సోలార్ డిస్టిలేషన్ మెషిన్ రూపొందించిన యువతి
ఆవు మూత్రం నుంచీ మంచినీరు తీయొచ్చు
రోజ్ వాటర్, జాస్మిన్ వాటర్ సైతం ఇదే మెషిన్ నుంచి
ఉప్పాడలో ప్రయోగాత్మకంగా పరిశీలన
పిఠాపురం: విద్యుత్ అవసరం లేకుండా సౌరశక్తిని ఒడిసిపట్టి తక్కువ ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే సోలార్ డిస్టిలేషన్ పరికరాన్ని ఓ యువతి రూపొందించారు. రోజుల తరబడి సముద్రంలో చేపల వేట సాగించే మత్స్యకారులు మంచినీటి కోసం పడే ఇబ్బందులను తొలగించేందుకు దీనిని ఆవిష్కరించినట్టు వైఎస్ ప్రసన్న చెప్పారు.
హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రసన్న పీహెచ్‌డీ పరిశోధనలో భాగంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. దీంతో ఎలాంటి మురికి నీటినైనా మంచినీటిగా మార్చుకోవచ్చని చెప్పారు. పరిశోధనలో భాగంగా తాను తయారు చేసిన యంత్రాన్ని ఇటీవల కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద సముద్రంలో ప్రయోగాత్మకంగా బోటులో అమర్చి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంట్లో కూడా నీటిశుద్ధి పరికరాలను అమర్చుకోవడం సాధారణంగా మారిపోయిందన్నారు. ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన అనేక నీటిశుద్ధి యంత్రాలు అధిక ఖర్చుతో కూడుకున్నవన్నారు.
ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ అవసరం లేకుండా ఎక్కడైనా.. ఎప్పుడైనా నీటిని శుద్ధి చేసుకునే యంత్రాన్ని తయారు చేయాలనే పట్టుదలతో సోలార్ డిస్టిలేషన్ మెషిన్ తయారు చేశానని ప్రసన్న చెప్పారు. సముద్రంలో రోజుల తరబడి చేపల వేట సాగించే మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు వచ్చానన్నారు. ఈ యంత్రం విజయవంతంగా పని చేస్తోందన్నారు.
గోమూత్రం నుంచి సైతం..
తన ప్రొఫెసర్ సందీప్ ఎస్.దేశ్‌ముఖ్ ప్రోత్సాహంతో దీనిని తయారు చేశానని ప్రసన్న తెలిపారు. ఎక్కడ కావాలన్నా ఈ యంత్రాన్ని అమర్చుకోవచ్చన్నారు. ఒక రోజుకు ఒక కుటుంబానికి అవసరమైనంత నీరు ఇందులో తయారవుతుందని చెప్పారు.
ఈ యంత్రం ద్వారా రోజ్ వాటర్, జాస్మిన్ వాటర్, అత్తరు వంటి వాటితో పాటు ఆవు మూత్రాన్ని శుద్ధి చేసి గోమాత ఆర్కా (దీనిని ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు) తయారు చేయవచ్చని వివరించారు. గోమూత్రాన్ని ఒకసారి వేస్తే గోమాత ఆర్కా వస్తుందని, మూడుసార్లు వేస్తే పూర్తిగా శుద్ధి జరిగి మంచినీటిగా మారుతుందని చెప్పారు.
ప్రభుత్వం సహకరిస్తే ఈ మెషిన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటివరకూ చాలా పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఎటువంటి అదనపు ఖర్చు, వృథా లేకుండా రూపొందించిన మొట్టమొదటి చిన్న పరికరం ఇదేనని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment