
ఇద్దరు పిల్లలను చంపి.. తానూ ఆత్మహత్య
కాకినాడ తోట సుబ్బారావునగర్‌లో ఘటన
హోలీ పండగ పూట విషాదం
కాకినాడ రూరల్: అభం శుభం తెలియని ఆ పసి పిల్లల పాలిట ఆ తండ్రి కాలయముడయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ.. ఇద్దరు చిన్నారులను బలిగొన్నాడు. అంతటితో ఆగక తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉలిక్కిపడేలా చేసే ఈ సంఘటన కాకినాడలోని తోట సుబ్బారావు నగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. భార్యా పిల్లలతో చీకూచింతా లేని కుటుంబం. ఆర్థికంగా దన్నుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో ఉద్యోగం. ఏమైందో ఏమో కానీ, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే పిల్లలను నిర్దాక్షిణ్యంగా నీటిలో ముంచి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.
ఆపై తాను ఉరి వేసుకున్నాడు. హోలీ పండగ పూట కాకినాడ రెండో డివిజన్‌లోని తోట సుబ్బారావు నగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్(37) వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా భార్యాపిల్లలతో తోటసుబ్బారావు నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. పిల్లలు జోషిత్(7) ఒకటో తరగతి, నిఖిల్(6) యూకేజీ చదువుతున్నారు. ఇలాఉండగా తోట సుబ్బారావు నగర్‌లో తన ప్లాట్ నుంచి హోలీ పండగ వేడుకల కోసం భార్య తనూజ, పిల్లలతో కలిసి వాకలపూడిలో తాను పనిచేస్తున్న ఓఎన్జీసీ కార్యాలయం వద్దకు వెళ్లాడు.
అక్కడ హోలీ వేడుకల్లో భార్యను ఉండమని చెప్పి, పిల్లలకు టైలర్ వద్ద కొలతలు తీయించి తెస్తానని ఇంటికి వచ్చాడు. ఇంట్లో బాత్రూం బకెట్ నీటిలో ఇద్దరు పిల్లలను ముంచి, ఊపిరాడకుండా చేసి హతaమర్చాడు. తర్వాత బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంట వరకూ భర్త, పిల్లలు రాకపోయేసరికి కంగారుపడిన భార్య ఫోన్ చేసినప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తోట సుబ్బారావునగర్‌లో చంద్రకిశోర్ ఇంటికి వచ్చారు. తలుపులు బలవంతంగా తెరిచేసరికి బెడ్రూంలో ఉరి వేసుకుని చంద్రకిశోర్ కనిపించాడు.
పిల్లలు బాత్రూంలో విగతజీవుల్లా కనిపించారు. విషయం తెలుసుకున్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఓఎన్జీసీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కళ్లెదుటే భర్త, పిల్లలు శవాలుగా పడి ఉండడంతో భార్య తనూజ స్పృహ కోల్పోయింది. బంధువుల సపర్యలతో స్పృహలోకి వచ్చిన ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఆమెను ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. సర్పవరం ఎస్సై శ్రీనివాస్‌కుమార్ కేను నమోదు చేశారు. సీఐ పెద్దిరాజు విచారణ చేపట్టారు. చంద్రకిశోర్ బెడ్రూంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుత జనరేషన్‌లో తన పిల్లలు సరిగ్గా చదవడం లేదని మనస్తాపం చెంది చనిపోతున్నట్టుగా రాసి ఉందని తెలిసింది. ఈమధ్యే పిల్లల స్కూలు కూడా మార్చినట్టు బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment