Fish feed
-
ప్రజారోగ్యంతో చెలగాటం.. చేపలకు మేతగా కుళ్లిన కోళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కుళ్లిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, పాడైపోయిన అన్నం ఇవి కొల్లేరు ప్రాంత ఫంగస్ చేపల సాగు కోసం చెరువుల్లో వేస్తున్న ఆహారం. ఈ చేపలను మనం తింటే ఏమవుతుంది. వ్యర్థ పదార్థాలను సైతం వృథా కానివ్వకుండా చేపలకు మేతగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో ఇటీవల పట్టుబడుతున్న వ్యర్థ పదార్థాల వాహనాల కేసులు ఇందుకు నిదర్శనంగా మారాయి. ఈ ఏడాది నవంబరు 14న కలెక్టరు వి.ప్రసన్న వెంకటేష్ వ్యర్థాల నివారణకు మండల స్థాయిలో టాస్క్ఫోర్సు కమిటీల పర్యవేక్షణకు జీవో విడుదల చేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,50,045 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు విస్తరించింది. వ్యాధులకు తట్టుకుని, ఎలాంటి మేతనైనా జీర్ణం చేసుకునే గుణాలు కలిగిన ఫంగస్ చేపల సాగు దాదాపు 12,000 ఎకరాల్లో జరుగుతోంది. సాధారణంగా చేపల పెంపకానికి డీవోబి, వేరుశెనగ చెక్క, పిల్లెట్లు మేతగా ఉపయోగిస్తారు. పిల్లెట్లతో ఫంగస్ చేపలు త్వరగా బరువు పెరగవు. పైగా ఖర్చు ఎక్కువ. అందుకే వాటి స్థానంలో కోళ్ల వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు చెరువులో వేస్తున్నారు. టాస్క్ఫోర్సు కమిటీలు రాష్ట్ర చేపల రైతుల సంఘం ఫిర్యాదుతో 2016లో అప్పటి మత్స్యశాఖ కమిషనరు చేపల చెరువుల్లో కోడి వ్యర్థాల మేతను నిషేధిస్తూ జీవో నెంబరు 56 ద్వారా కఠిన నిబంధనలు విధించారు. అప్పట్లో నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేసేవారు. ఆ సాగును కేంద్రం నిషేధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థాలను ఫంగస్ సాగులో వేస్తున్నారు. ఫంగస్ సాగు చేసే అందరి రైతులు వ్యర్థాలను వేయడం లేదు. ఈ ఏడాది నవంబరులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిషేధిత జీవోను పటిష్టంగా అమలు చేయాలని ఆయా శాఖాలకు ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దారు, వీఆర్ఓ, వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మత్స్య అభివృద్ధి అధికారి(ఎఫ్‌డీవో)లతో టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడం, వాహన డ్రైవర్ల లైసెన్సు రద్దు, వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువుల ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్లు రద్దు వంటి చర్యలను టాస్క్ఫోర్సు చేస్తోంది. అక్రమ రవాణా ఇలా.. వ్యర్థాల అక్రమ రవాణాకు వేస్ట్ఫుడ్ మాఫియా బరితెగిస్తుంది. తెలంగాణ, విజయవాడ, గుడివాడ, ఏలూరు వంటి పలు ప్రాంతాల్లో చికెన్ షాపుల నుంచి కిలో రూ.ఐదు చొప్పున వ్యర్థాలను కొనుగోలు చేసి వాటిని పెంపకందారులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా దుకాణాల వద్ద డ్రమ్ములను ఏర్పాటు చేసి ఒక్కొక్కటి సేకరించి వ్యాన్లలో చెరువుల వద్దకు తరలిస్తున్నారు. హోటల్స్ నుంచి మిగిలిన అన్నం, కూరలను సేకరిస్తున్నారు. ఈ దందా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జిల్లాలో పెదపాడు, ఉంగుటూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో కోడి వ్యర్థాలను ఫంగస్ సాగులో ఉపయోగిస్తున్నారు. మండవల్లి మండలం నుచ్చుమిల్లి, కైకలూరు మండలం కొట్టాడ గ్రామాల్లో కోడి వ్యర్థాల వినియోగంపై కేసులు నమోదయ్యాయి. కఠిన చర్యలు తప్పవు కోడి వ్యర్థ్యాలను చెరువుల్లో ఉపయోగించడం వల్ల నీరు, నేల కలుషితమవుతాయి. ఇలాంటి చేపల సాగు మొత్తం ఆక్వాకల్చర్ పేరును పాడుచేస్తోంది. కొట్టాడ గ్రామంలో 12 క్వింటాల కోడి వ్యర్థాల వ్యాన్‌ను పట్టుకున్నాం. చెరువు యజమాని, వాహనదారుడిపై కేసులు నమోదు చేశాం. – ఎన్.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు ప్రజారోగ్యానికి ముప్పు కుళ్లిన వ్యర్థాలతో సాగు చేసిన చేపలను మనుషులు తింటే ఆరోగ్యం పాడవుతోంది. ముఖ్యంగా దీని ప్రభావం మెదడుపై పడుతోంది. నరాల వ్యాధులు వస్తాయి. ఉదర కోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. చేపలకు మేతగా పెట్టిన వ్యర్థాల్లో కలుషిత రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి ఎంతో ప్రమాదకరం. – బి.శంకర్, కొల్లేటికోట పీహెచ్సీ డాక్టరు, కైకలూరు మండలం -
ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా శ్రీవెంకటేశ్వర వెటర్నరీ సైన్స్ విశ్వవిద్యాలయం డీన్. 13 మంది సభ్యులతో కమిటీని నియమించింది. రాష్ట్రస్థాయి ఆక్వా కల్చర్ సీడ్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఎంపెడా, ఆక్వారైతులు సహా ఇతర విభాగాల అధికారులతో కమిటీ నియమించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా ఆక్వాకల్చర్ సీడ్ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: చేపకు ఇక నాణ్యమైన ఫీడ్) -
చేపకు ఇక నాణ్యమైన ఫీడ్
సాక్షి, అమరావతి: చేపలు, రొయ్యల మేతలో ఇప్పటివరకు ఉన్న అనైతిక విధానాలకు ఫిష్ ఫీడ్ యాక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. తద్వారా ఆక్వా రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయనుంది. ఈ మేరకు తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఫిష్ ఫీడ్ యాక్ట్-2020 బిల్లును ఆమోదించింది. త్వరలోనే ఈ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. చేపల మేత తయారీలో కొన్ని ముడి ప్రొటీన్ కలిగిన జీర్ణం కాని పదార్థాలు, యూసిడ్, కరగని బూడిద, యూరియా మొదలైన వాటిని ఉత్పత్తిదారులు కలపడం వల్ల ఆక్వా రైతులు నష్టపోతున్నారు. రొయ్యలు, చేపల పెంపకంలో 60 శాతం మేత కోసమే రైతులు ఖర్చు చేస్తున్నారు. నాణ్యత లేని మేత వల్ల ఆశించిన స్థాయిలో చేపలు, రొయ్యల పెరుగుదల ఉండటం లేదు. మరోవైపు వాటికి వ్యాధులు కూడా సంక్రమిస్తుండటంతో రైతులకు నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన మేతను రైతులకు అందిస్తే చేపలు, రొయ్యల దిగుబడి అధికంగా ఉండటంతోపాటు మేత వ్యాపారం కూడా బాగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాలీనా మేత వ్యాపారం రూ.17 వేల కోట్ల వరకు ఉంటోంది. ఇంత టర్నోవర్ కలిగిన మేత తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తే అటు రైతులకు.. ఇటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దేశంలోనే తొలిసారిగా.. ఇప్పటివరకు రాష్ట్రంతోపాటు దేశంలోనూ చేపల మేతలో నాణ్యతను నిర్ధారించే ప్రభుత్వ విభాగం అందుబాటులో లేదు. చేపల మేత తయారీ పరిశ్రమల్లో అనైతిక, చట్టవిరుద్ధమైన పద్ధతులను నివారించడానికి, చేపల మేతలో నాణ్యత నిర్ధారణ చర్యలను అమలు చేయడానికి.. రాష్ట్రంలో ఫిష్ ఫీడ్ యాక్ట్-2020ను తేవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రాష్ట్రంలో మొదటిసారిగా ఆక్వా రైతుల ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని తెస్తోంది. ఫిష్ ఫీడ్ యాక్ట్‌లో అంశాలు.. ఫిష్ ఫీడ్ యాక్ట్‌లో 28 విభాగాలు ఉన్నాయి. ♦మత్స్య శాఖ కమిషనర్, సంబంధిత అధికారులు చేపల మేత నాణ్యతను పరిశీలించడంతోపాటు తయారీలో అనైతిక విధానాలను నియంత్రించొచ్చు. ♦చేపల మేత వ్యాపారాలకు లైసెన్సులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్, జిల్లా మత్స్యశాఖ అధికారి లేదా కమిషనర్ ప్రతిపాదించిన ఏ అధికారి అయినా లైసెన్సింగ్ అథారిటీగా వ్యవహరిస్తారు. ♦ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారి లేదా కంట్రోలింగ్ అధికారి నియమించిన అధికారులు చేపల మేత నాణ్యతను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. ♦రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, చేపల మేత వ్యాపార కార్యకలాపాలు, నియంత్రణ తదితర అన్ని విషయాలపై కంట్రోలింగ్ అథారిటీకి సలహాలు ఇవ్వడానికి, చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఉంటుంది. ♦మేతలో నాణ్యత ప్రమాణాల పరిశీలనకు రిఫరల్ ఫీడ్ అనాలిసిస్ లేబొరేటరీ, జిల్లా స్థాయిలో ఫిష్ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తారు. ♦రాష్ట్రంలో, ఇతర దేశాల్లో తయారు చేసిన చేపల మేతలో నాణ్యత ప్రమాణాలు ఒకేలా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విదేశీ మేతలో నాణ్యత లేకుంటే దిగుమతులు ఆపేస్తుంది. ♦ఫిష్‌ఫీడ్ ఇన్స్పెక్టర్, థర్డ్‌పార్టీ టెక్నికల్ ఏజెన్సీలు నిరంతరం చేపల మేతలో నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తారు. నాణ్యత లేకుంటే భారీ జరిమానాలు విధిస్తారు. ఫిష్ ఫీడ్ యాక్ట్ వల్ల ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలు.. ♦చేపలు, రొయ్యల మేత తయారీలో ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. అన్ని రకాల మేతల వాణిజ్య కార్యకలాపాలు ఫిష్ ఫీడ్ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ♦రైతులు వారి అవసరాలకనుగుణంగా మేతను ఎంచుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. ♦నిషిద్ధ యాంటీబయోటిక్స్ లేని చేపల మేత వాడటం ద్వారా మంచి బ్రాండ్ ఇమేజ్‌తో నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను అందిస్తుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది మేతపై ఇప్పటివరకు ఎటువంటి నియంత్రణ విభాగం లేకపోవడం వల్ల అనేక కంపెనీలు నాణ్యత లేని మేతను తయారు చేసి రైతుల్ని నిలువు దోపిడీ చేశాయి. ఫీడ్ యాక్టు అమలులోకి వస్తే రైతులకు సాగు వ్యయం తగ్గుతుంది. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు నాణ్యమైన చేపలు, రొయ్యలు ఎగుమతి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన రొయ్యలు, చేపలకు మంచి రేటు లభిస్తుంది. తద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాకుండా ఆక్వా రంగంపై ఆధారపడిన ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. - కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ రైతులకు రక్షణ కవచం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఫీడ్ యాక్ట్ రైతుకు రక్షణ కవచం లాంటిది. కంపెనీలు మేత తయారీలో ఏ ముడి పదార్థాలు వాడుతున్నాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీంతో నాణ్యమైన మేత అందుబాటులోకి వస్తుంది. ఎప్పటికప్పుడు మేతను పరిశీలించే అధికారం మత్స్యశాఖకు ఉండటం వల్ల అనైతిక విధానాలు పూర్తిగా తగ్గిపోతాయి. విదేశాలకు ఆక్వా ఎగుమతులు పెరుగుతాయి. - డాక్టర్ నగేశ్, ప్రెసిడెంట్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ - ఏపీ -
15 నుంచి ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: సముద్రంలో మత్స్య సంపద పెంపు, సమర్థ నిర్వహణ, సంరక్షణతో పాటు సముద్ర భద్రతా కారణాల రీత్యా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అంటే 61 రోజుల పాటు అన్ని రకాల చేపల వేటను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కేంద్రప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా సోమవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలంలో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా ఉంటుంది. ఈప్రక్రియకు ఎటువంటి ఆటంకం కలుగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిషేధాన్ని విధించడం ఆనవాయితీ. తూర్పు తీర ప్రాంతంలో ఏప్రిల్, జూన్ నెలల మధ్య, పశ్చిమ తీరంలో జూన్ ఒకటి నుంచి జూలై 31 వరకు కేంద్రప్రభుత్వం నిషేధాన్ని విధిస్తుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ సముద్ర తీర చేపల వేట (నియంత్రణ) చట్టం కింద నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధ కాలంలో రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో మరపడవులే కాకుండా చిన్నతరహా సంప్రదాయ పడవుల్ని సైతం అనుమతించరు. చేపల వేట నిషేధ కాలానికి జాలర్లకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తుంది.