సంగారెడ్డి మున్సిపాలిటీ: దసరా రోజైనా తమ కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం వారికి లేకపోయింది. వారితో ఎవ్వరు మాట్లాడినా, వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యాలు, చావులకు వెళ్లినా రూ.50 వేల జరిమానా విధిస్తారు. గ్రామంలో కులపెద్దలు నిర్వహించిన పంచాయతీ తీర్పు ఇది. వారు చెప్పింది వినకుంటే కుల బహిష్కరణ చేస్తారు.
ఇదేమి విడ్డూరం? ఇదెక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలలో కులపెద్దల తంతు ఇది.
గత అయిదేళ్ల కాలంలో కుల పెద్దల తీర్పుతో పలు కుటుంబాలు సాంఘిక బహిష్కరణకు గురై అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎనిమిది కుటుంబాలు ఈ విధంగా బహిష్కరణ వేటుకు గురయ్యాయి. పోలీసులను ఆశ్రయించినా వారికి సహకరించడంలేదు. వీరిలో రెండు కుటుంబాల వారు చివరకు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తే పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించారు. తెల్లకాగితంపై బాధితులతో సంతకాలు చేయించుకొని కుల బహిష్కరణకు గురైన వారితో పాటు గ్రామ పెద్దల సమక్షంలో గ్రామసభ నిర్వహించి రాజీ చేశామని హెచ్‌ఆర్‌సీకి పోలీసులు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు గ్రామస్థులు ఆరోపించారు.
దీనిపై గ్రామానికి చెందిన బాధితులు శనివారం జిల్లా ఎస్‌పీని కలిసేందుకు వచ్చినా వారు అందుబాటులో లేకపోవడంతో ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తమ సమస్యను వివరించారు. మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఇటిక్యాలలో 2వేల మంది ఓటర్లతో కలిపి 2684 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 68 మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా 135 మంది సమీపంలోని వివిధ ప్రైవేటు పరిశ్రమలలో పనిచేస్తున్నారు.
గ్రామంలో ప్రధానంగా కూలిపై ఆధార పడినవారే అధికంగా ఉన్నారు. గ్రామానికి చెందిన బింగి కిష్టయ్య, నర్సోల్ల కర్ణయ్య, పర్వతాలు, మహేందర్, భాస్కర్ (ప్రస్తుత ఎంపీటీసీ)లు ఒక గ్రూప్‌గా ఏర్పడి గ్రామంలో పంచాయతీలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తప్పు చేసిన వారికి రూ.50 వేల జరిమాన విధిస్తున్నారు. అందులో పంచాయతీ చెప్పిన వారే వాటాలుగా పంచుకుంటున్నారు.
ఇదే నిదర్శనం..
గ్రామానికి చెందిన నర్సోల్ల పెద్ద ఐలయ్య కుమారుడు సంతోష్‌కు అదే మండలం నగరం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిపించారు. భార్యభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో కాపురం చేసేందుకు నిరాకరించింది. ఇందుకు గాను మూడేళ్ల క్రితం గ్రామంలో కుల పంచాయతీ నిర్వహించారు. కుల పెద్దలు సంతోష్‌కు రూ.50 జరిమాన విధించారు. అందుకు తన తప్పు లేకున్నా ఎందుకు రూ.50 వేలు చెల్లించాలని కుల పెద్దలను ఎదురు ప్రశ్నించాడు.
అందుకు వారు కులపెద్దలు చెప్పింది కాదంటావా అంటూ అతనితో పాటు వారి కుటుంబ సభ్యులను కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వీరింట్లో శుభకార్యాలు జరిగినా చావులు జరిగినా ఎవ్వరూ వెళ్లరు. వెళ్తే రూ. 50వేల జరిమాన చెల్లించాలని తీర్పు చెప్పారు. అలా ఇప్పటి వరకు ముగ్గురితో మాట్లాడారని విడతల వారీగా రూ.39 వేల జరిమాన కుల పెద్దలకు చెల్లించారు. అందులో భాగంగా మే 14న గ్రామానికి చెందిన ఓ యువతి సంతోష్‌తో మాట్లాడినందుకు గాను పంచాయతీ నిర్వహించి జరిమాన విధించారు.
ఇందుకు బాధితుడు సంతోష్ అదే రోజు జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి పోలీసులకు రూ.10వేలు, కుల పెద్దలకు రూ. 10 వేల జరిమాన విధించారని బాధితుడు ఐలయ్య తెలిపారు. ఈ విషయంపై మే 31న సిద్దిపేట అర్‌డీవోతో పాటు గజ్వేల్ డీస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా స్పందించకపోవడంతో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
అందుకు ఆగస్టు 14న సి.ఐ అమృత్‌రెడ్డి, ఎస్.ఐ వీరన్నలు విచారణ చేసి గ్రామ పెద్దల సమక్షంలోనే కుల బహిష్కరణ చేస్తే తప్పులేదని, దండనగా వేస్తే(జరిమాన ) చెల్లించాలని, కుల పెద్దలు చెప్పినట్లు వినాలంటూ పోలీసులు ఉచిత సలహా ఇచ్చారని స్థానికులు తెలిపారు. కుల బహిష్కరణ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సంతోష్ బట్టలు విప్పి స్టేషన్‌లో కూర్చోబెట్టి కేసును విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశారు. పోలీసులు నాలుగు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకొని భయపెట్టారని సంతోష్ ఆరోపించారు.
గ్రామ పెదరాయుళ్లు.. వీళ్లు
Published Sun, Oct 5 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement