జవహర్‌నగర్ ఉదంతంతోనైనా కళ్లు తెరుస్తారా?
ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించాలి
శివార్లలోని జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో ఏడాదిన్నర విహాన్ మృతి వార్తతో నగర ప్రజల గుండెలు బరువెక్కాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో సైతం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో మరణించడం ఎందరినో కలచివేసింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామనే ప్రకటనలు తప్ప నిజంగా ప్రజలకు.. ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి సరైన సమాధానాలు దొరకడం లేదు.
⇒హైదరాబాద్
అక్కడ బాగు..
జైపూర్, గోవాల్లో ఏబీసీ కార్యక్రమాల అమలు బాగుందనే అభిప్రాయాలున్నాయి. అక్కడ ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలో ( 5–12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తారని, ‘మిషన్ రేబిస్’ పేరిట వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తారని జంతుప్రేమికులు చెబుతున్నారు. పాఠశాలల్లోనూ అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తారని పేర్కొన్నారు.
నామ్‌కే వాస్తేగా హైలెవెల్ కమిటీ
ఏళ్ల తరబడిగా కుక్కల బెడద ఉన్నా, వాటి దాడుల్లో ఎందరో మరణిస్తున్నా.. కుక్కలతో ఇక భయం లేదనుకునే పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి. రోడ్డు ప్రమాదాలు, నాలాల్లో మరణాల మాదిరే కుక్కకాట్లతో సైతం మరణాలు చోటు చేసుకుంటుండటం విషాదకరం. వీధికుక్కలపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులతో గత సంవత్సరం జీహెచ్‌ఎంసీ అఖిలపక్ష సభ్యులతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా, అది 27అంశాలు సిఫార్సు చేసినా ప్రజలకు కుక్కకాట్లు తప్పడం లేదు. సిఫార్సు చేసిన అంశాల్లో ఆరేడు అంశాలు మాత్రం కొద్దిరోజులు అమలు చేశారు. ఆ తర్వాత వాటిని మరచిపోయారు. ఐదు కుక్కల సంరక్షణ కేంద్రాలు, వాటి నిర్వహణ, వెటర్నరీ విభాగంలో సిబ్బంది పెంపు వంటివి మాత్రం అమలు చేశారు.
అమలుకు నోచుకోని అమాత్యుడి హామీ..
బహిరంగ ప్రదేశాల్లో మాంసాహార వ్యర్థాలు వేసే హోటళ్లు, దుకాణాలను ప్రాసిక్యూట్ చేయడంతో పాటు వాటిని మూసి వేస్తామనే హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మటన్, చికెన్ షాపుల వ్యర్థాలు బహిరంగంగా వేయకుండా కవర్లను అందజేస్తామన్న అప్పటి పశుసంవర్థక శాఖ మంత్రి హామీ అమలు కాలేదు. మూడు నెలల పాటు వీధికుక్కల స్పెషల్ డ్రైవ్, వీధికుక్కల సమాచారం కోసం ప్రత్యేక యాప్ వంటివి మాటలకే పరిమితమయ్యాయి.
సినిమాలు, టీవీల్లో స్లైడ్‌లు, షార్ట్ ఫిల్మ్, వీడియో కాంటెస్ట్ వంటి వాటితో సహ మిగతా అంశాలు మరచిపోయారు. వీధికుక్కల సంరక్షణకు ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలూ అటకెక్కాయి. రాత్రి సమయాల్లోనూ వీధికుక్కలను పట్టుకోవడం, వీధికుక్కల దత్తత వంటివి పట్టింపు లేకుండా పోయాయి. కుక్కలకు ఆహారం, నీళ్లు అందుబాటులో ఉంచుతామన్న మాటలు కొద్దిరోజులే అమలయ్యాయి. కుక్కలు కనిపించిప్పుడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కొద్దిరోజులు మాత్రం నిర్వహించారు.
ఇంతే చేయగలం..
సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్రప్రభుత్వ యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)రూల్స్ ,కుక్కల నివారణకు జీహెచ్‌ఎంసీ బైలాస్ మేరకు కుక్కల సంతతి తగ్గించడం, రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబిస్ (ఏఆర్) వ్యాక్సిన్ వేయడం మాత్రమే తాము చేయగలమని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. వాటితోపాటు ఫంగస్ ఇన్‌ఫెక్షన్ల వంటివి సోకకుండా ఐవర్‌మెక్టిన్ ఇంజెక్షన్లు వేస్తున్నామంటున్నారు.
కాగా.. సీఎం ఆదేశాల నేపథ్యంలో కుక్క కాట్ల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వెటర్నరీ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం.
లెక్కకు మిక్కిలిగా..
⇒ జీహెచ్‌ఎంసీ గణాంకాల మేరకు పదేళ్లలో 8మంది చిన్నారుల మరణాలు, ఐపీఎం లెక్కల మేరకు 3,36,767 మంది కుక్కల బారిన పడ్డట్లు లెక్కలున్నా, అవి అంతకంటే ఎక్కువగా ఉంటాయని అంచనా.
⇒ 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో ఏళ్ల బాలిక మృతి.
⇒ 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాట్ల వల్ల మరణించారు.
⇒ 2020లో అమీర్‌పేటలో ఒకేరోజు 50 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు.
⇒ 2020 ఆగస్ట్‌లో లంగర్‌హౌస్‌లో నలుగురు చిన్నారులకు గాయాలు.
⇒ 2021 జనవరి 30 బహదూర్‌పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
⇒ 2022 డిసెంబర్ 12న పీర్జాదిగూడలో చిన్నారికి తీవ్రగాయాలు.
⇒ 2023 ఫిబ్రవరిలో అంబర్‌పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.
⇒ 2023 డిసెంబర్‌లో షేక్‌పేటలో ఐదు మాసాల పసికందు కుక్కల దాడితో అసువులు బాశాడు.
⇒ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
⇒ నగరంలో కుక్కలను కట్టడి చేయాలని హైకోర్టు ఆదేశాలున్నా, అమలుకు నోచుకోలేదు.
నాలాలు, నిర్మాణాలూ కారణమే
వీధికుక్కల బెడద పెరగడానికి ఖాళీ జాగాలు లేకుండా వెలుస్తున్న భవన నిర్మాణాలతో నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడం కూడా ఒక కారణమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. నాలాల పైకప్పులు, మెష్‌లతోనూ కుక్కల దాహార్తి తీరే దారి లేకుండా పోయిందంటున్నారు. ఖాళీ జాగాలుంటే నీరుండే ప్రాంతాలుంటాయని పేర్కొన్నారు. ఆహారం, నీరు దొరక్కపోవడం కుక్కలు పిచి్చపట్టినట్లు దాడులు చేయడానికి కారణమని అంటున్నారు. వర్షాకాలంలో చర్మవ్యాధుల బాధలతోనూ తట్టుకోలేక వీధికుక్కలు పిచి్చపట్టినట్లు కరుస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment