రొయ్యల రైతులకు వైఎస్ జగన్ వరాలు
సాక్షి, గణపవరం: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో దారుణంగా చితికిపోయిన రొయ్యల రైతులు, చేపల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు. తాము అధికారంలోకి వస్తే రొయ్యల రైతులకు యూనిట్ కరెంటును రూపాయిన్నరకే అందజేస్తామని, అనుబంధ పరిశ్రమలకు యూనిట్ కరెంటు ఐదు రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. 169వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీడ్ కొనుగోళ్ల నుంచి రైతు తన పంటను అమ్ముకునే దాకా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను కూల్చేస్తామని, నిర్ణీత కాలంలోగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రైతుల బాధను చూసి..: ‘‘పాదయాత్ర ద్వారా ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టిన నాకు.. రైతులు, స్థానికులు తమ సమస్యలు చెప్పారు. చేపలు, రొయ్యలకు మంచి రేట్లుంటే మా బతుకులు బాగుంటాయని వారు తెలిపారు. పంట రేట్లు తగ్గిపోయి, దళారుల దోపిడీ పెరగడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం మాత్రం తమను పట్టించుకోవడంలేదని రైతులు బాధపడుతున్నారు. ఏలూరు కాలువ ఉన్నా.. రెండో పంటకు నీరు రావట్లేదని, ఎండాకాలంలో తాగునీరు కూడా లేదని, బోర్లు వేస్తే ఉప్పునీళ్లొస్తున్నాయని రైతులు వివరించారు. ఈ పరిస్థితుల్లో రొయ్యల పంటను బతికించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నా.. చెరువులు మార్చుతుంటే వైరస్ సోకి చనిపోతున్నాయన్నా.. అని చెబుతూ బాధపడ్డారు. పుట్టలకొద్దీ హ్యాచరీస్ పుట్టుకొస్తున్నా.. సీడ్ నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లు మాత్రం లేవని, హ్యాచరీస్-ప్రైవేట్ ల్యాబ్‌లు కలిసి రైతుల్ని మోసం చేస్తున్నారని, దాణా కంపెనీలు కూడా ఇష్టారీతిగా ధరలు పెంచుతున్నాయని, వీటన్నింటికి తోడు కరెంటు కష్టాలూ ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు.
కరెంటు చార్జీలు తగ్గిస్తాం: దివంగతనేత వైఎస్సార్ హయాంలో చేపలు, రొయ్యల రైతులకు కరెంటు యూనిట్ 90 పైసలకే ఇచ్చారు. ఇప్పుడేమో 3.80 రూపాయలు గుంజుతున్నారు. అదిగాక, అడిషనల్ చార్జీల పేరుతో లక్షలకు లక్షలు వసూలుచేస్తున్నారు. దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మాటిస్తున్నా. రైతులకు విద్యుత్ యూనిట్ రూపాయిన్నరకే ఇస్తాం. ఈ పంటలకు అనుబంధంగా నడిచే ఐస్ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రస్తుతం 7 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాన్ని 5 రూపాయలకు తగ్గిస్తాం. రొయ్యలకూ మద్దతు ధర ఉండాలన్నది నా ఆకాంక్ష. అది జరగాలంటే ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్య పెంచాలి. మనం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సముద్రతీరమంతటా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మిస్తాం. నాలుగో ఏట రొయ్యలకు మద్దతు ధర ప్రకటిస్తాం. సీడ్ తయారీ, దాణా తయారీ.. అన్ని చోట్లా దళారీ వ్యవస్థను రూపుమాపుతాం. తాగునీరు, పేదలకు ఇళ్లు ఇక్కడి ప్రధాన సమస్యలని స్థానికులు చెప్పారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని గ్రామాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నిర్మించుకుందాం. వాటిని గోదావరి, కృష్ణ జలాలతో నింపుకొందాం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేనే తీసుకుంటా..
కొల్లేరుపై పకడ్బందీ వ్యూహం: కొల్లేరు సరస్సుకు సంబంధించిన సమస్యలను కూడా ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఈ సమస్యల గురించి కైకలూరు సభలో నేను సుదీర్ఘంగా ప్రసంగించాను. కొల్లేరు సమస్య సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సిఉంటుంది. అందుకే దీనిపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి, నా పక్కనే కూర్చొబెట్టుకుంటాను. అధికారంలోకి వచ్చినవెంటనే కొల్లేరు రీసర్వేకు ఆదేశిస్తానని హామీ ఇస్తున్నా. కాంటూరును తగ్గించి రైతులకు మేలు చేకూర్చుతానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదు. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన ఆయనకు కొల్లేరుగానీ, ప్రత్యేక హోదాగానీ గుర్తుకురాదు. తీరా ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసరికి, నెపం వేరేవాళ్లపై నెట్టడానికి బీజేపీతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు కొత్త పెళ్లికూతురు కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు.
అబ్బా! బాబుకు బాధకలిగిందట!!: మట్టి నుంచి గనుల దాకా, గుడి భూముల నుంచి గుడిలో దేవుడి ఆహరణాల దాకా అన్నింటినీ స్వాహా చేస్తోన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు, మోసాలతోనే పరిపాలన సాగిస్తున్నాడు. నిన్న విశాఖపట్నంలో ఆయన అబద్దాలు క్లైమాక్స్‌కు చేరాయి. అవి వింటే.. ఈయన ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నాడా అనిపిస్తుంది. బాబు చేసేదేమో ధర్మపోరాటమట, తిరుపతిలో అర్చకులు చేసేదేమో అధర్మపోరాటమట! పైన చంద్రబాబు.. కింద జన్మభూమి కమిటీ మాఫియాలు జనాన్ని పీడిస్తున్నారు. ఈ మనిషా.. ధర్మపోరాటం చేసింది? కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తుంటే బాధ అనిపించిందట! మరి 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని, అందులో నలుగురి మంత్రులుగా చేసి, డిస్క్వాలిఫై కాకుండా స్పీకర్ పదవిని దిగజార్చినప్పుడు? కనీసం వడ్డీలకు కూడా సరిపోని డబ్బుచెల్లించి.. అదేదో మొత్తం రైతుల రుణాల మాఫీ అయినట్లు చెప్పుకున్నాడు. ఉదయం ట్విటర్లోనేమో రూ.13 వేల కోట్లు అని, సాయంత్రం సభలో రూ.25వేల కోట్లని రెండు మాటలు చెబుతాడు. ఈ అబద్ధాలకోరు.. వైఎస్సార్ పేరును కూడా తీసుకొస్తాడు. వైఎస్సార్ 50 శాతం హామీలే పూర్తిచేశాడట, ఈయనేమో 100 శాతం చేశాడట! నాలుగేళ్లలో 2 లక్షల ఇళ్లు కట్టలేనోడు.. సంవత్సరంలో 19 లక్షల ఇళ్లు కట్టిస్తాడట! దివంగత నేత వైఎస్సార్ 13 జిల్లాల ఆంధ్రలో 26 లక్షల ఇళ్లు, 23 జిల్లాల ఆంధ్రలో 68 లక్షల ఇళ్లు కట్టించిన సంగతి ప్రజలకు తెలియదా..
చంద్రం విచిత్రాలు వినతరమా?: నోరు తెరిస్తే అబద్ధాలు, సొంత డబ్బా తప్ప పనికొచ్చే మాట ఒక్కటీ మాట్లాడడీ చంద్రబాబు. స్వాతంత్ర్యపోరాటం జరిగినప్పుడు నిక్కరు కూడా తొడగని చంద్రబాబు.. నేనే స్వాతంత్ర్యం తెచ్చానంటాడు. ఇంకా నయం.. అప్పుడుగిన ఆయన ఏ నాయకుడో అయి ఉంటే.. స్వాతంత్ర్యం మనకెందుకు.. బ్రిటిష్ వారితో లాలూచీ పడదాం అనేవాడు! ఈ మహానుభావుడు దోమలమీద దండయాత్ర చేశాడట. ఒక్క శాశ్వత భవనమూ కట్టలేదుగానీ అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాడట. అంతేనా, కంప్యూటర్లు, సెల్ఫోన్లు కనిపెట్టానంటాడు. ప్రైవేట్ జెట్లలో విదేశాలకు పోయి.. ఏ దేశానికి పోతే ఆ దేశం నుంచి ఏదో వచ్చేస్తుందంటాడు. పాపం సత్యా నాదెండ్ల కష్టపడి చదివి పైకొచ్చి, మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో అయితే.. నా వల్లే అని క్రెడిట్ లాగేసుకుంటాడు చంద్రబాబు. సింధు చమటోడ్చి షెటిల్ ఆడితే.. ఆమెకు ఆట నేర్పించిందే నేనని చెప్పుకుంటాడు. ఈ మధ్య ఇంకోటి.. ఎండలు తగ్గించాలట! 10 డిగ్రీల ఎండను తగ్గించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాడు.. సూర్యుడితో ఫోన్లో మాట్లాడి తగ్గిస్తాడేమో!!
పొరపాటున కూడా క్షమించొద్దు: రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి.. అంటూ హామీలిచ్చి, ఏ ఒక్కదానినీ అమలు చేయకుండా ప్రజల్ని మోసపుచ్చాడు చంద్రబాబు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా.. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడుగా కావాలా? ఈ మోసకారి బాబును పొరపాటున కూడా క్షమిస్తే, ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటా కొత్త ఎత్తులతో వస్తాడు. ఒక నాయకుడు మైక్ పట్టుకుని మాటిస్తే, దాన్ని నెరవేర్చలేని రోజు రాజీనామా చేసే పరిస్థితి రావాలి. అది జగన్ ఒక్కడితోనే సాధ్యంకాదు. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే మన ప్రభుత్వంలో ప్రజలకు చేయబోయే మేళ్లను నవరత్నాల ద్వారా వివరించాం. ఇవాళ పేద పిల్లల చదువుల కోసం మనం ఏమేం చేయబోతున్నామో మరోసారి వివరిస్తాను..
పిల్లల చదువులకు ఎంత ఖర్చైనా నాదే బాధ్యత: ప్రతి పేద ఇంట్లో ఒక డాక్టర్‌గానీ, ఇంజనీర్గానీ ఉండాలన్నది మహానేత వైఎస్సార్ కల. అలాగైతేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడగలవు. పేదల కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు వేస్తాను. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ. 15,000 అందిస్తాం. పిల్లలు ఎంత పెద్ద చదువు చదివితే అంతవరకు అయ్యే ఖర్చును, ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే భరిస్తుంది. వేరే ప్రాంతాల్లో చదువుకునే పిల్లల హాస్టల్ ఖర్చు కింద ఏటా రూ. 20,000 ఇస్తాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు.