
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు
రైల్వే ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సవాళ్లు
భారత్‌కు దాయాది దేశంగా ఉన్న పాకిస్థాన్‌లో బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు తాజాగా తీవ్ర కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన పాక్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 100కి పైగా ప్రయాణికులను బంధించారు. ఈ చర్యలను ప్రతిఘటించిన ఆరుగురు పాకిస్థాన్ జవాన్లను హతమార్చారు. పాకిస్తాన్ రైల్వే దేశవ్యాప్తంగా ముఖ్యమైన రవాణా సాధనంగా పనిచేస్తోంది. దీని విస్తృతమైన నెట్‌వర్క్ మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంలో, వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, పర్యాటకానికి మద్దతుగా నిలవడంతో తోడ్పడుతుంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఎకనామీకి ఇలాంటి ఘటనలు కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ..
పాకిస్థాన్‌లో 1861లో కరాచీ నుంచి కోత్రి మధ్య మొదటి రైల్వే లైన్ ప్రారంభమైంది. బ్రిటిష్ వలసరాజ్య కాలంలో నార్త్ వెస్ట్రన్ స్టేట్ రైల్వేగా స్థాపించిన ఈ రైల్వే 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాకిస్థాన్ రైల్వేగా మారింది. కాలక్రమేణా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రస్తుతం పాకిస్థాన్ రైల్వే సుమారు 7,789 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఇది భారతరైల్వే విస్తరించిన సుమారు 68,000 కిలోమీటర్ల ట్రాక్‌తో పోలిస్తే చాలా తక్కువ. పాక్ రైల్వే కేవలం 479 స్టేషన్లను కవర్ చేస్తుంది. ఈ నెట్‌వర్క్ ప్యాసింజర్, సరుకు రవాణా సేవలకు కీలకంగా మారింది.
చైనా-పాక్ మధ్య ఎంఎల్-1 ప్రాజెక్ట్
ఇటీవలి కాలంలో పాకిస్థాన్ రైల్వే సేవలను పెంచడానికి ఆధునీకరణ కార్యక్రమాలను ప్రారంభించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మెయిన్ లైన్ 1 (ఎంఎల్-1) వంటి ప్రధాన రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తుంది. ఇది కరాచీ, లాహోర్, పెషావర్ వంటి పట్టణ కేంద్రాలను కలుపుతుంది. ఎంఎల్-1 అప్‌గ్రేడేషన్ వంటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైలు వేగాన్ని పెంచడం, రైల్వే సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కరాచీ నుంచి చైనాలోని పెషావర్ వరకు 1,726 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్రమంగా భవిష్యత్తులో ట్రాక్‌ను రెట్టింపు చేయడం, రైలు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచడం వంటివి ప్రాజెక్ట్ లక్ష్యాల్లో కీలకంగా ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం అంటే..
సరుకులు, ప్రయాణీకుల రవాణాను సులభతరం చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ వాణిజ్యాన్ని పెంచుతుందని నమ్ముతున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుందని, నిర్మాణ సమయంలో, తర్వాత కాలంలో కూడా వందలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, డబుల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి ఆపరేషనల్ భద్రతను మెరుగుపరుస్తాయని, ప్రమాదాలను తగ్గిస్తాయని అంచనా వేస్తున్నారు. రోడ్డు రవాణా కంటే రైలు మార్గాలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ, కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’
సవాళ్లు ఇవే..
ఈ ప్రాజెక్ట్‌కు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పాకిస్థాన్ రైల్వే కాలం చెల్లిన మౌలిక సదుపాయాలతో నెట్టుకొస్తోంది. దేశంలో సరైన భద్రత లేకపోవడంతో తాజాగా జరిగిన ట్రెయిన్ హైజాక్ వంటి ఘటనలు పునరావృత్తమైతే ఆర్థిక వ్యవస్థపై, దేశ సమగ్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే బెలుచిస్థాన్‌లో వేర్పాటు వాదులు పాకిస్థాన్‌కు పక్కలో బళ్లెంలాగా పరిణమిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితి తీవ్రరూపం దాల్చినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. చైనా-భారత్ మధ్య చెలరేగుతున్న భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో భారత్‌కు శత్రు దేశమైన పాకిస్థాన్‌తో చెలిమి చేస్తే భవిష్యత్తులో ఆసరాగా ఉంటుందని చైనా నమ్ముతుంది. దాంతో పాక్ ప్రాజెక్ట్‌ల్లో చైనా పెట్టుబడి పెడుతోంది. పాక్ పెద్దలు ఈ విషయాన్ని గ్రహించినా అక్కడి ఆర్థిక పరిమితులకు లోబడి చైనాతో చెలిమి చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
‘కేసీఆర్’ ప్రాజెక్టు
భారత్‌లో ఐఆర్‌సీటీసీ మాదిరిగానే పాకిస్థాన్‌లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్స్, రియల్ టైమ్ అప్‌డేట్స్ అందించే ‘రబితా అప్లికేషన్’ను అక్కడి రైల్వే ప్రవేశపెట్టింది. కరాచీలోని పట్టణ రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఆధునీకరించడానికి కరాచీ సర్క్యులర్ రైల్వే (కేసీఆర్) ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, నగరవాసులకు రైలు సేవలను చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment