తాబేళ్ల మృత్యుఘోష! | Turtles are protecting marine life from pollution | Sakshi
Sakshi News home page

తాబేళ్ల మృత్యుఘోష!

Published Sun, Feb 16 2025 4:53 AM | Last Updated on Sun, Feb 16 2025 4:53 AM

Turtles are protecting marine life from pollution

సంరక్షణ లేక మృత్యువాత పడుతున్న ‘ఆలీవ్‌ రెడ్లీ’

ఏపీ తీర ప్రాంతంలో ఒక్క జనవరిలోనే 3,085 తాబేళ్లు మృతి

అవన్నీ బయటికి కొట్టుకొచ్చినవే.. 

ఇక మృతి చెంది సముద్రంలో కలిసిపోయిన వాటికి లెక్కే లేదు  

కాలుష్యం బారి నుంచి సముద్ర జీవులను రక్షిస్తున్న కూర్మాలు

మత్స్య సంపద పెరుగుదలకు దోహదం

ఇంత మేలు చేస్తున్నా.. తాబేళ్ల రక్షణకు ప్రభుత్వ చర్యలు శూన్యం

సముద్రంలో కాలుష్యాన్ని నియంత్రిస్తూ జీవజాలం మనుగడకు దోహదపడుతున్న సముద్రపు తాబేళ్లు(ఆలీవ్‌ రెడ్లీ) మృత్యువాత పడుతున్నాయి. సముద్రతీరంలో తాబేళ్ల మరణాల గణాంకాలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఇదే కొనసాగితే  తాబేళ్ల జాతి క్రమేపీ అంతరించి పోయే ప్రమాదం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం శ్రద్ధపెట్టి తాబేలు జాతి సంరక్షణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. 

బాపట్ల, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం, కృష్ణా, కాకినాడ, అనకాపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, విశాఖపట్టణం తదితర జిల్లాల పరిధిలోని తీర ప్రాంతంలో ఒక్క జనవరి నెలలోనే 3,085 తాబేళ్లు మరణించినట్టు వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్న ట్రీ ఫౌండేషన్‌ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఇవన్నీ తీరానికి కొట్టుకొచ్చినవే. మృతి చెంది సముద్రంలో కలిసి పోయిన తాబేళ్ల సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. – సాక్షి ప్రతినిధి, బాపట్ల

సముద్ర జీవుల్ని రక్షిస్తూ..  
సముద్రంలో విపరీతంగా ఉత్పత్తి అయ్యే నాచు.. సూర్యకిరణాలను సముద్రపు లోతు­ల్లోకి వెళ్లని­వ్వ­కుండా అడ్డుకుంటుంది. దీని­వల్ల సముద్రంలో పెరిగే జంతు జాలానికి ఆక్సిజన్‌ సక్రమంగా అందే అవకాశముండదు. అదే జరిగితే జంతుజా­లం చాలా వరకు చనిపోవడంతో పాటు మిగిలిన జంతు జాలానికి ఎదుగుదల ఉండదు. తాబేళ్లు ఈ నాచును ఆహారంగా తీసుకుని దాని ఉత్పత్తిని నియంత్రిస్తు­న్నాయి. 

సముద్రంలో కాలుష్యాన్ని ఉత్పత్తి చేసే జల్లి ఫిష్‌లను సైతం తాబేళ్లు ఆహారంగా తీసుకుంటాయి. సముద్ర గర్భంలో ఉన్న కొండలు, గుట్టల్లో చేపలు గుడ్లుపెట్టే కేంద్రాలను తాబేళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాయి. దీనివల్ల మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారులకు మేలు జరుగుతుంది.

ఆ విధంగా అంతరిస్తున్నాయ్‌..
సముద్ర తాబేళ్లు జలాల అడుగున ఉంటున్నప్పటికి ప్రతి 40 నిమిషాలకోసారి శ్వాస తీసుకునేందుకు ఉపరితలానికి రావాల్సిందే. ఇలా­వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో మోటారు బోట్లు, మత్స్యకారుల టేకు, నానా­జాతి వలల వల్ల కొన్ని, కాలుష్యానికి గురై మరికొన్ని మృత్యువాత పడుతున్నాయి. ఏపీలోని మచిలీప­ట్నం, కాకినాడ, విశా­ఖ­పట్నం, విజ­య­నగ­రం తదితర ప్రాంతాల్లో ఈ తరహా వలలు అధికంగా వా­డు­­తుండడంతో తాబేళ్ల మరణాలు అధి­క­ంగా ఉన్నాయ­ని టీ ఫౌండేషన్‌ వెల్లడించింది. 

ఏటా జనవరి నుంచి మే వరకు గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు తీరప్రాంతానికి వచ్చి ఇసుకలో గుంతలు తీసి గుడ్లు పెట్టి వెళ­తాయి. 48 నుంచి 50 రోజుల మధ్యకాలంలో ఆ గుడ్లు పిల్లలుగా మార­తాయి. ఈ క్రమంలోనే తాబే­­లు జాతి అధికంగా అంతరిస్తున్నట్టు గణాంకా­లు చెబుతున్నాయి. తాబే­లు గుడ్లు, పిల్లల సమయంలో నక్కలు, కుక్కలు, ఇతర జంతువులు కొన్ని గుడ్లు, పిల్లల్ని తినేస్తున్నాయి. 

పిల్లలుగా మారిన తాబేళ్లు 3 గంటల్లోపు నీటి­లోకి చేరకుంటే చనిపోతాయి. కొన్ని నీటిలోకి చేరినా శ్వాస కోసం నీటిపైన తేలియాడేటప్పుడు పెద్ద పెద్ద పక్షులు వాటిని పొడిచి చంపుతున్నాయి. ఉత్పత్తి అవుతున్న తాబేలు పిల్లల్లో 10 శాతం కూడా బతకడం లేదని అంచనా. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం–­1972 ప్రకారం తాబేళ్లను చంపడం, వాటి గుడ్లను తినడం నేరం. ఈ నేరానికి పాల్పడితే ఏడేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధిస్తారు.

ప్రభుత్వ చర్యలు శూన్యం 
తాబేళ్ల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే జనవరి నుంచి మే నెలల్లో తీరంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఆ ఐదు నెలల పాటు ప్రత్యేకంగా అవగాహన కలిగిన సిబ్బందిని నియమించి తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షణ కేంద్రాల్లో పొదిగించాలి. పిల్లలు ఉత్పత్తి అయ్యాక వాటిని సురక్షితంగా నీటిలో వదలాలి. 

ఇందుకోసం తగినన్ని నిధులు కేటాయించి సంరక్షణ కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలి. మరోవైపు సముద్రంలో తాబేళ్లు చిక్కుకోని వలలనే వాడేలా మత్స్యకారులకు ఆదేశాలివ్వాలి. తాబేళ్ల ప్రాధాన్యంపై ఎప్పటికప్పుడు మత్స్యకారులకు అవగాహన కల్పించాలి. ఇందుకు ప్రభుత్వం అటవీ, పర్యావరణ శాఖలు సమన్వయం చేసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.

తాబేళ్ల రక్షణకు ట్రీ ‘ఫౌండేషన్‌’! 
తాబేళ్ల రక్షణకు చెన్నై కేంద్రంగా ఉన్న ట్రీ ఫౌండేషన్‌ కొంత మేర కృషి చేస్తోంది. 2017 నుంచి ఇక్కడ తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాలు నిర్వ­హిస్తోంది. తీరంలోని చినగంజాం మండలం ఏటిమొగ్గ, కుంకుడుచెట్లపాలెం, వేటపా­లెం మండలం రామచంద్రాపురం, పొట్టిసుబ్బయ్య­పా­లెం, రామాపురం, బాపట్ల మండలం సూర్యలంక తీరంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి 12 మంది సిబ్బందితో తాబేలు గుడ్లు సేకరించి వాటిని పొదిగించి పిల్లలను తిరిగి సముద్రంలోకి వదులుతోంది. 

2023లో 7,102, 2024లో 9,694 చొప్పున తాబే­లు పిల్లలను సముద్రంలోకి వదిలామని, ఈ ఏడా­ది ఇప్పటివరకు 14 తాబేళ్లు వచ్చి 1,541 గుడ్లు పెట్టినట్టు ట్రీ ఫౌండేషన్‌ ప్రతినిధులు చెబుతు­న్నారు. జిల్లా అటవీశాఖ దీనిని పర్యవేక్షి­స్తోంది. గత ప్రభుత్వంలో ఫౌండేషన్‌ సభ్యులకు నెల­కు రూ.10 వేలు చొప్పున గౌరవవేతనం ఇవ్వగా.. ఈ ప్రభుత్వం వచ్చాక అదీ ఇవ్వకపోవ­డంతో సభ్యు­లకు ఐటీసీ సంస్థ గౌరవ వేతనాలు చెల్లిస్తోంది.

ఇప్పటి వరకు 16,796 పిల్లలను సముద్రంలోకి వదిలాం..  
సముద్ర తాబేళ్ల రక్షణకు ట్రీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని తీరప్రాంతంలో 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 12 మంది సిబ్బంది ద్వారా తాబేళ్లు పెట్టిన గుడ్లు ఎప్పటికప్పుడు సేకరించి, సంరక్షణ కేంద్రాల్లో పొదిగించి పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి వదులుతున్నాం. గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 16,796 పిల్లలను సముద్రంలోకి వదిలాం. – చంద్రారెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్, ట్రీ ఫౌండేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement