ముట్టడి వీడింది
జల‘జాలం’ తొలగిపోతోంది. ఉప్పొంగి, ముంచెత్తి, ముప్పుగా మారిన గోదావరి.. తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుంది. నీటి పిడికిట్లో నాలుగురోజులు ఉక్కిరి బిక్కిరైన లంక గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. దారీతెన్నూ లేకుండా పోయిన దుస్థితి నుంచి తేరుకుంటున్నాయి. పలుచోట్ల వరద చిన్నెలు ఇంకా కొనసాగుతున్నా.. మొత్తం మీద బెడద తప్పినట్టే!
అమలాపురం : గోదావరి వరద ఉధృతి వేగంగా తగ్గిపోతోంది. ఒక్కరోజులో నది ఉరవడి సగానికి తగ్గిపోయింది. లంకలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. నాలుగు రోజుల పాటు ముంపులో కొట్టుమిట్టాడిన లంకగ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కాజ్‌వేలు, రోడ్లపై ఇంకా ముంపునీరు పారుతుండడంతో రాకపోకలు పూర్తిస్థాయిలో ఆరంభం కాలేదు. అయితే మురుగు కాలువల వల్ల ముంపు బారిన పడ్డ గ్రామాలు ఇంకా తెరిపిన పడలేదు.
గోదావరి వరద ఎంత వేగంగా ముంచెత్తిందో.. అంతే వేగంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద 14.70 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, 14.15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు 9.90 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, 7.98 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో రెండో ప్రమాద హెచ్చరిక, గురువారం ఉదయం పది గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు.
వరద తగ్గడంతో బ్యారేజి ఎగువన ఉన్న దేవీపట్నం, సీతానగరం మండలాల్లోని పలుగ్రామాలు, రాజమండ్రి వద్ద బ్రిడ్జిలంక ముంపు నుంచి బయటపడ్డాయి. ఆయా లంకలకు రాకపోకలు ఆరంభమయ్యాయి. కాగా బ్రిడ్జిలంక వాసుల్లో చాలా మంది శుక్రవారం కానీ వారి ఇళ్ల వద్దకు వెళ్లే అవకాశం లేదు. దిగువ న ఉన్న కోనసీమలంకల్లో సైతం ముంపు వేగంగా తగ్గుతోంది. అయితే పాశర్లపూడిలంక దిగువన, వీరవల్లిపాలెం, చాకలిపాలెం కాజ్‌వేలు, రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, ఠానేలంకలు ముంపు నుంచి బయటపడ్డా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, తోటలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పి.గన్నవరం, మామిడికుదురుల్లో బి.దొడ్డవరం, అప్పనపల్లి, పాశర్లపూడిలంక, జి.పెదపూడి, ఊడిముడిలంక, కె.ఏనుగుపల్లి, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కోడేరులంక, కనకాయలంక ముంపు నుంచి ఇంకా బయటపడలేదు.
తగ్గని డ్రైన్ల ముంపు
మంగళవారం వరదకు కొట్టుకుపోయిన పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లికి చెందిన చింతా కృష్ణమూర్తి మృతదేహం సమీపలంక గ్రామమైన వై.కొత్తపల్లిలంకలో దొరికింది. అయితే బుధవారం రాత్రి కొట్టుకుపోయిన అప్పనపల్లి దేవస్థానం ఉద్యోగి కాండ్రేగుల శ్రీనివాసశాస్త్రి ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు అయినాపురం, బండార్లంక అప్పర్ కౌశిక డ్రైన్ల ముంపు తీవ్రత అలాగే ఉంది. అయినాపురం డ్రైన్ నుంచి ముంపునీరు ముమ్మిడివరం మండలాల్లోని గ్రామాల్లోనే కాక ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లోని లోతట్టు ప్రాంతాల వరిచేలను ముంచెత్తుతోంది. డ్రైన్ నుంచి ముంపునీరు గోదావరిలోకి దిగే వరకూ ఈ దుస్థితి తప్పదని ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి దూరంగా నష్టం అంచనాలు
వరద నష్టంపై ఉద్యానశాఖ అధికారులు తయారు చేస్తున్న ప్రాథమిక అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. కేవలం 1984 ఎకరాల్లో మాత్రమే కూరగాయ పంటలు, బొప్పాయి, తమలపాకు, పూల సాగు దెబ్బ తిన్నట్టు చెపుతున్న అధికారులు ముంపుబారిన పడిన కొబ్బరి, అరటి, కోకో వంటి వాణిజ్య పంటలకు నష్టం ఉండదని తేల్చేశారు. వాస్తవంగా నష్టం ఇంతకన్నా బాగా ఎక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. సీతానగరం, ఆలమూరు, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో కూరగాయల పంటలకు అపారనష్టం జరిగింది. ఈ ప్రాంతాల్లోనే సుమారు 5 వేల ఎకరాల్లో పంట దెబ్బ తిందని రైతులు చెబుతున్నారు.
అరటిలో నర్సరీ స్థాయి మొక్కలు నాలుగురోజులపాటు ముంపులో ఉండడం వల్ల తెగులు సోకే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పశువుల పాకలు ఎక్కువగా ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి లంక గ్రామాల్లోని గ్రావెల్ రోడ్లు దెబ్బ తిన్నాయి. ముంపు నీట నానిన పూరి గుడిసెలు సైతం కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వాస్తవంగా జరిగిన నష్టం తేలాలంటే ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే సాధ్యం.