12 రోజులుగా వరద నీటితో సహజీవనం.. 12 మండలాల్లో 47 గ్రామాల చుట్టూ ముంపు
మరో మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి.. పాడి, ఉద్యాన, ఆక్వా రైతులకు తీరని నష్టం
వందల ఎకరాల్లో పంటలు కోల్పోయిన రైతులు
పడవలలో ప్రయాణాలు చేయలేక స్థానికుల ఇబ్బంది
సాక్షి, అమలాపురం : పాడి పంటలు.. అన్నపానీయాలు అందించి డెల్టాను సస్యశ్యామలంగా మార్చిన గోదావరే.. ఏటా ఉగ్రరూపం దాల్చి గ్రామాలను ముంచెత్తుతోంది. పాడి పంటలకు అంతులేని నష్టాన్ని మిగులుస్తోంది. అపారమైన నష్టాన్ని కలగజేస్తోంది. రోడ్లు, డ్రెయిన్లు, కాలువలను ఏకం చేస్తోంది. వాహనాలను పక్కనబెట్టి పడవల మీద రాకపోకలు సాగించేలా చేస్తోంది. చేలు, చెరువులు, ఉద్యాన పంటలను కబళిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే లంక గ్రామాలను అస్తవ్యస్థం చేస్తోంది. వరుసగా రెండుసార్లు ముంచెత్తిన గోదావరి వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
వరద ముంపులో 21వేల కుటుంబాలు..
గోదావరి వరదలవల్ల జిల్లాలో 12 మండలాల్లోని 47 శివారు గ్రామాలు నీట మునిగాయి. 21,492 కుటుంబాలు వరద ముంపు బారినపడ్డాయి. పి. గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, ఐ.పోలవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ఇది అధికంగా ఉంది. వరదకు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ స్థానికులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. ఎటుచూసినా వరద నీరు తప్ప మరొకటి కనిపించడంలేదని లంక వాసులు వాపోతున్నారు.
అల్లవరం మండలం బోడసుకుర్రు, ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 293 కుటుంబాలకు చెందిన 809 మందికి పునరావాసం కల్పించి ఆహార పొట్లాలను అందిస్తున్నారు. ఎనిమిది గృహాలు దెబ్బతిన్నాయి. 3,943.30 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, కంద, పసుపు, కర్ర పెండలం, కోకో పంటలతోపాటు కూరగాయ పంటలకు అధిక నష్టం కలిగింది. పన్నెండు రోజులుగా నదీపాయల్లో వరద కొనసాగుతుండడంవల్ల డెల్టాలోని మురుగునీటి కాలువల ద్వారా ముంపు నీరు దిగడంలేదు.
వరద నీరు రాకుండా అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు మూసివేశారు. ఇదే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డెల్టాలో వరిచేలు నీట మునగడంతో పంట దెబ్బతింది. అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ 2,734 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కానీ, ఇంతకు రెట్టింపు నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. వీటితోపాటు 300 ఎకరాల్లో వెనామీ రొయ్యల సాగు తుడుచుపెట్టుకుపోయిందని అంచనా.
పాలు మా వద్దే ఉండిపోతున్నాయి..
నాకు మూడు గేదెలున్నాయి. రోజుకు ఆరు లీటర్ల పాలు వస్తాయి. పాలు కొనుగోలు చేసే వ్యాపారులు వరదలు కారణంగా రావడంలేదు. ఇంట్లోనే కొంత వాడాల్సి వస్తోంది. వరదలవల్ల పచ్చగడ్డి కొరత అధికంగా ఉంది. గతంలో వరదల సమయంలో ఎండు గడ్డి ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడంలేదు. – కుసుమ కోటేశ్వరరావు, అయినవిల్లి లంక, అయినవిల్లి మండలం
ఈ నాలుగు నెలలు పడవ ప్రయాణమే..
వరదలు ఉండే ఈ నాలుగు నెలలు పడవ మీదనే రాకపోకలు చేయాల్సింది. ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు రేవు దాటి బస్సుపై నరసాపురం వెళ్తుంటా. తిరిగి వచ్చేసరికి రాత్రి ఏడవుతుంది. ఎక్కువ సమయం పడవ మీదే సరిపోతోంది. తిరిగొచ్చే వరకూ ఇంట్లో వారికి ఆందోళనే. – దొడ్డా శివ, బూరుగుపూడి, పి.గన్నవరం మండలం
బీర, బెండ పంట దెబ్బతింది..
రెండు ఎకరాల్లో బీర, బెండ పాదులు సాగుచేశా. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. పంట మంచి కాపు మీద ఉంది. దిగుబడి బాగా వస్తుందని ఆశించాను. 11 రోజులుగా వరదలు ముంచెత్తడంతో కాయగూర పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. పాదులు కుళ్లిపోయాయి. పెట్టుబడులు కూడా వచ్చే అవకాశంలేదు. లంక గ్రామాల్లో రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, మమ్ముడివరం మండలం
చెరువులను ముంచేసింది
అన్నంపల్లిలో నాలుగు ఎకరాల్లో ఆక్వా సాగుచేశా. ఈసారి కౌంట్ అనుకున్నంత వేగంగా రాలేదు. దీంతో చెరువుల పట్టుబడులు ఆలస్యమయ్యాయి. ఆగస్టులో రావాల్సిన వరద జూలైలో వచి్చంది. చెరువులు మొత్తం మునిగిపోయాయి. కౌంట్ 120 ఉన్న సమయంలో పట్టుబడులు చేసినా అనుకున్నంత రేటు రాలేదు. నష్టాలను చవిచూడాల్సి వచి్చంది. – దంతులూరి నానిరాజు, అన్నంపల్లి, ఐ.పోలవరం మండలం
సాయం అందించాలి..
ఏటా వరదల సమయంలో వేటకు విరామం ప్రకటించాల్సి వస్తోంది. మాకు చేపల వేట మాత్రమే జీవనోపాధి. వేటకు వెళ్లకపోతే కుటుంబ పోషణ కష్టం. వరదల సమయంలో ప్రభుత్వం నిత్యావసర వస్తువుల రూపంలో ఇచ్చే సాయం కంటే ఆర్థికంగా సాయం అందించాలి. – సంగాడి ముత్యాలు, మత్స్యకారుడు, మసకలపల్లి. కె.గంగవరం మండలం
Comments
Please login to add a commentAdd a comment