్లుతున్న క్రమంలో రైల్వే ఉన్నతాధికారులు తిరుపతిని సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో ప్రొటోకాల్ ప్రకారం అనంతపురం జిల్లాలోని గుంతకల్ కేంద్రం నుంచి డివిజన్ స్ధాయి అధికారులు తరుచుగా రావాలంటే విధి నిర్వహణ కష్టంగా మారుతోంది. బాలాజీ డివిజన్ ఏర్పాటు జరిగితే ఈ సమస్య ఉండదనే అభిప్రాయం డివిజన్ ఉన్నతాధికారుల్లో నెలకొంది.
విడిపోనున్న లైన్లు ఇవే
బాలాజీ డివిజన్ ఏర్పాటులో భాగంగా గుంతకల్లు డివిజన్ నుంచి 404 కిలోమీటర్ల మేర రైల్వేలైను విడిపోనుంది. రేణిగుంట-కడప మధ్య ఉన్న 125 కి.మీ, తిరుపతి-గూడూరు మధ్య ఉన్న 92 కి.మీ, తిరుపతి-కాట్పాడి మధ్య ఉన్న 104 కి.మీ, పాకాల-మదనపల్లె మధ్య ఉన్న 83 కి.మీ లైన్లను బాలాజీ డివిజన్‌లో కలిపే అంశాన్ని అధికారవర్గాలు పరిశీలిస్తున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా గుంతకల్ డివిజన్‌లో ఈ రైల్వే లైన్లు కొనసాగుతున్నాయి. బాలాజీ డివిజన్ ఏర్పాటుతో జిల్లాకు కొత్తరైళ్ల రాకతోపాటు రైల్వేల అభివృద్ధికి బీజం పడినట్లు అవుతుందని అటు కార్మికనేతలు, ఇటు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.కాగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని రైల్వేలైన్ బాలాజీ డివిజన్‌లోకి వెళ్లినా.. కడప పార్లమెంటు స్థానంలో కొంత లైన్, రైల్వేస్టేషన్లు గుంతకల్ డివిజన్‌లోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.