judgments
-
మా తీర్పు.. మీ భాషలోనే..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్.. వైడ్ సెపరేట్ జడ్జ్మెంట్ యాజ్ ఫర్ సెక్షన్ 235 సీఆర్పీసీ’ అంటూ తీర్పులిచ్చే న్యాయమూర్తులు.. ఇప్పుడు స్థానిక భాషల్లోనే తీర్పులు చెబుతున్నారు. కోర్టు తీర్పులు నిందితులు, బాధితులకు అర్థమయ్యేలా వెబ్సైట్లలోనూ స్థానిక భాషల్లోనే పొందుపరుస్తున్నారు. ‘మా తీర్పులు.. మీ భాషల్లోనే’ అంటూ జడ్జిమెంట్స్ వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బాటలోనే హైకోర్టులు సైతం నడుస్తున్నాయి. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున తీసుకున్న కీలక నిర్ణయం న్యాయస్థానాల్ని అన్నివర్గాలకు చేరువ చేసింది. సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటివరకూ 73,963 తీర్పుల్ని సుప్రీంకోర్టు వివిధ భాషల్లో తర్జుమా చేసి తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇదే నేపథ్యంలో 30,944 తీర్పుల్ని ఆయా హైకోర్టులు స్థానిక భాషల్లోకి మార్చాయి.షెడ్యూల్డ్ భాషల్లోనూ..షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను వెలువరిస్తామని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. చెప్పిన విధంగానే ఇప్పటివరకూ 18 భాషల్లో తీర్పుల్ని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, గారో, ఖాసీ, సంథాలీ ఇలా.. విభిన్నమైన స్థానిక భాషల్లో తీర్పులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా వెబ్సైట్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 73,963 తీర్పులు పొందుపరిచింది. రాజస్థాన్ హైకోర్టుతో మొదలై..సుప్రీంకోర్టుతో పాటు ప్రతి హైకోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆంగ్ల భాషలో జరగాలని భారత రాజ్యాంగంలోని 348(1)(ఏ) అధికరణం స్పష్టం చేసింది. అయితే, రాజ్యాంగంలోని 348(2) అధికరణం రాష్ట్రాల్లో అధికారిక వ్యవహారాలు, రాష్ట్రంలో ఉండే హైకోర్టు ప్రొసీడింగ్స్ కోసం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో హిందీ లేదా మరేదైనా భాషను వినియోగించేందుకు గవర్నర్‌కు అధికారం కల్పించింది. అధికారిక భాషా చట్టం–1963లోని సెక్షన్–7 కూడా ఇదే సూచిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ప్రొసీడింగ్స్‌లో హిందీ వినియోగానికి రాజ్యాంగంలోని 348(2) అధికరణం ప్రకారం 1950లో తొలిసారి అనుమతి లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ కోర్టులు హిందీ భాషను వినియోగించడం ప్రారంభించాయి.బీజం వేసిన మద్రాస్ హైకోర్టుమద్రాస్ హైకోర్టులో తమిళం, గుజరాత్ హైకోర్టులో గుజరాతీ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో హిందీ, కలకత్తా హైకోర్టులో బెంగాలీ, కర్ణాటక హైకోర్టులో కన్నడ భాషలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ప్రతిపాదనలు అందాయి. 1965 కేబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ ప్రతిపాదనలపై అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సలహాను అడగ్గా.. 2012 అక్టోబర్ 11న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో ఈ ప్రతిపాదనలను అంగీకరించవద్దని తొలుత నిర్ణయించారు. అయితే.. మరోసారి తమిళనాడు ప్రభుత్వం పట్టుబట్టింది. గత నిర్ణయాన్ని సమీక్షించి తమిళంలో కోర్టు తీర్పులు వెలువరించేందుకు అంగీకారం తెలపాలంటూ 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టును కోరింది. అప్పుడు కూడా తిరస్కరించారు. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 130వ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.స్థానిక భాషల్లో తర్జుమా చేయాల్సిందేఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రొసీడింగ్స్, తీర్పులు సామాన్య ప్రజలకు మరింత సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆంగ్లం నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది. కృత్రిమ మేధ(ఏఐ)తో పాటు ట్రాన్స్లేషన్ టూల్స్‌ని ఉపయోగించి ఈ–ఎస్సీఆర్ తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గత సీజేఐ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలో ఏఐ సహాయక న్యాయ అనువాద సలహా కమిటీని నియమించారు. మొత్తం షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లోకి తర్జుమా చేయాలని నిర్ణయించారు. గతేడాది వరకూ 16 భాషల్లో మాత్రమే చేయగా.. ప్రస్తుతం 18 భాషలకు తర్జుమా చేరుకుంది. ఇలాంటి కమిటీలే దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ఆయా హైకోర్టుల న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పాటయ్యాయి. తీర్పులను 16 స్థానిక భాషల్లోకి అనువదించేందుకు హైకోర్టులతో సుప్రీంకోర్టు భాగస్వామ్యమవుతోంది. -
కొల్లేరులోని లంక గ్రామాల్లో పెద్దలదే పెత్తనం
కొల్లేరులో పెదరాయుళ్ల జమానా బలంగా నడుస్తోంది. అడ్డగోలు తీర్పులతో కుటుంబాలను విభజించడం, అన్యాయంగా కొన్ని కేసుల్లో బాధితులను ఇబ్బందులు పెట్టేలాంటి తీర్పులు తరచూ లంక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే తరహా తీర్పులతో కుల కట్టుబాట్ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నా ఉన్నతాధికారులు నోరుమెదపలేని పరిస్థితి. అనేక ఘటనలు తెర మీదకు వచ్చి ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా విచారణల పేరుతో వదిలేస్తున్నారు. తాజాగా చేతబడి నెపంతో ఒక కుటుంబాన్ని తీవ్రంగా కొట్టి గాయపరచడం, మరో కేసులో అడ్డగోలుగా భార్యాభర్తలకు విడాకులు ఇప్పించడం వివాదాస్పదంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఏలూరుకొల్లేరులో పంచాయతీలకు సమాంతరంగా బంటాపెద్దలు తీర్పులు చెబుతూ సమాంతర పంచాయితీ నడుపుతున్నారు. సాధారణంగా తప్పు చేస్తే స్టేషన్‌కు వెళ్లే సంస్కృతి లేకుండా తప్పు జరిగితే బంటా పెద్దలకు ఫిర్యాదు చేయడం, వారే సెటిల్మెంట్ చేయడం కొల్లేరులోని ప్రజలు వారి తీర్పును వ్యతిరేకిస్తే గ్రామానికి వచ్చే అక్రమ చేపల చెరువుల ఆదాయంలో వాటాలు ఇవ్వబోమని బెదిరించడం, సాంఘిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించడం చేస్తూ నిరాటంకంగా తమ జమానా కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొల్లేరు పెదరాయుళ్ళ హవా రెట్టించింది. అన్ని రాజకీయ పార్టీలకూ కొల్లేరు ఓట్లు అత్యంత కీలకం. 4 నియోజకవర్గాలు.. 9 మండలాల్లో విస్తరించిన కొల్లేరులో 122 గ్రామాలున్నాయి. బంటా పెద్దలదే పెత్తనం, ఓటింగ్ విషయంలో వీరి మాటే చెల్లుతుండటంతో అధికార పార్టీ సహా అందరూ పెద్దల మాటకు తలొగ్గాల్సిన పరిస్థితులున్నాయి.కొల్లేరు స్వరూపం ఇదీ..నియోజకవర్గాలు: ఉంగుటూరు, దెందులూరు, ఉండి, కైకలూరు మండలాలు: కైకలూరు, మండవల్లి, ఏలూరు రూరల్ మండలం, పెదపాడు, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, ఉండిగ్రామాలు : 122జనాభా: 3.50 లక్షలుకుటుంబాలు: 78 వేలుఓట్లు : 1.75 లక్షలుకట్టేసి కొట్టడమే కొన్నింటిలో శిక్షలుఉదాహరణకు భార్య, భర్త విడిపోతే వివాహ సమయంలో భర్త తీసుకున్న లాంచనాలు సర్వం చెల్లించేస్తే విడాకులు మంజూరవుతాయి. వివాహేతర సంబంధం కేసుల్లో అయితే వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి వివాహిత భర్తకు పరిహారం ఇస్తే కేసు సెటిల్ అయిపోతుంది. అది కూడా కేసును బట్టి లక్షల్లోనే ఉంటుంది. ఇక చేతబడులు, ఇతరత్రా అనుమానాలు అయితే కట్టేసి కొట్టడమే శిక్ష. ఇలాంటి అనైతిక చర్యలు నేటికీ కొల్లేరులో కొనసాగుతున్నాయి. తాజాగా కైకలూరు మండలం చటాకాయి గ్రామంలో చేతబడి నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను కొల్లేరు పెద్దల తీర్పుతో చితకబాదారు. అక్టోబరు 25న కమ్యూనిటీ హాలు వద్ద స్తంభాలకు కట్టేసి గ్రామపెద్దల సమక్షంలో 18 మంది కలసి కర్రలతో కొట్టారు. వీరిలో బాధితుడు సైదు రఘు ఏకంగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. మరో ఇద్దరు మోరు రాంబాబు, జయమంగళ ధనుంజయ ఏలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ కేసులో ఆరుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కొందరు బాధితులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏలూరు రూరల్ మండల శ్రీపర్రులో భార్యాభర్తలకు విడాకులు అడ్డగోలుగా ఇప్పించడంపై భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శ్రీపర్రు గ్రామానికి చెందిన సుభాష్‌తో కైకలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన మహిళకు 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. గత నెల 27న గ్రామ పెద్దలు ఏకంగా రాతపూర్వకంగా విడాకుల తంతు పూర్తి చేశారు. దీంతో బాధిత మహిళ.. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిషోర్‌లకు ఇటీవల ఫిర్యాదు చేసింది.1952 నుంచి తీర్పులుఒడిశాకు చెందిన ఒక తెగ వందల ఏళ్ల క్రితం కొల్లేరు ప్రాంతానికి వచ్చి చేపలు పట్టుకోవడం ప్రధాన వృత్తిగా ఎంచుకుని లంక గ్రామాల్లో స్థిరపడిపోయింది. 1952 నుంచి కొల్లేరులో బంటా పెద్దల పాలనకు తెర లేచింది. అందరికీ ఆదాయాన్ని చూపి పెద్దల పెత్తనం సాగిస్తుంటారు. ఉదాహరణకు ఒక గ్రామ పరిధిలో 500 ఎకరాల్లో అభయారణ్యం ఉంటే దానిలో కొందరు పెట్టుబడిదారులతో చెరువులు వేయించి ఎకరాకు రూ.లక్ష చొప్పున కౌలుకు తీసుకుని గ్రామంలో ఎంతమంది మగవారు ఉంటే అంతమందికి వాటాలేసి ప్రతి ఏటా బంటా పెద్దలు ఆదాయం ఇస్తుంటారు. కొన్ని కీలక ఘటనల్లో బాధితులు స్టేషన్లకువెళ్లినా..ఉన్నతాధికారులను కలిసినా వారిని కట్టుబాట్ల పేరుతో వేధించడం, బహిష్కరణకు గురి చేస్తున్నారు. 122 గ్రామాల్లో పంచాయతీ పాలన ఉండి, సర్పంచులు ఉన్నప్పటికీ వ్యవస్థ నడిపేది బంటా పెద్దలే. ఒక్కో గ్రామంలో 10 మందితో పెద్దలు కమిటీలా ఏర్పడి ప్రతిరోజూ కమ్యూనిటీ హాలు వద్ద పంచాయితీలు చేస్తుంటారు. -
కక్షిదారులకు అర్థమయ్యేలా తీర్పులు
న్యూఢిల్లీ: కోర్టులిచ్చే తీర్పులు సకారణంగా, కక్షిదారులకు అర్థమయ్యేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక కేసు కోర్టులో ఎందుకు ఓడిపోయిందో, లేక ఎందుకు గెలిచిందనే విషయం కక్షిదారులకు తెలిసేలా తీర్పులుండాలని సూచించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండోర్ కాంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2005–06 కాలానికి గాను తమ సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ జమ చేయలేదు. బాధితులు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ను ఆశ్రయించగా వెంటనే రూ.87,204 చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కాంపోజిట్ కంపెనీ ఈపీఎఫ్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసింది. పరిశీలించిన ట్రిబ్యునల్ బోర్డ్ ఆదేశాలను పక్కన బెట్టింది. దీంతో ట్రస్టీస్ బోర్డ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. పరిశీలించిన ఇండోర్ బెంచ్.. బోర్డ్ పిటిషన్‌ను కొట్టి వేయడంతోపాటు ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థించింది. ఈ తీర్పుపై ఈపీఎఫ్ బోర్డ్ సుప్రీంకు వెళ్లింది. విచా రణ చేపట్టిన జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ నవీన్ సిన్హాల బెంచ్.. ‘ఆ తీర్పు కక్షిదారుల పట్ల పక్ష పాతం చూపినట్లుంది. కేసులో కక్షిదారులు తామెందుకు ఓడామో లేక గెలిచామనే విష యం తెలియకుండాపోయింది’ అని పేర్కొంది. -
‘బరి’ తెగింపే..
పసిబిడ్డను సాకినట్టు పెంచిన పుంజులనే ‘కసి’ బరిలో దింపేందుకు రంగం సిద్ధమవుతోంది. జాతి ఒకటే అయినా.. కళ్లలో పట్టరాని వైరం తొణుకుతుండగా, కాళ్లకు కట్టిన కత్తులు తళుకుమంటుండగా, రెక్కలు విప్పి, గాలిలోకి ఎగిరి పోరాడేందుకు, నేలను తమ నెత్తుటితో తడిపేందుకు.. పుంజులు ‘తుది’ తర్ఫీదు పొందుతున్నాయి. న్యాయస్థానాల తీర్పులతో నిమిత్తం లేకుండానే.. పెద్ద పండగ పేరుతో జరిగే నిర్దయాత్మక యుద్ధానికీ; రకరకాల జూదాలకూ.. ‘పెద్దల’ దన్నుతో జిల్లాలో వేదికలు తయారవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ :కోర్టులు, తీర్పులు, పోలీసులు..ఇవేమీ మాకు అడ్డు కాదంటూ కోడిపందేలకు నిర్వాహకులు బరి తెగిస్తున్నారు. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం పందేల వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పు ఎలా ఉన్నా అన్ని హంగులతో జిల్లాలో పందేలకు సర్వం సిద్ధమవుతోంది. గత ఏడాది పందేలు జరిగిన ప్రాంతాల్లోనే ఈసారీ నిర్వహించేందుకు టెంట్ల వంటి సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జూదం, గుండాట, ముక్కాట.. వంటి వాటికి నిర్వాహకులు లక్షల్లోనే ‘రుసుము’ వసూలు చేస్తున్నారు. (ఎదుర్లంకలో కేవలం గుండాట నిర్వహణ అవకాశానికి వేలం వేయగా పాట రూ.16.5 లక్షలకు ఖరారైంది). పందేల స్థాయిని బట్టి పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులతో నిర్వాహకులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పందేల విషయంలో చూసీచూడనట్టు పోవాల్సిందిగా రాజకీయ నాయకుల నుంచి మౌఖిక ఆదేశాలూ అందాయి. కొబ్బరితోటలే పోరుబరులు రాష్ట్ర విభజనకు ముందు, తరువాత కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాది మొదటిస్థానం కాగా మనజిల్లా రెండో స్థానంలో ఉంటుంది. పండగ మూడు రోజులు (బుధ, గురు, శుక్రవారం)లో పందేల నిర్వహణకు సర్కారు తొలి నుంచీ సానుకూలంగా ఉండడంతో అడ్డుఅదుపూ లేకుండా బరులు సిద్ధంచేస్తున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప కోర్టు తీర్పును గౌరవిస్తామంటున్నారు. అదేనోటితో సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తామంటున్నారు. చినరాజప్ప మాటలతో నిర్వాహకుల ఉత్సాహం పెరిగింది. జిల్లాలో ప్రధానంగా కోనసీమలో కోడిపందేలు భారీ ఎత్తున జరగనున్నాయి. పండగ మూడు రోజుల్లో ఇక్కడ సుమారు రూ.20 కోట్ల మేర పందేలు జరుగుతాయని అంచనా. చాలాచోట్ల కొబ్బరితోటలను పందేలకు వేదికగా చేసుకుంటున్నారు. యానాం-ఎదుర్లంక గోదావరి మధ్య లంకల్లో భారీగా పందేలకు ఇరు ప్రాంతాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యానాం నుంచి గోదావరి దాటి కోనసీమలో అడుగుపెట్టే ఐ.పోలవరం మండలంలో పందేలకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఆ మండలంలో ఆర్థికంగా బలమైన సామాజికవర్గ నేతలు తమ కనుసన్నల్లోనే ఎదుర్లంక, కేశనకుర్రు, పెదమడి మొక్కతోట, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, రాజుపాలెం, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, గెద్దనాపల్లి తదితర ప్రాంతాల్లో పందేలకు సర్వం సిద్ధం చేశారు. ఈసారి అధికారపార్టీ ముఖ్యనేత అండదండలుండటంతో రెట్టింపు స్థాయిలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడిపందేలంటే కోనసీమలో ముందు గుర్తుకువచ్చే అల్లవరం మండలంలో గోడి, గోడిలంకలో కొబ్బరితోటల్లో పందేలు భారీగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. హోంమంత్రి చినరాజప్ప సొంత మండలం ఉప్పలగుప్తంలో కూడా ఈ సారి బరితెగిస్తున్నారు. లంక గ్రామాల్లో మెరవనున్న కత్తులు పశ్చిమగోదావరికి సరిహద్దున ఉన్న మలికిపురం, వీవీ మెరక సరిహద్దులోను, తూర్పు, పశ్చిమ సరిహద్దు లంక గ్రామాల్లో పందేలకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. లంక గ్రామాలైన కలగంపూడి, ఒంటిలంక, ఏనుగులంక, నర్సాపురం, యలమంచలి గోదావరి సరిహద్దులంకల్లో, కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లోని వెదిరేశ్వరం, పొడగట్లపల్లి, కపిలేశ్వరపురం మండలంలోని లంకల్లో, కె.గంగవరం మండలం కూళ్లలో ఒక మోస్తరు పందేలు జరగనున్నాయి. బొబ్బర్లంక సమీపంలోని ధవళేశ్వరం, విజ్జేశ్వరంల మధ్య లంక ప్రాంతంలో పందేలకు బరి తెగిస్తున్నారు. సఖినేటిపల్లి, అప్పనరామునిలంక, మలికిపురం మండలం తూర్పులంక, కేశనపల్లి, చింతలపల్లి, మామిడికుదురు మండలం గోగన్నమఠం, మగటపల్లి, అమలాపురం మండలం సాకుర్రు గున్నేపల్లి, ఇందుపల్లి, కొత్తపేట మండలం అవిడి, ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లో పందేలకు బరి సిద్ధహవుతోంది. మెట్ట, ఏజెన్సీల్లో కూడా పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలం వేట్లపాలెంలో పందేలు జోరుగా సాగనున్నాయి. ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లో పలు గ్రామాల్లో పందేలు జోరుగా జరిపేందుకు సిద్ధపడుతున్నారు. గిరిజన ప్రాంతమైన దేవీపట్నం, మారేడుమిల్లి, రంపచోడవరంలలో పందేలకు రెడీ అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పందేలు జరుగుతాయని అంచనా. కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరిస్తాం : రాజప్ప సోమవారం పొద్దుపోయాక సర్పవరం పోలీసు అతిథిగృహంలో పోలీసు డైరీ ఆవిష్కరణకు హాజరైన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప దృష్టికి కోడిపందేల విషయాన్ని విలేకరులు తీసుకువెళ్లారు. దానిపై ఆయన మాట్లాడుతూ పందేల వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. -
గ్రామ పెదరాయుళ్లు.. వీళ్లు
సంగారెడ్డి మున్సిపాలిటీ: దసరా రోజైనా తమ కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం వారికి లేకపోయింది. వారితో ఎవ్వరు మాట్లాడినా, వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యాలు, చావులకు వెళ్లినా రూ.50 వేల జరిమానా విధిస్తారు. గ్రామంలో కులపెద్దలు నిర్వహించిన పంచాయతీ తీర్పు ఇది. వారు చెప్పింది వినకుంటే కుల బహిష్కరణ చేస్తారు. ఇదేమి విడ్డూరం? ఇదెక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలలో కులపెద్దల తంతు ఇది. గత అయిదేళ్ల కాలంలో కుల పెద్దల తీర్పుతో పలు కుటుంబాలు సాంఘిక బహిష్కరణకు గురై అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎనిమిది కుటుంబాలు ఈ విధంగా బహిష్కరణ వేటుకు గురయ్యాయి. పోలీసులను ఆశ్రయించినా వారికి సహకరించడంలేదు. వీరిలో రెండు కుటుంబాల వారు చివరకు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తే పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించారు. తెల్లకాగితంపై బాధితులతో సంతకాలు చేయించుకొని కుల బహిష్కరణకు గురైన వారితో పాటు గ్రామ పెద్దల సమక్షంలో గ్రామసభ నిర్వహించి రాజీ చేశామని హెచ్ఆర్సీకి పోలీసులు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీనిపై గ్రామానికి చెందిన బాధితులు శనివారం జిల్లా ఎస్పీని కలిసేందుకు వచ్చినా వారు అందుబాటులో లేకపోవడంతో ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తమ సమస్యను వివరించారు. మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఇటిక్యాలలో 2వేల మంది ఓటర్లతో కలిపి 2684 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 68 మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా 135 మంది సమీపంలోని వివిధ ప్రైవేటు పరిశ్రమలలో పనిచేస్తున్నారు. గ్రామంలో ప్రధానంగా కూలిపై ఆధార పడినవారే అధికంగా ఉన్నారు. గ్రామానికి చెందిన బింగి కిష్టయ్య, నర్సోల్ల కర్ణయ్య, పర్వతాలు, మహేందర్, భాస్కర్ (ప్రస్తుత ఎంపీటీసీ)లు ఒక గ్రూప్‌గా ఏర్పడి గ్రామంలో పంచాయతీలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తప్పు చేసిన వారికి రూ.50 వేల జరిమాన విధిస్తున్నారు. అందులో పంచాయతీ చెప్పిన వారే వాటాలుగా పంచుకుంటున్నారు. ఇదే నిదర్శనం.. గ్రామానికి చెందిన నర్సోల్ల పెద్ద ఐలయ్య కుమారుడు సంతోష్‌కు అదే మండలం నగరం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిపించారు. భార్యభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో కాపురం చేసేందుకు నిరాకరించింది. ఇందుకు గాను మూడేళ్ల క్రితం గ్రామంలో కుల పంచాయతీ నిర్వహించారు. కుల పెద్దలు సంతోష్‌కు రూ.50 జరిమాన విధించారు. అందుకు తన తప్పు లేకున్నా ఎందుకు రూ.50 వేలు చెల్లించాలని కుల పెద్దలను ఎదురు ప్రశ్నించాడు. అందుకు వారు కులపెద్దలు చెప్పింది కాదంటావా అంటూ అతనితో పాటు వారి కుటుంబ సభ్యులను కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వీరింట్లో శుభకార్యాలు జరిగినా చావులు జరిగినా ఎవ్వరూ వెళ్లరు. వెళ్తే రూ. 50వేల జరిమాన చెల్లించాలని తీర్పు చెప్పారు. అలా ఇప్పటి వరకు ముగ్గురితో మాట్లాడారని విడతల వారీగా రూ.39 వేల జరిమాన కుల పెద్దలకు చెల్లించారు. అందులో భాగంగా మే 14న గ్రామానికి చెందిన ఓ యువతి సంతోష్‌తో మాట్లాడినందుకు గాను పంచాయతీ నిర్వహించి జరిమాన విధించారు. ఇందుకు బాధితుడు సంతోష్ అదే రోజు జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి పోలీసులకు రూ.10వేలు, కుల పెద్దలకు రూ. 10 వేల జరిమాన విధించారని బాధితుడు ఐలయ్య తెలిపారు. ఈ విషయంపై మే 31న సిద్దిపేట అర్డీవోతో పాటు గజ్వేల్ డీస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా స్పందించకపోవడంతో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. అందుకు ఆగస్టు 14న సి.ఐ అమృత్‌రెడ్డి, ఎస్.ఐ వీరన్నలు విచారణ చేసి గ్రామ పెద్దల సమక్షంలోనే కుల బహిష్కరణ చేస్తే తప్పులేదని, దండనగా వేస్తే(జరిమాన ) చెల్లించాలని, కుల పెద్దలు చెప్పినట్లు వినాలంటూ పోలీసులు ఉచిత సలహా ఇచ్చారని స్థానికులు తెలిపారు. కుల బహిష్కరణ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సంతోష్ బట్టలు విప్పి స్టేషన్లో కూర్చోబెట్టి కేసును విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశారు. పోలీసులు నాలుగు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకొని భయపెట్టారని సంతోష్ ఆరోపించారు.