సాక్షి, ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గంట గంటకు వరద పెరుగుతోంది. 44.40 అడుగులకు నీటిమట్టం చేరింది. రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. అన్నదాన సత్రం నీటమునిగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భద్రాచలం నుంచి దిగువకు 9.92 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం డివిజన్ లోని ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే స్థానిక అధికారులకు సహకరించి పునరావస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు.
గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రావతి ప్రాణహిత నదుల్లో నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుంది. కాలేశ్వరం మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నుంచి కూడా లక్షల కొద్ది క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. చర్ల మండలంలోని తల్లి పేరు ప్రాజెక్టు నుంచి కూడా సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతున్నదని ముంపు ప్రాంత గ్రామాలపై యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
చదవండి: కొట్టుకుపోతుంటే.. ప్రాణాలకు తెగించి మరీ
భద్రాచలం నుండి చర్ల వెళ్ళు రహదారిపైకి సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరినందున రాక పోకలు నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రజలు రవాణా చేయకుండా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షం వస్తుందని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళొద్దని, ప్రజలు కూడా దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని పేర్కొన్నారు. పశువులను మేతకు బయటికి వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని, వరద చేరిన సందర్భంగా పశువులను ఎతైన ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయాలన్నారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment