భారీగా కృష్ణమ్మ వరద.. సముద్రానికి చేరడం అనుమానమే
నీట మునగనున్న కొల్లేరు లంక గ్రామాలు
పెద యడ్లగాడి వంతెన వద్ద ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటి మట్టం
నీట మునిగినరెండు రహదారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు నీరు చివరకు కొల్లేరు సరస్సులో కలవాలి. ఇక్కడ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి ఆ నీరు చేరాలి. ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి కొల్లేరులో అక్రమ చెరువు గట్లు అడ్డుపడుతున్నాయి.
వరదల సమయంలో కొల్లేరుకు 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, ఎర్ర కాల్వల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఇలా చేరిన నీరు కేవలం 12 వేల క్యూసెక్కులు మాత్రమే దిగువకు చేరుతోంది. నేడు ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
2,22,300 ఎకరాల్లో కొల్లేరు సరస్సు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరిధిలో మొత్తం 122 గ్రామాలు ఉన్నాయి. పర్యావరణవేత్తల ఆందోళన కారణంగా కొల్లేరు సరస్సును–5 కాంటూరు వరకు 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. ఏలూరు, ఉంగుటూరు, పెదపాడు, దెందులూరు, ఆకివీడు, నిడమర్రు, భీమడోలు, కైకలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది.
కొల్లేరుకు బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, ఎర్రకాల్వ వంటి వాగుల ద్వారా భారీగా నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే ఏకైక మార్గమైన మండవల్లి మండలం పెద యడ్లగాడి వంతెన వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరింది. మరో అడుగు చేరితే 13 లంక గ్రామాలు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.
అక్రమ చెరువులే అసలు కారణం..
వరదల సమయంలో కొల్లేరుకు చేరే వరద నీరు సముద్రానికి చేరడానికి అడ్డంకిగా ఉన్నది కొల్లేరు సరస్సులో అక్రమంగా తవి్వన చేపల చెరువులేనని అనేక మంది కోర్టులను సైతం ఆశ్రయించారు. ప్రధానంగా గతంలో టీడీపీ పాలనలో వేలాది ఎకరాల కొల్లేరు భూమి ఆక్రమణలకు గురైంది. దీంతో పర్యావరణవేత్తల ఫిర్యాదులతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2006లో ఆపరేషన్ కొల్లేరు పేరుతో ఇరు జిల్లాల్లో 25,142 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువులను ధ్వంసం చేశారు.
ప్రస్తుతం ఇంకా 15 వేల ఎకరాల పైబడే అక్రమ సాగు జరుగుతున్నట్టు అంచనా. తిరిగి కూటమి పాలన రావడంతో అక్రమ చేపల సాగు అధికమైంది. అధికారంలోకి వచి్చన టీడీపీ కొల్లేరు నాయకులు ఇటీవల అక్రమ దందాలకు తెర తీశారు. సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో కొల్లేరు ప్రక్షాళనకు ఆదేశాలివ్వాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
గ్రామాలకు రాకపోకలు బంద్..
ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. కొల్లేరు సరస్సులోకి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు చంద్రయ్య కాలువ, పెదపాడు, వట్లూరు, మొండికోడు, పందికోడు, పోల్‌రాజ్, కైకలూరు స్వాంపు, మాదేపల్లి, రాళ్ళకోడు, దోసపాడు, మోటూరు, పోతునూరు వంటి చానల్స్ నుంచి ప్రతి ఏటా నీరు చేరుతుంది.
ఈ ఏడాది ఇప్పటికే ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెద్ద యడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు బుడమేరు నీరు అధికంగా రావడంతో నీట మునిగింది. మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు –ఏలూరు రహదారిలో రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. రానున్న రెండు రోజుల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతాలకు భారీ ముంపు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment