కాకినాడ: వీధి కుక్కలు దాడి చేశాయి. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాయి. వివరాలివి...కాకినాడ నగరం నడిబొడ్డున ఉన్న బాలాజీ చెరువు వద్ద మండల రెవెన్యూ కార్యాలయం ఎదుటి వీధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వాసంశెట్టి శ్రీనివా స్, భూలక్ష్మి దంపతులు 15 రోజు క్రితమే ఇంద్రంపాలెం నుంచి ఇక్కడి ఇంట్లోకి అద్దెకు వచ్చారు. వీరికి సాందిక, సాయిశారద ఇద్దరు కుమార్తెలు. దాదాపు 11 సంవత్సరాల తరువాత నాగేంద్ర అనే బాలుడు జన్మించాడు. దీంతో అతడ్ని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. బాలాజీచెరువు వద్ద ఆటో మెకానిక్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ శనివారం ఉదయం మెకానిక్ షెడ్డుకు వెళ్లాడు.
భూలక్ష్మి ఒక వృద్ధురాలికి సహాయకురాలిగా వెళ్లింది. ఇంట్లో ఇద్దరు అక్కలతో పాటు ఆరేళ్ల బాలుడు నాగేంద్ర ఉన్నారు. ఆ బాలుడు ఆడుకునేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. విశాలమైన ఆవరణలో చెట్లు, మొక్కల మధ్య చిన్న కత్తెర పట్టుకుని ఆకులు కత్తిరిస్తూ ఆడుకుంటున్నాడు. ఇంతలో ప్రహరీ గోడదూకి వచ్చిన కుక్కలు నాగేంద్రపై హఠాత్తుగా దాడి చేశాయి. అతడ్ని ఈడ్చుకుంటూపోయాయి. భుజంపై చర్మం పీకేశాయి. తలపై చర్మం ఊడిపోయింది. ఒళ్లంతా గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు.
ఇంతలో పక్క ఇంట్లో నివసిస్తున్న మహిళ బయటకు వెళ్తూ నిర్జీవంగా ఉన్న నాగేంద్రను చూసి అతడి అక్కలకు చెప్పింది. దీంతో వారు బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ దూరమైపోయాడని తల్లిదండ్రులు, అక్కలు గోలు గోలున విలపించారు. బాలుని మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మూడో వపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ సత్యవేణి, కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న పరామర్శించారు.
కుక్కల దాడికి మాంసం వ్యర్థాలే కారణమా?
కుక్కలు బాలుడిని హతమార్చిన ఇంటి ముందు డంపర్ బిన్నులో ఆస్పత్రి, హోటళ్ల నుంచి తెచ్చి వేసిన వ్యర్థాలను తినేందుకు కుక్కలు అక్కడ వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల ఉండే ఆస్పత్రుల నుంచి రక్తం మరకలతో కూడిన వ్యర్థాలు, హోటళ్లలోని ఆహార వ్యర్థాలను రాత్రి వేళల్లో తెచ్చి డంపర్ బిన్‌లో వేయడంతో వాటిని తినేందుకు కుక్కలు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. వాటిని తిన్నాకా ఎండ తీవ్రతకు మొక్కల మధ్యకు వచ్చి పడుకోవడానికి ప్రహరీ దూకి వస్తున్నాయని స్థానికులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాలుడిపై కుక్కలు దాడి చేసి ఉంటాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment