అన్ని కేసుల్లోనూ పెదరాయుళ్ల తీర్పే ఫైనల్
తీర్పు మీరితే గ్రామ బహిష్కరణ, ఆదాయంలో కోతలు
పంచాయితీలకు సమాంతరంగా పెద్దల పాలన
కొన్ని ఘటనల్లో నష్టపోతున్న బాధితులు
కొల్లేరులో పెదరాయుళ్ల జమానా బలంగా నడుస్తోంది. అడ్డగోలు తీర్పులతో కుటుంబాలను విభజించడం, అన్యాయంగా కొన్ని కేసుల్లో బాధితులను ఇబ్బందులు పెట్టేలాంటి తీర్పులు తరచూ లంక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే తరహా తీర్పులతో కుల కట్టుబాట్ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నా ఉన్నతాధికారులు నోరుమెదపలేని పరిస్థితి.
అనేక ఘటనలు తెర మీదకు వచ్చి ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా విచారణల పేరుతో వదిలేస్తున్నారు. తాజాగా చేతబడి నెపంతో ఒక కుటుంబాన్ని తీవ్రంగా కొట్టి గాయపరచడం, మరో కేసులో అడ్డగోలుగా భార్యాభర్తలకు విడాకులు ఇప్పించడం వివాదాస్పదంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఏలూరు
కొల్లేరులో పంచాయతీలకు సమాంతరంగా బంటాపెద్దలు తీర్పులు చెబుతూ సమాంతర పంచాయితీ నడుపుతున్నారు. సాధారణంగా తప్పు చేస్తే స్టేషన్‌కు వెళ్లే సంస్కృతి లేకుండా తప్పు జరిగితే బంటా పెద్దలకు ఫిర్యాదు చేయడం, వారే సెటిల్మెంట్ చేయడం కొల్లేరులోని ప్రజలు వారి తీర్పును వ్యతిరేకిస్తే గ్రామానికి వచ్చే అక్రమ చేపల చెరువుల ఆదాయంలో వాటాలు ఇవ్వబోమని బెదిరించడం, సాంఘిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించడం చేస్తూ నిరాటంకంగా తమ జమానా కొనసాగిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొల్లేరు పెదరాయుళ్ళ హవా రెట్టించింది. అన్ని రాజకీయ పార్టీలకూ కొల్లేరు ఓట్లు అత్యంత కీలకం. 4 నియోజకవర్గాలు.. 9 మండలాల్లో విస్తరించిన కొల్లేరులో 122 గ్రామాలున్నాయి. బంటా పెద్దలదే పెత్తనం, ఓటింగ్ విషయంలో వీరి మాటే చెల్లుతుండటంతో అధికార పార్టీ సహా అందరూ పెద్దల మాటకు తలొగ్గాల్సిన పరిస్థితులున్నాయి.
కొల్లేరు స్వరూపం ఇదీ..
నియోజకవర్గాలు: ఉంగుటూరు, దెందులూరు, ఉండి, కైకలూరు
మండలాలు: కైకలూరు, మండవల్లి, ఏలూరు రూరల్ మండలం, పెదపాడు, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, ఉండి
గ్రామాలు : 122
జనాభా: 3.50 లక్షలు
కుటుంబాలు: 78 వేలు
ఓట్లు : 1.75 లక్షలు
కట్టేసి కొట్టడమే కొన్నింటిలో శిక్షలు
ఉదాహరణకు భార్య, భర్త విడిపోతే వివాహ సమయంలో భర్త తీసుకున్న లాంచనాలు సర్వం చెల్లించేస్తే విడాకులు మంజూరవుతాయి. వివాహేతర సంబంధం కేసుల్లో అయితే వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి వివాహిత భర్తకు పరిహారం ఇస్తే కేసు సెటిల్ అయిపోతుంది. అది కూడా కేసును బట్టి లక్షల్లోనే ఉంటుంది. ఇక చేతబడులు, ఇతరత్రా అనుమానాలు అయితే కట్టేసి కొట్టడమే శిక్ష. ఇలాంటి అనైతిక చర్యలు నేటికీ కొల్లేరులో కొనసాగుతున్నాయి.
తాజాగా కైకలూరు మండలం చటాకాయి గ్రామంలో చేతబడి నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను కొల్లేరు పెద్దల తీర్పుతో చితకబాదారు. అక్టోబరు 25న కమ్యూనిటీ హాలు వద్ద స్తంభాలకు కట్టేసి గ్రామపెద్దల సమక్షంలో 18 మంది కలసి కర్రలతో కొట్టారు. వీరిలో బాధితుడు సైదు రఘు ఏకంగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. మరో ఇద్దరు మోరు రాంబాబు, జయమంగళ ధనుంజయ ఏలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ కేసులో ఆరుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.
జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కొందరు బాధితులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏలూరు రూరల్ మండల శ్రీపర్రులో భార్యాభర్తలకు విడాకులు అడ్డగోలుగా ఇప్పించడంపై భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శ్రీపర్రు గ్రామానికి చెందిన సుభాష్‌తో కైకలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన మహిళకు 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. గత నెల 27న గ్రామ పెద్దలు ఏకంగా రాతపూర్వకంగా విడాకుల తంతు పూర్తి చేశారు. దీంతో బాధిత మహిళ.. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిషోర్‌లకు ఇటీవల ఫిర్యాదు చేసింది.
1952 నుంచి తీర్పులు
ఒడిశాకు చెందిన ఒక తెగ వందల ఏళ్ల క్రితం కొల్లేరు ప్రాంతానికి వచ్చి చేపలు పట్టుకోవడం ప్రధాన వృత్తిగా ఎంచుకుని లంక గ్రామాల్లో స్థిరపడిపోయింది. 1952 నుంచి కొల్లేరులో బంటా పెద్దల పాలనకు తెర లేచింది. అందరికీ ఆదాయాన్ని చూపి పెద్దల పెత్తనం సాగిస్తుంటారు.
ఉదాహరణకు ఒక గ్రామ పరిధిలో 500 ఎకరాల్లో అభయారణ్యం ఉంటే దానిలో కొందరు పెట్టుబడిదారులతో చెరువులు వేయించి ఎకరాకు రూ.లక్ష చొప్పున కౌలుకు తీసుకుని గ్రామంలో ఎంతమంది మగవారు ఉంటే అంతమందికి వాటాలేసి ప్రతి ఏటా బంటా పెద్దలు ఆదాయం ఇస్తుంటారు.
కొన్ని కీలక ఘటనల్లో బాధితులు స్టేషన్లకువెళ్లినా..ఉన్నతాధికారులను కలిసినా వారిని కట్టుబాట్ల పేరుతో వేధించడం, బహిష్కరణకు గురి చేస్తున్నారు. 122 గ్రామాల్లో పంచాయతీ పాలన ఉండి, సర్పంచులు ఉన్నప్పటికీ వ్యవస్థ నడిపేది బంటా పెద్దలే. ఒక్కో గ్రామంలో 10 మందితో పెద్దలు కమిటీలా ఏర్పడి ప్రతిరోజూ కమ్యూనిటీ హాలు వద్ద పంచాయితీలు చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment