ఒకటి, రెండు వారాల్లో రాక
ఎన్‌క్లోజర్లు సిద్ధం చేస్తున్న అధికారులు
సందర్శకులకు మరింత ఆనందం
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి మరికొన్ని కొత్త వన్యప్రాణులు రానున్నాయి. వీటి కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఇక్కడకు తీసుకురావడానికి జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్‌ఏ) నుంచి అనుమతులు లభించాయి. కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా కొత్త జంతువులు, అరుదైన పక్షులను తీసుకువస్తున్నారు.
రెండు నెలల కిందట కోల్‌కతా రాష్ట్రం అలీపూర్ జూ పార్కు నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా జత జిరాఫీలు, ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, స్కార్లెట్ మకావ్స్ ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. మరికొన్ని వన్యప్రాణులను గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఒకటి, రెండు వారాల్లో ఇక్కడకు తీసుకురానున్నారు. వాటి కోసం జూలో ఒక్కో జాతి జంతువులు, పక్షులు వేర్వేరుగా ఎన్‌క్లోజర్లు కూడా సిద్ధం చేశారు. ఆయా వన్యప్రాణులు చేరితే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది.
కొత్తగా రానున్నవి ఇవే..
గ్రీన్ వింగ్డ్ మెకావ్ రెండు జతలు, స్కార్లెట్ మెకావ్స్ రెండు జతలు, మిలటరీ మెకావ్స్ రెండు జతలు, మీడియం సల్ఫర్ క్రెస్టెడ్ కాక్‌టూ రెండు జతలు, స్క్వైరల్ మంకీస్ రెండు జతలు, కామన్ మార్మోసెట్స్ రెండు జతలు, మీర్‌కాట్ ఒక జత, రెడ్ నెక్డ్ వాల్లబీ ఒక జత కొత్తగా ఇక్కడకు తీసుకురానున్నారు.
ప్రత్యేక ఎన్‌క్లోజర్లు సిద్ధం
విశాఖ జూకు కొత్త వన్యప్రాణులు రానున్నాయి. గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వాటిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్లు సిద్ధం చేశాం. –డి.మంగమ్మ, జూ క్యూరేటర్(ఎఫ్‌ఏసీ), ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment