fresh water
-
బోటులోనే మంచినీటి తయారీ
పిఠాపురం: విద్యుత్ అవసరం లేకుండా సౌరశక్తిని ఒడిసిపట్టి తక్కువ ఖర్చుతో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే సోలార్ డిస్టిలేషన్ పరికరాన్ని ఓ యువతి రూపొందించారు. రోజుల తరబడి సముద్రంలో చేపల వేట సాగించే మత్స్యకారులు మంచినీటి కోసం పడే ఇబ్బందులను తొలగించేందుకు దీనిని ఆవిష్కరించినట్టు వైఎస్ ప్రసన్న చెప్పారు. హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రసన్న పీహెచ్డీ పరిశోధనలో భాగంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. దీంతో ఎలాంటి మురికి నీటినైనా మంచినీటిగా మార్చుకోవచ్చని చెప్పారు. పరిశోధనలో భాగంగా తాను తయారు చేసిన యంత్రాన్ని ఇటీవల కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద సముద్రంలో ప్రయోగాత్మకంగా బోటులో అమర్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంట్లో కూడా నీటిశుద్ధి పరికరాలను అమర్చుకోవడం సాధారణంగా మారిపోయిందన్నారు. ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన అనేక నీటిశుద్ధి యంత్రాలు అధిక ఖర్చుతో కూడుకున్నవన్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ అవసరం లేకుండా ఎక్కడైనా.. ఎప్పుడైనా నీటిని శుద్ధి చేసుకునే యంత్రాన్ని తయారు చేయాలనే పట్టుదలతో సోలార్ డిస్టిలేషన్ మెషిన్ తయారు చేశానని ప్రసన్న చెప్పారు. సముద్రంలో రోజుల తరబడి చేపల వేట సాగించే మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు వచ్చానన్నారు. ఈ యంత్రం విజయవంతంగా పని చేస్తోందన్నారు. గోమూత్రం నుంచి సైతం..తన ప్రొఫెసర్ సందీప్ ఎస్.దేశ్‌ముఖ్ ప్రోత్సాహంతో దీనిని తయారు చేశానని ప్రసన్న తెలిపారు. ఎక్కడ కావాలన్నా ఈ యంత్రాన్ని అమర్చుకోవచ్చన్నారు. ఒక రోజుకు ఒక కుటుంబానికి అవసరమైనంత నీరు ఇందులో తయారవుతుందని చెప్పారు. ఈ యంత్రం ద్వారా రోజ్ వాటర్, జాస్మిన్ వాటర్, అత్తరు వంటి వాటితో పాటు ఆవు మూత్రాన్ని శుద్ధి చేసి గోమాత ఆర్కా (దీనిని ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు) తయారు చేయవచ్చని వివరించారు. గోమూత్రాన్ని ఒకసారి వేస్తే గోమాత ఆర్కా వస్తుందని, మూడుసార్లు వేస్తే పూర్తిగా శుద్ధి జరిగి మంచినీటిగా మారుతుందని చెప్పారు. ప్రభుత్వం సహకరిస్తే ఈ మెషిన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటివరకూ చాలా పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఎటువంటి అదనపు ఖర్చు, వృథా లేకుండా రూపొందించిన మొట్టమొదటి చిన్న పరికరం ఇదేనని ఆమె చెప్పారు. -
త్వరలో ఆర్టీసీ ‘జీవా’జలం!
సాక్షి, హైదరాబాద్: సొంతంగా మంచినీటిని తయారు చేసి బస్టాండ్లలో విక్రయించడంతోపాటు మార్కెట్లోకి కూడా విడుదల చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆకట్టుకునే రీతిలో మంచినీటి సీసా డిజైన్‌ను రూపొందించింది. దీనికి ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్‌ఐవీఏ) అన్న పేరును ఖరారు చేసింది. దీనికి జీవం అన్న మరో అర్థం కూడా ఉండటం విశేషం. ‘స్ప్రింగ్ ఆఫ్ లైఫ్’అన్న ట్యాగ్‌ను దీనికి జతచేసింది. మరో వారం పది రోజుల్లో ఈ బ్రాండ్ మంచినీటిని ఆర్టీసీ విడుదల చేస్తోంది. తొలుత అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో వీటిని అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత క్రమంగా విస్తరించాలని నిర్ణయించింది. నకిలీలను నియంత్రించి.. ఆర్టీసీ బస్టాండ్లలో ఉండే దుకాణాల్లో మంచినీటి సీసాల విక్రయం విరివిగా సాగుతుంది. అదే వేసవిలో అయితే వాటి వినియోగం చాలా ఎక్కువ. దీంతో దుకాణదారులు రూ.20కి విక్రయించాల్సిన లీటరు నీటి సీసాను రూ.25–30కి అమ్ముతుంటారు. బ్రాండెడ్ పేర్లను పోలిన ‘నకిలీ’కంపెనీ నీళ్లు విక్రయిస్తుంటారు. ఇటీవలే వీటిని నియంత్రించిన ఆర్టీసీ ఇప్పుడు బ్రాండెడ్, ఐఎస్ఐ అధీకృత లోకల్ కంపెనీ నీళ్లు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయగలిగింది. ఈ తరుణంలోనే తనే సొంతంగా నీటి విక్రయాలను ప్రారంభించాలన్న ఆలోచనను సాకారం చేసుకుంటోంది. పేటెంట్ కోసం దరఖాస్తు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అరలీటరు నీటి సీసాలను అందిస్తోంది. ఇందుకోసం ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కార్యాలయాలు, ఇతర అవసరాలకు కూడా భారీగా ప్యాకేజ్డ్ నీటిని కొంటోంది. ఇందుకు సాలీనా రూ.5.15 కోట్ల ఖర్చును చూపుతోంది. ఇంత భారీ ఖర్చును తనే పెట్టుబడిగా మార్చుకుంటే సొంతంగా నీటిని మార్కెట్లోకి తేవచ్చన్న యోచనతో రెండు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీలు ఆకర్షణీయ సీసాల్లో నాణ్యమైన నీటిని నింపి ఆర్టీసీకి అందజేస్తాయి. వాటిని ఆర్టీసీ మార్కెటింగ్ చేసుకుంటుంది. ఇలా ఇతర కంపెనీల ధరలతో సమంగా లీటరు నీటికి రూ.20 ధరను ఖరారు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు అర లీటరు సీసాలను అందుబాటులో ఉంచుతారు. బస్టాండ్లలోని దుకాణాల్లో మాత్రం లీటరు పరిమాణంలోని నీటి సీసాలను ఉంచుతారు. కాగా జీవా పేరుతో తెస్తున్న ఈ బాటిళ్లకు ‘స్ప్రింగ్ ఆఫ్ లైఫ్’అన్న ట్యాగ్‌లను పెట్టింది. పేరుకు, బాటిల్ డిజైన్‌కు ఆర్టీసీ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిసింది. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు మార్కెట్లోనూ ఈ సీసాలను అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పుడు ఒప్పందం మేరకు వేరే కంపెనీ నీటిని కొనేందుకు చేస్తున్న రూ.5 కోట్ల ఖర్చును లేకుండా చేసుకోవటంతోపాటు సాలీనా కనీసం రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఆదాయం పొందాలని భావిస్తోంది. -
చెట్టు నుంచి పుట్టిన శిశువు.. సరస్సు లోతును కనిపెట్టలేదట
రంగురంగుల స్కెచ్ పెన్నులు తెచ్చి ఎంతో పొందిగ్గా బొమ్మ గీసినట్లు ఉంటుంది ఈ ప్రదేశం. సొగసులొలిగే ప్రకృతి.. తనకు తానే దిష్టి చుక్క పెట్టుకున్నట్లు కనిపిస్తుంది ఈ ద్వీపం. దీని పేరు ప్రశార్ లేక్. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో 2,730 మీటర్ల ఎత్తులో ఉన్న మంచినీటి సరస్సు ఇది. మండి పట్టణానికి తూర్పున 49 కి.మీ దూరంలో ఉంది. ఈ సరస్సు ఒడ్డున మూడు అంతస్తుల్లో ఆలయం ఉంటుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారట. ఒక చెట్టు నుంచి వచ్చిన శిశువు.. ఇక్కడ గుడి కట్టమని ఆదేశించిందని స్థల పురాణం. ఇంకో విషయమేంటంటే ఇప్పటి వరకు ఎవరూ ఈ సరస్సు లోతును కనిపెట్టలేదట. ఈ అందాలను ఆస్వాదించడానికి.. పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఒక్కో సీజన్లో ఒక్కో అందాన్ని అద్దుకునే ఈ సరస్సును జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే అంటుంటారు టూరిస్టులు. -
షాక్: స్కూల్ నల్లా బిల్లు రూ. 20 లక్షలు!
ఓ టీచర్ చేసిన పనికి.. ఊళ్లో ఏకంగా మంచి నీటికి ఇబ్బంది ఏర్పడడంతో పాటు స్కూల్ నల్లా బిల్లు యాజమాన్యానికి దిమ్మ తిరిగిపోయేలా చేసింది. ఇంతకీ అంత బిల్లు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎప్పుడూ మంచి నీటి నల్లాలను ఆన్ చేసి ఉంచడం మూలంగా! స్విమ్మింగ్ పూల్ నిర్వాహణను చూసుకునే ఆ టీచర్.. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నిరంతరం మంచి నీటి ట్యాప్‌లను కట్టేయకుండా ఉంచింది. ఆ నీటిని స్విమ్మింగ్‌పూల్‌లోకి మళ్లించింది. తద్వారా నిరంతరం ప్రవాహంతో ఆ పూల్ ఉండిపోగా.. ఇప్పుడు బిల్లు రూపంలో మోత మోగిపోయింది. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో.. నీటి కొరత ఏర్పడినందుకుగానూ పౌరులకు క్షమాణపణ చెప్పారు. ఇక ఈ బిల్లుకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. కరోనా టైంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ముందు జాగ్రత్త కోసమే తాను స్విమ్మింగ్‌పూల్‌లో మంచి నీటి ప్రవాహాన్ని అలా ఉంచానని, తద్వారా స్టూడెంట్స్ కరోనా బారిన పడకుండా ఉంటారన్న ఆలోచనతోనే ఆ పని చేశానని ఆమె వివరణ ఇచ్చుకుంది. కేవలం రెండు నెలల కాలంలోనే పదులు సంఖ్యలో స్విమ్మింగ్‌పూల్‌లకు సరిపడా నీటిని ఆ టీచరమ్మ వేస్ట్ చేసిందట. సాధారణంగా పూల్స్‌కు సపరేట్గా క్లోరిన్, ఫిల్టరింగ్ మెషిన్స్ ఉంటాయి. కానీ, వాటికి బదులుగా మంచి నీటితో ఇలా నింపి పడేసింది ఆమె. అయితే మధ్యలో కొందరు స్కూల్ సిబ్బంది అది గుర్తించినా.. ఆమె మళ్లీ వెళ్లి ఆ ట్యాప్‌లను ఆన్ చేయడం, నీళ్లు వృథాగా పోవడం జరిగిందన్నమాట. ఈ ఘటన జపాన్ యోకోసుకాలో జరిగింది. బిల్లు 3.5 మిలియన్ యెన్(27,000 డాలర్లు.. మన కరెన్సీలో 20 లక్షల 60 వేల రూపాయలకు పైనే) రాగా.. అందులో సగమైనా కట్టాలంటూ ఆ టీచర్‌కు ఇరిగేషన్ అధికారులు నోటీసులు పంపించారు. చదవండి: రోడ్డు పక్కన డబ్బు సంచి! చూసి ఏం చేశాడంటే.. -
5 సంవత్సరాల్లో గ్రామాల్లో పరిశుభ్రత, మంచినీటికి 6,140 కోట్లు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మెరుగైన పరిశుభ్రత, మంచినీటి సరఫరా సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో భారీగా నిధులు వెచ్చించనుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.6,140 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. అదనంగా ఇతర కార్యక్రమాలు, పథకాల నిధులను వీటికి జతచేసి ఈ అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిబంధనల్లో మార్పులు తేనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. 60 శాతం నిధులు.. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఏటా కేటాయించే నిధుల్లో 60 శాతం పరిశుభ్రత, మంచినీటి అవసరాలకు ఖర్చు చేయాలని ముసాయిదాలో పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ప్రతి గ్రామంలో ఏడాది పొడవునా తాగునీటి లభ్యత సౌకర్యాల కల్పన, రోజూ ప్రతి ఇంటికీ నీటి సరఫరాకు మౌలిక వసతుల ఏర్పాటు, పర్యవేక్షణ, రహదారులు, ఇతర ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, క్రమ విధానంలో చెత్త సేకరణ తదితరాల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. ప్రతి గ్రామానికి ఐదేళ్ల ప్రణాళిక.. గ్రామంలో పరిశుభ్రత, మంచినీటి సరఫరా సౌకర్యాల కోసం ప్రతి పంచాయతీకి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వనరులు, అదనపు సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక రూపొందిస్తారు. తుపాన్లు లాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. గ్రామసభలో ప్రణాళికపై చర్చించి తుది ఆమోదం తీసుకోవాలి. ప్రణాళికల అమలుకు సర్పంచ్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కమిటీని నియమించుకోవచ్చు. కమిటీలో మహిళలు, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
దుబాయ్‌కు ఐస్‌బర్గ్‌ను లాక్కొచ్చేస్తాం..!
-
రాజధానికి జల గండం
నాగార్జునసాగర్, సింగూరు జలాశయాల్లో అడుగంటిన నీటిమట్టాలు జంట నగరాలకు పొంచి ఉన్న నీటి కొరత రానున్న రోజుల్లో రాజధాని నగరానికి మంచినీటి ముప్పు తప్పేలా లేదు. ఒకవైపు భూగర్భ జలాలు పది మీటర్ల దిగువకు పడిపోవడం.. మరోవైపు జంట నగరాలకు తాగునీరందించే ప్రధాన ప్రాజెక్టులు నాగార్జునసాగర్, సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గిపోతుండటం... రాజధానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రాజెక్టుల్లో నీరు అట్టడుగు స్థాయికి చేరడం అధికారులను సైతం కలవరానికి గురిచేస్తోంది. జూలైలో ఏమాత్రం వర్షాలు ఆలస్యమైనా.. తర్వాతి రెండు, మూడు నెలలు జంట నగరాలకు తాగునీటికి ఇబ్బందులు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దుస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏరీతిన సన్నద్ధమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. - సాక్షి, హైదరాబాద్ సాగర్‌లో సంక్లిష్టం సాగర్‌లో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించే అంశంలో కొంత సంక్లిష్టత నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న 24 టీఎంసీల జలాలను సాగుకు, నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు ఇవ్వడం, ఆవిరి నష్టాలు పోగా... జంట నగరాలకు ఆగస్టు వరకు తాగునీటిని అందించడం సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 515.50 అడుగుల మేర నీరు ఉంది. నీటి నిల్వ 141.20 టీఎంసీలకు చేరింది. ఫిబ్రవరి 14న ఇరు రాష్ట్రాల సీఎంల చర్చల నాటికి సాగర్‌లో లభ్యత నీరు 51 టీఎంసీల మేర ఉండగా.. ఇప్పుడది 14 టీఎంసీలకు తగ్గింది. ఆ చర్చల అనంతరం ఏపీకి ఎడమ కాలువ కింద 2 లక్షల ఎకరాల ఖరీఫ్ పంటలకు, 5 లక్షల ఎకరాల మేర రబీ అవసరాలతో పాటు కృష్ణా డెల్టాకు నీరందించే లక్ష్యంతో ఇప్పటివరకు 19 టీఎంసీలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు మరో 18 టీఎంసీల నీటిని వాడుకున్నారు. మొత్తంగా ఇప్పుడు మరో 14 టీఎంసీల మేర మాత్రమే నీరు అందుబాటులో ఉంది. అయితే ఎగువన శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 20 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువకు వస్తోంది. ఇలా సుమారు 10 టీఎంసీల మేర నీరు సాగర్‌కు వచ్చే అవకాశముంది. ఆ లెక్కన సాగర్‌లో లభ్యత జలాలు 24 టీఎంసీలకు చేరుతాయి. ఈ మొత్తం నీటిలో సాగర్ ఎడమ కాలువ కింద తాగు అవసరాలకు 6 టీఎంసీలు, పంటల సాగుకు మరో 7 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంది. దీనితోపాటు ఆవిరి నష్టాల కింద 6 టీఎంసీల నీరుపోగా.. మిగిలేది కేవలం 5 టీఎంసీలే. ఈ 5 టీఎంసీలనే నెలకో టీఎంసీ చొప్పున జంట నగరాలకు తాగునీటికోసం సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ నల్లగొండ జిల్లాలో తాగు అవసరాలకు డిమాండ్ పెరిగినా, సాగు అవసరాలకు మరింత నీరు అవసరమైనా... హైదరాబాద్‌కు అందే నీటిలో కోత పడక తప్పదు. ఇదే జరిగితే ఆగస్టు నుంచి హైదరాబాద్‌కు తాగునీటికి కటకట తప్పదు. దానివల్ల పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది మాదిరే కృష్ణాబేసిన్‌లో సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాలుకురవని పక్షంలో మళ్లీ జంట నగరాలకు నీటి సమస్య తప్పే పరిస్థితి కనిపించడం లేదు. సింగూరుపైనే ఆశలు జంట నగరాలకు తాగునీటిని అందించే మరో ముఖ్యమైన ప్రాజెక్టు సింగూరుపైనే ఆశలు ఉన్నాయి. రాజధాని నగరమైన హైదరాబాద్‌కు నీటి సరఫరా కోసం ప్రాజెక్టులో ఆరు టీఎంసీల మేర వాటా ఉండగా.. ఇప్పటికే 5.2 టీఎంసీల మేర వినియోగించారు. మరో 0.8 టీఎంసీల వాటా మాత్రమే మిగిలి ఉంది. అయితే ప్రస్తుతం సింగూరులో 7.5 టీఎంసీల మేర నీరు అందుబాటులో ఉంది. అందులో ఆవిరి నష్టాల కింద మూడు టీఎంసీలను తీసేసినా.. మరో నాలుగు టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. ఈ నీటితో జూన్ నెల వరకు రాజధాని నగరానికి తాగునీరు అందించవచ్చని అధికార వర్గాల అంచనా. ఒకవేళ వర్షాలు పడటం ఆలస్యమైతే మాత్రం ఇబ్బందే. అదే పరిస్థితి ఎదురైతే నీటి కొరత తప్పదని వారు పేర్కొంటున్నారు. గోదావరిలో జూలై నాటికి వర్షాలు సాధారణంగానే ఉంటాయని చెబుతున్నారు. భూగర్భ జలాల పరిస్థితి.. (భూ ఉపరితలం నుంచి లోతుకు-మీటర్లలో) జిల్లా గత ఏడాది ప్రస్తుతం హైదరాబాద్ 7.97 10.46 రంగారెడ్డి 10.18 14.00 ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు (అడుగుల్లో..) నీరు (టీఎంసీల్లో) ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం {పస్తుత మట్టం లభ్యత నీరు గత ఏడాది మట్టం లభ్యత నీరు నాగార్జునసాగర్ 590 516.1 142.3 517.55 144.79 సింగూరు 1,717.93 1,696.92 7.53 1,712.77 21.74 -
సా..గుతోన్న సీజీజీ అధ్యయనం
రెండేళ్లుగా కొలిక్కిరాని నివేదిక జలమండలి ఉద్యోగుల్లో వీడని ఉత్కంఠ ఉద్యోగాలు ఉంటాయో..పోతాయో తెలియక ఆందోళన సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరానికి మంచినీటిని సరఫరా చేసే జలమండలిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) అధ్యయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల సంఖ్య, పని విభజన, ఖాళీల భర్తీ, అదనపు సిబ్బంది, పదోన్నతులు తదితర అంశాలపై సీజీజీ రెండేళ్లుగా చేస్తున్న అధ్యయనం ఇంకా కొలిక్కిరాలేదు. దీంతో ఉద్యోగుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికతో తమ ఉద్యోగాలు ఉంటాయా?, ఊడతాయా?, పదోన్నతులు లభిస్తాయా లేదా ఖాళీల భర్తీ జరుగుతుందా? అన్న సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ విషయంలో ఉద్యోగుల అనుమానాలు, భయాలను నివృత్తి చేసేందుకు బోర్డు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఉత్కంఠకు గురవుతున్నారు. బోర్డులో అన్ని విభాగాల్లో కలిపి సుమారు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో 600 వరకు ఖాళీలున్నట్టు సమాచారం. వీటి భర్తీ విషయంలో చర్యలు తీసుకోని యాజమాన్యం సీజీజీ నివేదికతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఉద్యోగ, కార్మిక సంఘాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. భర్తీ ఎప్పుడో.. జలమండలిలో రెండునెలల క్రితం 647 జనరల్ పర్పస్ ఎంప్లాయ్, సీవరేజీ కార్మికుల భర్తీ ప్రక్రియను చేపట్టింది.వీరిలో ఇన్‌సర్వీసు అభ్యర్థులైన 500 మందికి మాత్రమే పోస్టింగ్‌లు ఇచ్చారు. మరో 147 మంది బయటి వ్యక్తులకు పోస్టింగ్ ఇచ్చే ఫైలు రెండు నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. దీంతో ఇంటర్వ్యూ, క్షేత్రస్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులైన పలువురు నిరుద్యోగ అభ్యర్థులు పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక బోర్డు ఫైనాన్స్ విభాగం, ఇతర విభాగాల్లో మినిస్టీరియల్ ఉద్యోగాలు, మేనేజర్ పోస్టులు సుమారు 450 వరకు ఖాళీగా ఉన్నాయ. వీటి భర్తీపైనా సస్పెన్స్ కొనసాగుతోండడం గమనార్హం. నివేదికను తక్షణం బహిర్గతం చేయాలి.. ఉద్యోగుల భవితవ్యంతో సంబంధం ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదికను సాగదీయకుండా తక్షణమే ఆ నివేదికను బహిర్గతం చేయాలని ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తమ అభ్యంతరాలను, ఆందోళనను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. పలు విభాగాల్లో సిబ్బంది అదనపు పనిభారంతో సతమతమవుతున్నారని, వెంటనే ఖాళీలను భర్తీచేయాలని వారు యాజమాన్యాన్ని కోరుతున్నారు.