
అరుదైన వన్యప్రాణుల సంచారం గుర్తింపు
బెదిరితే బంతిలా మారిపోయే గుణం
వణ్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ముప్పు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని అడవుల్లో అరుదైన అడవి అలుగులు సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలియన్ అని కూడా పిలుస్తారు. చైనీస్ పాంగోలియన్, ఆసియా పాంగోలియన్, సుండా పాంగోలియన్, పాతమాన్ పాంగోలియన్ (Pangolin) అని నాలుగు రకాలు అలుగులు ఉంటాయి. ఈ అలుగు సుమారు 20 ఏళ్లు బతుకుతాయి. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవికి పొడవైన నాలుక ఉంటుంది.
ఎక్కువ శాతం దట్టమైన అటవీ ప్రాంతాల్లో, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతో పాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. 1821లో తొలిసారిగా ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ఈ జీవులకు భయపడితే ముడుచుకుపోయి తమను తాము రక్షించుకుంటాయి. వీటి చర్మంపై ఉండే పెంకులు చాలా దృఢంగా ఉంటాయి. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 25 నుంచి 30 పైగా సంచరిస్తున్నట్లు వైల్డ్‌లైఫ్, ఫారెస్టు అధికారులు తెలిపారు.
రాత్రి వేళ సంచారం
అలుగులు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. పగటిపూట గోతుల్లో, తొర్రల్లో, చెట్ల పైన దాగి ఉంటాయి. రాత్రి సమయాల్లో ఆహారం కోసం అన్వేషిస్తాయి. తెల్లవారేసరికి తొర్రల్లోకి చేరుకుంటాయి. ఈ అలుగు రెండు సంవత్సరాలకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తుందది. కోతి (Monkey) మాదిరిగానే తాను జన్మనిచ్చిన పిల్లలను వీపుపై ఎక్కించుకుని ఆహార అన్వేషణ సమయంలో తిప్పుతుందని చెబుతున్నారు.
అలుగులు సంచరిస్తున్న సమయంలో ఎలాంటి అలికిడి విన్నా బెదిరిపోయి బంతిలాగా ముడుచుకుపోతాయి. కదలకుండా గట్టిగా ముడుచుకుని ఉండిపోతాయి. అలుగులకు ఎదురు దాడి చేసే గుణం కూడా ఉంటుందని వైల్డ్‌లైఫ్ (Wild Life) అధికారులు చెబుతున్నారు. ఈ అలుగుల వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదునుగా ఉంటాయి. ఇవి సింహం కూడా తినలేనంత గట్టిగా ఉంటాయి. ఈ అలుగు సంతతి పాపికొండల అభయారణ్యంలో ఎక్కువగా ఉన్నట్లు వైల్డ్‌లైఫ్ అధికారులు తెలిపారు.
అలుగులపై స్మగ్లర్ల కన్ను
ఏజెన్సీ ప్రాంతంలోని అభయారణ్యంలో సంచరిస్తున్న అలుగులపై స్మగ్లర్ల కన్ను పడింది. అరుదైన అలుగు జంతువు వీపుపై ఉండే పెంకులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పెంకుల విలువ రూ.లక్షల్లో ఉంటుందని అంటున్నారు. అలుగు పెంకులను చైనాలోని మందుల తయారీలో ఉపయోగిస్తారని సమాచారం. గతంలో అలుగును బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు రూ.20 లక్షలకు విక్రయిస్తామని ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
చదవండి: మూగ జీవాలకూ రక్షణ ఇద్దాం!
ఆ సమయంలో తమ ఉన్నతాధికారులు ఆ వీడియోను చూసి స్మగ్లర్లను పట్టుకునేందుకు ఆదేశాలు ఇవ్వడంతో అలుగు అమ్మకానికి పెట్టిన ఇద్దరు వ్యక్తులను వలపన్ని చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వైల్డ్‌లైఫ్ అధికారులు తెలిపారు. అరుదైన వన్య ప్రాణులను వేటాడి విక్రయించాలని చూస్తే ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, అలాగే రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారని అధికారులు పేర్కొన్నారు.