
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): త్వరలోనే మన్యంలో రైలుకూత వినపడనుంది. ఇప్పటివరకు బస్సులు, లాంచీలు మాత్రమే తిరిగిన మన్యం ఏరియాలో రైళ్లు కూడా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం మన్యం ప్రజలు రైలులో ప్రయాణించాలంటే రాజమహేంద్రవరం, ఖమ్మం, కొత్తగూడెం వెళ్లాల్సి ఉంది. నూతన లైను ఏర్పాటులో భాగంగా మన్యం ఏరియాలో నాలుగు రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.
మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రవాణాను సులభతరం చేసేందుకు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు సుమారు 173 కిలో మీటర్ల మేర రైల్వేలైను మంజూరైంది. దీని నిర్మాణానికి రూ 2,800 కోట్లు అవసరమని అంచనా. ఈ లైన్‌ను మల్కన్‌గిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం రైల్వేస్టేషన్ వరకు నిర్మిస్తారు. ఈ లైను ఏర్పాటులో భాగంగా పలుచోట్ల 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలు ఉన్నాయి.
విలీన మండలాల మీదుగా...
మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడ, ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. నందిగామ నుంచి తెలంగాణలో గోదావరి మీదుగా భద్రాచలం, అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు.