కైకలూరు మండలం కొట్టాడ చెరువుకు తరలిస్తున్న వ్యర్థాలను పారబోస్తున్న దృశ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, పాడైపోయిన అన్నం ఇవి కొల్లేరు ప్రాంత ఫంగస్ చేపల సాగు కోసం చెరువుల్లో వేస్తున్న ఆహారం. ఈ చేపలను మనం తింటే ఏమవుతుంది. వ్యర్థ పదార్థాలను సైతం వృథా కానివ్వకుండా చేపలకు మేతగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో ఇటీవల పట్టుబడుతున్న వ్యర్థ పదార్థాల వాహనాల కేసులు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఈ ఏడాది నవంబరు 14న కలెక్టరు వి.ప్రసన్న వెంకటేష్ వ్యర్థాల నివారణకు మండల స్థాయిలో టాస్క్‌ఫోర్సు కమిటీల పర్యవేక్షణకు జీవో విడుదల చేశారు.
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,50,045 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు విస్తరించింది. వ్యాధులకు తట్టుకుని, ఎలాంటి మేతనైనా జీర్ణం చేసుకునే గుణాలు కలిగిన ఫంగస్ చేపల సాగు దాదాపు 12,000 ఎకరాల్లో జరుగుతోంది. సాధారణంగా చేపల పెంపకానికి డీవోబి, వేరుశెనగ చెక్క, పిల్లెట్‌లు మేతగా ఉపయోగిస్తారు. పిల్లెట్‌లతో ఫంగస్ చేపలు త్వరగా బరువు పెరగవు. పైగా ఖర్చు ఎక్కువ. అందుకే వాటి స్థానంలో కోళ్ల వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు చెరువులో వేస్తున్నారు.
టాస్క్‌ఫోర్సు కమిటీలు
రాష్ట్ర చేపల రైతుల సంఘం ఫిర్యాదుతో 2016లో అప్పటి మత్స్యశాఖ కమిషనరు చేపల చెరువుల్లో కోడి వ్యర్థాల మేతను నిషేధిస్తూ జీవో నెంబరు 56 ద్వారా కఠిన నిబంధనలు విధించారు. అప్పట్లో నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేసేవారు. ఆ సాగును కేంద్రం నిషేధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థాలను ఫంగస్ సాగులో వేస్తున్నారు. ఫంగస్ సాగు చేసే అందరి రైతులు వ్యర్థాలను వేయడం లేదు. ఈ ఏడాది నవంబరులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిషేధిత జీవోను పటిష్టంగా అమలు చేయాలని ఆయా శాఖాలకు ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దారు, వీఆర్‌ఓ, వెహికల్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ, మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో)లతో టాస్క్‌ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడం, వాహన డ్రైవర్ల లైసెన్సు రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువుల ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్లు రద్దు వంటి చర్యలను టాస్క్‌ఫోర్సు చేస్తోంది.
అక్రమ రవాణా ఇలా..
వ్యర్థాల అక్రమ రవాణాకు వేస్ట్‌ఫుడ్ మాఫియా బరితెగిస్తుంది. తెలంగాణ, విజయవాడ, గుడివాడ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల నుంచి కిలో రూ.ఐదు చొప్పున వ్యర్థాలను కొనుగోలు చేసి వాటిని పెంపకందారులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా దుకాణాల వద్ద డ్రమ్ములను ఏర్పాటు చేసి ఒక్కొక్కటి సేకరించి వ్యాన్‌లలో చెరువుల వద్దకు తరలిస్తున్నారు. హోటల్స్ నుంచి మిగిలిన అన్నం, కూరలను సేకరిస్తున్నారు. ఈ దందా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జిల్లాలో పెదపాడు, ఉంగుటూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో కోడి వ్యర్థాలను ఫంగస్ సాగులో ఉపయోగిస్తున్నారు. మండవల్లి మండలం నుచ్చుమిల్లి, కైకలూరు మండలం కొట్టాడ గ్రామాల్లో కోడి వ్యర్థాల వినియోగంపై కేసులు నమోదయ్యాయి.
కఠిన చర్యలు తప్పవు
కోడి వ్యర్థ్యాలను చెరువుల్లో ఉపయోగించడం వల్ల నీరు, నేల కలుషితమవుతాయి. ఇలాంటి చేపల సాగు మొత్తం ఆక్వాకల్చర్ పేరును పాడుచేస్తోంది. కొట్టాడ గ్రామంలో 12 క్వింటాల కోడి వ్యర్థాల వ్యాన్‌ను పట్టుకున్నాం. చెరువు యజమాని, వాహనదారుడిపై కేసులు నమోదు చేశాం.
– ఎన్.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు
ప్రజారోగ్యానికి ముప్పు
కుళ్లిన వ్యర్థాలతో సాగు చేసిన చేపలను మనుషులు తింటే ఆరోగ్యం పాడవుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం మెదడుపై పడుతోంది. నరాల వ్యాధులు వస్తాయి. ఉదర కోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. చేపలకు మేతగా పెట్టిన వ్యర్థాల్లో కలుషిత రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి ఎంతో ప్రమాదకరం.
– బి.శంకర్, కొల్లేటికోట పీహెచ్‌సీ డాక్టరు, కైకలూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment