మనకు సూర్యుడున్నాడు.
వద్దన్నా రోజూ ఉదయిస్తాడు.
సిస్టమ్ ఉంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తాడు.
కరెంట్ కష్టాలకు చెల్లు చీటి ఇస్తాడు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఘనంగా 75 ఏళ్ల ఉత్సవాలను కూడా చేసుకున్నాం. కానీ ఇప్పటికీ దేశంలో కరెంటు దీపం వెలగని గ్రామాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, చుట్టుపక్కల గ్రామాలు కూడా. ఇలాంటి గ్రామాల్లో వెలుగులు నింపారు ఈ హైదరాబాద్ ఇంజనీర్. వాహనం వెళ్లడానికి దారి లేని పాడేరు కొండలను కాలినడకన చుట్టి వచ్చిన రాధికా చౌదరి అక్కడి యాభై గ్రామాల్లో సౌరశక్తితో దీపాలు వెలిగించారు. కోటి ఇళ్లకు సౌర వెలుగులను అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆమె నాలుగు లక్షల ఇళ్లకు సర్వీస్ అందించారు. సోలార్ ఎనర్జీలో కెరీర్‌ని నిర్మించుకున్న రాధిక... పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా లబ్ది పొందమని సూచిస్తున్నారు.
మూడు తర్వాత బయటకు రారు
పాడేరు కొండల్లో నివసించే ఆదివాసీలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బయటకు రారు. బయటకు వెళ్లిన వాళ్లు సూర్యుడు అస్తమించేలోపే తిరిగి ఇల్లు చేరాలి కాబట్టి మధ్యాహ్నం మూడు తర్వాత ఇల్లు కదలేవాళ్లు కాదు. అలాంటి వాళ్లకు సౌరశక్తితో దీపం వెలుతురును చూశారు. మన పాడేరు వాసులే కాదు, కశ్మీర్‌లోయలోని లధాక్, లేప్రాంతాలు కూడా సౌర వెలుగును చూశాయి. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ జిల్లాలతో సహా మొత్తం 27 రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో సేవలు అందించారామె.
సోలార్ ఉమన్
రాధికకు యూఎస్‌లో ఎమ్‌ఎస్ న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. సోలార్ పవర్‌తో శాటిలైట్‌లను పనిచేయించడం అనే అంశంలో కోర్సు చేయడానికి నాసా స్పాన్సర్ చేసింది. యూఎస్‌లో కొంతకాలం విండ్ ఎనర్జీలో ఉద్యోగం, మరికొన్నేళ్లు స్వీడిష్ కంపెనీకి పని చేశారామె. ఆల్టర్నేటివ్ ఎనర్జీ సెక్టార్‌లో అడుగు పెట్టడం నుంచి సోలార్ పవర్ విభాగంలో పని చేయడంలో ఆసక్తి పెంచుకున్నారు రాధిక. ఇండియాలో సర్వీస్ ఇచ్చే అవకాశం రాగానే 2008లో ఇండియాకి వచ్చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు సోలార్ ఎనర్జీలో పని చేసిన సౌరవ్‌తో కలిసి ఫ్రేయర్ ఎనర్జీ ప్రారంభించారు.
‘‘నలుగురు వ్యక్తులం, ఓ చిన్న గది. ఆరు నెలలు జీతం తీసుకోలేదు. ఆ తర్వాత కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని విస్తరించాం. ఇప్పుడు 450 మంది ఉద్యోగులతో పని చేస్తోంది మా సంస్థ’’ అన్నారామె. మనదేశంలో సోలార్ ఎనర్జీ విభాగంలో ఇంత భారీ స్థాయిలో సర్వీస్ అందిస్తున్న ఏకైక మహిళ రాధిక. ఏ వ్యాపారానికైనా ఇండియా చాలా పెద్ద మార్కెట్. కాబట్టి ఇండియా మొత్తాన్ని కవర్ చేయాలన్న కేంద్రప్రభుత్వం విధానాలతో కలిసి పనిచేస్తూ దేశాన్ని సౌరవెలుగులతో నింపడమే ప్రస్తుతానికి ఉన్న ఆలోచన’’ అన్నారామె.
ప్రత్యామ్నాయం ఇది
బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి బొగ్గు గనుల మీద ఆధారపడడం తగ్గించి ఆల్టర్నేటివ్ ఎనర్జీని వినియోగంలోకి తెచ్చుకోవాలి. విండ్ పవర్ అనేది వ్యవస్థలు చేపట్టాల్సిందే కానీ వ్యక్తిగా చేయగలిగిన పని కాదు. ఇక మిగిలింది సోలార్ పవర్. సౌరశక్తిని వినియోగించుకోవడం సాధ్యమే. నిజమే... కానీ ఒక ఇంటికి సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? దాదాపు లక్ష అవుతుంది. సగటు మధ్య తరగతి నుంచి ‘అమ్మో ఒక్కసారిగా అంత ఖర్చా మా వల్ల కాదు’ అనే సమాధానమే వస్తుంది. అలాంటి వాళ్లకు రాధిక ఇచ్చే వివరణే అసలైన సమాధానం.
నాలుగేళ్ల్ల బిల్ కడితే ఇరవై ఏళ్లు ఫ్రీ పవర్ సోలార్ సిస్టమ్ ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకుంటే పాతికేళ్లు పని చేస్తుంది. నెలకు రెండువేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఇంటికి రెండు కిలోవాట్ల కెపాసిటీ ΄్లాంట్ అవసరమవుతుంది. దాని ఖర్చు లక్షా నలభై వేలవుతుంది. ప్రభుత్వం నుంచి 60 వేల సబ్సిడీ వస్తుంది. వినియోగదారుడి ఖర్చు 80 వేలు. ఏడాదికి 24 వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వాళ్లకు నాలుగేళ్లలోపు ఖర్చు మొత్తం వెనక్కి వచ్చినట్లే. ఇక కనీసంగా ఇరవై ఏళ్లు సోలార్ పవర్‌ని ఫ్రీగా పొందవచ్చు. సోలార్ పవర్‌ను పరిశ్రమలకు కూడా విస్తరిస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గుతుంది.
– రాధికా చౌదరి,
కో ఫౌండర్, ఫ్రేయర్ ఎనర్జీ
– వాకా మంజులారెడ్డి,
ఫొటోలు : మోహనాచారి
Comments
Please login to add a commentAdd a comment