Balaji Division: బాలాజీ పట్టాలెక్కేనా!
సాక్షి, రాజంపేట: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించడంపై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నా తమ చిరకాల వాంఛ నెరవేరలేదనే భావన ఉమ్మడి వైఎస్సార్ జిల్లా రైలు ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులను వేధిస్తోంది. కొత్త జోన్ ఏర్పడిన తరుణంలో కొత్త డివిజన్‌గా యేళ్లతరబడి ప్రతిపాదనలో ఉన్న బాలాజీ డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. తూర్పుకోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్లో కొంతభాగం విశాఖ రైల్వేజోన్‌లో కలపడం కన్నా, తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌గా చేయాలని సీమ వాసుల నుంచి కేంద్రానికి వినతులు వెళుతున్నాయి.
గుంతకల్‌కు వెళ్లాలంటే దూరాభారం...
తరచూ సమావేశాలకు గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేసి విశాఖజోన్‌లో కలిపితే బాగుంటుందని రైల్వే నిపుణులు అంటున్నారు. ఆ దిశగా ఎంపీలు రైల్వేమంత్రిత్వశాఖపై వత్తిడి తీసుకురావాలని సీమవాసులు కోరుతున్నారు.
బాలాజీ డివిజన్ ఏర్పాటైతే..
బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96 కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39 కి.మీ), పాకాల–మదనపల్లె (83 కి.మీ), రేణిగుంట–కడప (125 కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102 కి.మీ)లైను గుంటూరు డివిజన్‌లోకి విలీనం చేయాలని పరిశీలించారు. కాగా జిల్లా మీదుగా వెలుగొండ అడవుల్లో నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్‌లోకి వెళ్లింది.
కొత్తడివిజన్ ఏర్పడితే నందలూరుకు పూర్యవైభవం..
కొత్త డివిజన్ ఏర్పడితే బ్రిటీషు కాలం నాటి రైల్వేకేంద్రానికి పూర్వవైభవం సంతరించుకుంటుంది. బాలాజీ డివిజన్ కేంద్రానికి దగ్గరలో ఉన్న రేణిగుంట జంక్షన్ తర్వాత నందలూరు రైల్వేకేంద్రం రైల్వేపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. డివిజన్‌కు రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా రాజ్యసభలో నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే.
రైల్వేపరిశ్రమ వస్తే గుంతకల్‌కు ప్రాధాన్యత తగ్గిపోతుందని రైల్వే ఉన్నతాధికారులు భావించినట్లు తెలుస్తోంది. విశాఖ జోన్ ఏర్పడిన నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వరకు బాలాజీ డివిజన్‌గా ఏర్పాటుచేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు పాలకులు నడుం బిగించాలని పలువురు కోరుతున్నారు.
బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరం
బాలాజీ డివిజన్ ఏర్పాటు ఎంతైనా అవసరం. విశాఖజోన్ ఏర్పడుతున్న క్రమంలో కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాల్సి వస్తే అది ముందుగా బాలాజీ డివిజన్ ఉంటుంది. డివిజన్ కావడానికి అన్ని అర్హతలు బాలాజీ డివిజన్‌కు ఉన్నాయి. అందరికి ఉపయోగకరం. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆ దిశగా అడుగులు వేయాలి.
–షేక్ కమాల్‌బాషా, మాజీ కార్మికనేత, రైల్వే మజ్దూర్ యూనియన్
దశాబ్దాల నుంచి బాలాజీ డివిజన్ ప్రతిపాదన
బాలాజీ డివిజన్ ఏర్పాటైతే నందలూరుకు మళ్లీ పూర్వవైభవం సంతరించుకున్నట్లే. రైల్వేపరిశ్రమ పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. బాలాజీ డివిజన్లో రేణిగుంట తర్వాత ప్రాముఖ్యత కలిగిన రైల్వేకేంద్రం నందలూరు. ఈ డివిజన్ ప్రతిపాదన దశాబ్దాల కాలం నాటిది.
–పులి భాస్కరయ్య, రిటైర్డ్ లోకోపైలెట్, నందలూరు
బాలాజీ డివిజన్‌ను బలపరచాలని ఎంపీలను కోరుతాం
విశాఖ జోన్ ఏర్పాటు నిర్ణయం శుభపరిణామం. ఈ నేపథ్యంలో బాలాజీ డివిజన్ ప్రతిపాదనను బలపరచాలని ఎంపీలను కోరతాము. గుంతకల్ కారణంగా నందలూరుకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. బాలాజీ డివిజన్ ఏర్పాటు వల్ల నందలూరుకు పూర్వవైభవం వస్తుందని రైల్వేనిపుణులు చెబుతున్నారు.
–సయ్యద్‌అమీర్, వైఎస్సార్సీపీ, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి
జిల్లాలు: వైఎస్సార్, అన్నమయ్య
ప్రధాన రైల్వేకేంద్రం: నందలూరు
ప్రధాన స్టేషన్లు: కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె
ఉమ్మడి వైఎస్సార్ జిల్లా
మీదుగా నడిచే రైళ్లు: 30 (డౌన్, అప్)
గూడ్స్రైళ్లు: 40
స్టేషన్లు: 25
కార్మికులు: 4000
కిలోమీటర్లు: 180