డోలియాతో నరసింహమూర్తి, అలివేలు మంగ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మండువా లోగిలి మధ్య ధ్వజ స్తంభంలా పక్క ఫొటోలోని ఈ ఇత్తడి గొట్టం అమరికను డోలియా అంటారు. పూర్వం వర్షం నీటిని ఒడిసి పట్టి.. దానిని ఓ చోటకు చేర్చి మంచినీటిగా మార్చే ప్రక్రియ కోసం దీనిని వినియోగించేవారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోలియా తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సెంటర్‌లోని మండువాలో నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది. అందులో ఎనిమిది పదుల వయసు దాటిన సాలిగ్రామం నరసింహారావు, ఆయన భార్య అలివేలుమంగ ఉంటున్నారు. ఆ దంపతుల్ని ‘సాక్షి’ పలకరించింది. మండువా విశేషాలు, డోలియా ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంది.
తాతల కాలంలో నిర్మించారు
అప్పట్లోనే ఎంఏ ఇంగ్లిష్ చదివిన ఇంటి యజమాని నరసింహారావు మాట్లాడుతూ.. ‘మండువా లోగిలిపై పడే ప్రతి నీటి బొట్టు వృథా కాకూడదన్న ఉద్దేశ్యంతో డోలియా పెట్టించారు. మా తాత నరసయ్య ఎంతో ఇష్టపడి కట్టించిన మండువాను, అందులోని డోలియాను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో ఇత్తడి లేదా రాగితో ఇలాంటివి ఏర్పాటు చేసేవారు. ఇంటి కప్పుపై కురిసే వర్షం నీరంతా డోలియా గొట్టం ద్వారా ఇంటి అడుగు భాగంలో నిర్మించిన రాతి ట్యాంక్‌లోకి చేరేది. అప్పట్లో ఇలా నిల్వ చేసిన నీటినే తాగేవాళ్లం. అలాగని అప్పుడు నీటి కొరత లేదు. అప్పట్లో వర్షం నీరంటే ఎలాంటి కాలుష్యం లేనిది. రాగి లేదా ఇత్తడి తొడుగు ద్వారా ఒడిసి పట్టడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నశించేది. ఆ నీటిని తాగితే ఆరోగ్యం చేకూరుతుందని గట్టి నమ్మకం.
డోలియా ద్వారా వచ్చిన నీరు ఇంటిల్లిపాదికీ వారం, పది రోజులు సరిపోయేది. అది అయిపోయాక చెరువు నీళ్లు తెచ్చుకునే వాళ్లం. వర్షం నీటిని ప్రకృతి వర ప్రసాదంగా భావించేవారు. నీటిని నిల్వ చేసుకునేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు, వినియోగం తరువాత మిగిలిన నీటిని డ్రెయిన్లలోకి పంపించేందుకు మండువా లోగిళ్లలో కనిపించే ప్రత్యేక ఏర్పాట్లు నాటి జీవన శైలికి సాక్ష్యాలు. ప్రతి లోగిలిలో 10 నుంచి 12 కుటుంబాలు నివసించేవి. మండువా చుట్టూ గదులు, వసారాలు, కొట్టు గదులు ఉండేవి. కొన్నింటిలో అయితే మేడలు (డూప్లెక్స్ ఇళ్లు) కూడా ఉండేవి. మా మనుమలు, ముని మనుమలు సెలవులకు వచ్చినప్పుడల్లా ఈ మండువాను, డోలియాను తీసేద్దామనేవారు. ఏది చేయాలన్నా నన్ను ఇంటి నుంచి బయటకు పంపేశాక చేసుకోండని గట్టిగా చెప్పడంతో దాని గురించి మాట్లాడటం మానేశారు’ అని వివరించారు.
కాపాడాల్సిన బాధ్యత మాదే
నరసింహారావు సతీమణి అలివేలు మంగ మాట్లాడుతూ.. ‘మా మావయ్య గారి తండ్రి 130 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు ఇది. డోలియాను ఇప్పుడు వాడటం లేదు కానీ.. ఒకప్పుడు చాలా ఉపయోగపడేది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రెండు, మూడేళ్లకు ఒకసారి మెరుగు పెట్టించి కాపాడుకుంటున్నాం. పిడుగులు పడినప్పుడు డోలియా ఉండటం వల్ల ఇంట్లో వారెవరికీ ప్రమాదం ఉండదు’ అని చెప్పారు.
మండువా అంటే..
మండువా లోగిలి అంటే.. పురాతనమైన సంప్రదాయక పెంకుటిల్లు. చుట్టూ నలువైపులా గదులుంటాయి. కనీసం 10 కుటుంబాలు నివాసం ఉండేలా.. పెద్ద విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో నిర్మాణం ఉండేది. నాలుగు వైపులా ఒక దానిని ఆనుకుని మరొకటి చొప్పున 10 నుంచి 12 వాటాలు (పోర్షన్లు) ఉండేవి. ప్రతి వాటాలో వంట గది, విశ్రాంతి గది, పడక గది, పెరటి దొడ్డి ఉండేవి. ఒక్కొక్క పోర్షన్‌లో 8 నుంచి 10 గుమ్మాలను అమర్చేవారు. సింహద్వారం నుంచి పెరటి గుమ్మం వరకు వందకు పైగా గుమ్మాలు ఉండేవి. లోగిలి మధ్యలో కల్యాణ మండపం ఉండేది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి ఇంటి మధ్య హాలు భాగంలో పైకప్పు లేకుండా నిర్మాణం చేసేవారు. వాన నీరు హాలులో మధ్యలో పడటానికి వీలుగా ఒక గుంట, ఆ గుంటలోంచి నీరు బయటకు పోవడానికి డ్రెయినేజీ పైపు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోని బిందెలు, పాత్రలలో నింపుకుని అవసరానికి ఉపయోగించుకునేవారు. మండువా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువా లోగిలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి కుటుంబాల మమతల కోవెళ్లుగా మండువా లోగిళ్లు వెలుగొందేవి.
అలనాటి నిర్మాణాలకు ప్రతీక
కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో చిట్టూరి వంశీయులు నిర్మించిన మండువా లోగిలి అలనాటి నిర్మాణాలకు ప్రతీకగా రాజసాన్ని చాటుతోంది. ఇక్కడ 1830లో చిట్టూరి గోపాలయ్య నిర్మించిన ఈ మండువా లోగిలో మూడు తరాల వారు నివాసం సాగించారు. గోదావరి ఏటుగట్టుని అనుకుని ఉన్న ఈ గ్రామం తరచూ గోదావరి వరద ముంపునకు గురయ్యేది. ఈ దృష్ట్యా ఏటిగట్టుకు కిలోమీటరు దూరంలో ముంపు బారిన పడకుండా రెండెకరాల విస్తీర్ణంలో 10 కుటుంబాలకు చెందిన 50 మంది ఉండేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 189 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లోగిలిలో అన్ని సదుపాయాలను శాస్త్రానికి, వాస్తుకు అనుకూలంగా నిర్మించారు. ఇందులో 114 గుమ్మాలతో నిర్మించిన ప్రతి గది ఆధునిక హంగులను ప్రతింబిస్తుంటుంది. లోగిలి మధ్యలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం విశేషంగా అకట్టుకుంటుంది. చిట్టూరి వంశంలో మూడో తరానికి చెందిన పార్థసారథి ఈ మండువాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.
అక్కడక్కడా ఇంకా ఉన్నాయ్
తూర్పు గోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం కూళ్ల, ఉప్పలగుప్తం, సన్నవిల్లి, భీమనపల్లి, నంగవరం, గోడి, కూనవరం, పోతుకుర్రు, లక్కవరం, తూర్పుపాలెం, బట్టేల్లంక, కేశనపల్లి, గుడిమెళ్లంక, మోరిపోడు, గుడిమూల, సఖినేటిపల్లి, వీరవల్లిపాలెం, టేకి, పామర్రు గ్రామాల్లో మండువా ఇళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి, శివదేవుని చిక్కాల, వీరవాసరం, మల్లవరం, పోడూరు, కుమారదేవం, ఇలపర్రు, బూరుగుపల్లి, చించినాడ, తణుకు, భీమవరం, ఉండి, ఆకివీడు తదితర ప్రాంతాల్లో మండువాలు, డోలియాలను భద్రంగా చూసుకుంటున్నారు.
- చిట్టూరి పార్థసారథి
Comments
Please login to add a commentAdd a comment