mandavalli
-
ప్రజారోగ్యంతో చెలగాటం.. చేపలకు మేతగా కుళ్లిన కోళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, పాడైపోయిన అన్నం ఇవి కొల్లేరు ప్రాంత ఫంగస్ చేపల సాగు కోసం చెరువుల్లో వేస్తున్న ఆహారం. ఈ చేపలను మనం తింటే ఏమవుతుంది. వ్యర్థ పదార్థాలను సైతం వృథా కానివ్వకుండా చేపలకు మేతగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో ఇటీవల పట్టుబడుతున్న వ్యర్థ పదార్థాల వాహనాల కేసులు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఈ ఏడాది నవంబరు 14న కలెక్టరు వి.ప్రసన్న వెంకటేష్ వ్యర్థాల నివారణకు మండల స్థాయిలో టాస్క్ఫోర్సు కమిటీల పర్యవేక్షణకు జీవో విడుదల చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,50,045 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు విస్తరించింది. వ్యాధులకు తట్టుకుని, ఎలాంటి మేతనైనా జీర్ణం చేసుకునే గుణాలు కలిగిన ఫంగస్ చేపల సాగు దాదాపు 12,000 ఎకరాల్లో జరుగుతోంది. సాధారణంగా చేపల పెంపకానికి డీవోబి, వేరుశెనగ చెక్క, పిల్లెట్లు మేతగా ఉపయోగిస్తారు. పిల్లెట్లతో ఫంగస్ చేపలు త్వరగా బరువు పెరగవు. పైగా ఖర్చు ఎక్కువ. అందుకే వాటి స్థానంలో కోళ్ల వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు చెరువులో వేస్తున్నారు. టాస్క్ఫోర్సు కమిటీలు రాష్ట్ర చేపల రైతుల సంఘం ఫిర్యాదుతో 2016లో అప్పటి మత్స్యశాఖ కమిషనరు చేపల చెరువుల్లో కోడి వ్యర్థాల మేతను నిషేధిస్తూ జీవో నెంబరు 56 ద్వారా కఠిన నిబంధనలు విధించారు. అప్పట్లో నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేసేవారు. ఆ సాగును కేంద్రం నిషేధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థాలను ఫంగస్ సాగులో వేస్తున్నారు. ఫంగస్ సాగు చేసే అందరి రైతులు వ్యర్థాలను వేయడం లేదు. ఈ ఏడాది నవంబరులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిషేధిత జీవోను పటిష్టంగా అమలు చేయాలని ఆయా శాఖాలకు ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దారు, వీఆర్ఓ, వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో)లతో టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడం, వాహన డ్రైవర్ల లైసెన్సు రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువుల ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్లు రద్దు వంటి చర్యలను టాస్క్ఫోర్సు చేస్తోంది. అక్రమ రవాణా ఇలా.. వ్యర్థాల అక్రమ రవాణాకు వేస్ట్ఫుడ్ మాఫియా బరితెగిస్తుంది. తెలంగాణ, విజయవాడ, గుడివాడ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల నుంచి కిలో రూ.ఐదు చొప్పున వ్యర్థాలను కొనుగోలు చేసి వాటిని పెంపకందారులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా దుకాణాల వద్ద డ్రమ్ములను ఏర్పాటు చేసి ఒక్కొక్కటి సేకరించి వ్యాన్లలో చెరువుల వద్దకు తరలిస్తున్నారు. హోటల్స్ నుంచి మిగిలిన అన్నం, కూరలను సేకరిస్తున్నారు. ఈ దందా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జిల్లాలో పెదపాడు, ఉంగుటూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో కోడి వ్యర్థాలను ఫంగస్ సాగులో ఉపయోగిస్తున్నారు. మండవల్లి మండలం నుచ్చుమిల్లి, కైకలూరు మండలం కొట్టాడ గ్రామాల్లో కోడి వ్యర్థాల వినియోగంపై కేసులు నమోదయ్యాయి. కఠిన చర్యలు తప్పవు కోడి వ్యర్థ్యాలను చెరువుల్లో ఉపయోగించడం వల్ల నీరు, నేల కలుషితమవుతాయి. ఇలాంటి చేపల సాగు మొత్తం ఆక్వాకల్చర్ పేరును పాడుచేస్తోంది. కొట్టాడ గ్రామంలో 12 క్వింటాల కోడి వ్యర్థాల వ్యాన్‌ను పట్టుకున్నాం. చెరువు యజమాని, వాహనదారుడిపై కేసులు నమోదు చేశాం. – ఎన్.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు ప్రజారోగ్యానికి ముప్పు కుళ్లిన వ్యర్థాలతో సాగు చేసిన చేపలను మనుషులు తింటే ఆరోగ్యం పాడవుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం మెదడుపై పడుతోంది. నరాల వ్యాధులు వస్తాయి. ఉదర కోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. చేపలకు మేతగా పెట్టిన వ్యర్థాల్లో కలుషిత రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి ఎంతో ప్రమాదకరం. – బి.శంకర్, కొల్లేటికోట పీహెచ్సీ డాక్టరు, కైకలూరు మండలం -
ఓటుకు పోటెత్తిన జనం
సాక్షి, ముదినేపల్లి : మండలంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటేసేందుకు జనం పోటెత్తారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓటర్లు గురువారం ఉదయానికే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటేసేందుకు చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రాల వద్ద బారులు తీరారు. సరైన శిక్షణలేని పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. బొమ్మినంపాడు శివారు గొల్లగూడెం 98వ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7గంటలకు ప్రారంభించాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఈవీఎం సక్రమంగా పనిచేయనందున గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే కేంద్రం వద్ద ఓటర్లు భారీసంఖ్యలో బారులు తీరారు. వైవాక శివారు పెదగరువు 108వ బూత్‌లో ఇదే పరిస్థితి ఏర్పడింది. స్వల్ప సంఘటనల మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో సిబ్బంది, నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కలిదిండిలో 80 శాతం... కలిదిండి మండలంలో గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం పోలింగ్ ప్రారంభంలో పలుగ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. దీనికి తోడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు తీవ్ర నిరాశ పరిచింది. రెండు భవనాలు ఉన్న గ్రామంలో ఒకే భవనంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, కొన్ని గ్రామాల్లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతకు కొందరు ఉదయం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. పనులు ముగించుకుని రెండవ పూట భారీగా హాజరయ్యారు. మండలంలో మూలలంక, పౌలుపేట, తాడినాడ, చిన తాడినాడ గ్రామాల్లో పోలింగ్ ఆలస్యంగా జరిగింది. భాస్కరరావుపేట, తాడినాడ, సానారుద్రవరం, కోట కలిదిండి గ్రామాల్లో ఏడుగంటల తరువాత కూడా పోలింగ్ నిర్వహించారు. మొత్తానికి 80 శాతం పోలింగ్ నమోదైనట్టు తహసీల్దార్ కనకరాజు తెలిపారు. పోలీసులు తగిన భద్రత కల్పించడంతో మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండవల్లిలో 84శాతం... మండవల్లి మండలంలో 37,791 ఓటర్లుకు గాను, 84 శాతం పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ పీవీ రమణకుమారి తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ పలు బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండవల్లి మండలంలో 29 గ్రామాలు ఉండగా సుమారు 11 గంటల వరకు పోలింగ్ సక్రమంగా జరగలేదు. మండల పరిధిలో 49 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో కొందరు ఓటర్లు ఎక్కువసేపు లైన్లో ఉండలేక ఇంటికి వెళ్లి మళ్లీ వద్దామని అనుకుని వెళ్లి తిరిగి 4గంటలు దాటిన తర్వాత ఓటు వేయడానికి వస్తే ఓటు వేయడానికి బాగా జాప్యం జరిగి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 7 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉంది. కొవ్వాడలంక గ్రామంలో స్వల్ప ఘర్షణ చేసుకుంది. తక్కెళ్లపాడు గ్రామంలో 90 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది. కైకలూరులో... పోలింగు ఈవీఎంలు ఓటర్లును ఇబ్బందులు పెట్టాయి. సాంకేతికలోపం, అవగాహన రాహిత్యం వెరసి ఓటర్లు గంటల తరబడి మలమలమాడారు. కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో మొత్తం 234 పోలింగు బూత్‌లలో గురువారం పోలింగు జరిగింది. నియోజకవర్గాన్ని మొత్తం 12 సెక్టర్లు, 24 రూట్లుగా విభజించారు. ఈ ఏడాది ఎవరికి ఓటు వేశామనేది తిలకించే వీవీప్యాడ్లు తికమకపెట్టాయి. స్వల్ప సంఘటనల నడుమ పోలింగు ప్రశాతంగా ముగిసింది. ఓటు హక్కును ఉపయోగించుకున్న అభ్యర్థులు.. అసెంబ్లీకి పోటి చేసిన పలు పార్టీల అభ్యర్థులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు కైకలూరులో, టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ కొట్టాడ గ్రామంలో, బీజేపీ అభ్యర్థి కీర్తి వెంకట రామప్రసాద్, స్వతంత్య్ర అభ్యర్థి భూపతిరాజు రమేష్ కుమార్ రాజులు కైకలూరులో, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామమైన వరహాపట్నం గ్రామంలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్, టీడీపీ అభ్యర్థులు ఆయా పోలింగు బూత్‌లలో జరిగే పోలింగు సరళిని పరిశీలించారు. -
నిమజ్జనంలో విషాదం
మండవల్లి: మండవల్లి స్టేషన్‌రోడ్‌లో శనివారం వినాయక చవితి నిమజ్జనోత్సవంలో ప్రమాదంలో ఒకరు మరణించారు. ఊరేగింపు స్థానిక సెంటర్ వరకు రాగానే రైల్వేట్రాక్‌కు ఇసుక తోలుతున్న టిప్పర్ ఊరేగింపులో ఉన్న ఇద్దరిని ఢీకొంది. కైకలూరు మండలం భుజబలపట్నంకు చెందిన గంగునేని శ్యామ్, ఎస్సీకాలనీవాసి ప్రత్తిపాడు రాజుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకు ముదినేపల్లి తీసుకువెళుతుండగా శ్యామ్ మరణించాడు. మృతుని బంధువుల ధర్నా టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతుని బంధువులు సెంటర్లో ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎస్ఐ ఎ.మణికుమార్, కైకలూరు సీఐ రవికుమార్ వచ్చి న్యాయం చేస్తామని సర్దిచెప్పారు. -
స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
మండవల్లి(కృష్ణా): రెండేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మండవల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు... మండలంలోని ఇంగిలిపాకలంక గ్రామానికి చెందిన రాఘవులు అనే వ్యక్తి తన కూతురును స్కూల్ బస్సు ఎక్కించేందుకు తన కొడుకు నవీన్(2)తో కలిసి వచ్చాడు. కుమార్తెను బస్సు ఎక్కించే క్రమంలో నవీన్‌ను తండ్రి గమనించలేదు. అక్కడే అడుకుంటున్న నవీన్ ప్రమాదవశాత్తూ స్కూల్ బస్సు చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.