సాక్షి, మండవల్లి: ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇళ్లలోకి దోమలు రాకుండా వెలిగించే అగర్‌బత్తి కారణంగా మంటలు చెలరేగడంతో 20 గుడిసెలు కాలిపోయి.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను వెంటనే కైకలూరు ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని మండవల్లి మండలం భైవరపట్నం ప్రత్తిపాడు స్టేజీ వద్ద 20 ఏళ్లుగా నెల్లూరుకు చెందిన కొంత మంది పిట్టలు కొట్టే వాళ్లు నివసిస్తున్నారు. స్థానికంగా ఉండే ఆక్వా చెరువులపై నాటు తుపాకీలతో పిట్టలను బెదిరిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. కాగా, శుక్రవారం రాత్రి 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ క్రమంలో అక్కడ గుడిసెలో నిద్రిస్తున్న షారుక్‌ఖాన్, వంశీ, అను, కార్తీక్, విక్కీలతోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒక బాలుడు, మరో మూడేళ్ల చిన్నారి ఉన్నారు.
అయితే, పిట్టలను బెదిరించడానికి ఉపయోగించే మందుగుండు సామగ్రికి నిప్పు అంటుకోవడంతోనే పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దఎత్తున మంటలు, పొగతో పక్కనే ఉన్న 20 గుడిసెలకు క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్ధం వచ్చింది. ఎడిసిపడిన మంటల కారణంగా గుడిసెల్లోని వస్తువులు, పక్కనే ఉన్న వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
పత్తాలేని అగ్నిమాపక సిబ్బంది..
పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందుతున్నా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకోలేదు. ఆకివీడు నుంచి గంటన్నర తర్వాత వచ్చిన వాహనం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులను తరలించాల్సిన దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment