సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా అనేక దేశాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని, ఉపరితల, భూగర్భ జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ సిన్హా సూచిం చారు. బుధవారం జలసౌధలో నీటి వనరుల అభివృద్ధి, నిర్వహణలో ‘ఐసోటోప్’ల వినియోగంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ నీరు భూమి మీద దొరికే విలువైన వనరన్నారు. రాబోయే కాలంలో నీటి సంక్షోభం తీవ్రంగా ఉండబోతున్నదని, పారిశ్రామికీకరణతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నివారణా చర్యలు సూచించడానికి బార్క్ దేశవ్యాప్తంగా ‘ఐసోటోప్’టెక్నాలజీని వినియోగి స్తోందన్నారు. దీని ద్వారా భూగర్భ జలాల రీచార్జి మూలాలను అన్వేషించవచ్చునని, నీటి ఊటలను, ఉపరితల, భూగర్భ జలాల మధ్య అంతర్గత మార్గాలను తెలుసుకోవచ్చని వివరించారు.
వాటి కాలుష్య కారకాలను గుర్తించడంతోపాటుగా కాలువలు, సొరంగాలు, జలాశయాలు, డ్యాములు సంభవించే సీపేజ్‌ను తెలుసుకోవచ్చునని, జలాశయాల్లోకి, చెరువుల్లోకి వచ్చే పూడిక మట్టి పరిమాణాన్ని అంచనా వేయొచ్చునని స్పష్టం చేశారు. గతంలో తెలం గాణలోని నల్లగొండ జిల్లాలో కూడా ధన్ ఫౌండేషన్ వారి అభ్యర్థన మేరకు పూడిక మట్టి తీసిన,తీయని చెరువుల్లో, భూగర్భ జలాల రీచార్జి స్థితిని తులనాత్మకంగా అధ్యయనం చేశామని గుర్తు చేశారు. పూడిక మట్టి తీసిన చోట భూగర్భ జలాల మట్టం బాగా పెరిగినట్టు తేలిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోరితే ఉచితంగానే పరిశోధనలు నిర్వహించి నివారణా చర్యలు సూచిస్తామని అన్నారు. కొత్త సాంకేతిక పద్దతిపై తమకు అవగాహన కల్పించిన సిన్హాను ప్రభుత్వ సలహాదారు ఎస్‌కే జోషి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment