Godavari flood
-
1989 టీఎంసీలు కడలిపాలు
సాక్షి, హైదరాబాద్: గలగలా గోదారి.. బిరబిరా కృష్ణమ్మ కడలి వైపు కదిలిపోతున్నాయి. ఇప్పటికే 1,903 టీఎంసీల గోదావరి, 86 టీఎంసీల కృష్ణా జలాలు కలిపి మొత్తం 1989 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణాలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఎగువ గోదావరి పరీవాహకంలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వరద రాకపోవడంతో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులు సగం కూడా నిండలేదు. కృష్ణాలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో 10 రోజులుగా వచ్చిన వరదను వచ్చినట్టు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం(తెలంగాణ) నుంచి అంతర్వేది(ఏపీ) వరకూ పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండడంతో వస్తున్న వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వర్షాల్లేక వరద తగ్గుముఖం..గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు, వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 47.25 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 3,583 క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టు కాల్వలకు విడుదల చేస్తున్నారు. గోదావరికి ప్రాణహిత వరద తోడుకావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు 2,89,710 క్యూసెక్కులు, తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్ నుంచి 4,48,810 క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్ నుంచి 4,61,484 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్టు దిగువన వదులుతున్నారు. ⇒ పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. కాళేశ్వరం లింక్–2లో భాగంగా నీటిని ఎత్తిపోయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.82 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5,676 క్యూసె క్కులు ఉండగా, 3,602 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. ఎగువ కృష్ణాలో తగ్గిన వరదకృష్ణా పరీవాహకంలో ఎగువన వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 15,000, నారాయణపూర్ నుంచి 6,000, జూరాల ప్రాజెక్టు నుంచి 82,339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,84,791 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ నీటిని దిగువన ఉన్న సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి దిగువకు 1,04,424 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సాగర్ ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదలనాగార్జునసాగర్/దోమలపెంట : శ్రీశైలం నుంచి వచ్చే వరద తగ్గడంతో నాగార్జునసాగర్ వద్ద కొన్ని గేట్లు మూసివేశారు. శనివారం సాయంత్రం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. ఆదివారం ఉదయానికి 16 గేట్లకు తగ్గించారు. మధ్యాహ్నానికి 14, 10 గేట్లకు తగ్గిస్తూ సాయంత్రానికి ఎనిమిది గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. పర్యాటకులతో ఆదివారం నాగార్జునసాగర్ జనసంద్రంగా మారింది. సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.సొంతవాహనాల్లో తరలిరావడంతో డ్యాం దిగువన కృష్ణాతీరం వెంట గల రోడ్లన్నీ కిటకిటలాడాయి. శ్రీశైలం నుంచి వరద వస్తుందనే సాకుతో ఆదివారం కూడా తెలంగాణ వైపు లాంచీలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు చాలామంది నిరాశతో వెళ్లారు. కొంతమంది మాత్రం రైట్ బ్యాంకు వెళ్లి అక్కడి నుంచి లాంచీల్లో నాగార్జునకొండకు వెళ్లారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆరు గేట్లు పైకెత్తి నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
భద్రాచలం వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు కాగా, 9,18,164 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.కాగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. -
రాజమండ్రి : గోదావరి ఉగ్రరూపం..నీట మునిగిన లంక గ్రామాలు (ఫొటోలు)
-
పోటెత్తుతున్న గోదావరి.. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 14లక్షల 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి ప్రవహిస్తోంది. రాత్రికి 58 నుంచి 60 అడుగుల వరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. ఇప్పటివరకు 4,900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాలు వరదనీటిలో మునిగిపోయాయి. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. చదవండి: వానలు మిగిల్చిన విషాదం ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌లకు కాల్ చేయాలి. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలి. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
భద్రాచలం రామాలయం చుట్టూ వరద నీరు.. మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గంట గంటకు వరద పెరుగుతోంది. 44.40 అడుగులకు నీటిమట్టం చేరింది. రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. అన్నదాన సత్రం నీటమునిగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం నుంచి దిగువకు 9.92 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం డివిజన్ లోని ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే స్థానిక అధికారులకు సహకరించి పునరావస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రావతి ప్రాణహిత నదుల్లో నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుంది. కాలేశ్వరం మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నుంచి కూడా లక్షల కొద్ది క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. చర్ల మండలంలోని తల్లి పేరు ప్రాజెక్టు నుంచి కూడా సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతున్నదని ముంపు ప్రాంత గ్రామాలపై యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చదవండి: కొట్టుకుపోతుంటే.. ప్రాణాలకు తెగించి మరీ భద్రాచలం నుండి చర్ల వెళ్ళు రహదారిపైకి సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరినందున రాక పోకలు నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రజలు రవాణా చేయకుండా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షం వస్తుందని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళొద్దని, ప్రజలు కూడా దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని పేర్కొన్నారు. పశువులను మేతకు బయటికి వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని, వరద చేరిన సందర్భంగా పశువులను ఎతైన ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయాలన్నారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. -
గోదావరి ఉధృతి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, ఖమ్మం/తూర్పుగోదావరి: భద్రాచలం వద్ద గోదావరి వరద మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం టౌన్లోకి లీకేజీ వాటర్ పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో రామయ్య ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో సింగరేణి నుంచి తెప్పించిన హై పవర్ మోటార్ల సహాయంతో నీటిని రివర్స్‌గా మళ్లీ గోదావరిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు గోదావరి: ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద తీవ్రత పెరుగుతుంది. కోటిపల్లి స్నాన ఘట్టాలను వరద తాకడంతో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటి ప్రయాణాలు నిలిపివేశారు. కోటిపల్లి గోదావరి సమీప గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపాయ గట్టుకు వరద తాకిడితో తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం,పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి ఎదురు బిడియం కాజ్‌వేల పైకి కూడా వరద నీరు చేరనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగి పోర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై వరంగల్‌తో పాటు పలు గ్రామాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా టేకులగూడెం వద్ద గోదావరి వరద ఉధృతికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట మండలం కట్రియాల- ఇల్లంద మద్య జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలడంతో వరంగల్-ఖమ్మం మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆధార్ సిన్హా, రజత్ కుమార్, సునీల్ శర్మ,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు హాజరయ్యారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద
సాక్షి, రాజమహేంద్రవరం: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉపనదులైన ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరులో వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలోకి వరద పెరుగుతోంది.పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.050 మీటర్లకు నీటిమట్టం పెరిగింది.వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్‌వే గేట్ల నుంచి 3 లక్షల15 వేల791 క్యూసెక్కుల వరద నీటినిదిగువకు విడుదల చేశారు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. గురువారం నాటికి ఇది వాయవ్య బంగాళాఖా తం, దాని సరిహద్దులో ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. ఈ ఫలితంగా గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి వర్షాల ఉద్ధృతి పెరగనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని తెలిపింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దిగువ కాఫర్ డ్యామ్ పనులు వేగవంతం
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రవాహం లేని ప్రాంతంలో దిగువ కాఫర్ డ్యామ్ పనులను అధికారులు చేపట్టారు. మంగళవారం పోలవరం వద్ద గోదావరిలో 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 203 మీటర్ల మధ్య 29 మీటర్ల ఎత్తుకు పనులు చేశారు. వరద తగ్గే కొద్దీ ప్రవాహం నుంచి బయటపడిన ప్రాంతంలో మిగిలిన 473 మీటర్ల పొడవున కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతిలోగా దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి స్థాయిలో అంటే 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడంతో ఆమేరకు చర్యలు చేపట్టారు. గోదావరి వరద ఉద్ధృతికి కోతకు గురైన ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో రెండు చోట్ల, దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 680 మీటర్ల మధ్య అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన ప్రాంతం మినహా మిగిలిన 932 మీటర్లను జూలై నాటికే 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేశారు. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్‌లో 0 నుంచి 203 మీటర్ల మధ్య పనులు వేగంగా చేస్తున్న దృశ్యం నవంబర్‌లో కనిష్ట స్థాయికి వరద అగాధాలు పూడ్చడం, కాఫర్ డ్యామ్ పనులు చేపట్టే విధానాన్ని ఖరారు చేయడంతో డీడీఆరీ్ప(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) జాప్యం చేయడంతో జూలై ఆఖరు నాటికి పూర్తి చేయలేకపోయారు. జూలై రెండో వారంలోనే వరద రావడంతో కోతకు గురైన ప్రాంతంలో దిగువ కాఫర్ డ్యామ్‌ను వరద నీరు ముంచెత్తింది. దీంతో పనులు చేపట్టలేని పరిస్థితి. ఇటీవల వరద తగ్గడంతో ప్రవాహం లేని ప్రాంతంలో 0 నుంచి 203 మీటర్ల మధ్య దిగువ కాఫర్ డ్యామ్ పనులను చేపట్టి ఇప్పటికే 29 మీటర్ల ఎత్తుకు పూర్తి చేశారు. నవంబర్ రెండో వారానికి వరద కనిష్ట స్థాయికి చేరుతుంది. అప్పుడు దిగువ కాఫర్ డ్యామ్ ప్రాంతంలో వరద ఉండదు. ఆ సమయంలో మిగతా పనులు చేపట్టి కోతకు గురైన ప్రాంతంలో 680 మీటర్ల పొడవున 30.5 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్ డ్యామ్‌ను సంక్రాంతికి పూర్తి చేయనున్నారు. అప్పుడు 1,612 మీటర్ల పొడవున దిగువ కాఫర్ డ్యామ్ పూర్తవుతుంది. దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన సీడబ్ల్యూసీ ఖరారు చేసే డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టనున్నారు. గోదావరి వరదల్లోనూ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి నిరి్వఘ్నంగా కొనసాగించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. -
నేలతల్లికి.. గోదావరి గాయం
సాక్షి అమలాపురం: గోదావరి చేస్తున్న గాయానికి పెద్ద ఎత్తున భూములు కోతకు గురవుతున్నాయి. వరద ఉధృతికి విలువైన సాగు భూములు నదీగర్భంలో కలిసిపోతున్నాయి. జూలైలో వచ్చిన రికార్డు స్థాయి వరద.. ఈ నెలలో వచ్చిన వరదలకు లంక గ్రామాల్లోని కొబ్బరి తోటలు, విలువైన ఉద్యాన పంటలు పండే భూములు నదీకోతకు గురవుతున్నాయి. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 17 మండలాల్లో 93 లంక గ్రామాలుండగా, సుమారు 25 గ్రామాల్లో నదీకోత తీవ్రత అధికంగా ఉంది. మిగిలిన గ్రామాల్లో సైతం నదీకోతకు భూములు కొట్టుకుపోతున్నాయి. బంగారు భూములు గోదావరి మధ్య ఏర్పడిన సహజసిద్ధమైన లంకలంటే బంగారం పండే భూములు. ఏటా వరదలకు మేటలుగా పడే ఒండ్రు మట్టి వల్ల ఇక్కడ పంటల దిగుబడి అధికం. ఇతర ప్రాంతాల్లో కన్నా లకంల్లో కొబ్బరి దిగుబడి అధికం. కాయ సైతం పెద్దగా ఉంటుంది. ఇక్కడి కొబ్బరికి ఇతర ప్రాంతాల్లో పండే కాయకన్నా రూ.2 అధికంగా వస్తుంది. కొబ్బరితో పాటు కోకో, అరటి, కంద, పసుపు, అల్లం, కూరగాయల వంటి ఉద్యాన పంటలతో పాటు పువ్వులు, నర్సరీలు, మొక్కజొన్న, అపరాల వంటి వ్యవసాయ పంటలు సాగవుతుంటాయి. దీర్ఘకాలికం మినహా మిగిలిన పంటలు ఆగస్టు వరదల సమయానికే చేతికి వచ్చేలా సాగు చేస్తుంటారు. దశాబ్దాల కాలంగా ఇంతటి విలువైన వందల ఎకరాల భూములు నదీగర్భంలో కలిసిపోవడంతో లంక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత ఇక్కడ అధికం జిల్లాలోని ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, పి.గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం మండలాల్లో నదీకోత అధికంగా ఉంది. గోదావరి మధ్యన ఉన్న లంక గ్రామాల్లోనే కాకుండా ఏటిగట్లు, నదీగర్భానికి మధ్య ఉన్న భూములు సైతం పెద్ద ఎత్తున కోతకు గురవుతున్నాయి. కె.గంగవరం మండలం శేరిలంక, ముమ్మిడివరం మండలం కమిని, వలసతిప్ప, సలాదివారిపాలెం గ్రామాలు కూడా కోతకు గురవుతున్నాయి. ఇక్కడ ఇళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ గత దశాబ్దకాలంలో సుమారు 2 వేల ఎకరాల భూములు కొట్టుకుపోయాయని అంచనా. ఇది మామిడికుదురు మండలం పెదపట్నంలంక వద్ద పరిస్థితి. కల్పవృక్షాలను ఇలా నదీమతల్లి ఇలా కబళించేస్తోంది. ఇక్కడ కొబ్బరి దిగుబడి సంఖ్యలోను, పరిమాణంలోను ఎక్కువ. ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న బి.దొడ్డవరం, పెదపట్నం, అప్పనపల్లిలో సైతం నదీ కోత తీవ్రంగా ఉంది. దొడ్డవరాన్ని ఆనుకుని బోట్లకూరు అనే గ్రామం మొత్తం నదిలో కలిసిపోయింది. ఈ గ్రామాల్లో సుమారు 600 ఎకరాల భూమి నదిలో కొట్టుకుపోయింది. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఉడుమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేట వశిష్ట నది మధ్యలో దీవిలా ఉంటాయి. ఉధృత నదీ కోతకు ఈ దీవికి అన్నివైపులా సాగు భూమి కోతకు గురవుతోంది. జిల్లా పరిధిలోని వశిష్ట ఎడమగట్టు వైపు నది చిన్నపాయలా ప్రవహిస్తున్నా.. వంపు తిరిగినందున ఇటు లంక భూమికి కోత పెట్టడంతో పాటు ఏటిగట్టును సైతం బలహీనపరుస్తోంది. గడచిన పదేళ్లలో ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 100 ఎకరాలకు పైగా భూమి గోదావరిలో కలిసిపోయిందని అంచనా. రక్షణకు అడ్డంగా కన్జర్వెన్సీ యాక్టు కోత నివారణకు గ్రోయిన్లు, రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని లంక గ్రామాల రైతులు కోరుతున్నారు. అయితే మద్రాస్ కన్జర్వెన్సీ యాక్టు–1884 దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ యాక్టు ప్రకారం నదీ ప్రవాహానికి అడ్డంగా నిర్మాణాలు చేయకూడదు. ఈ నిబంధన వల్ల ప్రభుత్వం ఏటిగట్లను ఆనుకుని ఉన్న లంక ప్రాంతాల్లో గ్రోయిన్లు, రిటైనింగ్ వాల్స్ కడుతున్నా.. లంక మధ్య ప్రాంతాల్లో మాత్రం నిర్మించలేకపోతోంది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో రూ.110 కోట్లతో వీటిని నిర్మించారు. ఈ నిర్మాణాలు జరిగిన చోట నదీ కోత ఉండకపోవడం విశేషం. -
మళ్లీ మహోగ్ర గోదారి
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎగువన మహారాష్ట్రలో, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పోటెత్తి ప్రవహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని తదితర ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గత రెండు రోజులుగా గోదావరిలో వరద భీకరరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ గేట్లు ఎత్తేసి 10.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు ఉప నదులు, వాగులు వంకల నుంచి వచ్చిన వరద తోడై సమ్మక్క(తుపాకులగూడెం) బ్యారేజీలోకి 12.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీ దిగువన సీతమ్మసాగర్‌లోకి 14,93,531 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆ మేరకు కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు 54.60 అడుగులతో ఉన్న గోదావరి తర్వాత స్వల్పంగా తగ్గింది. సాయంత్రం 54.50 అడుగులతో 15,02,258 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, మంగళవారం జారీ చేసిన మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు గద్వాల రూరల్/దోమలపెంట(అచ్చంపేట)/ నాగార్జున సాగర్: కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు జూరాలకు 2.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా ఉండగా, 44 గేట్లు ఎత్తి 2,14,135 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సంకేçశుల నుంచి 52,832 క్యూసెక్కులు వస్తుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం 2,96,431 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో పది గేట్లను పది మీటర్ల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,75,700 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 63,914 క్యూసెక్కులు మొత్తం 3,39,614 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద ఉధృతి నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆరు గేట్లు ఐదు అడుగులు, 18 గేట్లు పది అడుగులు ఎత్తి దిగువకు 2,98,596 క్యుసెక్కులు వదులుతున్నారు. మంగళవారం వరకు 26 గేట్ల ద్వారా నీరు విడుదలవగా.. బుధవారం రెండు గేట్లు మూసివేసి 24 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. -
లంక గ్రామంలో తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
-
Telangana: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనంతగా మహోగ్ర రూపం దాల్చిన గోదావరి బారి నుంచి ప్రజ లను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన సైన్యాధికారులు 101 మంది బృందంతో కూడిన ప్రత్యేక దళాన్ని భద్రాచలం ముంపు ప్రాంతాల్లో సేవలందించేందుకు కేటాయించారు. దీంతో వారంతా హైదరాబాద్ నుంచి భద్రాచలం బయల్దేరి వెళ్లారు. సైన్యంతో పాటు ప్రత్యేకంగా హెలీకాప్టర్లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం వరదలపై సమీక్ష సందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు హెలికాప్టర్లను ప్రజలను రక్షించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలకు వీలుగా సిద్ధం చేశారు. రబ్బర్ పడవలతో పాటు, రక్షణ పరికరాలు, లైఫ్ జాకెట్లను యుద్ధప్రాతిపదికన భద్రాచలానికి తరలిస్తున్నారు. రెస్క్యూ టీమ్‌లను కూడా రంగంలోకి దించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడానికి వీలైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇప్పటికే తరలించిన రక్షణ సామగ్రి సరిపోని పక్షంలో మరింత సామగ్రి పంపించాలని సూచించారు. చదవండి: (భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం) 80 అడుగుల వరదొచ్చినా ఎదుర్కోవాలి వర్షాలు, వరదల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎస్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష, సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. వరద నీరు 80 అడుగులకు చేరినా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎస్ ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యేక పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు. శిబిరాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఐటీసీ భద్రాచలం వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు. చదవండి: (గోదావరి ఉధృతి.. పాత రికార్డులన్నీ బద్దలు..?!) పర్యవేక్షణ అధికారిగా సింగరేణి ఎండీ వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరామని ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎస్ తెలిపారు. ఈ మేరకు 68 మంది సభ్యులుగల ఇన్ఫాంట్రీ, 10 మంది సభ్యులుగల వైద్య బృందం, 23 మంది సభ్యులు గల ఇంజనీరింగ్ బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లాయని తెలిపారు. పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక పడవలను సిబ్బందితో సహా పంపామని చెప్పారు. అగ్నిమాపక విభాగానికి చెందిన 7 బోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది ఈతగాళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నారని వివరించారు. ఈ జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి, సింగరేణి కాలరీల ఎండీ ఎం.శ్రీధర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించామని తెలిపారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్‌లను భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో ఉంచితే..వరద సహాయక చర్యలు సమర్ధవంతంగా చేపట్టేందుకు అవకాశముందని మంత్రి పువ్వాడ చెప్పారు. -
పోలవరం ప్రాజెక్ట్ సవాళ్లను ఎదుర్కొనే కసరత్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధించిన కసరత్తును ఢిల్లీ–ఐఐటీ రిటైర్డ్ డైరెక్టర్, ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని 8 మంది నిపుణుల బృందం పూర్తి చేసింది. గోదావరి వరదల ఉధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను డ్రెడ్జింగ్, వైబ్రో కాంపాక్షన్ ద్వారా పూడ్చే విధానాన్ని నిపుణుల బృందం రూపొందించింది. డయా ఫ్రమ్ వాల్ పరిస్థితిని అంచనా వేసి.. దాని పటిష్టతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. బావర్ సంస్థ ఇచ్చే నివేదిక, గోతులను పూడ్చే విధానంపై డీడీఆర్పీకి పోలవరం సీఈ సుధాకర్‌బాబు పంపనున్నారు. సవాళ్లను ఎదుర్కొనే విధానాన్ని వారంలోగా డీడీఆర్పీ ఖరారు చేస్తుంది. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ సూచనల మేరకు ప్రొఫెసర్ రాజు నేతృత్వంలోని బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో మెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుకను నింపి పూడ్చే పనులు పరిశీలించింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను పరిశీలించింది. శనివారం పోలవరంలో రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో నిపుణుల బృందం సమావేశమైంది. రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యన నీటిని తోడకుండానే ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన గోతులను డ్రెడ్జింగ్ చేస్తూ.. వైబ్రో కాంపాక్షన్ ద్వారా పూడ్చే విధానాన్ని రూపొందించింది. ప్రధాన డ్యామ్ డయా ఫ్రమ్ వాల్ పటిష్టతపై అధ్యయనం చేసే బాధ్యతను బావర్‌కు అప్పగించింది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత డయాఫ్రమ్ వాల్‌తో అనుసంధానం చేయాలా లేదంటే ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలా అన్న అంశాన్ని డీడీఆర్పీకి నివేదిస్తారు. డీడీఆర్పీ ఖరారు చేసే విధానాన్ని సీడబ్ల్యూసీకి పంపి.. అది ఆమోదించిన విధానం ప్రకారం ఆ పనులు చేపడతారు. -
కోతకు గురైన నదీ గర్భం అభివృద్ధి.. క్షేత్రస్థాయిలో పరిశీలించాకే
సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉధృతికి పోలవరం ప్రాజెక్టులో గ్యాప్–1, గ్యాప్–2 ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్‌ల నిర్మాణ ప్రదేశానికి ఎగువన నదీ గర్భంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పటిష్టపర్చాలనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాకే తేల్చాలని డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) నిర్ణయించింది. డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్)–2 కింద ఆధునీకరణకు ఎంపికైన ధవళేశ్వరం బ్యారేజీ, శ్రీశైలం ప్రాజెక్టులను పరిశీలించేందుకు జనవరి 7న డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య రాష్ట్రానికి వస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించిన రోజునే పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీచేసి.. అపరిష్కృత డిజైన్లకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించారు. వర్చువల్ విధానంలో డీడీఆర్పీ భేటీ మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు డిజైన్ల రూపకల్పన కోసం సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన కేంద్రం ఏర్పాటుచేసిన డీడీఆర్పీ సోమవారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు, సీడబ్ల్యూసీ అధికారులతోపాటు సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్), సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) శాస్త్రవేత్తలు, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–చెన్నై ప్రొఫెసర్లు పాల్గొన్నారు. స్పిల్ వే నిర్మించకుండా వరద ప్రవాహాన్ని మళ్లించేలా కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభిం చి.. మధ్యలోనే వాటిని వదిలేయడంవల్ల వరద ఉధృతికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 కు ఎగువన ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. వాటిని ఇసుకతో నింపడం, వైబ్రో కాంపక్షన్ పద్ధతిలో ఇసుక తిన్నెలను పటిష్టపర్చడం.. డెన్సిఫికేషన్ (సాంద్రీకరణ) ద్వారా ఇసుక తిన్నెలను అ త్యంత పటిష్టంగా తీర్చిదిద్దడం, స్టోన్ కాలమ్స్ విదానంలో అభివృద్ధి చేసే విధానాలను డీడీఆర్పీకి అధికారులు వివరించారు. పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఏ విధానం ప్రకారం చేస్తే కోతకు గురైన ఇసుక తిన్నెలను అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దవచ్చో అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పాండ్య చెప్పారు. గోదావరి నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపునకు మళ్లించేందుకు నది వద్ద 450 మీటర్లు వెడల్పు.. ఆ తర్వాత ప్రతి వంద మీటర్లకూ 50 మీటర్ల వెడల్పును పెంచుతూపోయి.. స్పిల్ వే వద్దకు వచ్చేసరికి 1,100 మీటర్ల వెడల్పుతో అప్రోచ్ చానల్ తవ్వేలా డిజైన్‌ను 17వ డీడీఆర్పీ సమావేశంలోనే ఆమోదించారు. కానీ, నది వద్ద ప్రారంభంలో అప్రోచ్ చానల్ వెడల్పును 450 మీటర్లతో కాకుండా 550 మీటర్లకు పెంచే అంశంపై డీడీఆర్పీ చర్చించింది. ప్రారంభంలో అప్రోచ్ ఛానల్ వెడల్పును పెంచడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తేల్చారు. పోలవరం స్పిల్ వే సహా హెడ్ వర్క్స్‌లో అన్ని పనుల పటిష్టతను పరీక్షించే పనిని చెన్నైకి చెందిన సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీ సంస్థకు అప్పగించేందుకు డీడీఆర్పీ అంగీకరించింది. -
పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట
ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట చేలలోకి వరద నీరు చేరింది. గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బుధవారం చేపల వేటకు అధికారులు అనుమతించలేదు. అయితే కొందరు మత్య్సకారులు నీరు నిలిచిన పొలాల్లో చేపల వేట కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. పరివాహక ప్రాంతంలోని పంట చేలలో వరద నీటిపై తెప్పలు వేసుకుని వెళ్లి మత్య్సకారులు చేపలు పట్టారు. తమ రెక్కల కష్టం వరద పాలైందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం జరిగిన పొలాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పత్తి ఏరాల్సిన చోట చేపలు పట్టడం వింతగా ఉంది. - సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల -
కృష్ణాలో స్థిరంగా వరద.. శాంతించిన గోదావరి
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం: కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా.. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.98 లక్షల క్యూసెక్కుల ప్రవాహ జలాలు చేరుతున్నాయి. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ దిగువకు 35,315 క్యూసెక్కులు విడుదల చేస్తోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో కుడి గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ సర్కార్ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది. శ్రీశైలం ప్రాజెక్టు సీఈ మురళీనాథ్‌రెడ్డి సూచనల మేరకు మంగళవారం రాత్రి నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టామని విద్యుత్ కేంద్రం సీఈ సుధీర్ తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలంలో 876.89 అడుగుల్లో 172.66 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 539.7 అడుగులకు పెరిగింది. నీటి నిల్వ 187.70 టీఎంసీలకు చేరుకుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో మంగళవారం భారీ వర్షాలు కురవడంతో ఎగువన ఆల్మట్టిలోకి కృష్ణా వరద ప్రవాహం 3.92 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్రలోనూ వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 26,011 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 5,977 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 20,034 క్యూసెక్కులను 27 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం వద్దకు 2.65 లక్షల క్యూసెక్కులు గోదావరిలో వరద మంగళవారం మరింత తగ్గింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 2,65,670 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో 42 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వేకు ఎగువన వరద నీటి మట్టం 30.32 మీటర్లకు తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,32,010 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గోదావరి డెల్టా కాలువలకు 10,500 క్యూసెక్కులు వదలి.. మిగులుగా ఉన్న 4,21,510 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
మరోసారి మహోగ్రం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం, సాక్షి ప్రతినిధి, ఏలూరు, కుక్కునూరు: గోదారమ్మ తగ్గినట్లే తగ్గి అంతలోనే మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకు వరద ఉద్ధృతి పెరగడంతో భద్రాచలం వద్ద మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ 55.30 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 17.75 అడుగుల నీటిమట్టం ఉండగా మొత్తం 175 గేట్లను ఎత్తి 18,59,570 క్యూసెక్యులను సముద్రంలోకి వదులుతున్నారు. ► భద్రాచలం వద్ద వరద తాకిడి మరోసారి పెరగడంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు తిరిగి జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరద నీరు రహదారిపైకి చేరడంతో కుక్కునూరు – భద్రాచలం రాకపోకలు నిలిచిపోయాయి. ► ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి 2,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ► రంపచోడవరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్.ధనలక్ష్మి పరిశీలించారు. ► శబరి వరద నీరు చింతూరులో ప్రవేశించి సుమారు 40 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసర సరుకులను అందచేస్తున్నారు. చింతూరు వంతెన వద్ద గురువారం రాత్రి ప్రమాదానికి గురైన లాంచీ సరంగు పెంటయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. -
వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి
అమరావతి: గోదావరి వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. సీఎం కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మంది ప్రజలను తరలించామని, వచ్చే వరదను దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున సహాయ చర్యలు చేపట్టడానికి ఏర్పాట్లు చేశామని అధికారులు ఆయనకు వివరించారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ► వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ► ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టిపెట్టాలని, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ► దీనికోసం ప్రత్యేకంగా సహాయ పునరావాస శిబిరాలు తెరిచి, బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ► ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు సహాయ చర్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ► రక్షణ చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం రాష్ట్ర విపత్తు దళం (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్ఎఫ్) సహా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. ► రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ► గోదావరి వరద ఉధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. ► కృష్ణా జిల్లాలోనూ భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. -
వరద పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆరా..
సాక్షి, అమరావతి: గోదావరి వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. సీఎం కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మందిని తరలించారని, వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా సీఎంవో అధికారులు సీఎంకు వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఆయనకు తెలిపారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (పవన్ అభిమానికి సీఎం జగన్ ఆర్థిక సాయం) ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారిని రక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దీని కోసం ప్రత్యేకంగా సహాయ పునరావాస శిబిరాలు తెరిచి వారికి అన్నిరకాల సౌకర్యాలు అందించాలన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. రక్షణ చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. ఇటు కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
వందేళ్ల క్రితమే ఒడిసిపట్టారు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మండువా లోగిలి మధ్య ధ్వజ స్తంభంలా పక్క ఫొటోలోని ఈ ఇత్తడి గొట్టం అమరికను డోలియా అంటారు. పూర్వం వర్షం నీటిని ఒడిసి పట్టి.. దానిని ఓ చోటకు చేర్చి మంచినీటిగా మార్చే ప్రక్రియ కోసం దీనిని వినియోగించేవారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోలియా తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సెంటర్లోని మండువాలో నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది. అందులో ఎనిమిది పదుల వయసు దాటిన సాలిగ్రామం నరసింహారావు, ఆయన భార్య అలివేలుమంగ ఉంటున్నారు. ఆ దంపతుల్ని ‘సాక్షి’ పలకరించింది. మండువా విశేషాలు, డోలియా ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంది. తాతల కాలంలో నిర్మించారు అప్పట్లోనే ఎంఏ ఇంగ్లిష్ చదివిన ఇంటి యజమాని నరసింహారావు మాట్లాడుతూ.. ‘మండువా లోగిలిపై పడే ప్రతి నీటి బొట్టు వృథా కాకూడదన్న ఉద్దేశ్యంతో డోలియా పెట్టించారు. మా తాత నరసయ్య ఎంతో ఇష్టపడి కట్టించిన మండువాను, అందులోని డోలియాను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో ఇత్తడి లేదా రాగితో ఇలాంటివి ఏర్పాటు చేసేవారు. ఇంటి కప్పుపై కురిసే వర్షం నీరంతా డోలియా గొట్టం ద్వారా ఇంటి అడుగు భాగంలో నిర్మించిన రాతి ట్యాంక్‌లోకి చేరేది. అప్పట్లో ఇలా నిల్వ చేసిన నీటినే తాగేవాళ్లం. అలాగని అప్పుడు నీటి కొరత లేదు. అప్పట్లో వర్షం నీరంటే ఎలాంటి కాలుష్యం లేనిది. రాగి లేదా ఇత్తడి తొడుగు ద్వారా ఒడిసి పట్టడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నశించేది. ఆ నీటిని తాగితే ఆరోగ్యం చేకూరుతుందని గట్టి నమ్మకం. డోలియా ద్వారా వచ్చిన నీరు ఇంటిల్లిపాదికీ వారం, పది రోజులు సరిపోయేది. అది అయిపోయాక చెరువు నీళ్లు తెచ్చుకునే వాళ్లం. వర్షం నీటిని ప్రకృతి వర ప్రసాదంగా భావించేవారు. నీటిని నిల్వ చేసుకునేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు, వినియోగం తరువాత మిగిలిన నీటిని డ్రెయిన్లలోకి పంపించేందుకు మండువా లోగిళ్లలో కనిపించే ప్రత్యేక ఏర్పాట్లు నాటి జీవన శైలికి సాక్ష్యాలు. ప్రతి లోగిలిలో 10 నుంచి 12 కుటుంబాలు నివసించేవి. మండువా చుట్టూ గదులు, వసారాలు, కొట్టు గదులు ఉండేవి. కొన్నింటిలో అయితే మేడలు (డూప్లెక్స్ ఇళ్లు) కూడా ఉండేవి. మా మనుమలు, ముని మనుమలు సెలవులకు వచ్చినప్పుడల్లా ఈ మండువాను, డోలియాను తీసేద్దామనేవారు. ఏది చేయాలన్నా నన్ను ఇంటి నుంచి బయటకు పంపేశాక చేసుకోండని గట్టిగా చెప్పడంతో దాని గురించి మాట్లాడటం మానేశారు’ అని వివరించారు. కాపాడాల్సిన బాధ్యత మాదే నరసింహారావు సతీమణి అలివేలు మంగ మాట్లాడుతూ.. ‘మా మావయ్య గారి తండ్రి 130 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు ఇది. డోలియాను ఇప్పుడు వాడటం లేదు కానీ.. ఒకప్పుడు చాలా ఉపయోగపడేది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రెండు, మూడేళ్లకు ఒకసారి మెరుగు పెట్టించి కాపాడుకుంటున్నాం. పిడుగులు పడినప్పుడు డోలియా ఉండటం వల్ల ఇంట్లో వారెవరికీ ప్రమాదం ఉండదు’ అని చెప్పారు. మండువా అంటే.. మండువా లోగిలి అంటే.. పురాతనమైన సంప్రదాయక పెంకుటిల్లు. చుట్టూ నలువైపులా గదులుంటాయి. కనీసం 10 కుటుంబాలు నివాసం ఉండేలా.. పెద్ద విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో నిర్మాణం ఉండేది. నాలుగు వైపులా ఒక దానిని ఆనుకుని మరొకటి చొప్పున 10 నుంచి 12 వాటాలు (పోర్షన్లు) ఉండేవి. ప్రతి వాటాలో వంట గది, విశ్రాంతి గది, పడక గది, పెరటి దొడ్డి ఉండేవి. ఒక్కొక్క పోర్షన్లో 8 నుంచి 10 గుమ్మాలను అమర్చేవారు. సింహద్వారం నుంచి పెరటి గుమ్మం వరకు వందకు పైగా గుమ్మాలు ఉండేవి. లోగిలి మధ్యలో కల్యాణ మండపం ఉండేది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి ఇంటి మధ్య హాలు భాగంలో పైకప్పు లేకుండా నిర్మాణం చేసేవారు. వాన నీరు హాలులో మధ్యలో పడటానికి వీలుగా ఒక గుంట, ఆ గుంటలోంచి నీరు బయటకు పోవడానికి డ్రెయినేజీ పైపు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోని బిందెలు, పాత్రలలో నింపుకుని అవసరానికి ఉపయోగించుకునేవారు. మండువా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువా లోగిలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి కుటుంబాల మమతల కోవెళ్లుగా మండువా లోగిళ్లు వెలుగొందేవి. అలనాటి నిర్మాణాలకు ప్రతీక కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో చిట్టూరి వంశీయులు నిర్మించిన మండువా లోగిలి అలనాటి నిర్మాణాలకు ప్రతీకగా రాజసాన్ని చాటుతోంది. ఇక్కడ 1830లో చిట్టూరి గోపాలయ్య నిర్మించిన ఈ మండువా లోగిలో మూడు తరాల వారు నివాసం సాగించారు. గోదావరి ఏటుగట్టుని అనుకుని ఉన్న ఈ గ్రామం తరచూ గోదావరి వరద ముంపునకు గురయ్యేది. ఈ దృష్ట్యా ఏటిగట్టుకు కిలోమీటరు దూరంలో ముంపు బారిన పడకుండా రెండెకరాల విస్తీర్ణంలో 10 కుటుంబాలకు చెందిన 50 మంది ఉండేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 189 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లోగిలిలో అన్ని సదుపాయాలను శాస్త్రానికి, వాస్తుకు అనుకూలంగా నిర్మించారు. ఇందులో 114 గుమ్మాలతో నిర్మించిన ప్రతి గది ఆధునిక హంగులను ప్రతింబిస్తుంటుంది. లోగిలి మధ్యలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం విశేషంగా అకట్టుకుంటుంది. చిట్టూరి వంశంలో మూడో తరానికి చెందిన పార్థసారథి ఈ మండువాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడా ఇంకా ఉన్నాయ్ తూర్పు గోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం కూళ్ల, ఉప్పలగుప్తం, సన్నవిల్లి, భీమనపల్లి, నంగవరం, గోడి, కూనవరం, పోతుకుర్రు, లక్కవరం, తూర్పుపాలెం, బట్టేల్లంక, కేశనపల్లి, గుడిమెళ్లంక, మోరిపోడు, గుడిమూల, సఖినేటిపల్లి, వీరవల్లిపాలెం, టేకి, పామర్రు గ్రామాల్లో మండువా ఇళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి, శివదేవుని చిక్కాల, వీరవాసరం, మల్లవరం, పోడూరు, కుమారదేవం, ఇలపర్రు, బూరుగుపల్లి, చించినాడ, తణుకు, భీమవరం, ఉండి, ఆకివీడు తదితర ప్రాంతాల్లో మండువాలు, డోలియాలను భద్రంగా చూసుకుంటున్నారు. - చిట్టూరి పార్థసారథి -
వరద నీటిలో దహన సంస్కారాలు
సాక్షి, కాకినాడ: గోదావరి వరద బతికున్నోళ్లనే కాదు చనిపోయిన వాళ్లను కూడా ఇబ్బంది పెడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధ గౌతమీ నదికి వరద నీరు పోటెత్తడంతో మురమళ్ల గ్రామ స్మశాన వాటిక మునిగిపోయింది. గ్రామంలో నాగమణి అనే వృద్ధురాలు చనిపోవడంతో వరద నీటిలోనే అంతిమ యాత్ర నిర్వహించారు గ్రామ ప్రజలు. దహన సంస్కారాలు చేసినప్పుడు నీటితో తడిసిన కట్టెలు మండకపోవడంతో టైర్లు, కొబ్బరి మట్టలు వేసి అతికష్టం మీద కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగారు. మరోవైపు ఆంధ్ర, చత్తీస్గడ్ జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చింతూరు మండలంలో 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం విలీన మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. -
తగ్గని గోదా'వడి'
సాక్షి, అమరావతి/నెట్వర్క్: గోదావరిలో వరద ప్రవాహ తీవ్రత కొనసాగుతోంది. సోమవారం వేకువజామున 5 గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. క్రమేపీ తగ్గుతూ రాత్రి 7 గంటలకు 12.50 అడుగులకు చేరుకుంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 100 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు. గడచిన ఐదు రోజుల్లో 500 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ధవళేశ్వరం, దాని దిగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గినా.. ఎగువన భద్రాచలం వద్ద పెరుగుతుండటంతో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావంతో మంగళవారం ధవళేశ్వరం వద్ద వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి గోదావరి జిల్లాల ప్రజలను కలవరపెడుతోంది. ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు గోదావరిలోకి ఉప్పొంగి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6.40 గంటలకు భద్రాచలంలో నీటిమట్టం 43 అడుగులకు చేరింది. తూర్పు గోదావరి జిల్లా చింతూరు వద్ద 37.6 మీటర్లు, కూనవరం వద్ద 37.32 మీటర్లు, పోలవరం వద్ద 27.2 మీటర్లకు చేరింది. పోలవరం కాఫర్ డాŠయ్‌మ్ వద్ద వరద నీటి మట్టం 27.2 మీటర్లకు చేరడంతో.. స్పిల్‌వే మీదుగా రెండు మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 18 మండలాల పరిధిలోని 202 గ్రామాలను వరద ముంచెత్తింది. ఆ జిల్లాలో 87,850 మంది వరద వల్ల ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పటివరకు 18,809 మందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 22 మండలాల్లోని 218 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 26,047 మందికి సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. తూర్పు ఏజెన్సీ, కోనసీమ లంక గ్రామాలు నాలుగు రోజులుగా ముంపులోనే ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల పరిధిలో సుమారు 15 లంక గ్రామాలకు సైతం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎమ్మెల్యే, అధికారులకు తప్పిన ప్రమాదం పోలవరం మండలంలోని ముంపు గ్రామాల ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు, అధికారులకు తృటిలో ప్రమాదం తప్పింది. వారు పోశమ్మగండి నుంచి టూరిజం బోటులో వెళ్తుండగా.. మూలపాడు వద్ద కొండపక్క వరద ప్రవాహంలో చిక్కుకున్న బోటు ఒక్కసారిగా ఊగిపోతూ నదిలో కిందకు దిగిపోయింది. బోటును నది మధ్య నుంచి వాడపల్లి వైపు మళ్లించటంతో ప్రమాదం తప్పింది. కమీషన్ల కక్కుర్తే కొంప ముంచింది పోలవరం ప్రాజెక్ట్‌లో కమీషన్ల కోసం కక్కుర్తిపడి నిర్వాసితులను గాలికొదిలేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో వరదలకు కారణమయ్యారని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆక్షేపించారు. చంద్రబాబు పాపాలకు ప్రతిఫలమే ఈ వరదలన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్లే వరదలు వచ్చిపడ్డాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముంపుబారిన పడిన గిరిజన గ్రామాల్లో సోమవారం మంత్రుల బృందం పర్యటించింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న వీరవరం గ్రామానికి ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులాపల్లి ధనలక్ష్మి, యువజన అధ్యక్షుడు అనంతబాబు, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి ట్రాక్టర్లపై వెళ్లి పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. మరోవైపు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆచంట మండలంలో ముంపుబారిన పడిన అనగారలంక, పెదమల్లంలంక, పల్లిపాలెం, అయోధ్యలంక, పుచ్చలంక, రాయిలంకల్లో అధికారులతో కలిసి పర్యటించారు. 1,684 కుటుంబాల వారికి ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిçపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పామాయిల్ పంపిణీ చేశారు. శ్రీశైలం వద్ద పెరిగిన ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి సోమవారం వరద ప్రవాహం మరింత పెరిగింది. సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 2,36,331 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 42,378 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీ–నీవా ద్వారా 1,200 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 863.8 అడుగుల మేర 118.05 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విడుదల చేస్తున్న జలాల్లో 42,378 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతున్నాయి. ప్రస్తుతం సాగర్‌లో 506.8 అడుగులతో 126.30 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మహాబలేశ్వర్ పర్వతాల్లో 38 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించిన నేపథ్యంలో.. కర్ణాటక సర్కార్ ముందు జాగ్రత్తగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటి నిల్వలను ఖాళీ చేస్తూ భారీగా జలాలను దిగువకు విడుదల చేస్తోంది. కృష్ణా ప్రధాన ఉప నదులలో ఒకటైన బీమా ఉప్పొంగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1.60 లక్షల క్యూసెక్కుల వరద ఉజ్జయిని ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఉజ్జయిని గేట్లు అర్ధరాత్రి దాటాక ఎత్తే అవకాశం ఉంది. -
గిరిజనులను ముంచిన కాఫర్ డ్యామ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: నిపుణుల మాటలను పెడచెవిన పెట్టి చంద్రబాబు సర్కార్ నిర్మించిన కాఫర్ డ్యామ్ గిరిజనుల ‘కొంప’ ముంచింది. అదే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో మన్యం వాసులు నిద్రలేని రాత్రులు గడిపే స్థితికి కారణమైంది. కాఫర్ డ్యామ్ నిర్మాణంతో సమీప గ్రామాల్లో ప్రజలు వరద ముంపులో చిక్కుకుంటారని తెలిసినా నాటి ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం డ్యామ్‌కు సమీపాన ఉన్న దేవీపట్నం నుంచి కూనవరం మండలం వరకూ ఉన్న సుమారు ఐదు వేల కుటుంబాలు గోదావరి వరద ముంపునకు గురయ్యాయి. కాఫర్ డ్యామ్‌ను ఒక క్రమ పద్ధతిలో నిర్మించి ఉంటే ఇంతటి వరదను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడేదే కాదు. అటు పశ్చిమ గోదావరి జిల్లా పైడిపాక నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా పోసమ్మగండి వరకూ 1800 మీటర్ల పొడవు, 2400 మీటర్ల వెడల్పుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించారు. ఈ డ్యామ్‌కు రెండు వైపులా 300 మీటర్లు వంతున ఖాళీగా వదిలేశారు. ఏటా గోదావరికి ఆగస్టు వచ్చేసరికి వరదలు వస్తాయని తెలిసి కూడా ముందస్తు అంచనాలు లేకుండా చంద్రబాబు సర్కార్ డ్యామ్ నిర్మాణం చేపట్టింది. కాఫర్ డ్యామ్ నిర్మించే ముందు కనీసం నిర్వాసితులకు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ అందజేసి కాలనీలు నిర్మించి ఉంటే ఇప్పుడు ఇంతటి విపత్కర పరిస్థితి ఎదురయ్యేది కాదు. వాస్తవానికి భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగులకు చేరుకుని మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు మాత్రమే ఈ గిరిజన గ్రామాలు వరద ముంపునకు గురవుతాయి. కానీ ప్రస్తుతం భద్రాచలం వద్ద 46 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే జారీ చేశారు. అంటే.. వరద ముంపు ఈ గిరిజన గ్రామాలకు ఉండకూడదు. 48 అడుగులతో ఉన్నప్పుడు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే 30 గ్రామాలు, 53 అడుగులతో ఉన్నప్పుడు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే గిరిజన గ్రామాలన్నీ వరద నీటిలో మునిగిపోతాయి. గోదావరికి భారీగా వరదలు వచ్చి భద్రాచలం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 1953, 1986, 2006, 2013లలో మాత్రమే ఈ గిరిజన గ్రామాలు నీట మునిగాయి. కానీ ఇప్పుడు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసే సరికే గిరిజన గ్రామాలన్నీ జలదిగ్బంధానికి గురయ్యాయి. ఇదంతా కాఫర్ డ్యామ్ నిర్మాణంతో ఎదురైన వరద ఉధృతేనని అధికారులే చెబుతున్నారు. -
వరదపై ఆందోళన వద్దు
మండపేట/సాక్షి, అమరావతి బ్యూరో: గోదావరి వరదపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 13 వేల మందికి పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. పోలవరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 26 మీటర్లు ఉందని, 35 మీటర్ల వరకూ పెరిగినా ఇబ్బంది లేదని చెప్పారు. రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల్లో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న దేవీపట్నం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. రాకపోకలకు వీలు లేని గ్రామాల ప్రజలకు ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం, పప్పులు, పంచదార, నూనె, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముంపు సమస్య తలెత్తకుండా గోదావరి జిల్లాల్లోని డ్రైన్లలో యుద్ధప్రాతిపదికన గుర్రపుడెక్క తొలగించాల్సిందిగా అధికారులను ఆదేశించా మన్నారు. సోమవారం సాయంత్రానికి వరద తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వరదపై పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలు ముమ్మరం హోంమంత్రి మేకతోటి సుచరిత గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది బేసిన్‌లోకి వస్తున్న వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 24 మండలాల్లో 280 గ్రామాలు ముంపుకు గురైనట్లు వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీలోకి 13,43,836 క్యూసెక్కుల నీరు వస్తే అదే స్థాయిలో కిందికి వదులుతున్నామని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేసినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీస్ అధికారులను ముంపు ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. శాటిలైట్ ఫోన్లు, డ్రోన్ కెమేరాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో 17,632 మందిని 32 పునరావాస కేంద్రాలకు తరలించామని, 35,264 భోజనం ప్యాకెట్లు, 1,61,056 మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశామని చెప్పారు. పశ్చిమ గోదావరిలో 36,004 టన్నుల బియ్యం, 7,420 లీటర్ల కిరోసిన్, 3,710 కిలోల కంది పప్పు, 3,710 లీటర్ల పామాయిల్, 3,710 కిలోల ఉల్లిపాయలు, 3,710 కిలోల ఆలుగడ్డలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రతిదానినీ రాజకీయ కోణంలో చూడవద్దని మాజీ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. -
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృత రూపం దాల్చిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి బసతోపాటు భోజన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందిం చాలని సూచించారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సీఎం జగన్ గోదావరి వరద పరిస్థితి, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో శనివారం వాకబు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా విపత్తు నిర్వహణ సిబ్బంది, ఉభయగోదావరి జిల్లాల అధికారులను సన్నద్ధం చేయాలన్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనా ల్సిందిగా ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. గోదావరి వరదలకు ప్రభావితమైన దేవీపట్నం మండ లంలోని 32 ఆవాసాలు సహా ఉభయగోదావరి జిల్లాల్లోని ముంపు గ్రామాలకు సహాయం అందించాలని పేర్కొన్నారు. దీంతో ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యంతోపాటు, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపుల్ సెక్రటరీ, పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్లను ఆదేశించారు. సహాయ బృందాలు సిద్ధం వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది. తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది ఎన్డీఆర్ఎఫ్, 124 మంది ఎస్టీఆర్ఎఫ్, అగ్నిమాపక విభాగం నుంచి 90 మంది సిబ్బంది, పశ్చిమగోదావరిలో 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 34 మంది ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక విభాగం నుంచి 49 మంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శాటిలైట్ ఫోన్లు, డ్రోన్ కెమేరాలను వరద పర్యవేక్షణ కోసం సిబ్బంది వినియోగిస్తున్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తం: డీజీపీ గోదావరికి భారీగా వరద నీరు వస్తుండటంతోపాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని డీజీపీ సవాంగ్ చెప్పారు. ఎటువంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనేందుకు పోలీసులతోపాటు ఎస్డీ ఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసు బృందాలు సమాయత్తంగా ఉన్నాయని తెలిపారు.