స్థానిక భాషల్లోనే జడ్జిమెంట్లు వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం.. అదే బాటలో హైకోర్టులు
18 షెడ్యూల్డ్ భాషల్లో తీర్పులను అందుబాటులో ఉంచుతున్న కోర్టులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు అనువాద సాధనాలను వినియోగిస్తున్న న్యాయస్థానాలు
ఇప్పటివరకు 73,963 తీర్పుల్ని ఆయా భాషల్లో వెబ్‌సైట్‌లో ఉంచిన సుప్రీంకోర్టు
30,944 తీర్పులు స్థానిక భాషల్లో తర్జుమా చేసిన హైకోర్టులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్.. వైడ్ సెపరేట్ జడ్జ్‌మెంట్ యాజ్ ఫర్ సెక్షన్ 235 సీఆర్‌పీసీ’ అంటూ తీర్పులిచ్చే న్యాయమూర్తులు.. ఇప్పుడు స్థానిక భాషల్లోనే తీర్పులు చెబుతున్నారు. కోర్టు తీర్పులు నిందితులు, బాధితులకు అర్థమయ్యేలా వెబ్‌సైట్లలోనూ స్థానిక భాషల్లోనే పొందుపరుస్తున్నారు.
‘మా తీర్పులు.. మీ భాషల్లోనే’ అంటూ జడ్జిమెంట్స్ వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బాటలోనే హైకోర్టులు సైతం నడుస్తున్నాయి. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున తీసుకున్న కీలక నిర్ణయం న్యాయస్థానాల్ని అన్నివర్గాలకు చేరువ చేసింది.
సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటివరకూ 73,963 తీర్పుల్ని సుప్రీంకోర్టు వివిధ భాషల్లో తర్జుమా చేసి తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇదే నేపథ్యంలో 30,944 తీర్పుల్ని ఆయా హైకోర్టులు స్థానిక భాషల్లోకి మార్చాయి.
షెడ్యూల్డ్ భాషల్లోనూ..
షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను వెలువరిస్తామని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (ఈ–ఎస్‌సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. చెప్పిన విధంగానే ఇప్పటివరకూ 18 భాషల్లో తీర్పుల్ని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, గారో, ఖాసీ, సంథాలీ ఇలా.. విభిన్నమైన స్థానిక భాషల్లో తీర్పులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–ఎస్‌సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా వెబ్‌సైట్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 73,963 తీర్పులు పొందుపరిచింది.
రాజస్థాన్ హైకోర్టుతో మొదలై..
సుప్రీంకోర్టుతో పాటు ప్రతి హైకోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆంగ్ల భాషలో జరగాలని భారత రాజ్యాంగంలోని 348(1)(ఏ) అధికరణం స్పష్టం చేసింది. అయితే, రాజ్యాంగంలోని 348(2) అధికరణం రాష్ట్రాల్లో అధికారిక వ్యవహారాలు, రాష్ట్రంలో ఉండే హైకోర్టు ప్రొసీడింగ్స్ కోసం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో హిందీ లేదా మరేదైనా భాషను వినియోగించేందుకు గవర్నర్‌కు అధికారం కల్పించింది.
అధికారిక భాషా చట్టం–1963లోని సెక్షన్–7 కూడా ఇదే సూచిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ప్రొసీడింగ్స్‌లో హిందీ వినియోగానికి రాజ్యాంగంలోని 348(2) అధికరణం ప్రకారం 1950లో తొలిసారి అనుమతి లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ కోర్టులు హిందీ భాషను వినియోగించడం ప్రారంభించాయి.
బీజం వేసిన మద్రాస్ హైకోర్టు
మద్రాస్ హైకోర్టులో తమిళం, గుజరాత్ హైకోర్టులో గుజరాతీ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో హిందీ, కలకత్తా హైకోర్టులో బెంగాలీ, కర్ణాటక హైకోర్టులో కన్నడ భాషలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ప్రతిపాదనలు అందాయి.
1965 కేబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ ప్రతిపాదనలపై అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సలహాను అడగ్గా.. 2012 అక్టోబర్ 11న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో ఈ ప్రతిపాదనలను అంగీకరించవద్దని తొలుత నిర్ణయించారు. అయితే.. మరోసారి తమిళనాడు ప్రభుత్వం పట్టుబట్టింది.
గత నిర్ణయాన్ని సమీక్షించి తమిళంలో కోర్టు తీర్పులు వెలువరించేందుకు అంగీకారం తెలపాలంటూ 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టును కోరింది. అప్పుడు కూడా తిరస్కరించారు. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 130వ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.
స్థానిక భాషల్లో తర్జుమా చేయాల్సిందే
ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రొసీడింగ్స్, తీర్పులు సామాన్య ప్రజలకు మరింత సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆంగ్లం నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది. కృత్రిమ మేధ(ఏఐ)తో పాటు ట్రాన్స్‌లేషన్ టూల్స్‌ని ఉపయోగించి ఈ–ఎస్‌సీఆర్ తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గత సీజేఐ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలో ఏఐ సహాయక న్యాయ అనువాద సలహా కమిటీని నియమించారు. మొత్తం షెడ్యూల్‌లో ఉన్న 22 భాషల్లోకి తర్జుమా చేయాలని నిర్ణయించారు.
గతేడాది వరకూ 16 భాషల్లో మాత్రమే చేయగా.. ప్రస్తుతం 18 భాషలకు తర్జుమా చేరుకుంది. ఇలాంటి కమిటీలే దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ఆయా హైకోర్టుల న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పాటయ్యాయి. తీర్పులను 16 స్థానిక భాషల్లోకి అనువదించేందుకు హైకోర్టులతో సుప్రీంకోర్టు భాగస్వామ్యమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment