దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు
సుప్రీంకోర్టు తీర్పునకు ఈసీ వక్రభాష్యం చెబుతోంది
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన చేయాల్సిందే.. హైకోర్టుకు తెలిపిన బాలినేని తరఫు సీనియర్ న్యాయవాది శ్రీరామ్
సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఈసీఐ
బాలినేని పిటిషన్‌పై తదుపరి విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి : ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించడం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీలు, పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన టీ–ఎస్‌వోపీ సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు.
బాలినేని తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ దాదాపు అరపూట వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పు ఉద్దేశం, ప్రధాన సారాంశం, దానికి ఈసీఐ ఏ విధంగా వక్ర భాష్యం చెబుతోందో వివరించారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన చేయకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం నెరవేరదని అన్నారు. మాక్ పోలింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు మాత్రమే తెలుస్తుందని తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పరిశీలన వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.
వాటి పరిశీలన వల్ల ఓడిపోయిన అభ్యర్థులకు ఓట్ల గురించి తెలుసుకునే అవకాశం, ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకే సుప్రీం కోర్టు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత 45 రోజుల వరకు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను భద్రపరచాలని ఆదేశించిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1 ఈవీఎం, వీవీ ప్యాట్‌ను ఎన్నికల సంఘం భౌతికంగా పరిశీలించేదని, నారా చంద్రబాబు నాయుడు 2019లో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు ఆ సంఖ్య 5కు పెంచిందని వివరించారు.
పోలింగ్ సమయంలో ఓట్ల గురించి తెలుసుకునేందుకే ఈవీఎంలు, వీవీ ప్యాట్లు పరిశీలన చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. అంతే తప్ప అప్పటి ఓట్లను పక్కన పెట్టేసి ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు. ఎన్నికల సంఘం చిత్తశుద్దిని తాము ప్రశ్నించడం లేదని, దాని వ్యవహారశైలిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని శ్రీరామ్ చెప్పారు. ఈ వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ తోసిపుచ్చారు. సుప్రీం కోర్టు తీర్పును పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.
ఈవీఎం, వీవీ ప్యాట్ల లెక్కింపు సాధ్యం కాదన్నారు. ఒకవేళ ఇదే సుప్రీం కోర్టు ఉద్దేశం అయి ఉంటే నేరుగా చెప్పేదే తప్ప, బరŠట్న్ మెమొరీ (ఈవీఎం మైక్రో కంట్రోలర్‌లో శాశ్వతంగా నిక్షిప్తం చేసిన మెమొరీ) గురించి మాట్లాడేది కాదన్నారు. బరŠట్న్ మెమొరీని మాత్రమే పరిశీలించమని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. అందుకే ఆ బాధ్యతలను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లకు అప్పగించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు సమయం ముగియడంతో విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment