లంక గ్రామాల్లోని ఇళ్లల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురద
నీటిలో మునిగిన వస్తువులన్నీ బురదమయం
నాలుగు రోజులుగా నాని కుప్ప కూలిన ఇళ్లు
పనికి రాకుండా పోయిన విలువైన పత్రాలు, దుస్తులు
ఇంకా అంధకారంలోనే బాధితులు
కుప్పకూలిన పూరిల్లు
ఓలేరు–పల్లెపాలేనికి చెందిన రావిలంకె ముత్యాలమ్మ పూరిల్లు వరద నీటిలో నాని కుప్పకూలింది. పక్కనే ఉన్న పశువులపాకా పడిపోయింది. ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, ఇతర విలువైన వస్తువులు పాడయ్యాయి. వంటపాత్రలతో పాటు చిన్న చిన్న వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఉన్న ఎకరం పొలంలో రూ.60 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన కంద..
రెండు నెలల్లో చేతికొస్తుందనగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.
ఇల్లు మునిగిపోయింది
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఓలేరు పల్లెపాలెం గ్రామాన్ని వరద ముంచెత్తడంతో రామాలయం గుడి పూజారి దశరథరామయ్య ఇల్లు మునిగిపోయింది. ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, గ్యాస్ స్టౌతో పాటు అన్ని వస్తువులూ పనికి రాకుండా పోయాయి. వంట పాత్రలు, దుస్తులు నీటిలో కొట్టుకుపోయాయి.
నీటిలో నానడంతో ఇంటి గోడలు కూలి పోయాయి. వరద మిగిల్చిన బురదను కడుక్కోవడం వృద్ధులైన దశరథ రామయ్యతో పాటు ఆయన భార్య అంజలిలకు మరింత కష్టతరంగా మారింది. కూలీలు కూడా దొరకని స్థితిలో ఏం చేయాలో పోలుపోక కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
వరద మింగేసింది..
పల్లెపాలేనికి చెందిన చింతా కోటేశ్వరరావు కూలీ. ఆదివారం పనికి వెళ్లి వచ్చేసరికి ఊరుతో పాటు తన ఇంటినీ వరద మింగేసింది. మూడు రోజుల తర్వాత నీరు తగ్గాక చూస్తే దుస్తులు, బియ్యం సహా అన్ని వస్తువులూ పనికిరాకుండా పోయాయి. కట్టు బట్టలతో మిగిలారు. పక్కనే ఉన్న కన్న శివచంద్ర ఇంటిదీ ఇదే
పరిస్థితి.
జీవాలకు ఆహారం కరవు
ప్రాణప్రదంగా భావించే మేకలు, గొర్రెల కోసం ఇళ్లలో నిల్వ ఉంచుకున్న వరి ధాన్యం, బియ్యం మొత్తం వరద నీటిలో నాని పనికిరాకుండా పోయాయని ఓలేరు–పల్లెపాలేనికి చెందిన పెద్ద బోయిన దుర్గాభవానీ విలపించింది. గ్రామంలోని 25 కుటుంబాల యాదవుల ఇళ్లలో ఉన్న మొత్తం వందలాది బస్తాల ధాన్యం, బియ్యం నీటిలో తడిసిపోవడంతో మేకలు, గొర్రెలకు ఆహారం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటిలో మునగడంతో ఇళ్లు, పొలాల స్టాంపు పేపర్లు పనికి రాకుండా పోయాయని పెద్దబోయిన శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేయగా, పశువులకు మేత లేకుండా పోయిందని లంకె వెంకటేశ్వరరావు, దొక్కు శ్రీనివాసరావులు చెప్పారు. ఎకరం పొలంలో అరటి పంట కొట్టుకుపోయిందని రామారావు విలపించాడు.
తీరని బురద కష్టాలు
కృష్ణా వరద నాలుగు రోజుల్లో వీడినా అది మిగిల్చిన బురద కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కృష్ణానది ప్రాంతంలో కొల్లూరు మండలంలో 22, భట్టిప్రోలు మండలంలో 4, రేపల్లె మండలంలో ఒకటి చొప్పున 27 లంక గ్రామాలుండగా.. అన్నింటినీ వరద ముంచెత్తడంతో వేలాది ఇళ్లను బురద కప్పివేసింది. ఇళ్లల్లోనూ పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. నీటిలో మునిగిన టీవీ, ఫ్రిజ్ మొదలు విలువైన వస్తువులతో పాటు నిత్యావసర వస్తువులన్నీ పాడయ్యాయి. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇళ్లలో చేరిన బురదను శుభ్రం చేయడం మరింత కష్టతరంగా మారింది.
క్షేత్ర స్థాయిలో శూన్యం
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తుపాను, వరదల్లో నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.20 వేలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని నాడు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని పలువురు లంకగ్రామాల రైతులు గుర్తుచేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు వెంటనే నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న వేలాది పశువులు గ్రాసం కోసం అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాపట్ల జిల్లా కలెక్టర్‌తో పాటు కొందరు ప్రజాప్రతినిధులు గ్రాసం అందిస్తున్నట్టుగా ఫొటోలకు ఫోజులిచ్చారు గానీ.. క్షేత్రస్థాయిలో అందరికీ గ్రాసం ఇవ్వలేదు. అలాగే వేమూరు, రేపల్లె తోపాటు జిల్లా వ్యాప్తంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కృష్ణా నది ముంపు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. అరవింద వారధిపై బురదతో పాటు చెత్త పెద్ద ఎత్తున చేరింది. కొన్ని పశువులు మృతి చెందాయి. విద్యుత్‌ను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 5న జిల్లాలో మిచాంగ్ తుపాను కారణంగా 261 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. కేవలం రెండో రోజు సాయంత్రానికే పునరుద్ధరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, బాధితులకు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. కొంత మేర భోజనం, తాగునీటిని మాత్రమే అధికారులు అందించారు. అయితే పచ్చపార్టీ నేతలకే బాధ్యతలు అప్పగించడంతో ఒక వర్గం వారికే అవి అందాయి.
– సాక్షి ప్రతినిధి, బాపట్ల
Comments
Please login to add a commentAdd a comment