పెరిగిన వరదతో నీటమునిగిన ఇళ్లు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం, సాక్షి ప్రతినిధి, ఏలూరు, కుక్కునూరు: గోదారమ్మ తగ్గినట్లే తగ్గి అంతలోనే మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకు వరద ఉద్ధృతి పెరగడంతో భద్రాచలం వద్ద మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ 55.30 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 17.75 అడుగుల నీటిమట్టం ఉండగా మొత్తం 175 గేట్లను ఎత్తి 18,59,570 క్యూసెక్యులను సముద్రంలోకి వదులుతున్నారు.
► భద్రాచలం వద్ద వరద తాకిడి మరోసారి పెరగడంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు తిరిగి జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరద నీరు రహదారిపైకి చేరడంతో కుక్కునూరు – భద్రాచలం రాకపోకలు నిలిచిపోయాయి.
► ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి 2,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.
► రంపచోడవరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్.ధనలక్ష్మి పరిశీలించారు.
► శబరి వరద నీరు చింతూరులో ప్రవేశించి సుమారు 40 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసర సరుకులను అందచేస్తున్నారు. చింతూరు వంతెన వద్ద గురువారం రాత్రి ప్రమాదానికి గురైన లాంచీ సరంగు పెంటయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.