
పెరుగుతున్న గోదావరి, వశిష్ట గోదావరి వరద
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 44 శివారు గ్రామాలు మునక
పశ్చిమ గోదావరి జిల్లాలో పలు గ్రామాలపై ప్రభావం
సాక్షి, అమలాపురం/సాక్షి, భీమవరం: గోదావరి, వశిష్ట గోదావరి మరోసారి పోటెత్తడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాల్లోని ప్రజల జీవితం ఛిద్రమైంది. ఈ ఏడాది గోదావరి వరద లంక గ్రామాలను ముంచడం ఇది మూడోసారి. జూలైలో వచ్చిన వరదకంటే ఇప్పుడు వరద భారీగా ఉంది. జూలై చివర్లో వచ్చిన వరదలకే పలు పంటలకు నష్టం వాటిల్లగా ప్రస్తుత వరదలకు అక్కడక్కడా మిగిలిఉన్న కాస్త పంటలు కూడా దెబ్బతిన్నాయి.
వరదల ప్రభావం అంబేడ్కర్ జిల్లాలోని పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలపై అధికంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లోని లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 12 మండలాల్లోని 44 శివారు గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. కాజ్‌వేలతోపాటు ప్రధాన రోడ్లపై 5 అడుగుల ఎత్తున నీరు చేరడంతో లంకవాసులు, విద్యార్థులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు.
అప్పనపల్లి గ్రామం, బి.దొడ్డవరం ఇందిరమ్మ కాలనీ, అయినవిల్లి మండలంలో వీరవల్లిపాలెం, పొట్టిలంక, ముమ్మడివరం మండలంలోని లంకాఫ్ ఠాన్నేల్లంక, కూనాలంక, గురజాపులంక, అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో వరద మరింత పెరిగింది. జిల్లాలోని మత్స్యకార గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఉద్యాన పంటలు మరోసారి పెద్ద ఎత్తున నీట మునిగాయి. అరటి, కంద, కోకో, కొబ్బరి, కూరగాయ పంటలు నీట నానుతున్నాయి. పాడి రైతులు పాలు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మత్స్యకారులు పది రోజులుగా వేట లేక ఇబ్బంది పడుతున్నారు.
లంక భూములను ముంచెత్తిన వశిష్ట గోదావరి
ఎగువ నుంచి ఉరకలెత్తుతూ వస్తున్న జలాలతో వశిష్ట గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని పలు లంక గ్రామాలను వరద ముంచెత్తింది. ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని 600 ఎకరాల్లో కూరగాయలు, 80 ఎకరాల్లో తమలపాకుల పంటలకు నష్టం వాటిల్లింది.
200 ఎకరాల్లోని అరటి తోటలను వరద ముంచెత్తింది. యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక, దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం గ్రామాల్లో వరదనీరు చేరింది. వడ్డిలంక వద్ద స్లూయిజ్ గేటు సక్రమంగా మూసుకోకపోవడంతో గోదావరి నీరు నక్కల డ్రెయిన్‌లోకి ఎగదన్నుతోంది.