‘బరి’ తెగింపే.. | Suspected cockfight event busted in Soledad | Sakshi
Sakshi News home page

‘బరి’ తెగింపే..

Published Tue, Jan 13 2015 12:23 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

‘బరి’ తెగింపే.. - Sakshi

‘బరి’ తెగింపే..

 పసిబిడ్డను సాకినట్టు పెంచిన పుంజులనే ‘కసి’ బరిలో దింపేందుకు రంగం సిద్ధమవుతోంది. జాతి ఒకటే అయినా.. కళ్లలో పట్టరాని వైరం తొణుకుతుండగా, కాళ్లకు కట్టిన కత్తులు తళుకుమంటుండగా, రెక్కలు విప్పి, గాలిలోకి ఎగిరి పోరాడేందుకు, నేలను తమ నెత్తుటితో తడిపేందుకు.. పుంజులు ‘తుది’ తర్ఫీదు పొందుతున్నాయి. న్యాయస్థానాల తీర్పులతో నిమిత్తం లేకుండానే.. పెద్ద పండగ పేరుతో జరిగే నిర్దయాత్మక యుద్ధానికీ; రకరకాల జూదాలకూ.. ‘పెద్దల’ దన్నుతో జిల్లాలో వేదికలు తయారవుతున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :కోర్టులు, తీర్పులు, పోలీసులు..ఇవేమీ మాకు అడ్డు కాదంటూ కోడిపందేలకు నిర్వాహకులు బరి తెగిస్తున్నారు. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం పందేల వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పు ఎలా ఉన్నా అన్ని హంగులతో జిల్లాలో పందేలకు సర్వం సిద్ధమవుతోంది. గత ఏడాది పందేలు జరిగిన ప్రాంతాల్లోనే ఈసారీ నిర్వహించేందుకు టెంట్ల వంటి సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జూదం, గుండాట, ముక్కాట.. వంటి వాటికి  
 
 నిర్వాహకులు లక్షల్లోనే ‘రుసుము’ వసూలు చేస్తున్నారు. (ఎదుర్లంకలో కేవలం గుండాట నిర్వహణ అవకాశానికి వేలం వేయగా పాట రూ.16.5 లక్షలకు ఖరారైంది). పందేల స్థాయిని బట్టి పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులతో నిర్వాహకులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పందేల విషయంలో చూసీచూడనట్టు పోవాల్సిందిగా  రాజకీయ నాయకుల నుంచి మౌఖిక ఆదేశాలూ అందాయి.
 
 కొబ్బరితోటలే పోరుబరులు
 రాష్ట్ర విభజనకు ముందు, తరువాత కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాది మొదటిస్థానం కాగా మనజిల్లా రెండో స్థానంలో ఉంటుంది. పండగ మూడు రోజులు (బుధ, గురు, శుక్రవారం)లో పందేల నిర్వహణకు సర్కారు తొలి నుంచీ సానుకూలంగా ఉండడంతో అడ్డుఅదుపూ లేకుండా బరులు సిద్ధంచేస్తున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప కోర్టు తీర్పును గౌరవిస్తామంటున్నారు. అదేనోటితో సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తామంటున్నారు. చినరాజప్ప మాటలతో నిర్వాహకుల ఉత్సాహం పెరిగింది. జిల్లాలో ప్రధానంగా కోనసీమలో కోడిపందేలు భారీ ఎత్తున జరగనున్నాయి. పండగ మూడు రోజుల్లో ఇక్కడ సుమారు రూ.20 కోట్ల మేర పందేలు జరుగుతాయని అంచనా. చాలాచోట్ల కొబ్బరితోటలను పందేలకు వేదికగా చేసుకుంటున్నారు.  
 
 యానాం-ఎదుర్లంక గోదావరి మధ్య లంకల్లో భారీగా పందేలకు ఇరు ప్రాంతాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యానాం నుంచి గోదావరి దాటి కోనసీమలో అడుగుపెట్టే ఐ.పోలవరం మండలంలో పందేలకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఆ మండలంలో ఆర్థికంగా బలమైన సామాజికవర్గ నేతలు తమ కనుసన్నల్లోనే ఎదుర్లంక, కేశనకుర్రు, పెదమడి మొక్కతోట, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, రాజుపాలెం, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, గెద్దనాపల్లి తదితర ప్రాంతాల్లో పందేలకు సర్వం సిద్ధం చేశారు. ఈసారి అధికారపార్టీ ముఖ్యనేత అండదండలుండటంతో రెట్టింపు స్థాయిలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడిపందేలంటే కోనసీమలో ముందు గుర్తుకువచ్చే అల్లవరం మండలంలో గోడి, గోడిలంకలో కొబ్బరితోటల్లో పందేలు భారీగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. హోంమంత్రి చినరాజప్ప సొంత మండలం ఉప్పలగుప్తంలో కూడా ఈ సారి బరితెగిస్తున్నారు.  
 
 లంక గ్రామాల్లో మెరవనున్న కత్తులు
 పశ్చిమగోదావరికి సరిహద్దున ఉన్న మలికిపురం, వీవీ మెరక సరిహద్దులోను,  తూర్పు, పశ్చిమ సరిహద్దు లంక గ్రామాల్లో పందేలకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు.  లంక గ్రామాలైన కలగంపూడి, ఒంటిలంక, ఏనుగులంక, నర్సాపురం, యలమంచలి గోదావరి సరిహద్దులంకల్లో, కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లోని వెదిరేశ్వరం, పొడగట్లపల్లి, కపిలేశ్వరపురం మండలంలోని లంకల్లో, కె.గంగవరం మండలం కూళ్లలో ఒక మోస్తరు పందేలు జరగనున్నాయి. బొబ్బర్లంక సమీపంలోని ధవళేశ్వరం, విజ్జేశ్వరంల మధ్య లంక ప్రాంతంలో పందేలకు బరి తెగిస్తున్నారు.  
 
 సఖినేటిపల్లి, అప్పనరామునిలంక, మలికిపురం మండలం తూర్పులంక, కేశనపల్లి, చింతలపల్లి, మామిడికుదురు మండలం గోగన్నమఠం, మగటపల్లి, అమలాపురం మండలం సాకుర్రు గున్నేపల్లి, ఇందుపల్లి, కొత్తపేట మండలం అవిడి, ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లో పందేలకు బరి సిద్ధహవుతోంది. మెట్ట, ఏజెన్సీల్లో కూడా పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలం వేట్లపాలెంలో పందేలు జోరుగా సాగనున్నాయి. ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లో పలు గ్రామాల్లో పందేలు జోరుగా జరిపేందుకు సిద్ధపడుతున్నారు. గిరిజన ప్రాంతమైన దేవీపట్నం, మారేడుమిల్లి, రంపచోడవరంలలో పందేలకు రెడీ అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పందేలు జరుగుతాయని అంచనా.
 
 కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరిస్తాం : రాజప్ప
 సోమవారం పొద్దుపోయాక సర్పవరం పోలీసు అతిథిగృహంలో పోలీసు డైరీ ఆవిష్కరణకు హాజరైన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప దృష్టికి   కోడిపందేల విషయాన్ని విలేకరులు తీసుకువెళ్లారు. దానిపై ఆయన మాట్లాడుతూ పందేల వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement