చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎస్పీ విశాల్ గున్నికి దరఖాస్తు అందజేస్తున్న వృద్ధదంపతులు పిట్టా లక్ష్మి, అప్పారావులు
జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంతో సమానంగా కొలిచే నేల మనది. నాన్నంటే నడిచే దేవాలయం లాంటి వ్యక్తి. అమ్మప్రేమకు సాటిలేదు. ఇలాంటి కర్మభూమిలో పుట్టి, జీవిత చరమాంకంలో జబ్బు బారిన పడిన తండ్రిని కంటికి రెప్పలా కాచుకోవాల్సిందిపోయి.. ఆయన సంపాదించిన కోట్లాది రూపాయలున్నా చికిత్స చేయించకుండా అడ్డుపడుతున్నాడో కొడుకు. గారాబంగా పెంచి, ఓ ఇంటి వాడిని చేసిన తండ్రి సంపాదించిన ఆస్తిని లాగేసుకొని వీధిన పడేశాడు. ఓవైపు మూత్రపిండాల వ్యాధి పీడిస్తోంది.. మరోవైపు ఇంకెంతకాలం బతుకుతారంటూ హేళన చేస్తూ దుర్మార్గంగా మాట్లాడే కుమారుడు.. వెరసి తమకు ఆత్మార్పణే శరణ్యమని, చనిపోయేందుకు అనుమతించాలంటూ శనివారం జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి అర్జీ ఇచ్చారు ఆ వృద్ధదంపతులు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా సర్పవరానికి చెందిన పిట్టా అప్పారావు, లక్ష్మి దంపతుల దయనీయస్థితి ఇది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ముగ్గురికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకు రవి విడిగా ఉంటున్నాడు. అప్పారావుకు కిడ్నీ పాడవడంతో రెండ్రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రిలో రూ.వేలు ఖర్చు అవుతున్నాయి. కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ దుస్థితిలో తల్లిదండ్రులను రవి పట్టించుకోవడంలేదు.
అప్పారావు కష్టపడి కూడబెట్టిన ఆస్తి రూ.2 కోట్లు ఉంటుంది. చికిత్స నిమిత్తం అందులో కొంత భూమిని అమ్ముదామంటే కొడుకు ఒప్పుకోవడం లేదు సరికదా.. ‘62 ఏళ్లు వచ్చాయి. ఇంకా ఎంతకాలం బతుకుతారేంటి?’ అంటున్నాడు. తన భర్త సంపాదించిన ఆస్తికి సంబంధించిన దస్తావేజులను రెండేళ్ల క్రితం బ్యాంకులోను కోసం అని చెప్పి కొడుకు తీసుకెళ్లిపోయాడని, వాటిని ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని, విషయాన్ని పెద్దల వద్ద పెట్టినా ప్రయోజనం లేకపోయిందని లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది.
భర్తకు వచ్చిన వ్యాధిని బాగుచేయించుకోలేక, కొడుకు పెడుతున్న ఇబ్బందులను భరించలేక తీవ్ర మనోవ్యధ చెందుతున్నామని, తామిద్దరం చనిపోయేందుకు అనుమతి ఇప్పించాలంటూ వృద్ధ దంపతులు ఎస్పీని అభ్యర్థించారు. వారిని సముదాయించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరపాలని కాకినాడ డీఎస్పీ రవివర్మను ఆదేశించారు. వృద్ధుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసిందని, అధైర్య పడొద్దని చెప్పి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment