రాజధానికి జల గండం
నాగార్జునసాగర్, సింగూరు జలాశయాల్లో అడుగంటిన నీటిమట్టాలు
జంట నగరాలకు పొంచి ఉన్న నీటి కొరత
రానున్న రోజుల్లో రాజధాని నగరానికి మంచినీటి ముప్పు తప్పేలా లేదు. ఒకవైపు భూగర్భ జలాలు పది మీటర్ల దిగువకు పడిపోవడం.. మరోవైపు జంట నగరాలకు తాగునీరందించే ప్రధాన ప్రాజెక్టులు నాగార్జునసాగర్, సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గిపోతుండటం... రాజధానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రాజెక్టుల్లో నీరు అట్టడుగు స్థాయికి చేరడం అధికారులను సైతం కలవరానికి గురిచేస్తోంది. జూలైలో ఏమాత్రం వర్షాలు ఆలస్యమైనా.. తర్వాతి రెండు, మూడు నెలలు జంట నగరాలకు తాగునీటికి ఇబ్బందులు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దుస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏరీతిన సన్నద్ధమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. - సాక్షి, హైదరాబాద్
సాగర్‌లో సంక్లిష్టం
సాగర్‌లో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించే అంశంలో కొంత సంక్లిష్టత నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న 24 టీఎంసీల జలాలను సాగుకు, నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు ఇవ్వడం, ఆవిరి నష్టాలు పోగా... జంట నగరాలకు ఆగస్టు వరకు తాగునీటిని అందించడం సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 515.50 అడుగుల మేర నీరు ఉంది. నీటి నిల్వ 141.20 టీఎంసీలకు చేరింది. ఫిబ్రవరి 14న ఇరు రాష్ట్రాల సీఎంల చర్చల నాటికి సాగర్‌లో లభ్యత నీరు 51 టీఎంసీల మేర ఉండగా.. ఇప్పుడది 14 టీఎంసీలకు తగ్గింది. ఆ చర్చల అనంతరం ఏపీకి ఎడమ కాలువ కింద 2 లక్షల ఎకరాల ఖరీఫ్ పంటలకు, 5 లక్షల ఎకరాల మేర రబీ అవసరాలతో పాటు కృష్ణా డెల్టాకు నీరందించే లక్ష్యంతో ఇప్పటివరకు 19 టీఎంసీలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు మరో 18 టీఎంసీల నీటిని వాడుకున్నారు. మొత్తంగా ఇప్పుడు మరో 14 టీఎంసీల మేర మాత్రమే నీరు అందుబాటులో ఉంది.
అయితే ఎగువన శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 20 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువకు వస్తోంది. ఇలా సుమారు 10 టీఎంసీల మేర నీరు సాగర్‌కు వచ్చే అవకాశముంది. ఆ లెక్కన సాగర్‌లో లభ్యత జలాలు 24 టీఎంసీలకు చేరుతాయి. ఈ మొత్తం నీటిలో సాగర్ ఎడమ కాలువ కింద తాగు అవసరాలకు 6 టీఎంసీలు, పంటల సాగుకు మరో 7 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంది. దీనితోపాటు ఆవిరి నష్టాల కింద 6 టీఎంసీల నీరుపోగా.. మిగిలేది కేవలం 5 టీఎంసీలే. ఈ 5 టీఎంసీలనే నెలకో టీఎంసీ చొప్పున జంట నగరాలకు తాగునీటికోసం సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ నల్లగొండ జిల్లాలో తాగు అవసరాలకు డిమాండ్ పెరిగినా, సాగు అవసరాలకు మరింత నీరు అవసరమైనా... హైదరాబాద్‌కు అందే నీటిలో కోత పడక తప్పదు. ఇదే జరిగితే ఆగస్టు నుంచి హైదరాబాద్‌కు తాగునీటికి కటకట తప్పదు. దానివల్ల పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది మాదిరే కృష్ణాబేసిన్‌లో సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాలుకురవని పక్షంలో మళ్లీ జంట నగరాలకు నీటి సమస్య తప్పే పరిస్థితి కనిపించడం లేదు.
సింగూరుపైనే ఆశలు
జంట నగరాలకు తాగునీటిని అందించే మరో ముఖ్యమైన ప్రాజెక్టు సింగూరుపైనే ఆశలు ఉన్నాయి. రాజధాని నగరమైన హైదరాబాద్‌కు నీటి సరఫరా కోసం ప్రాజెక్టులో ఆరు టీఎంసీల మేర వాటా ఉండగా.. ఇప్పటికే 5.2 టీఎంసీల మేర వినియోగించారు. మరో 0.8 టీఎంసీల వాటా మాత్రమే మిగిలి ఉంది. అయితే ప్రస్తుతం సింగూరులో 7.5 టీఎంసీల మేర నీరు అందుబాటులో ఉంది. అందులో ఆవిరి నష్టాల కింద మూడు టీఎంసీలను తీసేసినా.. మరో నాలుగు టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. ఈ నీటితో జూన్ నెల వరకు రాజధాని నగరానికి తాగునీరు అందించవచ్చని అధికార వర్గాల అంచనా. ఒకవేళ వర్షాలు పడటం ఆలస్యమైతే మాత్రం ఇబ్బందే. అదే పరిస్థితి ఎదురైతే నీటి కొరత తప్పదని వారు పేర్కొంటున్నారు. గోదావరిలో జూలై నాటికి వర్షాలు సాధారణంగానే ఉంటాయని చెబుతున్నారు.
భూగర్భ జలాల పరిస్థితి..
(భూ ఉపరితలం నుంచి లోతుకు-మీటర్లలో)
జిల్లా గత ఏడాది ప్రస్తుతం
హైదరాబాద్ 7.97 10.46
రంగారెడ్డి 10.18 14.00
ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు (అడుగుల్లో..) నీరు (టీఎంసీల్లో)
ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం {పస్తుత మట్టం లభ్యత నీరు గత ఏడాది మట్టం లభ్యత నీరు
నాగార్జునసాగర్ 590 516.1 142.3 517.55 144.79
సింగూరు 1,717.93 1,696.92 7.53 1,712.77 21.74