Wildlife
-
ద్వారకా తీరంలో అన్వేషణ..!
రెండు దశాబ్దాల తరువాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) గుజరాత్‌లోని ద్వారకా తీరంలో నీటి అడుగున అన్వేషణను తిరిగి ప్రారంభించింది. ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో అయిదుగురు పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది.తొలిసారిగా ఈ అన్వేషణ బృందంలో మహిళా పురావస్తు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. ఏఎస్ఐ డైరెక్టర్(తవ్వకాలు, అన్వేషణలు) హెచ్‌కే నాయక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ అపరాజిత శర్మ, పూనమ్ వింద్, రాజ కుమారీ బార్బీనా పరిశోధన బృందంలో సభ్యులుగా ఉన్నారు. దశల వారీగా ఈ బృందం అన్వేషణలు కొనసాగిస్తుంది. మొదటి దశలో భాగంగా పరిశోధనల కోసం స్థలాలను గుర్తిస్తారు. తొలిదశలో కనుగొన్న అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ‘ఇదొక అపూర్వమైన అవకాశం’ అంటుంది పూనమ్ వింద్. నిజమే కదా! (చదవండి: ఆ టీచర్ సాహసం మాములుగా లేదుగా..! గిరిజన పిల్లల కోసం..) -
Sonakshi Sinha: పులిని నిద్రపుచ్చుతూ.. సింహం పక్కనే సేదతీరుతూ.. (ఫోటోలు)
-
డిసెంబర్ 30 వరకు.. వంతారా కార్నివాల్ అడ్వెంచర్
వన్యప్రాణులను రక్షించడానికి, వాటికి పునరావాసం కల్పించడానికి ఏర్పాటైన 'వంతారా' తాజాగా 'వాంతారియన్ రెస్క్యూ రేంజర్స్' పేరుతో ఓ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2024 డిసెంబర్ 30 వరకు జరగనుంది. ఈ ఈవెంట్ ప్రత్యేకించి జంతు ప్రేమికుల కోసం ఏర్పాటు చేసింది.వాంతారియన్ రెస్క్యూ రేంజర్స్ కార్యక్రమంలో చిక్కుకున్న పక్షులను విడిపించడం, రక్షించిన జంతువులకు ఆహారం ఇవ్వడం, ఆవాసాలను రక్షించడం నేర్చుకోవడం వంటి సవాళ్లను అనుకరించడంలో ఇంటరాక్టివ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వన్యప్రాణుల అక్రమ రవాణాపై క్లిష్టమైన పోరాటాన్ని నొక్కిచెబుతూ.. తప్పిపోయిన జంతువులలో ఒకదాన్ని రక్షించడంలో సాహసం ముగుస్తుంది.కార్యకలాపాలను పూర్తి చేసిన పిల్లలు.. రక్షించిన జంతు బొమ్మను అందుకుంటారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదేశంలో జంతువులు, పక్షుల బొమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటితో పాటు ఎక్కడ చూసినా శాంటా బొమ్మలను కూడా చూడవచ్చు.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
విమానాల్లో వన్యప్రాణులు
సాక్షి, విశాఖపట్నం: మూఢ నమ్మకాలతో కొందరు..! హోదా కోసం మరికొందరు..! కారణమేదైనా అరుదైన వన్యప్రాణులు సంపన్నుల ఇళ్లల్లో తారసపడుతున్నాయి. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి విమానాల్లో ఖండాతరాలు దాటి వస్తున్నాయి. ఇవి స్మగ్లర్లకు కాసులు కురిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై కస్టమ్స్ నిఘా పెరగడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త ఎయిర్‌పోర్టులను అన్వేíÙస్తున్నారు. థాయ్‌లాండ్, మలేíÙయా నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వన్యప్రాణుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు ఓడలలో వీటిని అక్రమంగా తరలించగా ఇప్పుడు వైమానిక మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు వైమానిక రంగాన్ని వినియోగిస్తున్న టాప్ 10 దేశాల్లో భారత్ ఉండటంపై ఐక్యరాజ్యసమితి (యూఎన్ఈపీ) ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైలో అధికంవివిధ దేశాల నుంచి భారత్‌కు అక్రమంగా వన్య ప్రాణులను తరలిస్తుండగా పట్టుబడిన కేసుల్లో మూడొంతులు చెన్నై ఎయిర్‌పోర్టుల్లో నమోదైనవే కావడం గమనార్హం. ఇక్కడ నిఘా పెరగడంతో తాజాగా బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు విశాఖ ఎయిర్‌పోర్టులను ప్రత్యామ్నాయాలుగా స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. చెన్నై, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులు అక్రమ రవాణాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆదాయం పెరుగుతుందనే మూఢ నమ్మకంతో..తాబేళ్లు, అరుదైన బల్లులను పెంచితే ఆదాయం పెరుగుతుందని కొందరి మూఢనమ్మకం. పాములను పెంచితే కష్టాలు తొలగిపోతాయని మరికొందరి విశ్వాసం. స్మగ్లర్లకు ఇది కాసులు కురిపిస్తోంది. ఇగ్వానాలు, మార్మోసెట్లు, కంగారూలు, విదేశీ తాబేళ్లు, విషపూరిత పాములు, యాలిగేటర్లు, అరుదైన పక్షులను కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వీటిని ఎలా పెంచాలనే విషయాలపై సోషల్ మీడియాలో సమాచారం సేకరిస్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్, కౌలాలంపూర్, ఆ్రస్టేలియా, ఆఫ్రికా నుంచి ఎక్కువగా వీటి అక్రమ రవాణా జరుగుతోంది.యూఎన్ ఈపీ ట్రాఫిక్ తాజా నివేదిక ప్రకారం 2011– 2020 మధ్య 70,000 రకాల అరుదైన జీవజాతులు 18 భారతీయ విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరిగాయి. వీటిలో సరీçసృపాలు 46 శాతం ఉండగా 18 శాతం క్షీరదాలున్నాయి. ఇండియన్ స్టార్ టార్టాయిస్, బ్లాక్ పాండ్ తాబేళ్లు, జలగలు, ఇగ్వానాలు వీటిలో ఉన్నాయి. దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 2023–24లో అక్రమ రవాణాకు సంబంధించి 18 కేసులను నమోదు చేయగా 230 వన్యప్రాణుల్ని స్వా«దీనం చేసుకున్నారు.పాములు నుంచి బల్లుల దాకా సజీవంగా.. గతంలో ఏనుగు దంతాలు, పాంగోలిన్ పొలుసులు, పులి చర్మాలు, జంతు చర్మాలు, గోళ్లు అక్రమంగా తరలించగా ఇప్పుడు ఏకంగా సజీవంగా ఉన్న వన్య ప్రాణులనే స్మగ్లింగ్ చేయడం విస్తుగొలుపుతోంది. 2019లో చెన్నై విమానాశ్రయంలో స్వా«దీనం చేసుకున్న ఆఫ్రికన్ హార్న్ పిట్ వైపర్లు, ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన తాచుపాములు, విశాఖ ఎయిర్‌పోర్టులో లభ్యమైన ప్రమాదకరమైన బల్లులు.. ఇలా సజీవంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధపడుతున్నారు. కట్టుదిట్టంగా తనిఖీలు విమానాశ్రయంలో నిరంతరం తనిఖీలు జరుగుతున్నాయి. బ్యాగేజ్ తనిఖీల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. డీఆర్ఐ, కస్టమ్స్ సహా అన్ని విభాగాల ఆధ్వర్యంలో ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వన్యప్రాణుల వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నాం. చెక్‌లిస్ట్‌లు, తనిఖీ కేంద్రాల వద్ద ప్రయాణికులకు అవగాహన కలి్పస్తున్నాం. – రాజారెడ్డి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
నల్లమలలో అతివేగం.. వన్యప్రాణులకు శాపం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు..వన్యప్రాణుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అ మ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి నుంచి హైదరాబాద్–శ్రీశైలం రహదారి వెళుతోంది. దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండే వన్యప్రాణులు రహదారి దాటుతుండగానే వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. నిషేధం ఉన్నా.. తగ్గని వేగం హైదరాబాద్–శ్రీశైలం హదారిపై మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు సుమారు 70 కి.మీ. నల్లమల అటవీ ప్రాంతం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి రాగానే నిబంధనల మేరకు వాహనాలు గంటకు కేవలం 30 కి.మీ. వేగంతోనే ప్రయాణించాలి. ఇక్కడి వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అడవిలోని రహదారి గుండా ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అయితే అడవిలో గరిష్ట వేగం 30 కి.మీ. కాగా, వాహనదారులు మితిమీరిన వేగంతో వెళుతున్నారు. అడవిలో ఏదైనా వన్యప్రాణి అడ్డుగా వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవడంతో వాహనాల కింద పడి అవి మరణిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు ఐదేళ్లలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో సుమారు 800కు పైగా వన్యప్రాణులు వాహనాల కిందపడి మరణించాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రిపోర్టు కాని వన్యప్రాణుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. సూచిక బోర్డులకే పరిమితం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నిత్యం వేలసంఖ్యలో వాహనాలు వెళుతున్నాయి. శని, ఆదివారాలతో పాటు ఇతర సెలవురోజుల్లో వాహనాల రద్దీ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. నల్లమలలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు అటవీమార్గంలో సూచిక బోర్డులతో పాటు 35 చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడక్కడా సూచిక బోర్డులు ఉన్నా వాహనాల వేగానికి బ్రేక్ పడటం లేదు. నిర్ణీత వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తుండటం నల్లమలలోని పులులు, చిరుతలు, జింకలు, అరుదైన మూషికజింకలు, మనుబోతులు, సరీసృపాలు తదితర అమూల్యమైన జంతుసంపదకు ముప్పుగా పరిణమిస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు వాహనదారులకు వి్రస్తృతంగా అవగాహన కలి్పంచడంతో పాటు, వేగానికి కళ్లెం వేసేందుకు స్పీడ్గన్లను ఏర్పాటుచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాహనాల వేగం తగ్గించేందుకు చర్యలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులు తరచుగా రహదారులు దాటే ప్రాంతాల్లో 35 చోట్ల సూచికబోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుచేశాం. వాహనాలు అటవీమార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు నెమ్మదిగా ప్రయాణించేలా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ -
విశాఖ జూకు గుజరాత్ వన్యప్రాణులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి మరికొన్ని కొత్త వన్యప్రాణులు రానున్నాయి. వీటి కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఇక్కడకు తీసుకురావడానికి జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏ) నుంచి అనుమతులు లభించాయి. కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా కొత్త జంతువులు, అరుదైన పక్షులను తీసుకువస్తున్నారు.రెండు నెలల కిందట కోల్‌కతా రాష్ట్రం అలీపూర్ జూ పార్కు నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా జత జిరాఫీలు, ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, స్కార్లెట్ మకావ్స్ ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. మరికొన్ని వన్యప్రాణులను గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఒకటి, రెండు వారాల్లో ఇక్కడకు తీసుకురానున్నారు. వాటి కోసం జూలో ఒక్కో జాతి జంతువులు, పక్షులు వేర్వేరుగా ఎన్క్లోజర్లు కూడా సిద్ధం చేశారు. ఆయా వన్యప్రాణులు చేరితే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది. కొత్తగా రానున్నవి ఇవే.. గ్రీన్ వింగ్డ్ మెకావ్ రెండు జతలు, స్కార్లెట్ మెకావ్స్ రెండు జతలు, మిలటరీ మెకావ్స్ రెండు జతలు, మీడియం సల్ఫర్ క్రెస్టెడ్ కాక్టూ రెండు జతలు, స్క్వైరల్ మంకీస్ రెండు జతలు, కామన్ మార్మోసెట్స్ రెండు జతలు, మీర్కాట్ ఒక జత, రెడ్ నెక్డ్ వాల్లబీ ఒక జత కొత్తగా ఇక్కడకు తీసుకురానున్నారు.ప్రత్యేక ఎన్క్లోజర్లు సిద్ధంవిశాఖ జూకు కొత్త వన్యప్రాణులు రానున్నాయి. గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వాటిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశాం. –డి.మంగమ్మ, జూ క్యూరేటర్(ఎఫ్ఏసీ), ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
వన సంపదకు పెద్ద ఆపద!
సాక్షి, అమరావతి: ప్రకృతికి మనిషి హాని తలపెడుతున్నాడు. తద్వారా తన ఉనికిని తానే దెబ్బతీసుకుంటున్నాడు. జంతుజాలాన్ని బతకనివ్వడం లేదు. మనిషి స్వార్థం వృక్షజాలాన్నీ వదలడం లేదు. తత్ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వృక్షజాలమూ బోసిపోతోంది. అక్రమ వ్యాపారుల దుశ్చర్యలకు పర్యావరణం సమతౌల్యాన్ని కోల్పోతోంది. 2015–2021 మధ్య కాలంలో 162 దేశాల్లో యథేచ్ఛగా జంతు, వృక్షజాతుల అక్రమ వాణిజ్యం జరిగినట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది. దాదాపు 4 వేలకు పైగా జంతు, వృక్షజాతులు నిత్యం అక్రమ రవాణాలో పట్టుబడుతున్నట్టు ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్–2024లో పేర్కొంది. వీటిల్లో సుమారు 3,250 రకాలు అంతరించిపోతున్న జాతుల్లో ఉండటం కలవరపెడుతోంది. ఫ్యాషన్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల తయారీ, ఔషధాల కోసం చట్ట విరుద్ధంగా అడవుల్లోని జీవజాలాన్ని మట్టుబెడుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఖడ్గమృగం, దేవదారు వృక్షాలు అక్రమ వ్యాపారానికి ఎక్కువగా అంతరించిపోయినట్లు తేల్చింది. బ్లాక్ మార్కెట్లో ఖడ్గమృగం కొమ్ము 29 శాతం డిమాండ్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పాంగోలిన్ స్కేల్స్ 28 శాతం, ఏనుగు దంతాలు 15 శాతంగా ఉన్నాయి. అక్రమ రవాణాకు తెగటారిపోతున్న జంతు, వృక్షజాలం అక్రమ వ్యాపారానికి బలవుతున్న జంతు జాతుల్లో ఏనుగులు (6 శాతం), ఈల్స్ (5 శాతం), మొసళ్లు (5 శాతం), చిలుకలు, కాకాటూలు (2 శాతం), సింహాలు, పులుల వంటి ఇతర మాంసాహార జంతువులు (2 శాతం), తాబేళ్లు (2 శాతం), పాములు (2 శాతం), సీహార్స్ చేపలు (2 శాతం) ఉన్నాయి. అక్రమ రవాణాలో ధూపం, పరిమళ ద్రవ్యాలు, కలప, ఔషధాల వినియోగానికి దేవదారు, మహోగని, హోలీ వుడ్, గుయాకం వృక్ష జాతులు యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. మార్కెట్లో వీటి వాటా 47 శాతంగా ఉంది. ఇంకా రోజ్‌వుడ్ 35 శాతం, ఔషధ మొక్కలు అగర్వుడ్ , రామిన్, యూకలిప్టస్ 13 శాతంగా ఉన్నాయి. సముద్ర జీవులకు ఆవాసాన్ని కల్పించడంతో పాటు తీరప్రాంతాన్ని కోత నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించే పగడపు దిబ్బలనూ అక్రమ వ్యాపారులు తొలిచేస్తున్నారు. అక్రమ రవాణాలో ఈ పగడాల వాటా 16 శాతంగా ఉంటోంది. గత దశాబ్దంలో ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ముల వేట తగ్గినట్టు నివేదిక చెబుతోంది. మార్కెట్లోనూ ధరలు క్షీణించినట్టు తెలిపింది. కరోనా కాలంగా చైనా మార్కెట్లు మూసివేయడంతో ఇది జరిగి ఉండవచ్చని భావిస్తోంది. దేశ సరిహద్దుల్లో అక్రమ రవాణా గుర్తింపు భారత్‌లోనూ విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశ సరిహద్దు రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్లలో ఎక్కువగా వన్యప్రాణుల అక్రమ రవాణాను గుర్తించారు. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్టు 2022–23 ప్రకారం 1,652 క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచర జాతులను స్వా«దీనం చేసుకున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పేర్కొంది. వీటిల్లో 40 శాతానికి పైగా అత్యంత ప్రమాదంలో ఉన్న జాతులుగా పేర్కొంది. సజీవంగా ఉన్న జంతువులు ముఖ్యంగా పెంపుడు జంతువులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నందుకు దేశంలో అక్రమ వ్యాపారం పెరిగినట్టు వన్య ప్రాణుల నేర నియంత్రణ నిపుణులు చెబుతున్నారు. -
విశాఖ జూకు కొత్త అతిథులు
ఆరిలోవ (విశాఖజిల్లా): విశాఖలో ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్దిరోజుల్లో మరికొన్ని కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని తీసుకురావడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (సీజెడ్ఏ) అనుమతులు లభించాయి. మరికొన్నింటిని తీసుకురావడానికి అనుమతులు రావాల్సి ఉంది.కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి కొత్త జంతువులు, అరుదైన పక్షులను అధికారులు తరచు తీసుకొస్తున్నారు. గత నెల 27న కోల్‌కతాలోని అలీపూర్ జూ పార్కు నుంచి జంతుమారి్పడి విధానం ద్వారా జత జిరాఫీలు, రెండుజతల ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, జత స్కార్లెట్ మకావ్ (రంగురంగుల పక్షి)లను ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని వన్యప్రాణులను కొద్ది రోజుల్లో తీసుకురానున్నారు. బెంగళూరు జూ నుంచి మిలటరీ మెకావ్, రెడ్‌నెక్డ్ వాలిబీ, స్వైరల్ మంకీస్, మార్మోసెట్ మంకీస్, గ్రీన్ వింగ్ మెకావ్లను నెలరోజుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి కోసం జూలో ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశారు. జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లు జర్మనీ నుంచి 12 అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లను విశాఖ జూకు తీసుకురానున్నారు. ఈ జాతి తాబేళ్ల జీవితకాలం వంద సంవత్సరాలు. ఇవి అరుదైనవి. మనదేశంలో ఇవి అరుదుగా కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సీజెడ్ఏ అధికారుల అనుమతి లభించింది. వీటిని ఇక్కడకు తీసుకొస్తే వందేళ్ల వాటి జీవితకాలంలో ఆ జాతి సంతతి వృద్ధి చెందుతుంది. ఇతర జూ పార్కుల నుంచి జంతుమారి్పడి ద్వారా కొత్త వన్యప్రాణులను ఇక్కడకు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు కలుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. వీటితోపాటు అహ్మదాబాద్ జూ పార్కు నుంచి వివిధ రకాల అరుదైన పక్షులను తీసుకొచ్చేందుకు సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించారు. అవికూడా వస్తే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది.త్వరలోనే కొత్త వన్యప్రాణులు విశాఖ జూకి ఒకటి, రెండునెలల్లో కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు జూ నుంచి మీర్కాట్, రెడ్‌నెక్డ్ వాలబీ, స్వైరల్ మంకీస్, మర్మోసెట్స్, గ్రీన్ వింగ్డ్ మకావ్ తదితర జాతులతో పాటు జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టోర్టోయిస్లను ఇక్కడికి తీసుకురావడానికి సీజెడ్ఏ అనుమతులు లభించాయి. అహ్మదాబాద్ జూ నుంచి మరికొన్ని అరుదైన పక్షులను తీసుకురావడానికి సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించాం. సీజెడ్ఏ అనుమతులు వచ్చిన వెంటనే వాటిని తీసుకొస్తాం. గతనెలలో లీపూర్ జూ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన జిరాఫీలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. జూలో అరుదైన వన్యప్రాణులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – డాక్టర్ నందనీ సలారియా, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
వన్యప్రాణులపై రీల్స్ చేయండి.. రూ. 5,000 గెలుచుకోండి!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ మహానగరం పేరు వినగానే అక్కడి జూలాజికల్ పార్క్ గుర్తుకు వస్తుంది. ఇది దేశంలోని పురాతన జూలాజికల్ పార్కులలో ఒకటి. ఈ పార్కులో పలు రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. ఈ పార్కుకు వచ్చే పర్యాటకుల సంఖ్యను మరింతగా పెంచేందుకు అక్కడి అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కాన్పూర్ జూ పార్కు అధికారులు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యర్థులకు ఉచితంగా పార్కును సందర్శించే అవకాశాన్ని కల్పించారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పలువురిని కాన్పూర్ జూకి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలని కోరారు. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘కాన్పూర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ షెఫాలీ రాజ్ మాట్లాడుతూ జూలో నిర్వహిస్తున్న ఈ పోటీ ఉద్దేశ్యం దేశం నలుమూలలలోని ప్రజలకు కాన్పూర్ జూ పార్కు గురించి తెలియజేసి, వారు ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించడమేనని అన్నారు. పర్యాటకులు రూపొందించే రీల్స్‌లో అత్యధికులు లైక్ చేసిన రీల్‌కు రూ. 5000, తరువాత ఉన్న రీల్‌కు రూ. 3000 నగదు బహుమతి అందించనున్నామని తెలిపారు. -
అడవిలో అమృతధార
బుట్టాయగూడెం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్య ప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన, వాహనాల కింద పడి మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రెండేళ్లుగా వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో అటవీ శాఖ ఈ ఏడాది కూడా వేసవి ప్రణాళిక రూపొందించారు. పాపికొండల్లో 60 నీటికుంటలు పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేవిధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చెలమల్ని తవ్వి వన్య ప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. అవికాకుండా 25 చెక్‌డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తొట్టెల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాటి పక్కన ఉప్పు ముద్దలను పెడుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుని ఉప్పు ముద్ద నాకుతాయని, తద్వారా వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కృషి పాపికొండలు అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటితొట్టెల్ని వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.50 లక్షలు వెచ్చిస్తోంది. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
వన్యప్రాణుల దాడులకు పరిహారం పెంపు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణులు–మనుషుల సంఘర్షణలో మరణాలు లేదా గాయపడటం వంటివి సంభవిస్తే.. వివిధ కేటగిరీల వారీగా చెల్లించే నష్టపరిహారాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ దాడుల్లో మనుషులు చనిపోతే గరిష్టంగా ఇచ్చే రూ.5లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గాయపడిన వారికి (సింపుల్ ఇంజూరి) వైద్య ఖర్చులకయ్యే మొత్తాన్ని చెల్లిస్తుండగా, వెంటనే సహాయం అందించేందుకు రూ.పదివేలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వనున్నారు. ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడినవారికి వాస్తవ వైద్యఖర్చుతో పాటు శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి ఎక్స్‌గ్రేషియా రూ.75 వేలు ఇస్తుండగా, ఇప్పుడు ఆ ఎక్స్‌గ్రేషియా రూ.లక్షకు పెంచారు. ఈ దాడుల్లో పశువులు చనిపోతే పశుసంవర్థకశాఖ ఇన్స్పెక్టర్ అంచనాలకు అనుగుణంగా మార్కెట్ ధర చెల్లిస్తుండగా దానిని పశుసంవర్థకశాఖ ఇన్స్పెక్టర్తో పాటు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్వో) , గ్రామసర్పంచ్ సంయుక్తంగా సమర్పించే నివేదిక ఆధారంగా మార్కెట్ ధర (రూ.50వేలుమించకుండా) చెల్లించనున్నారు. పంట నష్టానికీ పరిహారం పెంపు పంటనష్టం వాటిల్లినపుడు గతంలో ఎకరానికి రూ.6 వేలు చెల్లిస్తుండగా, వ్యవసాయ అధికారి, ఎఫ్ఎస్వో, రెవెన్యూ అధికారి సంయుక్తంగా వేసే అంచనా ఆధారంగా ఎకరానికి రూ.ఏడున్నర వేల కు పరిహారం పెంచారు. ఇతర ఉద్యానవన పంట లకు రెవెన్యూ అధికారుల అంచనాకు అనుగుణంగా రూ.ఏడున్నర వేల నుంచి రూ.50 వేల దాకా పరిహారం చెల్లిస్తుండగా, ఉద్యాన అధికారి, ఎఫ్ఎస్వో, రెవెన్యూ అధికారి సంయుక్త నివేదిక ఆధారంగా గతంలో చెల్లిస్తున్న మొత్తాన్ని అందజేయనున్నా రు. మరణం / గాయం / పంటనష్టం వంటి వాటికి ఆయా కుటుంబాల్లోని పెద్దలకు రెవెన్యూ అధికారుల సర్టిఫికెట్ ఆధారంగా వేగవంతంగా పరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ మేరకు అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. వివిధ కేటగిరీలకు అర్హత మార్గదర్శకాలు ఇవీ... ♦ అడవులు, రక్షిత ప్రాంతాల్లో వలస పశువులు, మేకలు, గొర్రెలు చనిపోతే ఎలాంటి పరిహారం లేదు ♦ జాతీయపార్కుల్లో జరిగిన దాడుల్లో పశువులు చనిపోతే పరిహారం చెల్లించరు ♦ ఫారెస్ట్‌బీట్ ఆఫీసర్/ ఎఫ్ఎస్వో పరిశీలించేదాకా దాడిలో పశువులు చనిపోయిన ప్రాంతం నుంచి తరలించొద్దు ♦ పశువులను చంపడంపై ఎఫ్ఎస్వో ఆ పై స్థాయి అధికారి సర్టిఫికెట్ (పంచనామా, ఫొటోలతో సహా) ఇవ్వాల్సి ఉంటుంది ♦ డీఎఫ్‌వో/ ఎఫ్‌డీవోలు మంజూరు చేసి చెక్కుల ద్వారా చెల్లించాలి ♦ వన్యప్రాణుల దాడుల్లో మనుషుల మరణం లేదా గాయపడినపుడు (పాములు, కోతులు మినహా) దాడి జరిగిన ప్రాంతాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లేదా ఎస్ఐ ర్యాంక్‌కు తక్కువలేని ఉద్యోగి 48 గంటల్లో స్పాట్ ఇన్స్పెక్షన్ చేయాలి ♦ మృతికి కారణంపై అసిస్టెంట్ సివిల్ సర్జన్‌తో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దాడి జరిగినపుడు అటవీ, వన్యప్రాణుల చట్టాలను బాధితుడు ఉల్లంఘించి ఉండకూడదు. -
అతిపెద్ద టైగర్ రిజర్వ్!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రెండు అభయారణ్యాలను కలిపేసి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్‌లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేయనున్నట్లు ఒక నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. సాగర్, దామోహ్, నర్సింగ్‌పూర్, రేసిన్ జిల్లాల్లో విస్తరించిన ఈ రెండు అభయారణ్యాలను కలిపేస్తే దేశంలోనే పెద్దదైన 2,300 కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతం కానుంది. ఇది వచ్చే రెండు, మూడు నెలల్లో ఏర్పాటుకానుంది. -
వేటగాళ్ల నయా ట్రెండ్
చంద్రగిరి (తిరుపతి జిల్లా): వన్యప్రాణుల వేటలో వేటగాళ్లు కొత్త రూటులు వెతుకుతున్నారు. గతంలో వన్యప్రాణులను వేటాడేందుకు తుపాకులు, ఉచ్చులను వాడేవారు. అయితే ఇప్పుడు వేట కుక్కలను ఇందుకు వినియోగిస్తున్నారు. వీటితో వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఇందుకోసం వేట కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వన్యప్రాణులను వేటాడాక వాటి మాంసాన్ని భారీ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి తిరుగు ప్రయాణమవుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వేటగాళ్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు రెండు వేట కుక్కలను అదుపులోకి తీసుకుని పనపాకం అటవీ కార్యాలయానికి తరలించారు. పనపాకం పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా వేట.. గత కొంతకాలంగా పనపాకం పరిసరాల్లోని ఈటలదొడ్డి, బొప్పిగుట్ట, వెదురుల కొండ, కందరవారి గుట్ట, మొరవగట్టు, నచ్చు బండ, గుడిసె గుట్ట, దొంగలబండ, మాలవాడి చెరువు ప్రాంతాల్లో విచ్చలవిడిగా వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి వచ్చిన మంజు, సాయిలకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి సహకరిస్తున్నట్లు చెబుతున్నారు. వీరు ఆదివారం రాత్రి వేటకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో సోమవారం తిరుగు ప్రయాణంలో అటవీ అధికారులకు పట్టుబడ్డారు. వేటగాళ్ల సెల్ఫోన్లను పరిశీలించిన అటవీ అధికారులు ఆశ్చర్యపోయారు. వాటిలో వేట కుక్కలకు శిక్షణ ఇచ్చే వీడియోలు, కుక్కలు.. అడవి పందులను వేటాడే వీడియోలు ఉన్నాయి. గతంలోనూ పనపాకం పరిసర ప్రాంతాల్లో స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలవారు వేట సాగించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడితే ఎంతటివారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం పనపాకం అటవీ చెక్‌పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్న కుక్కలు పెంపుడు జంతువులే. వేటకు శిక్షణ ఇచ్చేందుకు వీటిని తీసుకొ చ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పూచీకత్తుపై విడుదల చేశాం. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం. స్వా«దీనం చేసుకున్న శునకాలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టాం. – మాధవీలత, ఎఫ్ఆర్వో, పనపాకం రేంజ్ -
వేటాడితే.. వేటు తప్పదు
పాల్వంచరూరల్: అడవులు పచ్చగా ఉంటేనే వర్షాలు కురుస్తాయి. అప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయి. మరి అడవులు పెరగాలంటే వన్యప్రాణులను సంరక్షించాలి. అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులను బతుకనిద్దామని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. అడవుల సంరక్షణకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక చట్టాలను రూపొందించాయి. ఈ క్రమంలో జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యాన్ని పరిరక్షించేందుకు 1977 జనవరి 24న చట్టం రూపొందించారు. ఈనెల 8 వరకు వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం.. సమాజంలో మనుషులతో పాటు అనేక రకాల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. అయితే మనుషులు తమ ఆహారం కోసం పలురకాల జీవులను వధిస్తున్నారు. ముఖ్యంగా వన్యప్రాణులను వేటాడుతున్నారు. దీన్ని నివారించేందుకు 50 ఏళ్ల క్రితం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. ప్రత్యేకించి వైల్డ్‌లైఫ్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. అయితే స్మగ్లర్లు అక్రమంగా కలప తరలించేందుకు అడవులను హరిస్తున్నారు. ఇలా అడవులు అంతరిస్తుండడంతో వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. అడవుల్లో పులి, చిరుత, నెమలి, ఎలుగుబంటి, కుందేళు, పక్షులు, మొసళ్ల వంటి ప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వైల్డ్‌లైఫ్ చట్టం ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా వన్యప్రాణులను సంహరిస్తే కఠిన శిక్ష పడుతుంది. కానీ చట్టాలపై అవగాహన లేనివారు, ఉన్నా పట్టించుకోని వారు వన్యప్రాణులను యథేచ్ఛగా వధిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో వారికి అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. శిక్షల తీరు ఇలా.. ► అటవీ జంతువైన పులిని చంపినా, చర్మాన్ని, గోళ్లను తీసినా, బంధించినా, విష ప్రయోగం చేసినా, ఒక ప్రదేశం నుంచి మరో చోటుకు తరలించినా 1972 వైల్డ్‌లైఫ్ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్షకు పైగా జరిమానా విధించే అవకాశం ఉంది. జైలు శిక్ష పడితే ఏడాది వరకు బెయిల్ కూడా లభించదు. ► చిరుతపులిని చంపినా, పట్టుకున్నా, మరో చోటుకు తరలించినా వన్య మృగాల సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించొచ్చు. ► ఎలుగుబంటిని పట్టుకున్నా, సర్కస్‌లో ఆడించినా మూడు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. వేటాడినట్లు రుజువైతే మాత్రం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ► మొసళ్లను పట్టుకున్నా, చంపినా మూడు నుంచి ఏడేళ్ల జైలు, కోతులను పట్టుకున్నా, చంపినా, ఇంట్లో పెంచుకున్నా 5 నుంచి 7 నెలల పాటు జైలు శిక్ష, రూ.20 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే కుందేళ్లకై తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. ► నెమలిని పట్టుకున్నా, వధించినా, గుడ్లను పగలగొట్టినా, హాని చేసినా వైల్డ్‌లైఫ్ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. గతంలో ఏడుగురిపై కేసులు గతంలో కిన్నెరసాని డీర్ పార్కు సమీపంలో కొందరు దుప్పిని కుక్కలతో వేటాడి సోములగూడెం సమీప అటవీ ప్రాంతంలో వధించి మాంసం విక్రయించారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేశారు. దంతలబోరు అటవీ ప్రాంతంలో అడవి పందిని చంపి మాంసాన్ని విక్రయిస్తుండగా పాల్వంచ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఇంకా ఏడూళ్లబయ్యారం, ములకలపల్లి, చండ్రుగొండ, ఇల్లెందు అటవీ ప్రాంతాల్లోనూ వన్యప్రాణుల వేటగాళ్లను పట్టుకోగా, ఈ అన్ని ఘటనలో మొత్తం ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం వన్యప్రాణుల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. వన్యప్రాణులను ప్రతిఒక్కరూ కాపాడాలని జాగృతం చేస్తున్నాం. ఎవరైనా వన్య ప్రాణులను సంహరించే ప్రయత్నం చేసినా, వాటికి హాని కలిగించినా కఠిన చర్యలు తప్పవు. – కట్టా దామోదర్‌రెడ్డి, ఎఫ్డీఓ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు ఈనెల 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అటవీ రేంజ్‌ల పరిధిలో నిర్వహిస్తాం. ‘వనాలు పెంచండి, వన్యప్రాణులను కాపాడండి’ నినాదంతో ఏజెన్సీ పరిధిలోని అటవీ సమీప గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తాం. దీంతో పాటు విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తాం. – కృష్ణగౌడ్, జిల్లా అటవీశాఖాధికారి -
ప్లాస్టిక్ ప్రళయం
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్లాస్టిక్ మింగేస్తోంది. సముద్ర జీవులు, అడవి జంతువులను హరించడంతో పాటు మానవుల ఆహారంలోకి చొరబడుతోంది. గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం 1950లో రెండు మిలియన్ టన్నులు ఉండగా.. తాజా వినియోగం 391 మిలియన్ టన్నులను దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి చిన్న పనిలోనూ ప్లాస్టిక్‌పై ఆధారపడటంతో వీటి వినియోగం క్రమేపీ ఎక్కువైంది. ఇది 2040 నాటికి రెట్టింపు అవుతుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. పండ్లలోనూ ప్లాస్టిక్ భూతమే మానవులు తరచూ తినే పండ్లు, కూరగాయలను కూడా ప్లాస్టిక్ వదలడం లేదు. తాజాగా ఇటలీలోని కాటానియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్యారెట్, పాలకూర, యాపిల్స్, బేరి పండ్లలో చిన్నచిన్న ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు. యాపిల్స్‌లో అత్యధికంగా సగటున గ్రాముకు 1.95 లక్షలు, బేరిలో 1.89 లక్షలు, క్యారెట్, బ్రొకోలీలో లక్ష వరకు అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. ప్లాస్టిక్ కలుషిత నీరు, భూమి ద్వారా ఆహార ఉత్పత్తుల్లోకి చేరుతున్నట్టు పేర్కొన్నారు. తాబేలు పొట్టలోనూ చేరుతోంది గతంలో సముద్ర తీరాల్లో అకారణంగా తాబేళ్లు మృత్యువాత పడుతుండటంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అరచేతిలో ఒదిగిపోయే చిన్న తాబేలు పొట్టలో దాదాపు 140 మైక్రో ప్లాస్టిక్ ముక్కలను కనుగొన్నారు. ప్రస్తుతం ఏటా 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతుండగా.. ఇది వచ్చే 20 ఏళ్లల్లోపే మూడు రెట్లు పెరగనుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 800కి పైగా సముద్ర, తీర ప్రాంత జాతులను ఆహారంగా తీసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు, వారి రక్తంలో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. ముఖ్యంగా ప్రపంచంలో 1,557 సముద్ర జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం జీవులు ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకుంటున్నాయని తేలింది. గజరాజుల పాలిట ప్లాస్టిక్ పాశం గతేడాది భారత దేశంలోని పెరియార్ అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల అడవి ఏనుగు మృతి చెందింది. ప్రతి శీతాకాలంలో శబరిమలకు అడవుల ద్వారా కాలినడకన వెళ్లే లక్షలాది మంది భక్తులు విచ్చలవిడగా పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో పేగుల్లో అంతర్గత రక్తస్రావం, అవయవాలు విఫలమై అది చనిపోయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్క ఏనుగులే కాదు అతి శక్తివంతమైన వేటాడే జీవులైన హైనాలు, పులులతో పాటు జీబ్రాలు, ఒంటెలు, పశువులతో సహా భూ ఆధారిత క్షీరదాలు ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృత్యువాత పడుతున్నాయి. భూసారానికి పెనుముప్పు ప్లాస్టిక్‌లోని మైక్రో ప్లాస్టిక్స్ భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమికి మేలు చేసే మిత్ర పురుగులు, లార్వాలు, అనేక కీటకాల క్షీణతలకు దారి తీస్తోంది. ప్లాస్టిక్ ఫుడ్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ గొట్టాలు, బయోవ్యర్థాలు హానికరమైన రసాయనాలను మట్టిలోకి విడుదల చేస్తాయి. అవి భూగర్భ జలాల్లోకి ప్రవేశించి నీటిని సైతం కలుషితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం, ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌పై అనేక స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా 77 దేశాలు పాస్టిక్‌పై శాశ్వత, పాక్షిక నిషేధాన్ని విధించాయి. -
ఉప్పు తప్పించును వేసవి ముప్పు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వేసవి మండిపోతుండటంతో జంతువుల ఆరోగ్య పరిరక్షణపై అటవీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. మనుషుల్లాగే వన్యప్రాణులు కూడా శరీరంలో ఖనిజాల (మినరల్స్) శాతం తగ్గిపోతే అనారోగ్యం బారిన పడతాయి. రోజువారీ ఆహారంలో భాగంగా ఖనిజాలు.. కూడా సరిగా అందితేనే జీవ క్రియలు సజావు గా సాగుతాయి. అయితే అడవుల్లో బతికే జంతువులు సహజ సిద్ధంగా తినే మేత ద్వారా ఉప్పు (సోడియం)ను తీసుకుంటాయి. బండలు, కర్రల్ని, నీటి మడుగుల వద్ద మట్టిని నాకుతూ శరీర సమతాస్థితిని కాపాడుకుంటాయి. అయితే గతంలో కంటే ప్రస్తుతం సహజసిద్ధ ఉప్పు లభ్యత తగ్గిపోయింది. మరోవైపు వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా మరింత ఎక్కువగా మినరల్స్ అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో తగినంత ఉప్పు అందకపోతే వన్యప్రాణులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీని ని దృష్టిలో ఉంచుకుని వాటి ఆవాసాల్లోనే నీటి కుంటల వద్ద అధికారులు ఉప్పు గడ్డలు ఏర్పాటు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో ఈ పద్ధతిలో జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మట్టి, ఉప్పును కలిపి.. సహజమైన ఉప్పు, చెరువు మట్టి రెండింటినీ కలిపి (70 శాతం ఉప్పు, 30 శాతం చెరువు పూడిక మట్టి) కుప్పలా తయారు చేస్తారు. ఒక అడుగు లేదా అడున్నర ఎత్తులో నీటి కుంటలకు సమీపంలో జంతువులకు కనిపించేలా ఉంచుతారు. దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులు కాళ్లు, కొమ్ములతో కుప్పల్ని గీరుతూ, మట్టిలో ఉన్న ఉప్పును నాలుకతో చప్పరిస్తుంటాయి. ఒక దాన్ని చూసి మరొకటి అలా నాకుతూ ఉంటాయి. ఒక్కోసారి గుంపులుగా కూడా వస్తుంటాయి. అలా పదే పదే నాకడం వల్ల వాటికి అవసరమైనంత ఉప్పు లభిస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలకు ప్రత్యేకంగా ఉప్పును నాకిస్తుంటారు. ఈ విధానాన్నే అధికారులు అడవిలో ఉపయోగిస్తున్నారు. మొదట మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఉప్పు గడ్డలను వాడేవారు. అయితే వాటి గడువు తేదీ, ప్రాసెస్ కారణంగా జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అటవీ సిబ్బందే సాధారణ ఉప్పును మట్టితో కలిపి జంతువులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఖనిజ లోపం ఏర్పడకుండా.. వన్యప్రాణుల్లో ఖనిజ లోపం రాకుండా నీటికుంటల వద్ద ఉప్పు గడ్డలను ఏర్పాటు చేస్తున్నాం. దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మట్టిలో ఉన్న ఉప్పును అవి చప్పరిస్తున్నాయి. ఇది వాటి ఆరోగ్యాన్ని కాపాడుతోంది. – ఎస్.మాధవరావు ఎఫ్‌డీవో, జన్నారం, మంచిర్యాల జిల్లా -
Animatronic Elephant: స్కూల్‌కు ఏనుగొచ్చింది
ఏనుగు స్కూల్‌కి వస్తే? పిల్లలు దానిని భయం లేకుండా తాకి, నిమిరి ఆనందిస్తే? ఆ ఏనుగు కళ్లార్పుతూ, చెవులు కదిలిస్తూ మాట్లాడుతూ తన గురించి చెప్పుకుంటే? ‘ఎలీ’ అనే యానిమెట్రానిక్ ఏనుగు ఇకపై దేశంలోని స్కూళ్లకు తిరుగుతూ పిల్లలకు ఏనుగుల జీవనంలో ఏది ఇష్టమో, ఏది కష్టమో చెప్పనుంది. ‘పెటా’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ‘ఎలీ’కి గొంతు ఇచ్చిన నటి దియా మిర్జా ఏనుగులపై జరుగుతున్న దాష్టీకాలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి నడుం కట్టింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం పిల్లలు, తల్లిదండ్రులు, జంతు ప్రేమికులు తప్పక ఆహ్వానించదగ్గది. సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ ‘ఏనుగు డాక్టర్’ అనే కథ రాశారు. మదుమలై అడవుల్లో ఏనుగుల డాక్టర్‌గా పని చేసిన ఒక వ్యక్తి అనుభవాలే ఆ కథ. అందులో ఆ డాక్టర్ అడవుల్లో పిక్నిక్ల పేరుతో తిరుగుతూ బీరు తాగి ఖాళీ సీసాలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విసిరేసే వాళ్ల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానికి కారణం బీరు సీసా మీద ఏనుగు కాలు పెట్టగానే అది పగులుతుంది. ఏనుగు పాదంలో దిగబడి పోతుంది. ఇక ఏనుగుకు నడవడం కష్టమైపోతుంది. అది తిరగలేదు. కూచోలేదు. లేవలేదు. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిలబడి పోతుంది. అలాగే వారం పదిరోజులు నిలబడి తిండి లేక కృశించి మరణిస్తుంది. ఇది ఎవరు జనానికి చెప్పాలి? ఎవరు ప్రచారం చేయాలి? ఎవరో ఒకరు లేదా అందరూ ఏదో ఒక మేరకు పూనుకోవాలి కదా. ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’ (పెటా) నిన్న (శుక్రవారం) ఏనుగులతో జనం మైత్రి కోసం ముఖ్యంగా పిల్లల్లో అవగాహన కోసం ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. అచ్చు నిజం ఏనుగులా కనిపించే యానిమెట్రానిక్ ఏనుగును తయారు చేయించి దాని ద్వారానే పిల్లల్లో చైతన్యం కలిగించనుంది. ఆ ఏనుగుకు ‘ఎలీ’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’లో అంబాసిడర్‌గా ఉన్న దియా మిర్జా తోడు నిలిచింది. ఆమె ఏనుగుకు తన కంఠం ఇచ్చింది. నేను... ఎలీని... నిజం ఏనుగులా అనిపించే ఎలీ ఇకపై ఊరూరా తిరుగుతూ స్కూల్‌కి వస్తుంది. అందులో రికార్డెడ్‌గా ఉన్న దియా మిర్జా కంఠంతో మాట్లాడుతుంది. ఇది యానిమెట్రానిక్ బొమ్మ కనుక కళ్లు కదల్చడం, చెవులు కదల్చడం లాంటి చిన్న చిన్న కదలికలతో నిజం ఏనుగునే భావన కలిగిస్తుంది. అది తన చుట్టూ మూగిన పిల్లలతో ఇలా చెబుతుంది. ‘నేను ఎలీని. నా వయసు 12 సంవత్సరాలు. నేను ఇంతకు ముందు ఒక సర్కస్‌లో పని చేసే దాన్ని. జనం నన్ను సర్కస్‌లో చూసి ఆనందించేవారు. కాని అలా ఉండటం నాకు ఆనందం కాదు. అడవిలో తిరిగే నన్ను కొందరు బంధించి సర్కస్‌కు అప్పజెప్పారు. సర్కస్ ఫీట్లు చేయడానికి నన్ను బాగా కొట్టేవారు. నన్ను గట్టి నేల మీద ఎప్పుడూ నిలబెట్టేవారు. అలా నిలబడితే నాకు కష్టంగా ఉంటుంది. అసలు జనం మధ్య తిరగడం, గోల వినడం ఇవన్నీ నాకు భయం. సర్కస్ లేనప్పుడు నన్ను గొలుసులతో కట్టేస్తారు. ఏనుగుల గుంపు నుంచి ఏనుగును విడదీస్తే అది ఎంతో బాధ పడుతుంది. కాని ఇప్పుడు నేను విముక్తమయ్యాను. నన్ను ఒక సంస్థ విడిపించి బాగా చూసుకుంటోంది. నేను హాయిగా ఉన్నాను’ అని తన కథను ముగిస్తుంది. కొనసాగుతున్న హింస ‘ఏనుగులు ప్రకృతిలో ఉండాలి. జనావాసాల్లో కాదు. ఒక తల్లిగా పిల్లలకు కొన్ని విషయాలు తెలియాలని కోరుకుంటాను. పెటాతో కలిసి బాలబాలికల్లో చైతన్యం కోసం పని చేయడం మూగజీవులకు, పిల్లలకు బంధం వేయడంగా భావిస్తాను’ అని దియా మిర్జా అంది. ఏనుగులను ఇవాళ్టికీ ఉత్సవాల్లో, పర్యాటక కేంద్రాల్లో, బరువుల మోతకు, వినోదానికి ఉపయోగిస్తున్నారు. మనుషుల ఆధీనంలో ఉన్న ఏనుగుకు ఎప్పుడూ కడుపు నిండా తిండి, నీరు దొరకవు. వాటిని గొలుసులతో బంధించి ఉంచడం వల్ల ఒక్కోసారి అవి అసహనానికి గురై మనుషుల మీద దాడి చేస్తాయి. ఎలిఫెంట్ సఫారీల వల్ల ఏనుగు వెన్ను సమస్యలతో బాధ పడుతుంది. ఇవన్నీ మన తోటి పర్యావరణ జీవులతో ఎలా మెలగాలో తెలియకపోవడం వల్ల జరుగుతున్న పనులేనని ‘పెటా’ వంటి సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు తెలియచేస్తున్నారు. ‘ఎలీ’ వంటి ఏనుగులు ప్రతి ఊరు వచ్చి పిల్లలతో, పెద్దలతో సంభాషిస్తే లేదా ఇలాంటి సంభాషణను ప్రతి స్కూల్లో వీడియోల ద్వారా అయినా ప్రదర్శిస్తే మార్పు తథ్యం. -
వైల్డ్ లైఫ్ టూరిజం పునః ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో ‘ఎకోఫ్రెండ్లీ వైల్డ్ లైఫ్ టూరిజం’ తిరిగి ప్రారంభం కానుంది. 2021 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా మొదలైన ‘వైల్డ్‌లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్’ని జతచేసిన సరికొత్త హంగులు, ఆకర్షణలతో శుక్రవారం అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పునఃప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా టైగర్ సఫారీ కోసం సమకూర్చిన కొత్తవాహనాలను ఫ్లాగ్‌ఆఫ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం మొదలుకానుంది. టూర్లో భాగంగా ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ని ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌తో మంత్రి ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యాటకులకు కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్న ఆరు కాటేజీలను కూడా మంత్రి ప్రారంభిస్తారు. ఏటీఆర్ పరిధిలో పులుల కదలికల ఫొటోలు, పాదముద్రలు, ఇతర అంశాలతో తయారుచేసిన ‘ఏటీఆర్ టైగర్‌బుక్’ను ఆవిష్కరిస్తారు. అటవీ, వన్యప్రాణుల పరిరక్షణకు కృషి చేస్తున్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఏటీఆర్‌క్లబ్’ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ ఇలా... టూరిజం ప్యాకేజీలో... టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీ, గిరిపుత్రులను కలుసుకుని వారి జీవనశైలి, అనుభవాలు తెలుసుకోవడం వంటివి జతచేశారు. దాదాపు 24 గంటల పాటు ఇక్కడ గడపడంతో పాటు రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బస వంటివి అందుబాటులోకి తేనున్నారు. స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లుగా వ్యవహరించనున్నారు. రాత్రిపూట అడవిలోని పర్క్యులేషన్ ట్యాంక్‌లో నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణుల వీక్షణకు నైట్‌విజన్ బైనాక్యులర్స్ ఏర్పాటు చేశారు. ఎకోఫ్రెండ్లీ చర్యల్లో భాగంగా... జ్యూట్‌బ్యాగ్ వర్క్‌షాపు, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌సెంటర్, బయో ల్యాబ్‌ల సందర్శన ఉంటుంది. -
మనకు మరింత చేరువగా 'గజరాజు'
కె.జి. రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇకపై ఏనుగులనూ పెంపుడు జంతువులుగా పెంచుకునే వీలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్కుల అభివృద్ధి పేరుతో ఏనుగులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తరలించుకోవచ్చు కూడా. మానవ అవసరాలకు సైతం ఏనుగులను ఉపయోగించుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన తాజా సవరణలు ఇందుకు వీలు కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్)–1972 చట్టంలో చేసిన సవరణలకు ఆమోదముద్ర పడింది. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2022కు రాజ్యసభ సైతం గత నెల 19న ఆమోదముద్ర వేయడంతో ఏనుగులను సొంత అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు మరింత అధికారికం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మతపరమైన, ఇతర అవసరాల కోసం ఏనుగులను తరలించేందుకు ప్రత్యేకంగా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తాజా సవరణలో పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో అమ్యూజ్మెంట్, జూ పార్కుల ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుందని కొందరు చెబుతుండగా.. తాజా సవరణలపై పర్యావరణ వేత్తలు, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్ సంస్థ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్న అమ్యూజ్మెంట్ పార్కుకు ఏనుగులను తరలించేందుకు ఈ తాజా సవరణలు తోడ్పడతాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అనధికారికంగానే..! దేశంలో మానవ అవసరాలకు ఏనుగులను ఉపయోగించుకోవడం ఎప్పటినుంచో ఉంది. సర్కస్‌లలో ఏనుగులతో ఫీట్లు చేయించడం, కొండ ప్రాంతాల్లో భారీ దుంగలను లాగేందుకు ఏనుగులను ఉపయోగించుకోవడం జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ విధంగా సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్న ఏనుగుల సంఖ్య 2,675 వరకు ఉంది. ఇందులో కేవలం 1,251 ఏనుగులకు సంబంధించి మాత్రమే యాజమాన్య హక్కులను వాటిని వినియోగిసుస్తున్న వ్యక్తులు చూపుతున్నారు. ప్రధానంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రక్షణ అవసరాలతో పాటు బరువైన మొద్దులను లాగేందుకు ఏనుగులను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది. అయితే, 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సొంత అవసరాలకు ఏనుగులను వినియోగించడం నిషేధించబడింది. అయినప్పటికీ ఈ వ్యవహారం ఇంకా అనధికారికంగానే కొన్ని రాష్ట్రాల్లో సాగిపోతోంది. అలా చేయడం ఏనుగులను బానిసలుగా మార్చడమేనని, వాటిని గంటల తరబడి నిలబెట్టడం, తరలింపు సమయంలో రోజుల తరబడి ప్రయాణం వంటివి వాటిని క్షోభకు గురి చేస్తాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఆ మినహాయింపుతో.. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) చట్టాన్ని 1972లో రూపొందించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని సవరణలు చేసింది. వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2021 పేరుతో కొన్ని సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2021లోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగా.. అది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చేరింది. తాజాగా రాజ్యసభలో కూడా ఆమోదం పొందటంతో త్వరలో వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2022 కాస్తా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్ట రూపంలో అమల్లోకి రానుంది. గతంలో ఉన్న చట్టంలో ఏనుగులను సంరక్షించేందుకు అనేక అంశాలు తోడ్పడేవని.. తాజాగా చట్టంలో సెక్షన్ 43(2) ప్రొవిజన్ చేర్చడంతో చిక్కు వచ్చిపడిందని చెబుతున్నారు. పాత చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి లేకుండా ఏ అడవి జంతువునైనా కలిగి ఉంటే అది వేటాడటం కిందకు వస్తుంది. కానీ.. విద్య, శాస్త్ర పరిశోధనల కోసం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో ఏనుగులను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అది కూడా సెక్షన్ 12 నిబంధనలకు లోబడి మాత్రమేనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా వినియోగించుకునే వెసులుబాటు కూడా ఆయా జంతువుల సంరక్షణ కేంద్రంగానే జరగాలని పేర్కొన్నారు. అయితే, తాజా సవరణల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రంగా అనే అంశాన్ని మినహాయించారనే ఆరోపణలున్నాయి. సులభంగా తరలించేందుకేనా! దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏనుగులను సులభంగా తరలించేందుకు ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ప్రధానంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మానవ అవసరాలకు ఉపయోగించుకునే (కేప్టివ్) ఏనుగులున్నాయి. వీటిని గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రదేశాలకు తరలించేందుకే కేంద్రం కొత్త చట్టం కేంద్రం తెచ్చిందనేది ప్రధాన ఆరోపణ. గుజరాత్లో ఏర్పాటు చేయనున్న అమ్యూజ్మెంట్ పార్కులతో పాటు కేరళలలోని దేవస్థానాల్లో ఏనుగులను ఉపయోగించేందుకు తాజా సవరణల అసలు ఉద్దేశమనేది పర్యావరణ ప్రేమికుల ఆందోళన. తద్వారా సహజసిద్ధంగా ఏర్పడిన ఏనుగు కారిడార్లను చెరిపివేయడం సరికాదని పేర్కొంటున్నారు. చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తాజా మార్పుల వెనుక ఉన్న అసలు కారణం తెలిసే అవకాశం ఉందని చెప్పక తప్పదు. -
జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి.. భయంకర దృశ్యాలు వైరల్
జంతువులతో జోక్స్ చేయడం మంచిది కాదు. చిన్నవైనా, పెద్దవైనా వాటితో సాహసాలు చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటుంది. జంతువులని ఎంత మచ్చిక చేసుకున్నప్పటికీ ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అనేక సార్లు అవి మనుషులకు హాని కలిగించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి భయంకర ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వైల్డ్ లైఫ్ పార్క్‌లోని ఉద్యోగిపై ఓ భారీ మొసలి అనూహ్యంగా దాడి చేసింది. దీనిని వైల్డ్ హార్ట్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ ఫేస్బుక్లో పోస్టు చేసింది. క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లోని క్రొకోడైల్ క్రీక్ ఫామ్‌లో సెప్టెంబర్ 10న ఈ భయానక సంఘటన జరిగింది. జూకీపర్ సీన్ లే క్లస్ రెండు మొసళ్లతో లైవ్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో హన్నిబల్ అనే 16 అడుగుల పొడవైన, 660 కేజీల బరువుండే పెద్ద మొసలి ఉంది. దాని పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. క్లస్ గత 30 సంవత్సరాలుగా ఈ భారీ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు. చదవండి: ఇలా కూడా ఉద్యోగాన్ని రిజెక్ట్ చేస్తారా!.. చైనా కంపెనీపై మండుతున్న నెటిజన్లు షోలో భాగంగా జూ కీపర్ ‘ఈ ఆఫ్రికా మొత్తంలో దీనిపై మాత్రమే నేను ఇలా కూర్చోగలను’ అంటూ మొసలి వీపుపై కూర్చున్నాడు. వెంటనే దాని నుంచి దిగి పక్కకు వెళ్తున్న అతనిపై ఆ మొసలి ఒక్కసారిగా ఎదురు తిరిగింది. తన పదునైన పళ్లతో ఆయన తొడను గట్టిగా పట్టేసి విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. జూ కీపర్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. కాగా క్రూర జంతువులతో ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
వైల్డ్‌లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరణ్యభవన్‌లో ‘వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ’రూపొందించిన వైల్డ్‌లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్‌ను మంత్రి ఆవిష్కరించారు. కిట్ పని తీరు, శాంపిల్స్ సేకరణ, వైల్డ్‌లైఫ్ డీఎన్ఏ పరీక్షల విశ్లేషణ తదితర అంశాలను సొసైటీ ప్రతినిధులు వివరించారు. వన్యప్రాణుల వధ జరిగినపుడు నేర పరిశోధనలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించడం, అవి సహజ మరణం పొందినప్పుడు వాటి పాదముద్రలు, గోళ్లు, వెంట్రుకలు, పెంట, మాంసాహార అవశేషాలను సేకరించి వాటి డీఎన్ఏ పరీక్షల విశ్లేషణ కోసం పంపుతామన్నారు. విచారణ సమయంలో న్యాయస్థానాలకు ఈ పరీక్షల రిపోర్టును సమర్పిస్తే, వాటి ఆధారంగా వేటగాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. నేర పరిశోధనలో ఆధారాల సేకరణలో ఫోరెన్సిక్ విభాగం ఎంతో కీలకమైందన్నారు. బయోలాజికల్ ఎవిడెన్స్ ద్వారా వేట గాళ్ళకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుందన్నారు. ఉపయోగించే తీరుపై అటవీ అధికారులకు శిక్షణ ఇచ్చి కిట్లను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
World Earth Day 2022: వరల్డ్ ఎర్త్ డే.. పక్షులకు సేనాపతి
పక్షుల కోసం ఒక సైన్యం ఉంటుందా? అదీ మహిళా సైన్యం. ఉంటుంది. అస్సాంలో ఉంది. అక్కడి అరుదైన కొంగలు అంతరించిపోతున్నాయని గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమ బర్మన్. ఈ సైన్యం కొంగలను రక్షిస్తుంది. ఈ నేల, ఆకాశం, జీవజాలం ఎంత విలువైనవో చైతన్యపరుస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ఎర్త్ డే సందర్భంగా ‘వన్ ఫర్ చేంజ్’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్ ఫిల్మ్స్ ప్రసారం చేయనుంది. వారిలో ఒకరు పూర్ణిమ బర్మన్. ఆమె పరిచయం. ఈ భూమిని అందరూ ఉపయోగించుకుంటారు. కొందరే భూమి కోసం తిరిగి పని చేస్తారు. మనల్ని కాపాడే భూమిని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసే వాళ్ల వల్లే మనం ఈ మాత్రం గాలిని పీల్చి, ఈ మాత్రం రుతువులను అనుభవిస్తున్నాం. అడవులని చూస్తున్నాం. కలుషితం కాని నదుల ప్రవాహంలో పాదాలు ముంచగలుగుతున్నాం. పిట్టలు, పొదలు మనవే అనుకుంటున్నాం. వీటి కాపలాకు ఉన్నది ఎవరు? పూర్ణిమ బర్మన్ ఒకరు. స్టూడెంట్ నుంచి యాక్టివిస్టుగా పూర్ణిమ దేవి బర్మన్‌ది గౌహటి. వైల్డ్‌లైఫ్ బయాలజీని ముఖ్యాంశంగా తీసుకుని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. 2007లో గ్రేటర్ అడ్జటంట్ స్టార్క్స్(పారిశుద్ధ్య కొంగలు) మీద పిహెచ్డి చేయడానికి కామరూప జిల్లాలోని దాదర గ్రామానికి వెళ్లింది. ఒకప్పుడు ఆగ్నేయాసియా లో ఉండే ఆ కొంగలు అంతరించిపోయే స్థితికి వచ్చి కేవలం అస్సాం, బిహార్లలో కనిపిస్తున్నాయి. ఇవి పారిశుద్ధ్య కొంగలు. అంటే మృతకళేబరాలను తిని శుభ్రం చేస్తాయి. పర్యావరణ వృత్తంలో వీటి పాత్ర కీలకం. ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చూడ్డానికి అందంగా ఉండవు. చెట్ల పైన గూళ్లు పెడతాయి. తేమ అడవులు వీటికి ఇష్టమైనా ఆ అడవుల స్థానంలో ఊళ్లు వెలుస్తూ రావడం వల్ల ఇవి గ్రామాల్లోనే చెట్ల మీద గూళ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. అయితే పూర్ణిమ వచ్చేంత వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. వీటిని గ్రామస్తులు బతకనిచ్చేవారు కాదు. ఇవి గూళ్లు పెట్టిన చెట్లను నరికేసేవారు. దాంతో అవి దిక్కులేనివి అయ్యేవి. అప్పుడే పూర్ణిమ ఆ గ్రామానికి వెళ్లింది. పీహెచ్‌డి ఏం చేసుకోవాలి? పూర్ణిమ వెళ్లేసరికి ఒక గ్రామంలో ఈ పారిశుద్ధ్య కొంగల గూళ్లు ఉన్న చెట్లను కూల్చేస్తున్నారు. అక్కడ ఆ కొంగలను ‘హార్గిల్లా’ అంటారు. ‘ఎందుకు కూలగొడుతున్నారు?’ అని పూర్ణిమ పోట్లాటకు వెళ్లింది. అప్పుడు వాళ్లు చెప్పిన జవాబు ఏమిటంటే– పెంట దిబ్బల మీద మృతకళేబరాలను తాను తిని పిల్లల కోసం కొంత ముక్కున పట్టి తెస్తుంది తల్లి. అలా తెచ్చేప్పుడు ఇళ్ల ముంగిళ్లలో డాబాల మీద కొంత జారి పడుతుంటుంది. అది నీçచుకంపు. పైగా దీని ఆకారం బాగుండదు కనుక దుశ్శకునంగా భావించేవారు. అందుకని వాటిని రాళ్లతో కొట్టి తరిమేస్తారు. ‘అదంతా విన్న తర్వాత జనాన్ని ముందు మార్చాలి... అదే అసలైన పిహెచ్డి అనుకున్నాను’ అంటుంది పూర్ణిమ. ఇక పిహెచ్‌డిని పక్కన పెట్టి హార్గిల్లాల సంరక్షణకు సంకల్పించుకుంది. విప్పారిన రెక్కలు 2007లో మొత్తం వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి. ఒక పక్షిజాతికి ఆ విధంగా పూర్ణిమ జీవం పోసింది. అందుకే ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. చైతన్యం కలిగించి సరిగ్గా పని చేయాలేగాని ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకొస్తారని ఈ ఉదంతం చెబుతోంది. పక్షులు వాలే చెట్టు ఉంటే భూమి బతికి ఉన్నట్టు అర్థం. భూమిని బతికించుదాం. హార్గిల్లా ఆర్మీ ఊళ్లలో మగవారు పనికిపోతారు. ఇళ్లలో ఉండేది... చెట్ల ౖపైన ఉండే కొంగలను కనిపెట్టుకోవాల్సింది స్త్రీలే అని గ్రహించింది పూర్ణిమ. హార్గిల్లాలు దుశ్శకునం కాదని– బా» ర్ చక్రవర్తి ఆ కొంగలు సంచరించే చోట నాగమణి దొరుకుతుందని నమ్మేవాడని చెప్పింది. ఊరు శుభ్రంగా ఉండాలంటే రోగాలు రాకుండా ఈ కొంగలే చేయగలవని చైతన్యం తెచ్చింది. ‘అరణ్యక్’ పేరుతో గౌహతిలో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ కింద దాదర, పచర్సా గ్రామాల్లోని 400 మంది స్త్రీలతో హార్గిల్లా ఆర్మీని తయారు చేసింది. తను ఆ ఆర్మీకి సేనానిగా మారింది. వీరి పని ఈ కొంగలను సంరక్షించడమే. అయితే వీరు బతికేది ఎలా? అందుకని మగ్గం పనిలో ఉపాధి కల్పించింది. ఆ మగ్గం వస్త్రాల మీద కూడా హాగ్రిల్లా కొంగల బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీరలు బాగా అమ్ముడుపోతున్నాయి. -
దుప్పి.. కళ్లుగప్పి
సత్తుపల్లి(ఖమ్మం) : తాళం వేసితిని.. గొళ్లెం మరిచితిని’అన్న చందంగా మారిన అటవీ శాఖాధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.1.7 కోట్లతో అర్బన్ పార్కును అభివృద్ధి చేశామని.. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలున్నాయి. సత్తుపల్లిలో అర్బన్ పార్కు ఏర్పాటు ప్రాంతంలో సహజ సిద్ధంగానే దుప్పులు, పునుగులు, కుందేళ్లు, తాబేళ్లు ఉన్నాయి. వీటిని సంరక్షించేందుకు అటవీశాఖ 375 ఎకరాల్లో కంచె, గోడల నిర్మాణం చేపట్టారు. ఇటీవల కొత్తూరు వైపు దుప్పి కంచె దాటుకుని సమీప ఇళ్లల్లోకి వెళ్లగా స్థానికులు పట్టుకుని అటవీశాఖకు అప్పగించారు. మరికొన్ని దుప్పులు కంచె దాటే క్రమంలో తీగలు తగిలి మృత్యువాత పడగా, రేజర్ల గ్రామానికి చెందిన ఒక దుప్పిని హతమార్చి మాంసం విక్రయించడంతో కేసులు నమోదయ్యాయి. గురువారం అర్ధరాత్రి కూడా జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైపు నుంచి దుప్పులు రోడ్లపై పరుగులు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల పార్కు నిర్వహణ పేరిట రుసుము కూడా వసూలు చేయడం ఆరంభించిన అటవీ అధికారులు వన్య ప్రాణుల సంరక్షణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -
అంతరించిపోయేలా ఉన్నాం.. మమ్మల్ని కాపాడండయ్యా!
-
అంతరించిపోయేలా ఉన్నాం.. మమ్మల్ని కాపాడండయ్యా!
World Wildlife Day Special: ‘‘మా బతుకు మేం బతుకుతున్నాం. మా సరిహద్దుల్లోకి వచ్చేది మీరు. అనవసరంగా మమ్మల్ని బలిగొనేదీ మీరే. మా కుటుంబం ప్రకోపాన్ని చూపిస్తే తట్టుకోగలరా మీరు?. కానీ, అలా చేయం. ఎందుకంటే.. మాకంటూ అడవి ధర్మం ఉంది. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అంతరించిపోతున్న మా జాతుల్ని వీలైతే పరిరక్షించి పుణ్యం మూటగట్టుకోండి’’ మూగ జీవాలకు మాటొస్తే.. కచ్చితంగా మనుషులతో ఇలాగే మొరపెట్టుకుంటాయేమో. భూమ్మీద వృక్షజాలం, జంతుజాలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదే. ఆ బాధ్యతను గుర్తు చేసేందుకే ఒక రోజు ఉంది. ఇవాళ(మార్చి 3వ తేదీ) వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే. వైల్డ్‌లైఫ్ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా అవగాహన కల్పించే రోజు. అంతేకాదు అందమైన వాటి ప్రపంచం గురించి ప్రస్తావించుకునే రోజు కూడా. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వనజీవుల సంరక్షణ కోసం చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో కొత్తగా అర్టిషిషియల్ టెక్నాలజీ (AI) ద్వారా అంతరించిపోతున్న దశలో ఉన్న జంతువుల్ని గుర్తించడం, తద్వారా వాటి పరిరక్షణకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని భావిస్తున్నారు. 1973లో సైట్స్ (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఆ తేదీని World Wildlife Dayగా పరిగణించాలని డిసెంబర్ 20, 2013లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తీర్మానించింది. వైల్డ్‌లైఫ్ డే సందర్భంలో మన గడ్డ మీద ఉండి.. అంతరించిపోయే దశకు చేరుకున్న ఆరు జాతుల గురించి చర్చించుకుందాం. ఏషియాటిక్ లయన్ ప్రపంచంలోనే అతిపెద్ద రెండో జాతి ఇది. రాజసం ఉట్టిపడే సింహాలకు.. గుజరాత్ ‘గిర్’ శాంక్చురీ దీనికి అడ్డా. కానీ, చాలా ఏళ్ల కిందట భారత్‌లోని ఉత్తర, మధ్య తూర్పు ప్రాంతాల్లోనూ వీటి సంఖ్య ఎక్కువగా ఉం డేది. అంతరించిపోతున్న క్రమంలో వీటి పరిరక్షణకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీలగిరి మార్టెన్ దక్షిణ భారత దేశంలో.. అందునా నీలగిరి కొండల్లో కనిపించే అరుదైన మార్టెన్ జాతి ఇది. తమిళనాడు, అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కేరళ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనూ వీటి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వీటి సంఖ్య వెయ్యి లోపే ఉంది. అందుకే ఐయూసీఎన్ (International Union for Conservation of Nature) ఈ జాతిని రెడ్ లిస్ట్‌లో చేర్చింది. మంచు చిరుత ఔన్స్ అని ముద్దుగా పిల్చుకునే ఈ జాతి.. అరుదైన జీవుల్లో ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో, హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ నేషనల్ పార్క్‌లో, ఉత్తరాఖండ్ నందా దేవి నేషనల్ పార్క్‌లో ఇవి కనిపిస్తాయి. శరవేగంగా వీటి జనాభా క్షీణించి పోగా.. ప్రస్తుతం మొత్తంగా పది వేల లోపే మంచు చిరుతలు ఉంటాయని అధికారులు లెక్కలు వేశారు. సంగై అనిమిలీయా కుటుంబంలోని దుప్పి జాతి సంగై (Brow-antlered Deer). మణిపూర్ లోక్టక్ సరస్సును ఆనుకుని ఉన్న కెయిబుల్ లామ్జావో నేషనల్ పార్క్‌లో ఇవి కనిపిస్తాయి. ఇక్కడో ప్రత్యేకత ఏంటంటే.. సంగై ఆ రాష్ట్ర జంతువు. డ్యాన్సింగ్ డీర్ పేరుతో వీటి మీద జానపద కథలు సైతం ప్రచారంలో ఉన్నాయి. సింహపు తోక మకాక్ వాండెరూ.. సింహపు తోక మకాక్(కోతులు). ప్రపంచంలోనే అతి పురాతనమైన, అరుదైన జాతిగా వీటిని చెప్తుంటారు రీసెర్చర్లు. కేరళ షెండూర్నీ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో ఇవి కనిపిస్తాయి. ఒంటికొమ్ము రైనో వేట, కొమ్ముల అక్రమ రవాణాతో క్షీణించే దశకు చేరుకున్న జాతి ఇది. కజిరంగ నేషనల్ పార్క్ (అస్సాం), దుద్వా టైగర్ రిజర్వ్(యూపీ), పోబిటోరా వైల్డ్‌లైఫ్ శాంక్చురీ(అస్సాం)లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను రక్షించడం అనే థీమ్‌తో ఈ ఏడాది వరల్డ్ వైల్డ్‌లైఫ్ డేని నిర్వహిస్తున్నారు. There are over 22,000 endangered & critically endangered species on the IUCN Red List. Continued species loss is a threat to people and planet. For #WWD2022, let us all support conservation of vulnerable plants and animals. Learn more: https://t.co/hW7VtdeXHK #RecoverKeySpecies pic.twitter.com/AtjMmtVCio — World Wildlife Day (@WildlifeDay) February 22, 2022 పరుగు, పుట్రా, మొక్కలే కాదు.. పరిమాణంలో పెద్ద జంతువులు సైతం మనిషి నిర్లక్ష్యానికి బలై అంతరించే దశకు చేరుకోగా.. ఇప్పటికే కొన్ని అంతరించిపోయాయి కూడా. -సాక్షి, వెబ్ స్పెషల్ -
అభయారణ్యాల్లో ‘అండర్‌పాస్’లకు అనుమతి
నిర్మల్/నిర్మల్‌టౌన్/సాక్షి, హైదరాబాద్: అభయారణ్యాల్లో రహదారులు వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా, అవి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్‌పాస్‌లు నిర్మించాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. నిర్మల్‌లోని అటవీశాఖ కార్యాలయంలో గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్మల్ నుంచి మంత్రి పాల్గొనగా, అరణ్య భవన్ నుంచి అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. అభయారణ్యాల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేలా రహదారుల వద్ద ముఖ్యమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణం, వాహనాల వేగ నియంత్రణ, రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం, పులుల గణన.. తదితర అంశాలపై సమావేశాలో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసమే అండర్‌పాస్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర వన్యప్రాణి మండలి నుంచి త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవిలో వన్యప్రాణుల దాహాన్ని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నెహ్రూ జూపార్క్ అభివృద్ధికి చర్యలు.. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ‘నెహ్రూ జూలాజికల్ పార్కు’ను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి అధ్యక్షతన జాపాట్ (జ్యూస్ అండ్ పార్కస్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) కార్యవర్గ సమావేశాన్ని కూడా వర్చువల్ విధానంలో నిర్వహించారు. నెహ్రూ జూలాజికల్ పార్కుతోపాటు రాష్ట్రంలోని 8 పార్కుల్లో వన్యప్రాణుల సంరక్షణ, పార్కుల అభివృద్ధి, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రత్యేక చర్యలపై చర్చించారు. కాగా, నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. టికెట్ బుకింగ్, విరాళాలు, వన్యప్రాణుల దత్తత వంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డొబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎ.కె. సిన్హా, బోర్డు సభ్యులు ఎమ్మెల్యే కోనప్ప, రాఘవ, జూ పార్క్ డైరెక్టర్ ఎంజే అక్బర్, సీఎఫ్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన నల్ల చిరుతని ఎప్పుడైనా చూశారా..?
మైసూరు(కర్ణాటక): వన్యజీవుల ప్రపంచంలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి సందర్శకులకు కనువిందు చేసింది. మైసూరు జిల్లాలో ఉన్న హెచ్డీ కోటె తాలూకాలో నాగరహొళె అభయారణ్యంలోని దమ్మనకట్టి రేంజిలో సోమవారం సఫారీకి వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత దర్శనమిచ్చింది. దీంతో సందర్శకులు తమ కెమెరాలకు పనిచెప్పారు. అరుదైన నల్ల చిరుత ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ఇక్కడ ఏనుగులు, పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. చాలా అరుదుగా నల్ల చిరుత బయటకు వస్తూ ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: ఆ ఫొటోలు మైనర్‌కు పంపిన శాంతిప్రియ.. భరత్ దక్కడేమోనని.. -
వేట.. పేలుతున్న తూటా
రుద్రవరం: అధికారుల కన్నుకప్పి కొందరు నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట సాగిస్తున్నారు. వన్యప్రాణుల మాంసానికి, చర్మానికి మంచి డిమాండు ఉండటంతో రహస్యంగా వేట కొనసాగిస్తున్నారు. కొందరు నాటు తుపాకులతో వేటాడుతుండగా, ఇంకొందరు ఉచ్చులు బిగించి వాటిలో చిక్కిన వన్యప్రాణులను హతమార్చి.. వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం, చెలిమ రేంజి పరిధిల్లో ఈ తతంగం సాగుతోంది. నేల రాలుతున్న జింకలు నంద్యాల డివిజన్లో రుద్రవరం, చెలిమ రేంజిలలో వేలాది హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి మండలాల్లోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఆయా గ్రామాల వారంతా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మరక్షణ నిమిత్తం కొందరు నాటు తుపాకులు, వేట కొడవళ్లు కలిగి ఉన్నారు. కాలక్రమేణా వాటిని జంతువులను వేటాడేందుకు వినియోగిస్తున్నారు. వీరు ఆయుధాలతో రహస్యంగా అడివిలోకి వెళ్లి వన్య ప్రాణులను ప్రధానంగా జింకలను హతమార్చుతున్నారు. మాంసాన్ని బయటకు తరలించి కిలో రూ.500 ప్రకారం విక్రయిస్తున్నా రని సమాచారం. నామమాత్రపు దాడులు వేటగాళ్ల చేతుల్లో జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సమాచారం అందిస్తే నామమాత్రపు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రుద్రవరం మండలం హరినగరం వద్ద బహిరంగంగా వన్యప్రాణి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడిచేసి నిందితులను వదిలిపెట్టి కేవలం మాంసాన్ని స్వాధీనం చేసుకొని ఆపై అగ్నిలో కాల్చివేశారు. అదే గ్రామంలో ఓ నాటు తుపాకీ కూడా లభించింది. అయినప్పటికీ నిందితుడికి సరైన శిక్ష వేయించలేక పోయారు. అటవీ ప్రాంతంలో మరో నాటు తుపాకీ దొరికినట్లు చూపించారు. అలాగే ఇటీవలే గోస్పాడు మండలం దీబగుంట్ల వద్ద ఇరువురు నిందితులు జింక మాంసంతో పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆళ్లగడ్డ మండలం పెద్దకందుకూరు మెట్ట ఆల్ఫా కళాశాల సమీపంలో జింకను వేటాడినట్లు చెప్పారు. కొరవడిన సంరక్షణ వన్య ప్రాణులు అటవీ ప్రాంతంలో జీవించలేక బయటకు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా రుద్రవరం మండలంలోని ఆర్.నాగులవరం, చందలూరు, తువ్వపల్లె, టీ.లింగందిన్నె, పేరూరు, శ్రీరంగాపురం, పెద్దకంబలూరు, అప్పనపల్లె, ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె, నల్లగట్ల, కందుకూరు, చింతకొమ్మదిన్నె, మిట్టపల్లె, చాగలమర్రి మండలం ముత్యాలపాడు, బోదనం తదితర ప్రాంతాలలో జింకల సంచారం అధికంగా ఉంటోంది. అటువంటి ప్రదేశాల్లో అధికారుల నిఘా కొరవడటంతో వేట యథేచ్ఛగా సాగుతోంది. మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు వద్ద తెలుగు గంగ 28వ బ్లాక్ ఉప ప్రధాన కాల్వలో ఒకే ప్రదేశంలో వరుసగా రెండు పెద్ద పులులు మృతి చెందాయి. వాటి మృతికి కారణాలు ఇంత వరకు కనుగొన లేకపోయారు. మిట్టపల్లె, నల్లగట్ల ప్రాంతాల్లో జింకల కళేబరాలు లభించాయి. ఇలా విచ్చలవిడిగా వేట సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వన్య ప్రాణులు, అడవి జంతువుల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉండని సిబ్బంది నల్లమల అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తామని బాధ్యతలు చేపట్టిన అటవీ అధికారులు అడవికి 20, 40 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డ, నంద్యాల వంటి పట్టణాల్లో నివాసాలు ఉంటున్నారు. పగటిపూట మాత్రం కార్యాలయాలు, ఠాణాల వద్ద అటుఇటు కలియతిరిగి వెళ్తున్నారు. రాత్రి సమయాల్లో అటవీ సంరక్షణ గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వన్యప్రాణులను వేటాడితే జైలే వేట కారణంగా నేలకొరుగుతున్న వన్య ప్రాణులపై రుద్రవరం రేంజి అధికారి శ్రీపతి నాయుడును వివరణ కోరగా వన్య ప్రాణులను వేటాడితే జైలుశిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇటీవల జరిగిన పలు సంఘటనలతో అటవీ శాఖ అప్రమత్త మయ్యిందన్నారు. ఇందులో భాగంగానే నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ట్రాప్ కెమెరాలు అమర్చామన్నారు. అలాగే వేట సాగే పలు ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అలాగే గ్రామాల్లో వన్య ప్రాణులను వేటాడితే కేసులు, పడే శిక్షలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫారెస్టు గదులు సక్రమంగా లేకçపోవడం వల్లే సమీప పట్టణాల్లో సిబ్బంది నివాసముంటున్నారని తెలిపారు. -శ్రీపతి నాయుడు, రుద్రవరం రేంజి అధికారి -
విచ్చలవిడిగా వన్య ప్రాణుల వేట
సాక్షి, హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో వన్యప్రాణులు, అరుదైన జంతువుల వేట, అక్రమ రవాణా క్రమంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో వీటి శరీర భాగాలకు డిమాండ్ పెరగడంతో అంతర్జాతీయ స్మగ్లింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పులులు, చిరుతల చర్మం, గోళ్లు, దంతాలు, ఎముకలు, కొవ్వు, మీసాలు, ఉడుముల జననాంగాలు, పాంగోలిన్ చర్మం, పొలుసులు, ముంగిస జుట్టు, పాములు, తాబేలు చర్మాలు ఇలా వివిధ శరీర అవయవాలకు విదేశాల్లో బాగా డిమాండ్ ఉంది. దీంతో మన అడవుల్లో వీటిని వేటాడేందుకు లేదా అక్రమ రవాణాకు అంతర్జాతీయ సంబంధాలున్న స్మగ్లింగ్ ముఠాలు పనిచేస్తున్నాయి. నిందితులను పట్టుకుంటున్నా ఈ గ్యాంగ్‌ల వెనక ఎవరున్నారు, వీటి తరలింపు అంతిమ లక్ష్యం లేదా గమ్యస్థానం ఏమిటో కనుక్కోవడంలో మాత్రం అటవీ అధికారులు, పోలీసులు విఫలమౌతున్నారు. వన్య ప్రాణుల వేట, తరలింపుపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణలో అటవీ శాఖ 24 గంటలు పనిచేసేలా ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ కంట్రోల్ రూంను, టోల్‌ఫ్రీ నంబర్‌ను గతంలోనే ఏర్పాటు చేసింది. ఈ నంబర్‌కు 6,500కు పైగా కాల్స్ రాగా వాటిలో నాలుగు వేల దాకా వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా, రక్షణకు సంబంధించినవే ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో అరణ్య భవన్ ప్రధాన కార్యాలయం నుంచే ఈ ఫిర్యాదులపై ఒక ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. మిగతా అన్ని ఫిర్యాదులపై జిల్లాల్లోనే కార్యాచరణ చేపడుతున్నారు. అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో ఒక యాంటీ పోచింగ్ స్క్వాడ్, ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లలో చెరొకటి, మిగతా 8 అటవీ సర్కిళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో సమన్వయంతో పాటు అటవీ, పోలీస్, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, రెవెన్యూ ఇంటలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, రైల్వేస్, సీఐఎస్ఎఫ్, ఫోరెన్సిక్, సీసీఎంబీ, జులాజికల్ సర్వే, బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్, పోస్టల్ తదితర జాతీయ స్థాయి ఏజెన్సీల అధికారుల సంయుక్త కృషితో దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల అరణ్యభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ తిలోత్తమ వర్మ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. -
అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..
వాషింగ్టన్ డీసిలోని నేచరల్ హిస్టరీ మ్యూజియం గురించి తరగతిగదిలో ఎన్నోసార్లు విని ఉన్నాడు సుయాస్. అక్కడ మొక్కల నుంచి జంతువుల వరకు, శిలల నుంచి శిలాజాల వరకు ఎన్నో కళ్లకు కడతాయి. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళతాయి. అలాంటి మ్యూజియంను జీవితంలో ఒక్కసారైనా చూడాలనేది సుయాస్ కల. చిత్రమేమిటంటే...పదిహేడేళ్ల వయసులో సుయాస్ తీసిన ఆరు మాసాల పులిపిల్ల ఫొటోను ఆ మ్యూజియంలో సంవత్సరం పాటు ప్రదర్శించారు. ఈ ఫొటో నేచర్స్ విభాగంలో బెస్ట్ ఫొటోగ్రఫీ ఏషియా అవార్డ్ అందుకుంది. ఎంత సంతోషం! భోపాల్(మధ్యప్రదేశ్)కు చెందిన సుయాస్ కేసరికి చిన్నప్పటి నుంచి వైల్డ్‌లైఫ్‌పై అంతులేని ఆసక్తి ఉండేది. తాను విన్న మృగరాజు, పులి, కుందేలు, నక్క...మొదలైన కథలు జంతుజాలంపై తనకు ఆసక్తిని కలిగించాయి. తన వయసు పిల్లలు టామ్ అండ్ జెర్రీలాంటి కార్టూన్ సీరియల్స్ చూస్తుంటే తాను మాత్రం జంతుజాలం, పర్యావరణానికి సంబంధించిన చానల్స్ చూసేవాడు. తాను చూసిన విశేషాలను స్నేహితులతో పంచుకునేవాడు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనే కాకుండా వేసవి సెలవులకు కోల్‌కతాకు వెళ్లినప్పుడు...బెంగాల్‌లోని జూపార్క్లను చూసేవాడు. చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. తన బాల్యంలో ఒకసారి... ఒక జూలో కటకటాల వెనకాల ఉన్న పులులను చూసి సంతోషంతో చప్పట్లు కొట్టాడు. ‘నువ్వు సంతోషంగా ఉన్నావు కాని అవి సంతోషంగా లేవు’ అన్నది అమ్మమ్మ. ‘ఎందుకు?’ అని ఆశ్చర్యంగా అడిగాడు సుయాస్. ‘వాటి నివాసస్థలం అడవులు. అక్కడే అవి సంతోషంగా, స్వేచ్ఛగా ఉండగలవు. జూ వాటికి జైలు మాత్రమే’ అని చెప్పింది అమ్మమ్మ. ఇక అప్పటి నుంచి అడవుల్లో జంతుజాలానికి సంబంధించిన జీవనశైలిని తెలుసుకోవాలనే ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చిన్నప్పటి ఆసక్తులు వేరు పెదయ్యాక కెరీర్ గురించి ఆలోచనల వేరు. చాలా సందర్భాల్లో చిన్నప్పటి ఆసక్తి బాల్యంలోనే ఆగిపోతుంది. అయితే సుయాస్ విషయంలో అలా జరగలేదు. కాలేజీ రోజుల్లో, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా తన ఆసక్తి తనను విడిచి పెట్టలేదు. అందుకే యూఎస్‌లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి అడవులను వెదుక్కుంటూ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక్కడ... అడవులు ఎన్నో తిరుగుతూ కన్జర్వేటర్లు, ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్లతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అడవులన్నీ తిరుగుతున్న క్రమంలో తనకొక విషయం అర్థమైంది. మనుషులు అడవులకు వస్తున్నారు, జంతుజాలం మనుషులను చూస్తుంది...కాని ఇద్దరికీ మధ్య ఎక్కడో గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. జంగిల్ పర్యటన వినోదానికి మాత్రమే పరిమితమైపోతుంది. అలా కాకుండా అడవిలో ప్రతి జీవి గురించి మనసుతో తెలుసుకోవాలి. అవి మనలో ఒకటి అనుకోవాలి.... ఇలా ఆలోచిస్తూ, తన ఆలోచనకు వేదికగా సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. రకరకాల జంతువుల గురించి చిన్న చిన్న మాటలతోనే లోతైన పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఊహించని స్థాయిలో ఫాలోవర్స్! అందులో యూత్ ఎక్కువ. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. అందుకే ‘20 సంవత్సరాల వ్యక్తి దృష్టికోణంలో ‘అడవి’ అనే టాపిక్‌ను తీసుకొని ఫిల్మ్సిరీస్ చేశాడు. మంచి స్పందన వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్) స్వచ్ఛంద సంస్థ చేయూత ఇచ్చింది. తమ పంటలను ధ్వంసం చేస్తున్నాయి అనే కారణంతో ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్యప్రదేశ్‌కు వస్తున్న 18 అడవి ఏనుగులపై దాడి చేయడానికి కొందరు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో వారి నుంచి ఏనుగులను రక్షించడమే కాదు, వారి పంటలు దెబ్బతినకుండా తన బృందాలతో కలిసి కంచెలు ఏర్పాటు చేశాడు సుయాస్. జంతుజాలం సంక్షేమం గురించి అడవంత విశాలమైన పనులు చేయాలనేది సుయాస్ కల. అందులో ఒకటి వైల్డ్‌లైఫ్ గురించి సొంతంగా వోటీటీ ప్లాట్‌ఫామ్ మొదలుపెట్టాలని! విజయోస్తు సుయాస్. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
మానవ తప్పిదం: వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టే!
వడ్రంగి పిట్టలంటే తెలియని వారుండరు. ముఖ్యంగా పల్లెల్లో స్వేచ్ఛగా విహరిస్తూ సందడి చేస్తుంటాయి. అవి రాత్రి పూట తమ పొడవాటి ముక్కును పదును చేసుకోవటం కోసం చెట్టు బెరడను గీకుతూ ఒక రకమైన శబ్ధం చేస్తుంటాయి. పైగా ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా చూపరులను కట్టిపడేసేలా ఉంటాయి. అలాంటి ఈ వడ్రంగి పక్షులు ఇక లేవని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అసలేం జరిగిందో ఏమిటో తెలుసుకుందామా! న్యూయార్క్: వడ్రంగి పిట్టలాంటి కొన్ని అరుదైన ప్రసిద్ధ పక్షి జాతులు, కొన్ని రకాలైన చేపలతో సహా దాదాపు 23 రకాల జాతులు అంతరించిపోయినట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ 23 జాతులు అంతరించిపోయినట్లు మాత్రమే కనుగొన్నట్లు పేర్కొంది. కానీ క్రమంగా మొక్కలు, జంతువులు కూడా అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని వన్య ప్రాణి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు అవి అంతరించిపోవడానికి ఓ కారణంగా తెలిపారు. భవిష్యత్‌లో ఇలా అంతరించిపోయేది మనకు ఇక సాధారణం కావచ్చని చెబుతున్నారు. (చదవండి: ‘విమాన సేవలను తిరిగి పునరుద్ధరించండి’) ఇటీవల దశాబ్దాలుగా అర్కాన్సాస్, లూసియానా, మిసిపిప్పి, ఫ్లోరిడా వంటి ప్రాంతాలతోపాటు ఆఖరికి చిత్తడి నేలలు ఉండే ప్రాంతాల్లో కూడా చేసిన పరిశోధనల్లో వడ్రంగి పిట్టల ఆచూకీ లభించలేదని యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ యూఎస్‌లోని మొలస్క్లు (నత్తలు, పీతలు) ఉండే తాగునీటి సరస్సుల్లో ఎక్కువగా ఈ వడ్రంగి పిట్టలు ఉంటాయని తెలిపారు. చివరిసారిగా ఆ ప్రాంతంలోనే చూసినట్లు యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ జీవ శాస్త్రవేత్త ఆంటోనీ ఆండి ఫోర్డ్ పేర్కొన్నారు. నీటి కాలుష్యం, పక్షుల ఈకల కోసం వాటిని చంపడం, అడవుల నరికివేత తదితర కారణాలతోపాటు మానవ తప్పిదాలే అవి అంతరించిపోవడానికి ప్రధాన కారణమని వెల్లడించారు. (చదవండి: పాకిస్తాన్ వైపుగా వెళ్తున్న గులాబ్ తుపాన్) -
వైల్డ్ ఇన్నొవేటర్ అడవి కూన
అడవిలో జాడలైన వాళ్లకు, అన్వేషణలో అడుగులు వీడని వాళ్లకు ‘వైల్డ్ ఇన్నొవేటర్ అవార్డు’ వస్తుంది! వన్య పరిశోధకుల వినూత్న దృష్టికి గొప్ప అభినందన వంటి ఈ అంతర్జాతీయ అవార్డుకు తొలిసారి ఒక భారతీయ మహిళ ఎంపికయ్యారు. యు.ఎస్. నుంచి ముగ్గురు, కెన్యా నుంచి ఇద్దరు, యు.కె., ఆస్ట్రేలియా కొలంబియా, మొజాంబిక్ నుంచి ఒక్కొక్కరు ఈ అవార్డును గెలుపొందగా.. ఇండియా నుంచి డాక్టర్ కృతి కారంత్ విజేత అయ్యారు. బహుమతి 75 లక్షల రూపాయలు. గౌరవం గగనమంత. విలువ భూగోళమంత. కృతి మాత్రం పుట్టినప్పటి నుంచీ అడవి కూనే! అరణ్యంలో వృక్షాలెన్నో, కృతి కెరీర్లో అవార్డులు అన్ని. అయితే ఇప్పుడొచ్చింది ప్రత్యేకమైన అవార్డు. ఒక విలక్షణమైన వృక్షంతో పోల్చదగిన పురస్కారం. యు.ఎస్. లోని ‘వైల్డ్ ఎలిమెంట్స్ ఫౌండేషన్’ ఈ అవార్డు ఇస్తుంది. బెంగళూరులోని ‘సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్’ (సి.డబ్లు్య.ఎస్.)లో కృతి చీఫ్ కన్సర్వేషన్ సైంటిస్ట్. వన్యప్రాణుల జీవనాన్ని అధ్యయనం చేసి, పరిశోధించి వాటి సంరక్షణకు వినూత్న విధానాలను కనిపెడుతుంటే శాస్త్రవేత్త. 42 ఏళ్ల కృతి ఎప్పటికప్పుడు అప్పుడే కొత్తగా అడవిని, అడవిలో పులులు, సింహాలను చూస్తున్నంత ఉల్లాసంగా ఉంటారు. నిజానికి ఆమె తనకు ఊహ తెలుస్తున్నప్పుడే అరణ్యమార్గంలోకి వచ్చేశారు! నాగర్హోల్ నేషనల్ పార్క్‌లో ఒక సాయంత్రం తాతగారి తెల్ల అంబాసిడర్ కారులో తండ్రి పక్కన కూర్చొని మెల్లిగా వెళుతున్నప్పుడు ఒక కందకంలో పులి ఆ చిన్నారి కంట పడింది. ఆ కొద్దిసేపటికే చిరుత దర్శనమిచ్చింది. ‘‘నాకది ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది’’ అంటారు కృతి. క్రమంగా కర్ణాటక లోని అటవీ ప్రాంతాలన్నీ ఆమె ఆట మైదానాలు అయ్యాయి. అందుకు తగిన కారణమే ఉంది. తండ్రి డాక్టర్ ఉల్లాస్.. టైగర్ బయాలజిస్ట్! తాతగారు డాక్టర్ శివరామ్ కారంత్ ప్రసిద్ధ రచయిత, పర్యావరణవేత్త. అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల వారితో కలిసి కృతి వన్య జీవన అధ్యయనం తర్వాతి కాలంలో జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత. ప్రకృతిని ప్రేమించే ఇద్దరు వ్యక్తుల దగ్గర పెరిగిన అమ్మాయి ప్రకృతినే కదా ప్రేమిస్తుంది. అయితే వన్యప్రాణుల సంరక్షణ శాస్త్రవేత్త అవుతానని అప్పుడు ఆమెక్కూడా తెలీదు. తల్లిలా, తండ్రిలా, తాతయ్యలా పీహెచ్డీ చేయాలని మాత్రమే అనుకుంది. నార్త్ కరోలీనా వెళ్లి అక్కడి డ్యూక్ యూనివర్శిటీలో పర్యావరణంపై పీహెచ్.డీ చేశారు కృతి. ఆ ముందు వరకు, ఆ తర్వాతా ఆమె చదివిన చదువులు, జరిపిన పరిశోధనలు, చేసిన ఉద్యోగాలు.. దేశంలో, విదేశాల్లో.. అన్నీ కూడా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించినవే. చివరికి తను పుట్టిన రాష్ట్రంలోనే పెద్ద సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ అవార్డు! 2011లో ‘నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వాళ్ల రిసెర్చ్ గ్రాంట్ రావడం, తర్వాతి ఏడాదే ‘ఎమర్జింగ్ ఎక్స్‌ప్లోరర్’గా గుర్తింపు పొందడం కృతి కెరీర్‌ని విస్తృతం చేశాయి. పది దేశాలు తిరిగి, పది సంస్కృతుల మనుషులతో కలిసిమెలిసి తిరగడం సాధ్యం అయింది. సాధారణంగా సైంటిస్టులు మనుషులతో కలవడానికి ఇష్టపడరు. కృతి మాత్రం ఎక్కడి మనుషులతో అక్కడి మనిషిలా కలిసిపోయారు. కర్ణాటక అరణ్య ప్రాంతాల చుట్టూ కనీసం రెండు వేల ఇళ్లకైనా వెళ్లి వాళ్లతో మాట్లాడి ఉంటారు కృతి! మాట వరకు పైన పది దేశాలను అన్నాం కానీ.. 40 దేశాలకు పైగానే ఆమె పర్యటించారు. అన్ని దేశాలు తిరిగిన ఆమె ఇండియా మొత్తం తిరగకుండా ఉంటారా! దేశంలోని అభయారణ్యాలన్నిటిలో ఒక అడుగు వేసి వచ్చారు. పరిశోధన అవసరమైన చోట అక్కడే కొన్నాళ్లు నివాసం ఉన్నారు. ఆమె పరిశోధనలు బి.బి.సి.లో, ఇంకా అనేక ప్రసిద్ధ చానళ్లలో సీరీస్‌గా వచ్చాయి. కృతి రియల్ లైఫ్ హీరోలు తండ్రి, తాత, తల్లి ప్రతిభ. ఇప్పుడు ఆమె తన కుటుంబంలోని ముగ్గురికి హీరో అయ్యారు. భర్త అవినాశ్ సొసలే, ఇద్దరు కూతుళ్లు.. ఆమె సెలవు రోజుల్లో ఆమెతో పాటు అడవిలో విహరించే వన్యప్రాణులు అయిపోతారు! వాళ్లతో పాటు ఇంట్లో నల, బఘీర అనే రెండు పిల్లులు వినిపించీ వినిపించనంతగా మ్యావ్ మ్యావ్ మంటూ పులుల్లా సోఫాలు ఎక్కి దిగుతుంటాయి. కృతి సాధించిన పరిశోధనల్లో ఒకటి.. ధ్వని, వాయు కాలుష్యాల నుంచి వన్య జీవులను సంరక్షించడం. -
విషాద గాథ: కొన్నాళ్లకు అవి కనిపించవు..
సాక్షి సెంట్రల్ డెస్క్: జూ.. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఒక ఇంటరెస్టింగ్ ప్లేస్.. రకరకాల జంతువులు, పక్షులు ఉండే ప్లేస్.. జూ సంగతి సరే.. అందులోని జంతువులకు ఈ భూమ్మీద ప్లేస్ కరువవుతోంది.. ఆ విషయం మీకు తెలుసా? అందుకే నేడు(ఏప్రిల్ 8) ‘నేషనల్ జూ లవర్స్ డే’ సందర్భంగా వాటి పరిస్థితి ఏంటో ఓసారి తెలుసుకుందాం.. భూమ్మీద పది లక్షల రకాల జంతువులు, వృక్షాలు, ఇతర జీవజాలం అంతరించేపోయే దశలో ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. 1900వ సంవత్సరం నుంచీ గమనిస్తే అంతరించిపోయే దశలో ఉన్నట్టుగా గుర్తించిన జీవుల శాతం ►భూమి మీద బతికే జీవుల్లో 20 శాతం ►ఇదే సమయంలో మొసళ్లు, కప్పలు, కొన్నిరకాల పాముల వంటి ఉభయచర జీవుల్లో 40 శాతానికిపైగా ►సముద్రాల్లో పగడపు దిబ్బలను ఏర్పాటు చేసే కోరల్స్లో 33 శాతం ►నీటిలోనే జీవించే జలచరాల్లో 30 శాతానికిపైగా మనమే చంపేస్తున్నాం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వన్యప్రాణుల హననం విచ్చలవిడిగా సాగుతోంది. అడవి జం తువుల చర్మం, దంతాలు, కొమ్ములు, గోర్లు, మాంసం కోసం చంపడం బాగా పెరిగిపోయింది. ►ప్రపంచంలోనే ఆఫ్రికా ఖండంలో ఏనుగుల సంఖ్య ఎక్కువ. స్మగ్లర్లు దంతాల కోసం ఇక్కడి అడవి ఏనుగుల్లో 65 శాతం ఏనుగులను గత పదేళ్లలోనే వధించారు. ► సౌతాఫ్రికాలో 2007 నుంచి 2013 మధ్య ఖడ్గ మృగాల వేట 7,700 శాతం పెరిగింది. ►ప్రపంచవ్యాప్తంగా జంతువుల అక్రమ వ్యాపారం విలువ ఏటా రూ.52 వేల కోట్ల నుంచి రూ. లక్షా 72 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా ప్లాస్టిక్.. భూతమే.. మనం నిత్యం వినియోగిస్తున్న ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు, వస్తువుల్లో చాలా వరకు సముద్రాల్లోనే డంప్ అవుతున్నాయి. ఇవి భారీ ఎత్తున జీవజాలం చనిపోవడానికి కారణమవుతున్నాయి. ►ప్రపంచవ్యాప్తంగా ఏటా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 80 లక్షల టన్నులు. ►ఈ ప్లాస్టిక్ వేస్ట్ ప్రభావం వల్ల అంతరించేపోయే దశకు చేరుకున్న సముద్ర జీవజాతులు.. సుమారు 600 జాతులు.. సముద్రాల్లో చేరిన మైక్రో ప్లాస్టిక్ ముక్కల (ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ పరిమాణం ఉన్నవి) సంఖ్య మన పాలపుంతలో ఉన్న కోట్ల నక్షత్రాల కన్నా 500 రెట్లు ఎక్కువ. పచ్చదనం పెరగట్లే.. పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి. అంతేస్థాయిలో జీవులూ అంతరించిపోతున్నాయి. ►ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అమెజాన్‌లో గత 50 ఏళ్లలోనే 17 శాతం తరిగిపోయింది. ►ప్రపంచవ్యాప్తంగా 2019లో ప్రతి నిమిషానికి 25–30 క్రికెట్ స్టేడియాల పరిమాణంలో అడవులను నరికేశారు. ►మొత్తంగా ఉష్ణమండల అడవుల్లోనే ప్రపంచంలోని సగం జీవజాలం బతుకుతోంది. అలాంటి ఉష్ణ మండల అడవుల విస్తీర్ణం ఏటా ఏకంగా 1.7 లక్షల కిలోమీటర్ల మేర తరిగిపోతోంది. మనమేం చేద్దాం.. భూమ్మీద జీవజాలం సంరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి పలు సూచనలు చేసింది. అందరూ కూడా వ్యక్తిగతంగా వీటిని అనుసరిస్తే.. అడవులను, జంతువులను కాపాడుకోవచ్చని పేర్కొంది. ఒక లక్ష్యంగా.. పర్యావరణంపై అతితక్కువ ప్రభావం పడేలా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, విద్యుత్, పెట్రోలియం ఉత్పత్తుల వృథాను అరికట్టడం వంటివి.. అందరికీ అవగాహన కల్పించి.. అడవి జంతువులు, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కాలేజీలు, స్కూళ్లు, ఇతర చోట్ల అవగాహన కల్పించాలి. వినియోగంలో బాధ్యత.. అడవుల నుంచి అక్రమంగా తరలించే ఉత్పత్తులు, వస్తువులు, ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దు. అలాంటి వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. సమాచారం ఇవ్వాలి.. అడవి జంతువుల అక్రమ రవాణా, వాటి మాంసం, ఇతర ఉత్పత్తుల విక్రయాలు వంటివాటి గురించి తెలిస్తే.. వెంటనే ప్రభుత్వాధికారులకు సమాచారం ఇవ్వాలి. అడవి జంతువులు తగ్గిపోయిన తీరు... చదవండి: సెకండ్ వేవ్: సర్జరీలకు కరోనా బ్రేక్! ఆ ఒక్కటీ పాయె -
తాజ్‌మహల్ వద్ద పైథాన్ హల్చల్
న్యూఢిల్లీ: సాధారణంగా తాజ్‌మహల్ సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మంగళవారం అనుకోని అతిధిలా ఓ పైథాన్ వచ్చేసి హల్చల్ చేసింది. తన రాకతో అక్కడి స్థానికులను, తాజ్‌మహల్ సిబ్బందిని కాసింత భయభ్రాంతులకు గురి చేసింది. వెస్ట్ గేట్ వద్ద ఉన్న పర్యాటక పోలీసు అధికారుల టికెట్ కౌంటర్ వద్ద 5 అడుగుల పొడవైన ఇండియన్ రాక్ పైథాన్‌ను చూసి జనం షాకయ్యారు. వారు వెంటనే స్పందించి సమీపంలోని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ టీంకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. పైథాన్‌ను కొన్ని గంటల పాటు పరిశీలనలో ఉంచి, ఆ తరువాత పక్కనే ఉన్న అడవిలోకి విడిచి పెట్టారు. వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ను సమాచారం అందించిన టూరిజం పోలీస్ కానిస్టేబుల్ విద్యాభూషణ్ సింగ్ మాట్లాడుతూ.. పైథాన్‌ను టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నట్లు మొదట స్థానిక పర్యాటకులు గుర్తించారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాలల్లో ప్రజలను అప్రమత్తం చేసి , అటు పక్క ఎవరు రాకుండా చూశాము. ఈ లోగా ఎస్ఓఎస్ రెస్క్యూ టీం రావడంతో పాముని పట్టుకోగలిగామని అన్నారు. వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు ,సిఇఒ కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ..పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి సరైన సమయంలో వైల్డ్ లైఫ్ రక్షణ టీం కు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే పాములు చాలా సున్నితమైన ప్రాణులు, జాగ్రత్తగా వ్యవహరించకుండా ఉంటే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ( చదవండి: రిపోర్టర్ మైక్ లాక్కొని కుక్క పరుగో పరుగు..చివరికి ) -
క్లిక్ చేసే వన దేవతలు
పురుగును నోట కరుచుకున్న పిట్ట గూడుకు గెంతే సమయంలో క్లిక్‌మంటుంది. గట్టున బద్దకపు నిద్ర వదిలించుకున్న మొసలి తిరిగి నీళ్లల్లో దబ్బున పడే సమయాన క్లిక్. చిరుతపులి ఏమీ చేయనక్కర్లేదు. కాస్త కళ్లు మిటకరించినా చాలు– క్లిక్. ఒక ఏనుగు, తొండంతో తన గారాలపట్టిని దగ్గరగా లాక్కుంటుంది... క్లిక్కే. భీతహరిణి సౌందర్యాన్ని క్లిక్‌మనిపించే అదృష్టం అందరికీ ఉండదు. గడప దాటి అడవికి చేరి వనాలలో తిరుగుతూ వన్యప్రాణి సౌందర్యాన్ని చూపే స్త్రీలు ఉన్నారు. ఆర్జూ ఖురానా, రాధికా రామస్వామి, అపరూప డే, అర్పిత ఎస్.మూర్తి, కృష్ణకుమారి... ఈ భారతీయ మహిళా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లను తెలుసుకుని ఉండాలి మనం. 50,000 ఎంట్రీలు ప్రపంచవ్యాప్తంగా వస్తే వాటిలో గట్టిగా నిలిచిన మన భారతీయ మహిళా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ ఐశ్వర్య శ్రీధర్ గత సంవత్సరం ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2020’ అవార్డు గెలుచుకుని మన దేశం పేరును రెపరెపలాడించినప్పుడు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీని సీరియస్‌గా సాధన చేస్తున్న మహిళలపై అందరి దృష్టి పడిందని చెప్పాలి. వన్యప్రాణుల అపురూప లిప్తలను కెమెరాల్లో బంధించే ఈ స్త్రీలు ఆ పనిలో పొందే ఆనందాలను, ఎదుర్కొనే సవాళ్లను కూడా తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఏర్పడింది. సాధారణంగా పురుషులకు వీలయ్యే పనిగా ఉన్న ఈ రంగం స్త్రీల ప్రవేశంతో కొత్త కెమెరా చూపును పొందిందని చెప్పాలి. వన్యప్రాణుల పట్ల మాతృస్పర్శతో ఈ స్త్రీలు తీసే ఫొటోల వల్ల వాటి సంరక్షణకు సంబంధించిన చింతన అందరికీ వస్తుంది. ఇష్టమైన పని... కష్టమైన పని బాలీవుడ్ చిత్రం ‘3 ఇడియెట్స్’లో మాధవన్ పాత్రకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కాని తల్లిదండ్రులు అతణ్ణి ఐఐటిలో చేర్పిస్తారు. ఇంజినీరు అవమని పోరుతుంటారు. వారిని ఒప్పించి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారడం అతడికి తలకు మించిన పని అవుతుంది. పురుషులకు కూడా రిస్క్ అని భావించే ఈ పనిలో స్త్రీలు అడుగుపెట్టడం సామాన్యం కాదు. కుటుంబం నుంచి సమాజం నుంచి వీరి పట్ల ఒక ‘కన్సర్న్’ వ్యక్తమవుతూ ఉంటుంది. ‘ప్రమాదం కదూ... ఎందుకొచ్చిన తిప్పలు... ఈ ఫొటోలు తీస్తే ఏం వొస్తుంది’ ఇలాంటి కామెంట్స్ వస్తాయి. కాని ఈ మహిళా ఫొటోగ్రాఫర్లు ఈ అడ్డంకులన్నీ దాటి ముందుకు వచ్చారు. ‘ఒక కెమెరా అందుకో. వనాలలో ప్రవేశించు. వన్యప్రాణులను క్లిక్ చెయ్’ అనే సింపుల్ నినాదంతో కెమెరా పట్టుకుని అడవుల్లో తిరుగుతున్న మహిళా ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. తొలి ఫొటోగ్రాఫర్ వసుధ భారతదేశ తొలి వైల్డ్‌లైఫ్ మహిళా ఫొటోగ్రాఫర్‌గా బెంగళూరుకు చెందిన వసుధ చక్రవర్తిని చెప్పాలి. ఆమె నీలగిరి అడవుల్లో స్థానిక గిరిజనుల సహాయంతో అద్భుతమైన వన్యప్రాణి ఫొటోలను తీసింది. వన్యప్రాణుల మీద ఇష్టంతో ఇంటర్నేషనల్ బ్యాంక్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కుటుంబ వ్యతిరేకతను పొందింది. కాని ఒక అమాయక జంతువు కళ్లల్లోకి చూస్తే ఎంత పెద్ద కష్టమైనా మర్చిపోవచ్చు కదా అంటుంది. ‘తెలిసిన విషయాలు కొన్ని తెలియని విషయాలు కొన్ని. రెంటి మధ్య తలుపులు ఉంటాయి. చేయవలిసిందల్లా ఆ తలుపులు తెరుచుకుని తెలుసుకోవడమే’ అంటుంది వసుధ. కాని ఆ తలుపులను తెరిచే శక్తి స్త్రీలు పొందవలసి ఉంటుంది. స్వీయ ప్రయత్నం చేయాలి. కుటుంబం మద్దతు తీసుకోవాలి. రాధికా రామసామి మరో నలుగురు వసుధ చక్రవర్తి లానే రాధికా రామసామి కూడా భారతదేశంలో తొలితరం మహిళా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్. చెన్నైకు చెందిన రాధిక ఢిల్లీలో స్థిరపడి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో పక్షులను కెమెరాలో బంధించడం ప్రారంభించింది. భారతదేశంలోని అన్ని అభయారణ్యాల్లో తిరిగి అంతరించిపోతున్న అరుదైన పక్షులను ఫొటోలు తీసింది. ఆ తర్వాత ఆఫ్రికా అడవుల్లో కూడా ఆమె కెమెరా ఫొటోల వేట కొనసాగించింది. ‘మనకు ప్రకృతి ఎంత సమృద్ధమైన వనరులు ఇచ్చిందో అడవుల్లో తిరిగితే తెలుస్తుంది.’ అంటుంది రాధికా రామసామి. ఢిల్లీకే చెందిన ఆర్జూ ఖురానా ఇటీవల ఈ రంగంలో పేరు గడిస్తోంది. ‘మిమ్మల్ని ప్రకృతితో ప్రేమలో పడవేయించడం, వనాల పట్ల గౌరవం కలిగేలా వర్ణ చిత్రాలలో మునకలేయించడమే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పని’ అంటుంది ఆర్జూ. ఇక కోల్‌కటాకు చెందిన అపురూప డే రెక్కలల్లార్చే పక్షులను క్లిక్ మని పించడంలో ఎక్స్పర్ట్. ‘మీరు ఎక్కడికైనా వెళ్లండి. మీ కోసం ఒక పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది’ అంటుందామె. కాలు కుదురుగా ఉండదని ఈ అమ్మాయికి పేరు. అలాగే అర్పిత ఎస్.మూర్తి చిరుతపులులను ఫొటోలు తీసే చిరుతగా గుర్తింపు పొందింది. మన తెలుగు వెలుగు కృష్ణకుమారి తెలుగు వనిత అయిన కృష్ణకుమారి ఒకటి రెండేళ్ల క్రితం సెల్‌ఫోన్‌తో ప్రకృతి చిత్రాలు తీయడాన్ని హాబీగా మొదలెట్టింది. కాని నేడు ఆమె నికాన్ డి 500 ఉపయోగించే ప్రొఫెషనల్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగింది. ‘ఒకప్పుడు నేను ఇతరులు తీసే ఫొటోలను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఇవాళ నేను తీసిన ఫొటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు’ అంటుందామె. ఇద్దరు పిల్లల తల్లి, వృత్తిరీత్యా జియోఫిజిసిస్ట్ అయిన కృష్ణకుమారి కుటుంబం ప్రోత్సాహంతో ఈ రంగంలో దూసుకువెళుతున్నారు. ‘ప్రకృతిలో ఆశ్చర్యాలకు అంతులేదు. తీస్తూ పో. పంచుతూ పో’ అంటారామె. ఇందుకోసం ఢిల్లీ బర్డ్ఫోటోగ్రాఫర్స్ గ్రూప్‌లో చేరి తర్ఫీదు పొందింది.వన్యప్రాణులు తమ జీవితాన్ని ప్రదర్శనకు పెట్టవు మనుషుల్లాగా. వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. వాటి రక్షణకు నిలవాల్సింది మనమే. వారికీ మనకూ వాహకులుగా నిలిచే పని ఈ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్స్ చేస్తున్నారు. మహిళ చేతుల్లో కెమెరా కుదురుగా ఉన్న పసిపాపలా ఉంటుంది. ఆ పసిపాప ప్రతి క్లిక్ దివ్యం. ప్రతి స్నాప్ స్వచ్ఛం. - సాక్షి ఫ్యామిలీ -
నీళ్లు తాగేందుకు వస్తే.. కాళ్లు నరికారు
సాక్షి, కొత్తగూడ: నీళ్లు తాగేందుకు వచ్చిన వన్యప్రాణి సాంబర్ డీర్ కాళ్లను దుండగులు కిరాతకంగా నరికారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండా సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. రేణ్యాతండా, చిన్నతండా మధ్య ఉన్న చెరువులో నీళ్లు తాగడానికి సాంబర్ డీర్ రాగా, కొందరు యువకులు గట్టిగా అరిచారు. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...) భయపడిన జంతువు చెరువులోకి దిగి ఈదుకుంటూ కట్ట ఎక్కి పొలాల్లోకి దిగింది. అక్కడ బురదగా ఉండడంతో పరుగెత్తలేక నిలిచిపోయింది. సదరు యువకులు గొడ్డళ్లతో వెంబడిస్తూ జంతువు వెనక వైపు కాళ్లు నరికారు. రెండు కాళ్లు విరిగిన సాంబర్ జింక గట్టిగా అరవడంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. వన్యప్రాణిని ట్రాక్టర్లో హన్మకొండలోని వనవిజ్ఞాన కేంద్రానికి తరలించి శస్త్రచికిత్స చేయించారు. చదవండి: (అడవంతా జల్లెడ!) -
అందాల పోటీలో ఆంధ్రా సీతాకోకచిలుకలు
బుట్టాయగూడెం: జాతీయ స్థాయి ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేయడానికి జరుగుతోన్న ఫైనల్ పోటీలో మొత్తం 7 రకాలు ఎంపిక కాగా, వాటిలో పాపికొండల అభయారణ్యంలో ఉండే మూడు రకాల సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి. 2021 సంవత్సరానికి కొనసాగుతోన్న ఈ పోటీలో పశ్చిమగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలోని కామన్ జేజేబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేసేందుకు ఆన్లైన్ ఓటింగ్ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 8 వరకూ ఆన్లైన్ ఓటింగ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని వైల్డ్‌లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సి.సెల్వమ్ తెలిపారు. ► పాపికొండల అభయారణ్యంలో సుమారు 130 రకాల రంగురంగుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. ముఖ్యంగా కొలనులు, చెరువులు, వాగుల సమీపాల్లో రకరకాల సీతాకోకచిలుకలు గుంపులుగా ఏర్పడి అలికిడైన సమయంలో ఒక్కసారిగా ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. ► ఇక్కడున్న వాటిల్లో తుది జాబితాకు ఎంపికైనవి అరుదైన రకాలని వైల్డ్‌లైఫ్ శాస్త్రవేత్త కె.బాలాజీ తెలిపారు. దాదాపు 9 నెలలపాటు కష్టపడి ఫోటోలు సేకరించి పోటీల్లో వాటిని పెట్టినట్లు చెప్పారు. ఇక్కడి సీతాకోకచిలుక జాతీయ స్థాయిలో ఎంపికైతే ఈ ప్రాంతానికి మరింత పేరు వస్తుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ► ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత జాతీయ సీతాకోకచిలుకను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటిస్తారని వైల్డ్‌లైఫ్ అధికారులు తెలిపారు. -
ఈ దృశ్యాన్ని చూసి జడుసుకోవాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ఎవరు ఈ దృశ్యాన్ని చూసినా జడుసుకోవాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త ఆడమ్ థార్న్ ముఖానికి అద్దాల ఫేస్‌మాస్క్ ధరించి ఆరడుగుల కొండ చిలువతో చిన్న ఫైట్‌కు దిగారు. కుడి చేతిని మోచేతి వరకు గట్టిగా మడిచి దమ్ముంటే తనపై దాడి చేయమని సవాల్ చేసినట్లున్నారు. ఆ కొండ చిలువ హఠాత్తుగా పైకి లేచి బార్లా తెరిచిన నోటితో థార్న్ మోచేతిని గట్టిగా పట్టి పీకింది. ఆ మంటను పంటి భిగువున థార్న్ భరించాల్సి వచ్చింది. పాములను పట్టడంలో అపార అనుభవం కలిగిన మిత్రుడు రాబ్ అల్లేవా సమక్షంలో ఈ ఫీటు నడిచింది. గట్టిగా థార్న్ చేతిని పట్టుకున్న కొండ చిలువను రాబ్ అల్లేవా లాగేశాడు. ఈ క్రమంలో కొండ చిలువ ఆయన్ని కూడా కాటేసింది. అనంతరం కొండ చిలువ పట్టి పీకిన చోట థార్న్ కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. వీరిద్దరు ‘హిస్టరీ ఛానెల్’లో ప్రసారం చేయడం కోసం ‘కింగ్స్ ఆఫ్ పెయిన్’ పేరిట ఓ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. అందులో భాగంగా థార్న్ ఈ ఫీట్‌ను నిర్వహించారు. ఈ సిరీస్ డాక్యుమెంటరీలో భాగంగా వీరిద్దరు కొన్ని వందల సార్లు వివిధ రకాల పాములు, జంతువులతో ఇలా కరిపించుకున్నారు. థార్న్ వన్యప్రాణి బయోలజిస్ట్. తన మిత్రుడు రాబ్‌తో కలిసి ప్రపంచంలోని పలు దట్టమైన అడవుల్లోకి వెళ్లి వివిధ రకాల పాములు, జంతువులతోపాటు పలు రకాల కీటకాలతో కరిపించుకొని ఏది కరిస్తే ఎంత బాధ, ఎంత సేపుంటుందో ప్రజలకు తెలియజేసేందుకు ఓ 30 పాయింట్ల స్కేలును తయారు చేసి దానిపై నమోదు చేస్తూ వస్తున్నారు. 1980వ దశకంలో క్రిమికీటకాలు కరిస్తే ఎంత బాధ ఉంటుందో తెలియజేయడానికి ఎ ‘సూచిక’ను రూపొందించిన డాక్టర్ జస్టిన్ ష్మిడ్‌ను ఆదర్శంగా తీసుకొని వారు ఈ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు. వారు ఇప్పటి వరకు భారీ బల్లులు, లైన్ ఫిష్‌గా వ్యవహరించే ప్రమాదకరమైన చేపలు, కొన్ని విష సర్పాలతో ఇలాంటి ఫీట్లు చేశారు. కొండ చిలువల కోరలకు విషయం ఉండక పోయిన ఓ మనిషిని చంపి తినేంతటి శక్తి ఉంటుందన్న విషయం తెల్సిందే. -
త్వరలో అమల్లోకి నూతన అటవీ చట్టం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు త్వరలోనే నూతన అటవీ చట్టం అమల్లోకి రాబోతోంది. అడవుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో గతంలోని నిబంధనలకు భిన్నంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ కొత్త చట్టంలో భాగంగా అడవుల్లో చెట్ల నరికివేతతో పాటు పులులు, ఇతర జంతువుల వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. అడవుల్లో ఆక్రమణలు, అక్రమ కలప రవాణా, అరుదైన వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా రాష్ట్ర అటవీశాఖ పలు ప్రతిపాదనలు రూపొందించింది. చట్టాన్ని మరింత కఠినతరం చేయడం, గణనీయంగా జైలు శిక్షలు, జరిమానాలు పెంచడం ద్వారా ఈ నేరాలకు పాల్పడే వారిలో భయం పుట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు పదేపదే అటవీనేరాలకు పాల్పడేవారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకున్న చట్టాల మేరకు ఈ తరహా నేరాలకు ప్రేరేపించేవారు, ప్రోత్సహించేవారు, డబ్బు సమకూర్చేవారి జోలికి వెళ్లకపోవడంతో నూతన చట్టంలో వీరి భరతం కూడా పట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండ్రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు ప్రస్తుతం అనుసరిస్తున్న అటవీచట్టం 1967లో రూపొందించినది కావడంతో మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త అంశాలు చేర్చాలని మొదట భావించారు. అయితే దేశానికే ఆదర్శంగా తెలంగాణ అటవీచట్టం ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో కొన్ని కీలకమార్పులతో నూతన చట్టానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. వీటిని ఒకటి, రెండ్రోజుల్లో అటవీశాఖ ప్రభుత్వానికి పంపించనుంది. దీనిపై ప్రభుత్వ పరంగా పరిశీలనతో పాటు న్యాయశాఖ సూచించే మార్పులు చేర్పులకు అనుగుణంగా తీర్చిదిద్ది అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం లభించగానే దీని అనుమతి కోసం కేంద్రప్రభుత్వానికి పంపుతారు. అటవీ నేరాలకు కనీస శిక్ష మూడేళ్లు అడవుల్లో చెట్ల నరికివేత, జంతువుల వే ట, అటవీ భూ ఆక్రమణలు వంటి ఇతర నేరాలకు పాల్పడిన వారిపై కనీసం మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించేలా అటవీశాఖ ప్రతిపాదించింది. అ లాగే షెడ్యూల్డ్ చెట్ల జాబితాలో మరికొన్ని చెట్లను చేర్చనుంది. ఇంతవరకు ఎర్రచందనం, చందనం చెట్లు ఈ జాబితాలో ఉండగా, కొత్తగా టేకు, నల్లమద్ది, బీజాసాల్, నారేటి మొదలైన రకాలను కూడా జాబితాలో చేర్చనున్నారు. అరుదైన చెట్లను నరికేవారు, అక్రమ రవాణా చేసే వారితో సహా దీనిని ప్రోత్సహించే వారికి కూడా శిక్ష పడేలా నూతన చట్టంలో ప్రతిపాదించినట్టు సమాచారం. పదేపదే అటవీనేరాలకు పాల్పడేవారి పట్ల కూడా మరింత కఠినంగా వ్యవహరించేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ఇటు వన్యప్రాణుల సంరక్షణ, అరుదైన జంతుజాతుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపైనా అటవీశాఖ దృష్టి సారించింది. పులుల అభయారణ్యాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా వాటి జాడను, వేటగాళ్ల కదలికలను పసిగట్టాలని భావిస్తోంది. పులులు, ఇతర జంతువులు అక్రమ కరెంట్ తీగల బారిన పడి మరణించకుండా ఇన్సులేటెడ్ వైరింగ్, మెటల్ డిటెక్టర్ల వినియోగం, ఇతర చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. -
వివాదంగా మారిన నెమలి అంత్యక్రియలు
న్యూఢిల్లీ: సాధారణంగా యుద్ధాల్లో వీరమరణం పొందిన జవాన్లకు త్రివర్ణ పతాకం కప్పి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తారు. కానీ చనిపోయిన నెమలికి త్రివర్ణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించి వివాదంలో చిక్కుకున్నారు ఢిల్లీ పోలీసులు. గత శుక్రవారం ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చనిపోయిన నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని త్రివర్ణ పతాకంలో చుట్టి బాక్స్‌లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఈ ఘటన వివాదస్పదంగా మారింది. పోలీసులు అలా అంత్యక్రియలు నిర్వహించడం సబబు కాదని పలువురు వన్యప్రాణి ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ‘ వన్యప్రాణి సంరక్షణ ప్రకారం ఇలాంటి పక్షులు చనిపోతే రాష్ట్ర అటవీ శాఖ వాటికి పోస్ట్‌మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ఇది పోలీసులు చేయాల్సిన పని కాదు’ అని వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త గౌరి మౌలేక్ పేర్కొన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ..‘ నెమలి మన జాతీయ పక్షి కాబట్టి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. మేం ప్రొటోకాల్‌ను పాటించాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నెమళ్లు చనిపోయినట్లు మా దృష్టికి వస్తే వాటికి కూడా ఇలాగే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని తెలిపారు. -
ఆమె సాహసాన్ని చూస్తే షాకే!
క్వీన్స్లాండ్: మాములుగా మనం పాములను చూస్తే పది ఆమడల దూరం పరుగెత్తుతాం. ఇక కొండచిలువ లాంటి పెద్ద పాములను చూస్తే! గుండె గుభేల్ మంటుంది. కానీ ఒక మహిళ ఏకంగా కొండచిలువను పట్టుకుని భుజంపై వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. క్వీన్స్లాండ్కి చెందిన బ్రీడీ మారో ఒక ఎలక్ట్రీషియన్. పాములను పట్టుకోవడంలో నైపుణ్యం ఉంది. ఓ ఇంట్లోకి వచ్చిన కొండచిలువ పిల్లిని తిని ఇంటి అడుగుభాగంలోకి వెళ్లింది. అది గమనించిన మారో పాకుతూ ఇంటి అడుగుభాగానికి వెళ్లి పామును పట్టుకుంది. ఒక చేత్తో దాని మెడను గట్టిగా పట్టుకొని తన భుజాన వేసుకుంది. తర్వాత దానిని ఒక బుట్టలోవేసి, తీసుకెళ్లి పొదల్లో వదిలేసింది. ఈ తతంగాన్ని ఒకరు వీడియో తీయగా, దీన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.‘గత 15 ఏళ్లుగా వన్యపాణ్రుల సంరక్షకురాలిగా పని చేస్తున్నాను. ఇలాంటి పాములు ఎన్నో పట్టుకున్నాను. ఈ సీజన్లో పాములు బయటకు వస్తాయి. అందరు జాగ్రత్తగా ఉండాలని’ బ్రీడీ మారో సూచించారు. -
కృష్ణజింకల కళేబరాలు స్వాధీనం
నిందితుల అరెస్టు: చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ సాక్షి, హైదరాబాద్: అంతరించి పోతున్న జంతు జాతికి చెందిన 2 కృష్ణ జింకల (బ్లాక్‌బక్) కళేబరాలు, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ మనోరంజన్ భాంజా వెల్లడించారు. వీటితోపాటు ఆరు బూడిద రంగు కుందేళ్లు, ఆరు కంజు పిట్టలు, 27 బుడక పిట్టలు, పాము మెడ కలిగిన కొంగ, అడవిబాతు (నీటి) కళేబరాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి మాంసాన్ని అమ్ముతున్న పాతబస్తీకి చెందిన సయ్యద్ జమీర్‌ను, సరఫరా చేసిన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని దండుపల్లికి చెందిన రాజేశ్‌లను సోమవారం రాత్రి పోలీ సులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న కళేబరాలు, నిందితులను మంగళవారం అరణ్యభవన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ట్రాన్సిట్ రిమాండ్ కింద అటవీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారని భాంజా తెలిపారు. వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్, హైదరాబాద్ జిల్లా అటవీ అధికారి సీపీ వెంకటరెడ్డితో కలసి ఆయన మీడి యాతో మాట్లాడుతూ... వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ ఒకటిలో ఉన్న కృష్ణజింకలను చంపిన వారికి, కనీస జరిమానా రూ.10వేలు మొదలుకుని ఎంతైనా వేయవచ్చునని, నాన్‌బెయిలబుల్ కేసు కింద మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చని చెప్పారు. భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్న జింకల వేట తదనంతర పరిణామాల పట్ల అటవీశాఖ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న జింకలు, ఇతర జంతువుల వేటపై వీసీ, సీఎస్ఓతో చర్చిం చినట్లు ఓఎస్డీ శంకరన్ తెలిపారు. వర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిలో పచ్చగడ్డి, నీటిని ఏర్పాటు చేసి జంతువులను అక్కడకు తరలించాలని వర్శిటీ అధికారులకు సూచించామన్నారు. -
మూగ వేదన
వేసవి తాపం పెరిగి పోతోంది. శేషాచలంలోని జలపాతాలు, నీటి గుంటలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. వీటిపై ఆధారపడ్డ మూగజీవులు గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. రెండు ఘాట్‌రోడ్లలో టీటీడీ ఏర్పాటు చేసిన నీటి తొట్టెలే శరణ్యంగా మారాయి. తిరుమల: శేషాచలం తూర్పు కనుమల్లో భాగం. చిత్తూరు, వైఎస్సార్ కడప జల్లాల్లో వ్యా పించి ఉన్నాయి. ఇవి సుమారు ఐదున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించాయి. తిరుమల కొండల్లో మొదలై కర్నూలు జిల్లాలోని కుందేరు నది వరకు వ్యాపించి ఉన్నాయి. భారత పర్యావరణ, అటవీశాఖ 2010 సెప్టెంబర్ 20న శేషాచల బయోస్పియర్ రిజర్వుగా ప్రకటించాయి. ఈ బయోస్పియర్ మొత్తం విస్తీర్ణం 4,756 చ.కి.మీ. జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. అందుకే ‘శేషాచల బయోస్పియర్ రిజర్వు’గా ప్రకటించారు. అరుదైన వన్యప్రాణుల ఆవాసం అరుదైన జంతు, జీవజాతులకు ఆవాసం శేషాచలం. అనేక రకాల క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరజీవులు, కీటకాలు, సూక్ష్మ జీవులు, శిలీంధ్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన 38 రకాల క్షీరదాల్లో .. ఏనుగులు, చిరుత, రేసు కుక్కలు, ఎలుగు బంటి, పునుగుపిల్లి, గుంటనక్కలు, అడవిపిల్లి, ముంగిస, కణుతులు, దుప్పులు, చుక్కల జింక, కొండ గొర్రె, బెట్లు ఉడత, దేవాంగ పిల్లి ఉన్నాయి. 178 రకాల పక్షిజాతుల్లో ప్రధానంగా ఎల్లో (తోటెడ్ బుల్బుల్ )పక్షి, గ్రీన్ పీజియన్, లార్జ్హక్– కుకు పక్షి జాతులు అరుదైనవి. 63 రకాల సీతాకోక చిలుకలు, 27 రకాల సరీçసృపాల జాతుల్లో అతిముఖ్యమైన స్లెండర్ కోరల్, బ్రై న్వైన్, ఏలియట్ సీల్డ్టైర్ సర్పం ఉన్నాయి. వీటితోపాటు 12 రకాల ఉభయచర జీవులు కూడా ఉన్నాయి. దాహం..దాహం పచ్చని ప్రకృతికి శేషాచలం పెట్టింది పేరు. వరుణుడు ముఖం చాటేయడంతో శేషాచలంలో నీటి జాడలేకుండాపోతోంది. శేషాచలంలో ప్రధానంగా గుర్తించిన 365 జలపాతాల్లో చేతివేళ్ల మీద లెక్కపెట్టే తలకొన, గుండ్లకోన, గుంజన వంటి వాటిల్లో మినహా మిగిలినచోట్ల నీటి జాడలేదు. అడవిలో ఉండే నీటి గుంటలు కూడా ఎండిపోయాయి. తాపం తీర్చుకునేందుకు జంతువులు, ఇతర వన్యప్రాణి జాతులు అలమటించాల్సి వస్తోంది. నీటికోసం మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే .. మున్ముందు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాహం తీరుస్తున్న టీటీడీ నీటి తొట్టెలు తిరుమల రెండు ఘాట్ రోడ్లలో వాహనాల రేడియేటర్లకు నీళ్లు పోసుకునేందుకు టీటీడీ ప్రత్యేకంగా సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేసింది. ఇవి జంతువుల దాహం తీర్చేం దుకు ఉపయోగపడేవి. ఈ తొట్టెల్లో నీటి శాతం తగ్గిపోవడంతో జంతువులు, పిట్టలు అష్టకష్టాలు పడేవి. దాహం తీర్చుకునే క్రమంలో అనేక పక్షులు మృత్యువాత పడేవి. దీనిపై విమర్శలు రావడంతో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశాల మేరకు చిన్నపాటి ప్లాస్టిక్ నీటి తొట్టెలు అమర్చారు. వీటిచుట్టూ సిమెంట్ ప్యాకింగ్ చేపట్టారు. వీటికి రోజూ టీటీడీ లారీల ద్వారా నీటిని నింపుతున్నారు. మూగజీవులు తాగునీటి కోసం వీటిపైనే ఆధారపడుతున్నాయి. -
అటవీ భూముల్లో ఉపాధి
► నీటి సంరక్షణ, అడవుల పరిరక్షణకు పెద్దపీట ► పెద్ద ఎత్తున నీటి, ఊట కుంటల తవ్వకాలు ► భూముల సరిహద్దు చుట్టూ కందకాలు ► త్వరలో ముగియనున్న పనుల గుర్తింపు ► ఉపాధి కూలీలకు పని.. ► అటవీ ప్రాంతాలకు వైభవం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ఇప్పటి వరకు పల్లెలకే పరిమితమయ్యాయి. ఇకపై ఈ పనుల విస్తృతి పెరగనుంది. అటవీ భూముల్లోనూ ఉపాధి పనులు చేపట్టనున్నారు. అటవీ భూముల్లో వర్షపునీటి వరదకు మట్టి కోతకు గురికాకుండా, భూమిలో తేమ సాంద్రత ఎక్కువ కాలం నిలిపే ప్రక్రియలో భాగంగా ఉపాధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తద్వారా అటవీ ప్రాంతంలో సారవంతమైన మట్టి కొటుకుపోవడానికి అవకాశం ఉండదు. అలాగే వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా మట్టిలో తేమ ఉంటుంది. తద్వారా మొక్కలు చనిపోకుండా మనుగడ సాగిస్తాయి. ఫలితంగా హరిత శాతం పెరగడంతో పాటు వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అడవుల్లో నీటి లభ్యత లేని కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో మూగజీవులు ప్రమాదాల బారిన పడడంతోపాటు వేటగాళ్లు, ఆకతాయిల చేతిలో బలవుతున్నాయి. తాజాగా నీటిని పెద్దఎత్తున సంరక్షించడం ద్వారా అటువంటి విఘాతాలకు అడ్డుకట్ట వేయవచ్చని సర్కారు భావిస్తోంది. అటవీ భూముల్లో వివిధ పనులను ఉపాధి పథకం ద్వారా చేపట్టడం ద్వారా కూలీలకు పని లభించడంతోపాటు.. అడవులకు వైభవం రానుంది. చేపట్టే పనులివే... అటవీ భూముల్లో నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో భాగంగా వాననీటిని ఒడిసి పట్టేందుకు నీటి కుంటలు, ఇంకుడు గుంతలు తవ్వనున్నారు. అలాగే ఏటావాలుగా ఉన్న ప్రాంతాల్లో భూమికి సమాంతరంగా కండిత కందకాలు తీయనున్నారు. పైనుంచి కిందకు వచ్చే వర్షపు నీరు ఈ కందకాల్లో చేరి భూమిలోకి సులువుగా ఇంకిపోతుంది. అలాగే భూముల రక్షణకూ ఉపక్రమించనున్నారు. అటవీ భూముల సరిహద్దు చుట్టూ వెడల్పాటి కందకాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా బయటి నుంచి పశువులు, మనుషులు అటవీ భూముల్లోకి ప్రవేశించడానికి వీలుండదు. ఫలితంగా అటవీ వృక్షాలకు ఎటువంటి ముప్పు వాటిల్లదు. వేసవి వచ్చిందంటే అడవులకు నిప్పంటుకోవడం సహజంగా మారింది. మానవ తప్పిదం, యాధృచ్ఛికంగా జరుగుతున్న ఈ ప్రమాదాల వల్ల వృక్షాలు కాలి బూడిదవుతుండడంతో హరితం కనుమరుగవుతోంది. ఈ నష్టాన్ని నివారించడానికి చాలా ఏళ్లు పట్టక తప్పదు. ఈ క్రమంలో యంత్రాంగం అగ్ని ప్రమాదాలను సాధ్యమైనంత మేరకు నివారించడంపై దృష్టి సారించింది. అటవీ విస్తీర్ణాన్ని బట్టి ఒకవైపు నుంచి మరోవైపునకు నిర్ణీత వెడల్పులో నేలపై పూర్తిగా మొక్కలు లేకుండా పనులు చేపడతారు. అంటే మట్టి రోడ్డు మాదిరిలా ఆ ప్రాంతాన్ని తయారు చేస్తారు. ఈ విధానాన్ని అవలంభించడం వల్ల మంటల వ్యాప్తి కొంత ప్రాంతానికే పరిమితమై నష్ట తీవ్రత తగ్గుతుంది. త్వరలో పనుల గుర్తింపు.. అటవీ భూముల్లో నీటి సంరక్షణ, మొక్కల పెంపకం వంటి పనులు చేపట్టడానికి ఆ శాఖకు పెద్దగా నిధుల కేటాయింపు లేదు. అలాగే మానవ వనరులూ తక్కువే. దీంతో భూముల పరిరక్షణ కష్టంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో ఉపాధి కింద ఆ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ శాఖకు చెందిన భూముల్లోనూ గుర్తించిన పనులను చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అటవీ భూముల్లో ఉపాధి కింద పనులు చేసేందుకు మార్గం సుగమం అయిందని అధికారులు వివరిస్తున్నారు. అటవీ భూముల్లో ఏయే ప్రాంతాల్లో ఏయే రకం పనులు చేపట్టాలన్న అంశంపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు అటవీ శాఖకు తాజాగా లేఖ రాశారు. వీలైనంత త్వరలో పనులు గుర్తించాలని కోరారు. ఈ పనులను పూర్తిగా ఉపాధి హామీ కూలీలే చేయనున్నారు. పనుల అంచనాలు రూపొందించడంతోపాటు కూలీలకు వేతనాలు అందజేయడం గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యత. పనుల పర్యవేక్షణ మాత్రం అటవీ శాఖ అధికారులదే. పచ్చదనం 9.75 శాతమే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తీర్ణం 7,493 చదరపు కిలోమీటర్లు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఇందులో 33శాతం హరితం పరుచుకోవాలి. కానీ జిల్లాలో అతి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో పచ్చదనం కేవలం 9.75 శాతానికే పరిమితమైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా సమతుల్యత లోపించడం కారణంగానే పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని నిపుణులు వివరిస్తున్నారు. భవిష్యత్ ఇవే పరిస్థితులు కొనసాగితే మానవ మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉపద్రవం ముంచుకరాకముందే యంత్రాంగం మేల్కొంటోంది. ఉపాధి పథకంలో భాగంగా అటవీ భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
వన్యప్రాణులకు రక్షణేది..?
పచ్చని చెట్లు.. పారేటి సెలయేళ్లు నడుమ దొరికింది తింటూ హాయిగా జీవనం సాగించే వన్యప్రాణులకు గడ్డుకాలం ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులకు తోడు పెరుగుతున్న జనాభాకు అడవుల శాతం క్రమక్రమంగా తగ్గుతోంది. ఉన్న కొద్దిపాటి అటవీ ప్రాంతంలో ఆహారం, నీటి వసతి లేక జనారణ్యంలోకి అడుగిడుతున్న వన్యప్రాణులు రక్షణ కరువై వేటగాళ్ల ఉచ్చులకు బలైపోతున్నాయి. చండూరు : మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు, నాంపల్లి, మర్రిగూడెం, మునుగోడు మండలాల పరిధిలో రెండు వేల హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా నాంపల్లి, మర్రిగూడెం మం డలాల్లో అడవులు ఎక్కువగా ఉన్నాయి. వన్యప్రాణుల సంఖ్య కూడా పెరుగుతూ నే ఉంది. ముఖ్యంగా జింకలు, జాతీయ పక్షులైన నెమళ్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉంటాయి. రాత్రివేళ వేట.. నియోజకవర్గ పరిధిలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న నాంపల్లి, మర్రిగూడ మండలాల సరిహద్దు గ్రామాల్లో ఇటీవల వేటగాళ్లు రెచ్చిపోతున్నారని తెలి సింది.ఓ వైపు అధికారుల నిఘా కొరవడ డం.. మరో వైపు జాతీయ పక్షులు, జిం కలు ఆహారం, దాహార్తిని తీర్చుకునేం దుకు జనారణ్యంలోకి వస్తుండడం వేట గాళ్లకు కలిసొస్తుందని తెలుస్తోంది. కొం దరు ఓ ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో వలల సహాయంతో నెమళ్లను పట్టుకుం టున్నట్టు సమాచారం. ఇటీవల కాలం లో చండూరు మండలంలో మూడు నె మళ్లు ప్రత్యక్షమయ్యాయి. రైతులు వాటి ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అందులో ఒకటి అనుమానాస్పదంగా మృతిచెందింది. ది రైతుల పొ లాల్లో పురుగు మందు తినడంతోనే మృ తి చెందిందని పోలీసులు ధ్రువీకరించారు. గతంలో ... మండలంలో 1999లో గుండ్రపల్లి గ్రామ శివారులో నెమళ్లను తిన్నట్టుగా ఆనవాళ్లు కనిపించడంతో అధికారులు గ్రామంలో విచారణ కూడా నిర్వహించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కటకటాల పాల్జేశారు. మండలం పరిధిలోని జోగిగూడెం గ్రామంలో 2015లో నెమళ్లను వేటాడి పోగులు వేసుకుని తిన్నారన్న వార్త అప్పట్లో దుమారమే రేపింది. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేశారు. తదుపరి మర్రిగూడెం మండల పరిధిలో కొంత మందిపై కేసు నమోదు చేసి వదిలేశారు. జాతీయ పక్షులకు రక్షణ లేదు నియోజకవర్గ పరిధిలో జాతీయ పక్షులకు రక్షణ లేకుండాపోయింది. అడవుల్లో నీరు లేక పోవడంతో బహిరంగ ప్రదేశాల్లోకి వస్తున్నాయి. ఫారెస్ట్ అధికారుల నిఘా లేకపోవడంతో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు.వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి. బొబ్బల శ్రీనివాస్ రెడ్డి(ఎప్‌ఎస్‌సీఎస్) వేటగాళ్లపై నిఘా అడవుల్లో నీటి వసతి లేక అప్పుడప్పుడు వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తుంటాయి. ఇటీవల కాలంలో మునుగోడు నియోజకవర్గ పరిధిలో నెమళ్ల సంఖ్య పెరిగింది. వేటగాళ్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నాం. ఎక్కడైనా వన్యప్రాణులను వేటాడితే సమాచారం ఇవ్వాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. –వెంకటయ్య, ఫారెస్ట్ రేంజ్ అధికారి, మునుగోడు -
యథేచ్ఛగా చెట్ల నరికివేత
► కడెం అడవులకు రక్షణ కరువు ►పట్టించుకోని అధికారులు కడెం : నిర్మల్ డివిజన్లోని కడెం అటవీ క్షేత్రంలో క్రమంగా అడవులకు రక్షణ కరువైంది. స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారు. కడెం అటవీ క్షేత్ర కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అడవికి రక్షణ లేదు. అటవీక్షేత్ర కార్యాలయానికి అతి సమీపంలో పెద్దూర్ సెక్షన్లో కొద్దిరోజుల క్రితం టేకుచెట్లు యథేచ్ఛగా నరికివేతకు గురయ్యారుు. అటవీ క్షేత్రంలో ఎక్కువ విస్తీర్ణంలో అడవి ఉందంటే అది గంగాపూర్ సెక్షన్లోనే. టైగర్‌జోన్ పరిధిలోని ఈ అడవిని కోర్ ఏరియా అంటారు. ఈ అడవిలో పులితో సహా అనేక వన్య ప్రాణులు ఆవాసం ఉంటారుు. అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడికి సందర్శనకు వస్తుంటారు. అరుుతే, కొద్దిరోజుల క్రితం గంగాపూర్ సమీపంలో కొందరు నాలుగైదు చెట్లు నరికారు. కొద్దిరోజులుగా పెద్దూర్ సెక్షన్లోనే చెట్లు నరికివేతకు గురవుతున్నారుు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న చెట్లను స్మగ్లర్లు నిర్భయంగా నరికివేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. సిబ్బంది కొరత రేంజిని కడెం, ఉడుంపూర్‌గా రెండుగా విభజించారు. కడెం రేంజి అధికారికే అదనంగా ఉడుంపూర్ బాధ్యతలు అప్పగించారు. ఇక పాండ్వాపూర్ గ్రామం వద్ద గల అటవీ చెక్‌పోస్టు గతంలో జన్నారం డివిజన్లోని అటవీ సిబ్బంది నిర్వహించారు. కానీ, జిల్లాల పునర్విభజన తర్వాత ఆ చెక్‌పోస్టును కడెం రేంజి పరిధిలోకి తెచ్చారు. దీంతో ఈ చెక్‌పోస్టు వద్ద గంగాపూర్ సెక్షన్ సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఆ సిబ్బంది అసలు విధులు పక్కకు పోయారుు. ఇటు చెక్ పోస్టు వద్దే ఎక్కువ సమయం గడపాల్సి రావటం, తమ విధులు కాగానే అలసిపోవటంతో డ్యూటీ పక్కకుపోతుంది. ప్రస్తుతం చెక్‌పోస్టు వద్ద గంగాపూర్ సెక్షన్ సిబ్బంది అందరూ షిప్టు ప్రకారంగా డ్యూటీలు చేస్తున్నారు. ఎక్కువ అటవీ ఉన్న గంగాపూర్ సెక్షన్ పరిధిలో ఉన్న ఈ చెక్‌పోస్టు వద్ద ఎఫ్ఎస్వో, ఎఫ్బీవోలుకాకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సింది. పెద్దూర్ సెక్షన్లో ఈ బీటు పెద్దదే. మద్దిపడగ, చిట్యాల, ధర్మాజీపేట బీట్లు ఉన్నారుు. ఇంకా, మద్దిపడగలో కడెంలో అటవీ నర్సరీలు ఉన్నారుు. వీటన్నింటినీ ఒక్క ఎఫ్ఎస్వో, ఎఫ్బీఓనే బాధ్యతలు నిర్వహిస్తోంది. దీంతో విధుల నిర్వహణకు అనేక ఇబ్బందులవుతున్నారుు. సంబంధిత ఉన్నతాధికారులు ముందు లోటుపాట్లను సవరించాలి. అడవిపై రక్షణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పకడ్బందీగా వ్యవహరిస్తాం కడెం క్షేత్ర పరిధిలోని అడవిని రక్షించే విషయంలో దృష్టిసారిస్తాం. విధి నిర్వహణలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తాం. స్మగ్లింగ్‌ను పూర్తిగా నివారిస్తాం. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు నివేదించాం. రాథోడ్ రమేశ్, ఎఫ్ఆర్వో, కడెం -
నేడు వరల్డ్ స్నేక్ డే
పపపపపప... ప్రకృతి! కల్లోకొస్తే... గజగజ వణికిపోతాం. కళ్లెదురుగా కనిపిస్తే బిగుసుకుపోతాం. ‘పపపపపపపపప.. పాము...’ అంటూ పరుగులు తీస్తాం. కానీ కొంతమంది అలా ఉండరు. పాముని కళ్లింత చేసుకుని అబ్బురంగా చూస్తారు. పాముకు కలలో కూడా అపకారం తలపెట్టరు! పామును ఎవరైనా చంపబోతే... ‘వద్దొద్దు.. మూగప్రాణి వదిలేద్దాం’ అంటారు. ఏమిటి.. వాళ్లకూ మనకూ తేడా? మనకు భయం. వాళ్లకు భయం లేదు. అంతే తేడా. అవును. పామును ప్రకృతిలో భాగంగా చూస్తే... భయం అనిపించదు. ప్రకృతి నుంచి వేరు చేసి చూసినప్పుడే... భయం ఆవహిస్తుంది. భయం పాముకన్నా ప్రమాదకరమైనది. ఇవాళ ‘వరల్డ్ స్నేక్ డే’! పాముల గురించి తెలుసుకుందాం. భయాన్ని పోగొట్టుకుందాం... ప్రతి ‘డే’కి ఒక హిస్టరీ ఉంటుంది. కానీ ‘స్నేక్ డే’కి అలాంటి హిస్టరీ ఏం కనిపించదు! ‘జూలై 16 వరల్డ్ స్నేక్ డే’ అన్నదొక్కటే ప్రపంచానికి తెలుసు. దీనిని ఎవరు ప్రారంభించారో ఎక్కడా సమాచారం లేదు! ఎలా మొదలైందో అదీ లేదు. అంతమాత్రాన ఈ ‘ప్రపంచ సర్ప దినోత్సవానికి’ ప్రాముఖ్యం లేదని కాదు. ఏటా ఈ రోజు ప్రపంచ పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు స్నేక్ డేని జరుపుకుంటారు. అంతా ఒక చోట చేరతారు. పాముల ముద్దు ముచ్చట్లను షేర్ చేసుకుంటారు. ఈ సందడినంతా మనం టెక్సాస్‌లో చూడాలి! కోళ్ల ఫారంలా అక్కడొక ఫేమస్ స్నేక్ ఫారం ఉంది. 1967 నుంచి అది అక్కడ ఉంది. 1970లలో ‘రమోన్స్’ అనే రాక్ బ్యాండ్ సాంగ్‌తో ఆ పాముల ఫారానికి క్రేజ్ పెరిగింది. టూరిస్టులు ఎక్కువయ్యారు. ఇక జూలై 16 వచ్చిందంటే సందర్శకుల కిటకిట. స్నేక్ డే సందర్భంగా ఫ్యామిలీ ఇస్తున్న సర్ప సమాచారం ఇది. సర్పాలు-సంగతులు ⇒ పాములు తమ తలకంటే పెద్ద పరిమాణం ఉన్న జంతువుల్ని కూడా మింగేయగలవు. వీటి దడవల నిర్మాణం అందుకు అనువుగా ఉంటుంది. ⇒అంటార్కిటికాలో తప్ప ప్రపంచంలోని ప్రతి ఖండంలోనూ పాములు ఉన్నాయి. పదహారు వేల అడుగుల కంటే ఎత్తున ఉన్న హిమాలయాల మీద కూడా పాములు కనిపించవు. అలాగే ఐర్లాండ్, ఐస్‌ల్యాండ్, న్యూజిలాండ్ దీవుల్లో కూడా పాములు ఉండవు. వాటి మనుగడకు అవసరమైన వాతావరణం ఆ ప్రాంతాలలో ఉండదు. ⇒ ఇవి నాలుకతో వాసన చూస్తాయి.. ⇒ నీటి అడుగున ఉండే పాములు తమ చర్మం ద్వారా శ్వాస తీసుకుంటాయి. సర్పచిత్రాలు ⇒నోము (1974) : ఈ చిత్ర కథానాయిక చంద్రకళ నాగభక్తురాలు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. భర్త తరపు చుట్టాలు ఆస్తి కోసం ఇద్దర్నీ చంపాలని కుట్రలకు పాల్పడతారు. భక్తురాలి కోసం నాగదేవత ఏవిధంగా ఆ కుట్రలను తిప్పి కొట్టింది? నాస్తికుడైన భర్తను ఎలా రక్షించింది? అనేది చిత్ర కథాంశం. ⇒దేవతలారా దీవించండి (1977) : నల్లమల అడవిలో ఉన్న నాగదేవత గుడిలోని నిధిని ఐదుగురు స్నేహితులు వశం చేసుకోవాలని చూస్త్తారు. నాగదేవతకు హాని తల పెడతారు. నాగదేవత ఎలా పగ తీర్చుకుందనేది చిత్రకథ. ⇒పున్నమి నాగు (1980) : చిన్నప్పట్నుంచీ తండ్రి కొంచెం కొంచెం విషాన్ని ఆహారంలో కలిపి ఇవ్వడంతో నాగులు (చిరంజీవి)లో పాము లక్షణాలు వస్తాయి. పౌర్ణమి రోజున పాము తరహాలో ప్రవర్తిస్తాడు. అతని కాటుకు అమాయక మహిళలు మరణిస్తారు. ఈ లక్షణాలను వదిలించుకోవడానికి పరిష్కారం లేదని తెలిసి నాగులు ఆత్మహత్య చేసుకుంటాడు. ⇒దేవి (1999) : ఓ ప్రమాదంలో చిక్కుకున్న నాగదేవతను రక్షించబోయి ఓ పెద్దాయిన ప్రాణాలు కొల్పోతాడు. దుష్టశకులు, కుటుంబ సభ్యుల నుంచి ఆయన కుమార్తెను రక్షించడానికి మనిషి రూపంలో భువిపైకి వచ్చిన నాగదేవత కథే ఈ చిత్రం. దశ విషసర్పాలు పాము కనబడగానే గుండె గుభేల్మంటుంది. అది కరుస్తుందేమో, కరిస్తే ప్రాణం హరీమంటుందేమోనని కంగారు పుడుతుంది. కానీ అన్ని పాములూ కరిచేయవు. కరిచినా అన్ని పాముకాట్లకూ ప్రాణాలు పోవు. ప్రపంచంలో ఉన్న పాముల్లో కొన్ని మాత్రమే విషపూరితమైనవి. వాటిలో ఇవి తొలి పది స్థానాల్లో ఉన్నాయి... 1. ఫియర్స్ స్నేక్ లేక ఇన్‌ల్యాండ్ తైపాన్ ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సర్పం. ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఇది ఒక్కసారి కాటేస్తే వచ్చే విషంతో 100 మంది మనుషులు, 2,50,000 ఎలుకలు చనిపోతాయట. అంటే సాధారణ కోబ్రాలో ఉండే విషంతో పోలిస్తే యాభై రెట్లు. 2. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, ఇండోనోసియాల్లో అత్యధికంగా కనిపించే ఈ పాము అత్యంత వేగంగా కదులుతుంది. దీనికి కోపం ఎంత ఎక్కువంటే ఒక్కసారి కాటేసి ఊరుకోదట. కసి తీరేవరకూ వేస్తూనే ఉంటుందట. 3. బ్లూ క్రెయిట్ ఇవి ఆగ్నేయ ఆసియా, ఇండో నేసియాల్లో కనిపిస్తాయి. ఇవి రాత్రిళ్లు చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. కోబ్రాలో కంటే పదహారు రెట్ల అధిక విషం ఉంటుంది వీటిలో. ఇది కాటు వేస్తే కండరాలు చచ్చుబడటం, నరాలు చిట్లిపోవడం, వాంతులు వంటి లక్షణాలు కలుగుతాయి. త్వరగా చికిత్స చేయకపోతే కోమా లోకి వెళ్లిపోవడమో, బ్రెయిన్ డెడ్ కావడమో జరుగుతుంది. 4. తైపాన్ ఇది కూడా ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కరవగానే రక్తం గడ్డ కట్టడం మొదలవుతుంది. ఊపిరి సలపదు. ఓ గంటలోపే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇది కరిచిన ప్రతిసారీ విషయం విడుదల కాదట. విడుదలైతే మాత్రం అంతే సంగతులు. 5. బ్లాక్ మాంబా ఆఫ్రికా ఖండంలో ఇవి విరివిగా ఉంటాయి. నేలమీద జీవించే పాముల్లో ఇది అత్యంత వేగ వంతమైన సర్పం. ఒక్క కాటుతో విడుదలయ్యే విషంతో పది నుంచి ఇరవై అయిదు మంది ప్రాణాలు పోతాయి. ఇది కరిస్తే ముందు నోరు ఆరిపోతుంది. కళ్లు మసకబారతాయి. కండరాలు పట్టు వదిలేస్తాయి. కడుపునొప్పి, వాంతులు, పెరాలిసిస్.. ఇలా రకరకాల సమస్యలు తలెత్తి పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల్లోపు ప్రాణం పోతుంది. 6. టైగర్ స్నేక్ ఆస్ట్రేలియాలో కనిపించే ఈ సర్పం ఒంటిమీది డిజైన్ పులుల మాదిరిగా అనిపిస్తుంది. అందుకే దీనికా పేరు వచ్చింది. ఇవి గుడ్లు పెట్టవు. ఒకేసారి ఇరవై నుంచి ముప్ఫై పిల్లల్ని కంటాయి. కరిస్తే అరగంటలో ప్రాణం పోతుంది. ఒకవేళ విషం కాస్త తక్కువ మోతాదులో విడుదలైతే ఆరు నుంచి ఇరవై నాలుగ్గంటల్లో పోతుంది. 7. ఫిలిప్పైన్ కోబ్రా కోబ్రాలన్నింటిలోకీ ఇది ప్రమాదకరమైనది. ఇది మన ప్రాణం తీయాలంటే దాని దగ్గరకు వెళ్లక్కర్లేదు. మూడు మీటర్ల దూరంలో ఉన్నా మన ముఖమ్మీదికి విషాన్ని చిమ్ముతుంది. అది కళ్లలో పడితే చూపు పోతుంది. శరీరంలోకి చేరితే కార్డియాక్ అరెస్ట్ అయ్యి ప్రాణం పోతుంది. 8. వైపర్స్ సా స్కేల్డ్ వైపర్, చెయిన్ వైపర్, పిల్ వైపర్స్ అంటూ వీటిలో చాలా రకాలు ఉన్నాయి. అన్నీ ప్రమాదకరమే. ఇండియా, చైనా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో విరివిగా ఉంటాయి. రకరకాల రంగుల్లో ఉంటాయి. ఇవి జంతువుల్ని చుట్టేసి కాటేసి వదిలేస్తాయి. అవి విలవిల్లాడి చనిపోయేవరకూ ఉండి అప్పుడు మింగుతాయి. 9. డెత్ యాడర్ ఆస్ట్రేలియా, న్యూ గినియాల్లో కనిపించే ఈ సర్పాలు తోటి సర్పాల్ని కూడా కాటేస్తుంటాయి. ఇవి ఎంత తెలివైనవంటే... ఆకలేసినప్పుడు తలని, తోకని మాత్రమే బయట ఉంచి మిగతా శరీరాన్ని ఇసుకలోనో, ఆకుల్లోనో దాచిపెట్టేసుకుంటాయి. అవతలి జీవులు దగ్గరికి రాగానే మింగేస్తాయి. 10. ర్యాటిల్ స్నేక్ గలగలా శబ్దం చేస్తూ కొట్టుకునే తోకను బట్టి దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. అమెరికా, కెనడా, అర్జెంటీనాల్లో కనిపిస్తుంది. ప్రపంచంలో మొత్తం ముప్ఫై ఆరు రకాల ర్యాటిల్ స్నేక్స్ ఉన్నట్లు అంచనా. మరణానికి చేరువవుతున్న దశలో వీటిలోని విషం మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పర్యావరణం భయమే.. సగం విషం పాములు పంటపొలాలను నాశనం చేసే ఎలుకలను, కీడు చేసే కీటకాలను తింటాయి. వీటి వల్ల మనిషికి మేలే జరుగుతుంది. అదీకాకుండా పర్యావరణ సమతుల్యం కాపాడటంలో పాముల పాత్ర అధికంగా ఉంటుంది. పాము కనపడగానే చంపేయడం అనే ఆలోచన మానుకోవాలి. అలాగే, దేవత అంటూ పూజల పేరిట చేసే అకృత్యాలకు స్వస్తి చెప్పాలి. మన దగ్గర మాత్రం రక్తపింజర, తాచుపాము, చిన్నపింజర, కట్లపాము.. ఈ నాలుగే విషపూరితమైనవి. పాము కాటు వేయగానే చాలా మంది విపరీతమైన భయాందోళనలకు లోనవుతారు. ఈ కారణంగా సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. ఏదైనా పాము కాటు వేస్తే వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అన్ని పెద్ద ఆసుపత్రులలో దీనికి సంబంధించిన మందులు ఉన్నాయి. ముందైతే మన జాగ్రత్తలో మనం ఉంటే పాములతో ఎలాంటి సమస్యా లేదు. - అవినాష్ విశ్వనాథ్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఫస్ట్ ఎయిడ్ పాము కాటు... ప్రథమ చికిత్స పాము కాటు తర్వాత రెండు సూదులు గుచ్చినట్లుగా ఉంటే అది విషసర్పం కాటు అని తెలుసుకోవచ్చు. దీనికి తక్షణం చికిత్స అవసరం పాము కాటు తర్వాత ఆందోళన వద్దు. దాని వల్ల రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. ఫలితంగా ఒంటిలోపల విషం వేగంగా విస్తరించి, ప్రాణాపాయమూ కలగవచ్చు. కాటుకు గురైన వ్యక్తి ఒంటి మీది ఉంగరాలు, బ్రేస్లెట్స్, వాచీ, తాయత్తులు వంటి వాటిని తొలగించాలి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. చేయకూడదని పనులు : ఆస్పిరిన్ మాత్రలు లేదా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు సినిమాల్లో చూపించినట్లుగా పాముకాటుపై గాటుపెట్టడం, విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం వంటివి అసలు చేయకూడదు పాము కాటు వేసిన చోట ఐస్ పెట్టడం, కాపడం పెట్టడం వంటివి చేయకూడదు చేతిపైనా లేదా కాలిపైన కాటు పడ్డప్పుడు దాన్ని గుండె కంటే పైన ఉండేలా పెట్టకూడదు వీలైతే కాటు వేసిన పామును గుర్తించగలిగితే మంచిదే. ఎందుకంటే కొన్ని విషాలు నరాల వ్యవస్థమీద, రక్తం మీద, కండరాల మీద పనిచేస్తుంటాయి. పామును స్పష్టంగా గుర్తించగలిగితే, దాని విషం పనిచేసే తీరు ఆధారంగా వెంటనే సంబంధిత యాంటీవీనమ్ ఇవ్వవచ్చు. అయితే ఇందుకోసం తాత్సారం చేయకూడదు. - డాక్టర్ సి. హేమంత్, సీనియర్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్ సర్ప పురాణం భారతీయ సంస్కృతిలో...అడుగడుగున పడగ జాడలు పామును భారతీయులు నాగేంద్రుడిగా కొలుస్తారు. కొందరికి పాము ఇలవేల్పు. సాక్షాత్తు విష్ణుమూర్తి శయనించేది సర్పం మీదే. అందుకే ఆయన శేషశయనుడయ్యాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు పాములలో తాను అనంతుడ (ఆదిశేషుడు) నని చెప్పాడు. అనంతుడు అంటే అంతం లేనివాడని అర్థం. ఆదిశేషువును మూలప్రకృతికి ప్రతీకగా పురాణాలు చెబుతున్నాయి. శివుడి మెడలో కంఠాభరణంగా, వినాయకునికి జందెంగా నాగేంద్రుడు కనిపిస్తాడు. విష్ణుపురాణం ప్రకారం బ్రహ్మదేవుని కుమారుడైన కశ్యపునికి నలుగురు భార్యలు. అందులో మూడవ భార్య అయిన కద్రువ వేయి పాములకు జన్మనిచ్చింది. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, క ర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు... ప్రముఖులు. ఆమె కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది. పాములు తమోగుణానికి ప్రతీక. ఇవి పాతాళంలో ఉంటూ, భూగర్భంలో ఉన్న సంపదలను సంరక్షిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మానవాళి పురాతన కాలం నుంచి పాముని ఆరాధించినట్లుగా చరిత్ర చెబుతోంది. పునఃసృష్టికి, శక్తికి ప్రతీకగా సర్పాలను కొలిచే ఆచారం భారతీయులలో ఉంది. పాము కుబుసం విడిచి, మళ్లీ చర్మం ధరించడం వల్ల వాటికి పునఃసృష్టి శక్తి ఉన్నట్లుగా భావిస్తారు. ముఖ్యంగా తాచుపామును నాగదేవతగా కొలిచే ఆచారం కనపడుతుంది. నాగపంచమికి, నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తే, ఆ పాలు నాగేంద్రుడు స్వీకరిస్తాడని ఒక నమ్మకం. భారతదేశంలో అనేక ప్రాంతాలలో నాగేంద్రుడి ఆకారంలో చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. అనంతపురం జిల్లా లేపాక్షిలో పెద్ద నాగేంద్రుని శిలా విగ్రహం ఇందుకు నిదర్శనం. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ప్రమాదవశాత్తు తాచుపాము చనిపోతే, మానవులకు అంత్యక్రియలు జరిపిన విధంగా వీటికి కూడా చితి పేర్చి తలకొరివి పెట్టి, భస్మం చేస్తారు. ఉత్తర భారతదేశంలో మగ పామును నాగరాజుగా భావించి, గుడి కట్టి, ఆ విగ్రహానికి పూజలు చేస్తారు. మరికొన్ని ప్రాంతాలలో నేరుగా సర్పానికే పూజలు చేస్తారు. సింధు నాగరికత ప్రజలు సర్పాన్ని పూజించినట్లుగా చరిత్ర చెబుతోంది. ‘కద్రువ నాగమాత’ అని చిన్నయసూరి బాలవ్యాకరణంలో నాగేంద్రుడిని ప్రస్తావించాడు. భాగవతంలో అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి సన్నద్ధులయ్యారు. మంధరగిరిని కవ్వంగా ఎంచుకున్నారు. తాడుగా వాసుకిని ప్రయోగించారు. తల భాగం వైపు రాక్షసులు, తోక భాగం వైపు దేవతలు నిలబడి, మంధరగిరిని చిలికారు. అమృతాన్ని సాధించారు. ఈ సత్కార్యంలో వాసుకిదే ప్రధానపాత్ర. శంకరుడికి ఆభరణంగా ఉన్న సర్పం కారణంగా సంగీతంలో ‘శంకరాభరణం’ అనే రాగం కూడా పుట్టింది. నాగరత్నమ్మ, నాగమణి, నాగేశ్వరరావు... వంటి పేర్లు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది. సర్పాన్నే భుజంగం, అహి, పాము, ఉరగం, గాలి మేపరి, పన్నగం... వంటి అనేక పేర్లతో పిలుస్తాం. భారతీయ సాహిత్యంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ నవలలో ప్రథమంగా, ‘వేయి పడగల పాము విప్పారుకొని వచ్చి, కాటందుకొన్నది కలలోన రాజును’ అని వర్ణించాడు. - డా. పురాణపండ వైజయంతి -
కముజు పిట్టలతో విందుకు యత్నం
హరితహారంలో వన్యప్రాణుల వధ మర్పల్లి : హరితహారం కార్యక్రమంలో కొందరు వన్యప్రాణులను వధించారు. కముజు పిట్టలతో విందు జరుపుకొన్నారు. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలంలో జరిగింది. శుక్రవారం మర్పల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం పది గంటలకు మార్కెట్ కార్యాలయం ఎదుట 11 కముజు పిట్టల కాళ్లు కట్టి నీటి తొట్టెలో ఉన్న మొక్కల ముందు ఉంచారు. అనంతరం హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు వాటిని వండి వడ్డించేందుకు మాంసం దుకాణాలకు తరలించి వాటిని కోయించారు. వంటకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ విషయం బయటకు పొక్కడంతో అతిథులు భోజనం చేయకుండానే వెళ్లారు. -
తిరుమలలో ఆరడుగుల నాగుపాము
తిరుమలలో వన్యప్రాణుల బెడత పెరిగింది. ఒకవైపు చిరుతల సంచారంతో భక్తులు ఆందోళన పడుతోంటే.. మరో వైపు.. నాగు పాములు, కొండ చిలువలు.. జనావాసాల్లోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం ఆరు అడుగుల నాగుపాము అటవీశివారు ప్రాంతం నుండి బాలాజీనగర్ చివరి సంధు వద్ద రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు పామును చూసి పరుగులు తీసారు. సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ మజ్దూర్ భాస్కర్‌నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి పామును పట్టుకున్నాడు. దీంతో జనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత నాగుపామును అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. -
క్వారీ.. స్వారీ
♦ రాతి నేలలపై కన్ను కర్ణాటక నుంచి వలస ♦ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మిషన్లు ♦ రాత్రంతా బ్లాస్టింగ్లు, రోజంతా క్వారీ ♦ విలవిల్లాడుతున్న వన్యప్రాణులు ♦ కళ్లప్పగించి చూస్తున్న అధికారులు మనూరు: జిల్లాలోనే అతిపెద్ద మండలమైన మనూరులో ఇబ్బడిముబ్బడిగా కంకర క్వారీలు వెలుస్తున్నాయి. పచ్చని పంటపొలాలు రాతి నేలలుగా మారుతున్నాయి. రాతి పొడి కాలుష్యం వల్ల పంటలు ఎదగడంలేదు. ఫలితంగా రైతులే కాక వన్యప్రాణులు సైతం విలవిల్లాడుతున్నాయి. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు సరిహద్దున ఉన్న మనూరు మండలంలోని రాతి నేలలపై ఆ రాష్ట్రానికి చెందిన అక్రమార్కులు కన్ను వేశారు. ఇక్కడి భూములను తక్కవ ధరకే కొనుగోలు చేసి క్వారీలు ఏర్పాటుచేస్తున్నారు. స్థానిక చోటామోటా రాజకీయ నాయకులను ఆశ్రయించి, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు అమ్యామ్యాలు ఇచ్చి అనుమతులు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే క్వారీకోసం దరఖాస్తు చేసుకున్నదే తడువుగా క్రషింగ్ ప్రారంభిస్తుండటం గమనార్హం. ఎదగని పంటలు కంకర క్వారీల చుట్టూ ఉన్న సాగు భూముల్లో రెండు, మూడేళ్లుగా పంటలు ఎదగడంలేదని ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్వారీలు ఏర్పాటు కావడంతో పంటలు ఎదగక జీవనాధారం కోల్పోతున్నామన్నారు. అంతేకాక రాత్రి వేళల్లో భయంభయంగా గడపాల్సి వస్తోందన్నారు. పెద్ద పెద్ద శబ్ధాలతో, పెలుళ్లు సృష్టించడం వల్ల కంటిమీద కునుకులేకుండా పోతుందన్నారు. ఇళ్లకు సైతం బీటలు వారుతున్నాయన్నారు. అలాగే తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన చెందుతున్నారు. వీటికి తోడు శివారు వెంట ఎక్కడ చూసినా భారీ గోతులు కనిపిస్తున్నాయన్నారు. భారీ గోతుల వల్ల వర్షాకాలంలో ప్రాణనష్టం సైతం జరిగే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. వన్యప్రాణులు విలవిల జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మండలంలోని బీడు భూములో వందల సంఖ్యలో కృష్ణజింకలు, లేళ్లు ఉన్నాయి. ఇవి బోరంచ శివారు నుంచి ఔదత్పూర్, శిఖార్‌ఖాన వరకు సంచరిస్తుంటాయి. కాగా మోర్గి, గోందేగాం, నాగల్గిద్ద, గుడూర్, ఔదత్పూర్ శివారులో వందల సంఖ్యలో జికంలు ఉన్నాయి. కంకర మిషన్ల బ్లాస్టింగ్ వల్ల అవి పంటచేలలు, గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. క్వారీల అనుమతులు రద్దు చేయాలి రోజురోజుకు పుట్టుకొస్తున్న క్వారీల అనుమతులను సంబంధిత అధికారులు రద్దుచేయాలని మండలంలోని రైతులు, వన్యప్రాణుల ప్రేమికులు, ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. క్వారీల కారణంగా పచ్చని పంటపొలాలు దెబ్బతింటున్నాయన్నారు. మూసివేతకు సిఫార్స్ చేస్తాం అక్రమంగా వెలుస్తున్న కంకర మిషన్లపై చర్యలు తీసుకునేందుకు మైనింగ్ అధికారులకు నివేదిస్తాం. రైతుల ఇబ్బందులను, వారి విన్నపాలను జిల్లా అధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. -తారాసింగ్, తహశీల్దార్, మనూరు -
వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణి మృతి
వేటగాళ్ల ఉచ్చుకు ఒక దుప్పి, నాలుగు గేదెలు మృత్యువాడపడ్డాయి. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఎర్రగుంట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలలో ఉచ్చు పెట్టారు. వాటికి చిక్కుకుని దుప్పి, నాలుగు గేదెలు ప్రాణాలు కోల్పోయాయి. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
నగ్నంగా మార్చి వారిపై చిత్రాలు గీసి..
బెర్లిన్: సాధారణంగా కాన్వాస్ పెయింట్స్ చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటాయి. అది అందరికీ అబ్బని ఓ చక్కటి కళ. ఈ పెయింటింగ్‌తో ఎన్నో అద్భుతాలు, వింతలు సృష్టించి ఆకర్షించవచ్చు. సాధరణంగా ఈ పెయింట్స్‌ను ఏ పేపర్పైనో గోడపైనో వేస్తే పెద్దగా ఆసక్తి అనిపించకపోవచ్చేమోగానీ.. మనుషులనే పెయింటింగ్ చిత్రాలుగా మారిస్తే.. అది కూడా అరే.. నిజంగానే అటవీ జంతువులు దర్శనం ఇస్తున్నాయే అనేంత భ్రమపడేలా ఆ చిత్రాలు ఉంటే.. ! జర్మనీకి చెందిన ఓ పెయింటర్ అచ్చం ఇలాంటి పేయింట్స్ వేశారు. జిసైన్ మార్ వెడెల్ అనే ఓ చిత్రకారురాలు నగ్నంగా ఉన్న మనుషులను ఆయా జంతువులు, పక్షులు, కీటకాలు, సముద్ర ప్రాణిలా ఆకారంలో మలచడంతోపాటు ఆ మేరకు వారిపై రంగులు వేసి అబ్బురపరిచింది. ఇలా పురుషులు, స్త్రీలపైన దాదాపు పన్నెండు గంటలపాటు ఆమె కష్టపడి పెయింట్స్ వేసి అనంతరం ఆ పెయింట్స్ ను ఓ చక్కటి ఫొటోగ్రాఫర్ తో క్లిక్ మనిపించింది. ఆ ఫొటోలు చూసిన వారంత ఆశ్చర్యపోయారు. ఒక కళను ఇలా కూడా ప్రదర్శించడం సాధ్యమా అని అనుకుంటున్నారు. తాను ఇలా మనుషులపైనే పెయింటింగ్ వేయాలని ఆలోచించడమే ఆశ్చర్యంకాగా.. అది కూడా అత్యంత అరుదైన అటవీ జంతువుల బొమ్మలే చిత్రించి వాటిపట్ల మనుషులు కాస్తంత ఉదారంగా ఆలోచించేలా చిత్రాలు వేయడం గొప్ప విషయం. కాగా ఈ పెయింటింగ్స్ వేస్తున్నంత సేపు వారు తమకు మసాజ్ చేస్తున్నట్లుగా ఫీలయ్యారంట. -
నీళ్ల కోసం వచ్చి..
అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల దాహాన్ని తీర్చేందుకు నీటి తొట్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చి వాటి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఫొటోలను చూడండి. సీసీ కెమెరాల్లో ఓ తొట్టి వద్ద మూడు చిరుతలు నీటిని తాగుతూ కనిపిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహాన్ని తీర్చడం కోసం నల్లగొండ జిల్లా చందంపేట అటవీ పరిధిలో 20 నీటి తొట్లను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు సీసీ కెమెరాలను అమర్చారు. నీరు తాగడానికి వచ్చిన వన్యప్రాణులను ఫుటేజీల ఆధారంగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎన్ని చిరుతలు ఉన్నాయనే విషయాన్ని లెక్కగడుతున్నారు. చందంపేట రేంజ్ పరిధిలో 15 వరకు చిరుతలు ఉన్నట్లు లెక్క తేలిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సర్వేశ్వర్ తెలిపారు. - చందంపేట బావిలో చిక్కి.. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట శివారులోని గుర్రాల ఆనందరెడ్డి అనే రైతు వ్యవసాయబావిలో నీళ్ల కోసం వచ్చి ఓ చిరుతపులి పిల్ల పడింది. మంగళవారం ఉదయం ఆనందరెడ్డి గమనించి పోలీసులకు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుమితారావు వచ్చి.. వరంగల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారు క్రేన్ సహాయంతో బావిలోకి బోను దించినప్పటికీ చిరుత అందులోకి రాలేదు. దీంతో మత్తు మందు ఇచ్చి బయటకు తీశారు. వైద్యపరీక్షలు నిర్వహించి వరంగల్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం బావిలో పడి ఉంటుందని భావిస్తున్నారు. పెద్దలింగాపూర్, సోమారంపేట శివార్ల గుట్టల ప్రాంతంలో మరో మూడు చిరుత పులులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. - ఇల్లంతకుంట ఎండకు కరిగి.. భగ్గుమంటున్న సూర్యుడి వేడికి రోడ్డుపై తారు కూడా కరుగుతోంది. ఏటూరునాగారం-తుపాకులగూడెం గ్రామాల మధ్యలోని బూటారం క్రాస్ రోడ్డు, రొయ్యూర్ సమీపంలో రోడ్డుపై తారు మంగళవారం ఇలా కరిగి కనిపించింది. ఈ రహదారిపై భారీగా లారీలు వెళ్తుండటంతో రోడ్డు కుంగిపోతోంది. విషయం తెలియక వచ్చిన ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. - ఏటూరునాగారం -
ఎండకు తాళలేక..
మండుతున్న ఉష్ణోగ్రతలు.. వడ గాలులకు జనం పిట్టల్లా రాలుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన సత్తమ్మ(60) వడదెబ్బకు మృతి చెందింది. బుధవారం వేడికి తాళలేక స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో వైపు ఎండలకు వన్యప్రాణులు సైతం అల్లాడుతున్నాయి. దుర్గి మండలం ఓబులేశుపురం గ్రామ సమీపంలో ఎండలకు ఓ దుప్పి ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
దుప్పి మాంసం స్వాధీనం
లింగాల : మండలంలోని రాయవరంలో శుక్రవారం రెండు కిలోల దుప్పి మాంసాన్ని అటవీశాఖ అధికారి చంద్రమౌళి స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు దుప్పి మాంసం వండిన ఈ గ్రామానికి చెందిన శంకర్, వెంకటయ్యలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడం చట్ట విరుద్ధమని పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జాతీయ పక్షులను చంపితే జైలుకే...
జగిత్యాల : జాతీయపక్షి నెమలిని చంపిన కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన విధిస్తూ కరీంనగర్ జిల్లా జగిత్యాల మొదటి అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ రమేష్ సోమవారం తీర్పునిచ్చారు. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద జిల్లాలో జైలుశిక్ష విధించడం ఇదే తొలిసారి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతిరెడ్డి తెలిపిన వివరాలు.. జగిత్యాల మండలం తారకరామనగర్‌కు చెందిన వనం రవి, కుంభం పోచయ్య కూలీలు. వీరు మల్యాల మండలం రాజారాం గ్రామ సమీపంలోని రామస్వామి గుట్టపై వన్యప్రాణుల కోసం వలలు ఏర్పాటు చేశారు. 2011 ఆగస్టు 19 వలల్లో రెండు నెమళ్లు చిక్కాయి. రవి, పోచయ్య ఆ నెమళ్ల ఈకలు పీకి, అమ్మేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సమ్మిరెడ్డి, వెల్దుర్తి బీట్ ఆఫీసర్ రఘుపతి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఇది పసిగట్టిన రవి, పోచయ్య నెమళ్లను వదిలేసి పారిపోయూరు. అటవీ అధికారులు నెమళ్లను స్వాధీనం చేసుకుని వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసేలోపే అవి మృతి చెందాయి. చనిపోయిన నెమళ్లకు పోస్టుమార్టం నిర్వహించి, రవి, పోచయ్యపై జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో రవి, పోచయ్యలకు శిక్ష విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. -
వీబీసీతో వన్యప్రాణాలు హరీ!
జయంతిపురం వద్ద 2 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దీనిని ఆనుకునే ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు నాలుగేళ్లలో అంతరించిపోనున్న రిజర్వ్ ఫారెస్ట్‌లోని జంతువులు విజయవాడ : జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ భారీ కర్మాగారం ఏర్పాటుతో ఇక్కడి అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ముంచుకురానుంది. జయంతిపురం సమీపంలోని 500 ఎకరాల్లో వీబీసీ ప్రతిపాదిత స్థలాన్ని ఆనుకొని ఏడు గ్రామాలకు విస్తరించిన రెండు వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అది రిజర్వ్ ఫారెస్ట్ కావటంతో వన్యప్రాణుల సంచారమూ అధికమే. ముప్పయ్యేళ్ల క్రితం ఇక్కడ జింకలు, నెమళ్లు, అడవి పందులు, దుప్పిలు, కొండచిలువలు, అనేక ఇతర జంతువులు ఉండేవి. రిజర్వ్ ఫారెస్ట్ కావటం, పక్కనే అడవిలోనే కృష్ణానది కూడా ఉండటంతో జంతువులకు ఇబ్బందులు ఉండేవి కాదు. గడచిన 20 ఏళ్లలో ఇక్కడ 19 సిమెంట్ ఫ్యాక్టరీలు, వందకు పైగా ఇతర పరిశ్రమలు ఏర్పడ్డాయి. వాయు కాలుష్యంతో గడచిన ఇరవయ్యేళ్లలో పెద్ద సంఖ్యలో జంతువులు మృత్యువాత పడ్డాయి. ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం... ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాలుష్య తీవ్రత సెకనుకు 59 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది 60 దాటితే తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని ఇప్పటికే అనేక సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వీబీసీ ఏర్పాటు చేయనున్న భారీ కర్మాగారంలో అమ్మోనియా ప్లాంట్, నైట్రిక్ యాసిడ్ ప్లాంట్, అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్, యూరియా ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కర్మాగారం కంటే రెట్టింపు స్థాయి ఉత్పత్తితో రెట్టింపు సంఖ్యలో ప్లాంట్లు ఏర్పాటు చేయనుండటం గమనార్హం. దీనివల్ల ప్రమాదకర స్థాయిని దాటి కాలుష్యం పెరగటం ఖాయం. దీనివల్ల మనుషులతో పాటు వన్యప్రాణులకూ ముప్పు తప్పదు. సాధారణంగా ఏడేళ్ల జీవిత కాలం ఉన్న దుప్పిలు ఇక్కడి అటవీ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రభావంతో ఏడాదిన్నరకే మృత్యువాత పడుతున్నాయి. మిగిలిన జంతువులదీ ఇదే పరిస్థితి. ఇప్పటివరకు అడవికి కనీసం 10 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు ఉండటంతో నష్టం తీవ్రత కొంత తక్కువగా ఉండేది. ఇప్పుడు 500 మీటర్ల దూరంలోనే వీబీసీ కర్మాగారం ఏర్పాటు కానుండటంతో మరో నాలుగేళ్లలో అడవిలోని జంతు సంపద పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది. అధికార పార్టీ కనుసన్నల్లోనే... అధికార పార్టీ కనుసన్నల్లోనే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలంగా యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. దీనిపై పట్టించుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలే పూర్తిగా సహకరిస్తుండటం శోచనీయం. పర్యావరణ వేత్తలు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకునేందుకు చేస్తున్న యత్నాలను ప్రభుత్వ పెద్దలు తొక్కిపట్టి మరీ ఆ యాజమాన్యానికి సహకరిస్తుండటం గమనార్హం. -
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లోని పెనుబల్లి మండలం భవన్నపాలెం సమీపంలోని నీలాద్రి అడవుల్లో వేటగాళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, నీలాద్రీశ్వర ఆలయ సమీపంలో రోడ్డుపై స్కార్పియో వాహనం కంటపడింది. సమీపంలోనే అడవిలో వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్లిన ఫారెస్టు అధికారులకు మృతి చెందిన చుక్కల దుప్పి, పక్కనే ఇద్దరు తుపాకీతో కన్పించారు. దీంతో నిందితులైన పెనుబల్లి మండలం భవన్నపాలెం, బీజేఆర్ క్యాంప్‌లో డ్రైవర్.. షూటింగ్ ఎక్స్పర్ట్ అయిన సాధం శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా మైలవరం, రైస్‌మిల్లులో వర్కర్ సోమవరం చిట్టిబాబులను అదుపులోకి తీసుకొని సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలంలో దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, సత్తుపల్లి శివారులో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చుతున్న కూరాకుల రామారావు, జల్లిపల్లి విజయ్‌కుమార్, ముడియం తిరుపతిరావులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. -
పులులు 3.. చిరుతలు 14
- కిన్నెరసాని అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తింపు - వన్యప్రాణుల గణంకాల సర్వే - 430 జంతువులు ఉన్నట్లు సమాచారం పాల్వంచ రూరల్ : కిన్నెరసాని అభయారణ్యంలో ఇటీవల వన్య మృగాల సంరక్షణ విభాగం అధికారులు జంతువుల గణంకాలను సర్వేను నిర్వహించారు. గత నెల 24 నుంచి 30వ తేదీ వరకు అభయారణ్యంలో యానంబైల్ రేంజ్, చాతకొండరేంజీల పరిధిలో 20 బీట్ల అడవీలో సంచరించే వివిధ రకాల జంతువుల పాదముద్రలు, విసర్జనల ఆధారంగా ప్లగ్ మార్క్‌లతో గణంకాల సర్వేను నిర్వహించినట్లు చాతకొండ రేంజర్ సూర్యనారాయణ గురువారం తెలిపారు. యానంబైల్ రేంజ్ పరిధిలోని 9 బీట్లలో 4 చిరుత పులులు, 1 పెద్దపులి, దుప్పులు 70, కొండగొర్రెలు 9, అడవి పందులు 35, నేమళ్లు 4, కుందేళ్లు 24, కణుజులు 5, ఎలుగుబంట్లు 2, అడవి దున్నలు 10, కొండముచ్చులు 8, చాతకొండ రేంజ్ పరిధిలోని 11 బీట్లలో రెండు పెద్ద పులులు, 11 చిరుతలు, అడవి దున్నలు 48, కొండగొర్రేలు 48, అడవి పందులు 51, దుప్పులు 66, నేమళ్లు 2, కుందేళ్లు 28, ఎలుగుబండ్లు 3 సంచరించినట్లు సర్వేలో గుర్తించినట్లు తెలిపారు. డెహరాడూన్‌కు పంపనున్న పులి విసర్జన అభయారణ్యంలోని పడిగాపురం అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది చేసిన సర్వేలో లభ్యమైన పెద్దపులి విర్జనను పరీక్షల నిమిత్తం ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని డెహరాడూన్లో ఉన్న అటవీశాఖ అకాడమికి పంపనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. -
వేట
ఎక్కడో అడవిలో తలదాచుకుంటున్న వన్యప్రాణులు పలువురు మానవ మృగాల చేతిలో ప్రాణాలు వదులుతున్నాయి. జల్సాలకు అలవాటుపడ్డ వారు అటవీ జంతువులను హతమారుస్తున్నారు. తమ సరదాల కోసం మూగజీవాలను బలితీసుకుంటున్నారు. ఇందుకు జన్నారం పరిధిలోని టైగర్‌జోన్‌ను ఎంచుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక జీవి ప్రాణాలు తీస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అటవీ అధికారులేమో పలుచోట్ల బాధితులను పట్టుకుంటున్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వన్యప్రాణుల వేట మాత్రం ఆగడం లేదు. ఉట్నూర్ : జన్నారం వైల్డ్‌లైఫ్ అటవీ డివిజన్ (వన్యప్రాణి సంరక్షణ విభాగం) పులుల సంరక్షణ కేంద్రం వేటగాళ్లకు నిలయంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అటవీ ప్రాంతాన్ని 42వ టైగర్ జోన్‌గా గుర్తించింది. కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణి విభాగంలో అధికారిక లెక్కల ప్రకారం 673 రకాల మొక్కలు, పది రకాల ఉభయచర జంతువులు, 34 రకాల సరిసృపాలు, 270 రకాల పక్షి జాతులు, 75 రకాల క్షీరజాతులు మనుగడ సాగిస్తున్నాయి. అడవులు వేగంగా అంతరిస్తుండడంతో వాటికి మనుగడ లేకుండాపోతోంది. పదుల సంఖ్యలో వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉండడంతో నిత్యం ఏదో ఒక చోట అటవీ జంతువుల బలవుతున్నాయి. మామూళ్లకు కక్కుర్తి పడి కొంత మంది కిందిస్థాయి అటవీ సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిళ్లు బ్యాటరీలు, బరిసెలు, వలలు, విద్యుత్ వైర్లు, బైండింగ్ తీగలు తదితర సామగ్రితో వేటగాళ్లు అడవుల్లోకి వెళ్లి వాటిని వెంటాడుతున్నారు. రాత్రి వేళ జంతువులు దాహార్తి తీర్చుకోడానికి సాసర్‌వెల్స్, గ్రామాల సమీపంలో ఉండే చెరువులు, ఇతర నీటి వనరుల ప్రాంతాలకు వస్తుంటారు. ఆ సమయంలో వేటగాళ్లు మాటువేసి వాటిని వేటాడుతున్నారు. జంతువులకు తాగునీరందించేందుకు అటవి శాఖ వారు ఏర్పాటు చేసిన సాసర్వెల్స్ను వేటగాళ్లు వేటకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అభయారణ్యంలోని బీర్సాయిపేట, తాళ్లపేట, జన్నారం, ఇందన్పల్లి అటవీ రేంజ్‌ల్లోని పలు బీట్లలో జంతువుల వేట ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం వచ్చిందంటే.. వీకెండ్ అయిన ఆదివారం వచ్చిందంటే చాలు ఉట్నూర్, జన్నారం పట్టణ ప్రాంతాలతోపాటు ఇందన్పల్లి, ఖానాపూర్, బీర్సాయిపేట తదితర గ్రామాలు వన్యప్రాణుల మాంసంతో నిండిపోతున్నాయి. వేటగాళ్లు నేరుగా ఇళ్లలోకి మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం పలువురిని ఏజెంట్లుగా కూడా పెట్టుకుంటున్నారు. ముందుగానే ఎవరెవరికి ఏ మాంసం ఎంత కావాలో వివరాలు తీసుకుంటూ.. లేదా గ్రామానికి చెందిన వారే పలువురు వేటగాళ్లతో నేరుగా ఫోన్లో కోడ్ భాషలో మాట్లాడుతూ మాంసాన్ని తెప్పించుకుంటున్నారు. ఇదంతా ఉదయం నాలుగు గంటల నుంచి 6 గంటలలోపే జరిగిపోతోంది. మరికొందరేమో ఆడవారిని రంగంలోకి దింపి వన్యప్రాణుల మాంసాన్ని ఆటో, జీప్ ప్రయాణాల ద్వారా మంచిర్యాల, లక్సెట్టిపేట, నిర్మల్, ధర్మపురి, జగిత్యాల, కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పలు వ్యాధులున్న వారికి ఫలానా జంతువు మాంసం తింటే తగ్గిపోతుందని ప్రచారంలో ఉండడంతో వాటికి సంబంధించి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఒక్కో వన్యప్రాణి మాంసం కిలో ధర రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. దీంతో ఈ అక్రమ దందా రూ.లక్షల్లోనే జరుగుతోంది. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖకు చెందిన పలువురు అధికారులకు హస్తం ఉండడంతో దందా గుట్టుచప్పుడు కాకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నిఘా అంతంతే.. 1965లో కవ్వాల్‌ను అటవి ప్రాంతంగా గుర్తించిన ప్రభుత్వాలు 1972లో వన్యప్రాణి సంరక్షణ విభాగంగా గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత 2011లో కవ్వాల్ అభయారణ్యంలో 892.23 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియాగా.. 1,119.68 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియాగా గుర్తిస్తూ 42వ పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. దీంతో వన్యప్రాణులను అన్నిరకాలు రక్షించేందుకు వేట నిరోధక దళాలు అటవీ సెక్షన్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలనూ నియమించింది. ఈ బృందాలు నిరంతరం అడవుల్లో తిరుగుతూ వన్యప్రాణులను సంరక్షించాలి. కానీ.. వన్యప్రాణులను కాపాడడంలో వారు విఫలమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో కొంత మంది ఎనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంపుల్లోని వారు వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కింది స్థాయి సిబ్బంది నిఘా లోపంతో అడవుల్లో యథేచ్ఛగా వేటా సాగుతోంది. దీనికితోడు అడవులు వేగంగా అంతరిస్తుండడంతో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది..!! కేసులు సరే.. చర్యలేవీ..? జన్నారం వైల్డ్‌లైఫ్ డివిజన్లోని ఇందన్పల్లి, తాళ్లపేట, బీర్సాయిపేట, జన్నారం అటవీ రేంజ్‌ల పరిధిలో జనవరి 2011 నుంచి ఇప్పటివరకు ఏడు నీలుగాయిలు, మూడు దుప్పిలు, ఐదు అడవి పందులు, ఒక కొండగొర్రె, రెండు సాంబర్లు, ఒక చిరుత, ఐదు చుక్కల దుప్పిలు, ఒక సింగోళి, నాలుగు జింకలు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి. ఇందుకు దాదాపు 86 మంది వేటగాళ్లపై కేసులు నమోదైనట్లు సమాచారం. గత నెల ఐదో తేదీన జన్నారం అటవీ రేంజ్ పరిధిలోని అడవిలో నీలుగాయిని వే టాడి మాంసం విక్రయిస్తున్న వారిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అల్లినగర్‌కు చెందిన 19 మందిపై కేసులు నమోదు చేశారు. అదీకాక వెలుగులోకి రాకుండా మరెన్నో వన్యప్రాణులు బలి అవుతూనే ఉన్నాయి. అయితే.. వేటగాళ్లపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు ఆ తదుపరి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వేటగాళ్లపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వన్యప్రాణుల రక్షణకు కారిడార్
ఈ వారంలో కేంద్ర బృందంతో సమావేశం కందకాలతో ఏనుగుల దాడుల నివారణ సోలార్ ఫెన్సింగ్ పనులు త్వరలో ప్రారంభిస్తాం చిత్తూరు పశ్చిమ డీఎఫ్‌వో చక్రపాణి చిత్తూరు(అర్బన్): వన్యప్రాణాలు జనావాసాల్లోకి రాకుండా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని అడవుల్లో కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చిత్తూరు పశ్చిమ అటవీశాఖ అధికారి చక్రపాణి తెలిపారు. ఇందుకోసం మూడు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో భారత ప్రభుత్వ వన్యప్రాణి సంరక్షణ అధికారులు సమావేశం కానున్నారన్నారు. ఇటీవల పలమనే రు, కుప్పం, మామండూరు తదితర ప్రాంతాల్లో ఏనుగులు పంట పొలాల పై దాడులు చేయడం, తాజాగా రామకుప్పంలో ఓ ఏనుగు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం తదితర అంశాలపై డీఎఫ్‌వో చక్రపాణి శనివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.... ఏనుగులు పంట పొలాలపై దాడు లు చేయకుండా మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని అడవులతో కలిపి వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొటెక్ట్ అధికారులకు నివేదిక పంపాం. ఈనెల తొలి వారంలో మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శితో పాటు ఆ రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర అధికారుల బృందం సమావేశవుతుంది. కుప్పం, క్రిష్ణగిరి, హోసూరు, బన్నేరుగట్టు తదితర అటవీ ప్రాంతాల మీదుగా కారిడార్ ఏర్పాటవుతుంది. పనులు, నిధులు అన్నీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కుప్పం సమీపంలోని పెద్దకుర్తిగుంట నుంచి మోట్లచెరువు వరకు 50 కిలో మీటర్ల దూరంలో సోలార్ ఫె న్సింగ్ వేశాం. ఇంకా పది కిలో మీటర్ల దూరం వరకు గ్యాప్ ఉంది. ఈ ప్రాం తంలో బండలు, కొండలు ఎక్కువగా ఉండటంతో కాస్త ఆలస్యమైంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. అంతేగాకుండా ఈ అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా ఉండటానికి కందకాలు నిర్మిస్తున్నాం. రూ.25 లక్షలు నిధులు కూడా వచ్చాయి. 12 అడుగుల ఎత్తులో గుంతలు తవ్వడాన్నే కందంకం అంటాం. ఈ గుంతల్ని చూడగానే ఏనుగులు దాటడానికి సాహసించవు. అడవుల్లోనే ఏనుగుల సంరక్షణ కోసం నీటి గుంటలు త వ్వుతాం, పచ్చిక వేయడానికి షెల్టర్ నిర్మిస్తాం. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏనుగుల దాడుల్లో 219 ఎకరాల్లో పాక్షికంగా పంట పొలాలు ధ్వంసమయ్యాయి. వరి, చెరకు పంటలకు ఎకరాకు రూ.6 వేలు, మామిడి, కొబ్బరి ఒక్కో చెట్టుకు రూ.15వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.25.20 లక్షలు పరిహారాన్ని సంబంధిత రైతులకు చెల్లించాం. ఇతర కూరగాయలు, ఆకుకూరల తోటలకు ఉద్యానవశాఖ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా పరిహారం ఇస్తున్నాం’. -
భారత యువతికి ‘గ్రీన్ ఆస్కార్’
కోల్‌కతా: వన్యప్రాణులు, జంతువులకు సంబంధించిన ఉత్తమ చలన చిత్రాలకు ఇచ్చే ‘వైల్డ్ స్క్రీన్ పండా అవార్డ్’ను పశ్చిమబెంగాల్‌కు చెందిన యువ ఫిల్మ్ మేకర్ అశ్వికా కపూర్ సాధించారు. ఈ అవార్డును ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌తో పోలుస్తూ.. ‘గ్రీన్ ఆస్కార్’గా పరిగణిస్తారు. ‘కకాపో చిలుక (గుడ్లగూబ చిలుక)’ జీవితం ఆధారంగా అశ్విక నిర్మించిన ‘సిరొక్కో’ లఘు చిత్రానికి ఈ అవార్డు వచ్చింది. బ్రిటన్‌లోని బ్రిస్టల్ సిటీలో జరుగుతున్న వైల్డ్ స్క్రీన్ ఫెస్టివల్లో భాగంగా శుక్రవారం ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. కోల్‌కతాలో కాలేజీ చదువు పూర్తిచేసిన 26 ఏళ్ల అశ్విక.. న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయం నుంచి ‘శాస్త్ర, జీవావరణ చరిత్ర చలన చిత్ర నిర్మాణం’లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన, ఎగరలేని జాతి అయిన ‘కకాపో చిలుక’పై 15 నిమిషాల చిత్రాన్ని రూపొందించారు. దీనిని వైల్డ్ స్క్రీన్ ఫెస్టివల్‌కు పంపగా... 42 దేశాలకు చెందిన 488 చిత్రాలతో పోటీ పడి మరీ ‘గ్రీన్ ఆస్కార్’ను గెలుచుకుంది. -
అభయమేదీ..?
పెద్దదోర్నాల: నల్లమల..అపార వన్యప్రాణి సంపదకు నిలయం. పులుల అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ అటవీ ప్రాంతంలో 70 వరకు పెద్దపులులు, వందల సంఖ్యలో చిరుతలున్నాయి. పులుల చర్మాలకు, గోళ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్ల కన్ను వన్యప్రాణులపై పడింది. ఈ ప్రాంతంలో పులులను వేటాడి వాటి చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో శనివారం అటవీ అధికారులు మండలంలోని ఐనముక్కలలో ఓ ఇంట్లో సోదాలు చేయగా..రెండు పెద్దపులుల చర్మాలు ఒకేచోట లభించడం విస్మయానికి గురిచేసింది. పటిష్టమైన భద్రత, నిఘా వ్యవస్థలతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా యథేచ్ఛగా వేట కొనసాగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన అత్యంత తీవ్రమైనదిగా భావిస్తున్న అటవీ అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు. గతంలోనూ ఘటనలు... అడవి అంటే ఒకప్పుడు భయం..అడవిలో స్వేచ్ఛగా, రాజసం ఉట్టిపడేలా సంచరించే పులి అంటే వెన్నులోంచి వణుకు పుడుతుంది. అటువంటి పులి పాలిట కొందరు కాల యముళ్లలా మారారు. మూగజీవాలను నిర్దాక్షిణ్యంగా మట్టు పెడుతున్నారు. కుందేళ్లు, దుప్పులు, కణితులు, జింకలు, కొండగొర్రెలు, అడవి పందులు, అడవి కోళ్లు వేటగాళ్లకు ఆహారంగా మారుతుండగా పులులు, చిరుతలు కొందరు స్వార్థపరుల ధనదాహానికి బలవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు నల్లమలలో గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కొన్నేళ్ల కిందట బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కట్ని, బహిలియా జాతివారు పులులను వేటాడేందుకు నల్లమలలో ప్రవేశించారు. తుమ్మలబయ లు సమీపంలో 2002లో బహిలియా జాతికి చెందిన వారు పులిని చంపి గోళ్లు, చర్మాలను తీసుకెళ్లారు. 2009 నవంబర్‌లో దోర్నాల మండలంలోని చెంచుకుంట, కొర్రపోలు గూడెం ప్రాంతంలో చిరుత మృతదేహం లభించింది. దొనకొండ మండలం సాగర్ కాలువలో చిరుత మృతదేహం లభ్యమైంది. రెండేళ్ల క్రితం బీహార్ రాష్ట్రం పాట్నా నుంచి వచ్చిన స్మగ్లర్ల ముఠా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించగా, ముఠాలోని సభ్యుడైన పరమేశ్వరముండా యర్రగొండపాలెం మండలం దద్దనాల అటవీ ప్రాం తంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పాట్నాలోని సునీల్ కుమార్ అనే స్మగ్లర్ 40 మంది సభ్యులను పులుల కోసం అటవీ ప్రాంతంలో వదలి వెళ్లినట్లు అతను తెలపడంతో అప్పట్లో అటవీ శాఖాధికారులు అప్రమత్తయ్యారు. నిరంతర నిఘా..కఠిన చట్టాలున్నా... వన్యప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ప్రత్యేక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. వన్యప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. అభయారణ్యంలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు పెడతారు. పులుల అభయారణ్యంలోని వన్య ప్రాణులను వేటాడితే 2006-యాక్టు ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా కేసులు నమో దు చేసి శిక్షలు విధిస్తారు. మొదటిసారి అరణ్యంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్లలోపు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల దాకా జరిమానా ఉంటుంది. రెండోసారి అదే ముద్దాయి వన్యప్రాణులకు వేటాడితే ఏడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. 2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలం సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు. నాన్‌బెయిలబుల్ వారెంట్‌తోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఇంతటి కఠిన చట్టాలు అమలులో ఉన్నా వన్య ప్రాణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటు ఘాట్ రోడ్లలో వాహనాలపై వేగ నియంత్రణ ఉన్నా, కొందరు వాహనదారులు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి వన్యప్రాణుల ప్రశాంతతకు భంగం కలిగించడంతో పాటు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల మరణాలకు కారకులవుతున్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం: మార్కాపురం డీఎఫ్ఓ శరవణన్ మండల పరిధి ఐనముక్కల ఎస్సీ కాలనీలో పులుల చర్మాలు దొరకడంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎఫ్ఓ శరవణన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏసీఎఫ్ ఖాదర్‌వలి తెలిపారు. స్థానిక ఫారెస్టు రేంజి కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సిద్ధాపురంతో పాటు పలు ప్రాంతాల్లో అటవీశాఖ, పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. పులిచర్మాలతో పట్టుబడిన గంగమాల విజయ్‌బాబు, గంగమాల చిట్టిబాబులను కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ నెల 19వ తేదీ నుంచి శ్రీశైలం రోడ్డులో ఉన్న ఏపీ టూరిజం రిసార్ట్సులో బస చేశారని శనివారం చర్మాలు స్వాధీనం చేసుకునేందుకు తాము దాడులు జరిపిన నేపథ్యంలో వారు అక్కడ నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ కోణంలోనూ దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. -
మణికొండ జాగీర్.. పేలుళ్లతో బేజార్
- పరిమితికి మించి బ్లాస్టింగ్స్ - బీటలువారుతున్న ఇళ్లు - చెల్లాచెదురవుతున్న వన్యప్రాణులు గచ్చిబౌలి: మణికొండ జాగీరు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. భీకర శబ్దాలతో ఆ ప్రాంతవాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఓ నిర్మాణ సంస్థ పరిమితికి మించి పేలుళ్లు జరపడంతో సమీపంలో ఇళ్లు బీటలువారుతున్నాయి. వన్య ప్రాణులు చెల్లాచెదురవుతున్నాయి. అనుమతుల మాటున రెండున్నరేళ్లుగా సాగుతున్న మితిమీరిన పేలుళ్లను పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెండున్నరేళ్లుగా బ్లాస్టింగ్ తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి మణికొండ జాగీరులోని గుట్టల్లో స్థలం ఇచ్చారు. చిత్రపురి కాలనీగా పిలిచే ఈ వెంచర్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఐవీఆర్సీఎల్ నిర్మాణ సంస్థ నిర్మాణపు పనులు చేస్తోంది. ఇప్పటికే కొన్ని బ్లాకుల నిర్మాణం తుది దశలో ఉంది. రెండున్నరేళ్లుగా గుట్టను దాదాపు 70 శాతం బ్లాస్టింగ్ చేసి చదును చేశారు. ప్రశాంత్ హిల్స్ వైపు గుట్ట కొంత భాగం ఉంది. కొద్ది రోజులు గడిస్తే అదీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. బీటలువారుతున్న ఇళ్లు రాయదుర్గంలోని ప్రశాంత్హిల్స్ను ఆనుకొని ఉన్న గుట్టను బ్లాస్టింగ్ చేసి మరో బ్లాక్‌కు పునాదులు వేస్తున్నారు. ఓపెన్ బ్లాస్టింగ్స్‌తో ప్రశాంత్‌హిల్స్ వాసులు ఆందోళనకుగురవుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వెంకటరమణ ఇల్లుతో పాటు మరికొందరి ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. వన్య ప్రాణులకు ప్రాణ సంకటం మూడేళ్ల క్రితం మణికొండ జాగీరులో నెమళ్లతో పాటు కుందేళ్లు కనిపించేవి. భవనాల సంఖ్య పె రగడం, నిరంతర పేలుళ్లతో అవన్నీ చెదిరిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఇక, ఈ ప్రాంతంలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన శిలలు కనుమరుగువుతున్నాయి. గతంలో ప్రభుత్వం రాయదుర్గం, గచ్చిబౌలి, ఖాజాగూడ, మణికొం డ ప్రాంతాలలోని గుట్టలపై రాతి శిలలను కాపాడేందు రాక్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటిం చింది. ఈ ప్రతిపాదనలు రూపుదాల్చడానికి ముందే రాతి శిలలు కనుమరుగవుతున్నాయని ప్రకృతి ప్రేమికులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. అనుమతులున్నాయి: సీఐ శ్రీకాంత్ మణికొండ జాగీరులో ఐవీఆర్సీఎల్ నిర్మాణ సంస్థ చేపడుతున్న బ్లాస్టింగ్‌లకు అనుమతి ఉందని రాయదుర్గం సీఐ శ్రీకాంత్ తెలిపారు. ఫిర్యాదు అందితే పరిశీలిస్తామని, ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. -
మదిని దోచే చిత్రాన్నిచ్చే.. ఫొటోగ్రాఫర్
గత స్మృతుల్లోకి తీసుకెళ్లి, మనసును పులకరింపజేసే శక్తి అందమైన ఛాయాచిత్రానికి ఉంది. వంద మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో సులువుగా తెలియజేస్తుంది. మదిని దోచే అపురూపమైన ఫొటోలను తన కెమెరాలో బంధించి, భద్రంగా మన చేతికందించే కళాకారుడు.. ఫొటోగ్రాఫర్. సృజనాత్మకతతో అద్భుతాలే మనదేశంలో ఆదరణ పొందుతున్న కెరీర్.. ఫొటోగ్రఫీ. వృత్తిపరమైన సంతృప్తి, సమాజంలో పేరు, పనికి తగ్గ వేతనం అందించే కెరీర్ ఇది. సృజనాత్మకత, కష్టపడే తత్వం ఉంటే ఫొటోగ్రఫీలో అద్భుతాలే సృష్టించొచ్చు. ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో అందరూ ఫొటోగ్రాఫర్ల అవతారం ఎత్తుతున్నారు. ఆకట్టుకొనే దృశ్యం కనిపిస్తే చాలు.. ఫోన్లో బంధించి, వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. స్నేహితుల నుంచి ‘లైక్’లు కొల్లగొడుతున్నారు. మనం తీసిన ఫొటోను నలుగురు మెచ్చుకుంటే.. కలిగే సంతృప్తికి వెలకట్టలేం. ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీపై అడుగులేస్తున్న వారెందరో ఉన్నారు. ఆసక్తి, అభిరుచితో తీసిన మంచి ఫొటోలను కళాభిమానులు వేలాది రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. వివాహాలు, శుభకార్యాల్లో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల అవసరం తప్పనిసరిగా మారింది. ఇక మీడియాలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఒక్క ఫొటోతో సంచలనం సృష్టించినవారు ఉన్నారు. అవకాశాలు, సవాళ్లు మనదేశంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. నిపుణులైన ఫొటోగ్రాఫర్లకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలకు కొదవ లేదు. ఫ్యాషన్, వైల్డ్‌లైఫ్, జ్యుయెలరీ, సినిమా, జర్నలిజం వంటి విభాగాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్న వృత్తి. ఫొటోగ్రాఫర్లకు ఓపిక, సహనం తప్పనిసరిగా అవసరం. హాబీతోపాటు సంపాదన ‘‘అందమైన జ్ఞాపకంగానే కాకుండా అద్భుతమైన కెరీర్‌గా రాణించే అవకాశం ఉన్న రంగం ఫొటోగ్రఫీ. గ్లోబలైజేషన్ వల్ల కంపెనీల ప్రచారానికి విపరీతమైన గిరాకీ పెరిగింది. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు క్రియేటివిటీ, నాలెడ్జ్ ఉన్న ఫొటోగ్రఫీ నిపుణులకు మంచి వేతనాలను అందిస్తున్నాయి. ప్రకృతి ఆరాధకులు దీన్ని హాబీగా స్వీకరించి ఎంజాయ్ చేస్తూనే డబ్బు సంపాదించుకునేందుకు వీలుంది. గతానికి భిన్నంగా ఫొటోగ్రఫీ కొత్త టెక్నాలజీతో అప్డేట్ అవుతోంది. దీన్ని కెరీర్‌గా స్వీకరించిన వారికి మంచి వేతనం లభిస్తుంది. ప్రారంభంలో నెలకు కనీసం రూ. 25 వేలకు పైగా సంపాదించవచ్చు. నాలుగేళ్ల ఫొటోగ్రఫీ కోర్సులో పలు అంశాలపై శిక్షణ ఇస్తారు. మరో నాలుగు నెలలు ఇంటర్న్‌షిప్. అనంతరం ప్రొఫెషనల్‌గా స్థిరపడే అవకాశం ఉంటుంది.’’ - సనకా లక్ష్మీ పవన్, ఫొటోగ్రాఫర్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి -
తరిగిపోతున్న పచ్చధనం
- యథేచ్ఛగా వృక్షాల నరికివేత - ఆక్రమణల పాలవుతున్న అడవులు - చోద్యం చూస్తున్న అటవీ శాఖాధికారులు అనంతపురం : పచ్చదనం తరిగిపోతోంది. అటవీ ప్రాంత అభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయలతో ఏటా లక్షలాది మొక్కలు నాటుతున్న అధికారులు వాటి పర్యవేక్షణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోంది. స్వార్థపరులు విచక్షణా రహితంగా వృక్షాలు నరికి వేయడం, అటవీ భూముల దురాక్రమణ కారణంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 1,98,930 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీని పరిరక్షణకు అటవీ శాఖతో పాటు 284 వన సంరక్షణ సమితుల్లోని 75,300 మంది సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ అడవుల్లో రూ.12 కోట్ల వ్యయంతో 2011-12లో 300 హెక్టార్లలో 1.20 లక్షల నారేపి, తపసి మొక్కలు, 2012-2013లో 300 హెక్టార్లలో 1.20 లక్షల అటవీ జాతుల మొక్కలతోపాటు, 12లక్షల యూకలిప్టస్, 2013-14లో 900 హెక్టార్లలో వివిధ రకాల మొక్కలను అటవీ శాఖ నాటింది. సాధారణంగా అటవీ జాతుల మొక్కలు మూడేళ్లలో 8 నుంచి 10 అడుగులు, యూకలిప్టస్ మొక్కలు 15 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికి మూడేళ్లు దాటుతున్నా అడవుల్లో ఆ మేరకు పెరిగిన చెట్లు కనిపించడం లేదు. పైగా అధికారులు నాటిన మొక్కల సంఖ్యకన్నా, నరికివేతకు గురైన వృక్షాల సంఖ్యే అధికంగా ఉంటోందన్న వాదన వినిపిస్తోంది. జనారణ్యంలోకి వన్యప్రాణులు అడవుల్లోని వృక్షాలు విచ్చలవిడిగా నరికివేతకు గురికావడంతో ఒకప్పుడు పచ్చని అడవులుగా ఉన్నప్రాంతాలు ప్రస్తుతం బోడికొండలు, గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలు ఆవాసంగా కలిగిన వన్య ప్రాణులకు ఆహారం, తాగునీటి కొరత ఏర్పడుతోంది. దీంతో వాటిని వెతుక్కుంటూ వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడుతూ, ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన సంరక్షణ సమితుల పనితీరును మెరుగుపరచాలి. స్వార్థపర శక్తుల చేతుల్లో పడి అటవీ ప్రాంతాలు నాశనమై పోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిరంతరం అటవీ ప్రాంతాల్లో నిఘా ఉంచడమే కాకుండా, అటవీ చట్టాలను సైతం కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విచ్చలవిడిగా నరికివేత అడవుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైఫల్యమే అవి విస్తరించకపోవడానికి కారణమవుతోంది. దీనికి తోడు కొన్నేళ్లుగా స్మగ్లర్లు వృక్ష సంపదను యథేచ్ఛగా దోచుకోవడంతోపాటు, అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. వారం క్రితం తాడిమర్రి మండలం సమీపంలోని అటవీ ప్రాంతంలో టీడీపీకి చెందిన కొందరు కబ్జా చేసేందుకు భూమిని చదును చేస్తుండగా, స్థానికులు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు దాడి చేసి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో 540 హెక్టార్లు, ఎల్లుట్ల రిజర్వులో 150 హెక్టార్ల మేర దురాక్రమణకు గురైనట్లు అధికారులు చెబుతున్నా.. రికార్డులకు ఎక్కని ఆక్రమణలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ చర్యలు తీసుకుంటున్నాం అడవుల పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఏటా మొక్కలు నాటుతున్నా.. కొంత మంది వాటిని ధ్వంసం చేస్తున్నారు. 2014-15లో 600 హెక్టార్లలో 5.50 లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నాం. అడవుల నరికివేతను అరికట్టేందుకు కట్టుదిట్టమైనప్రణాళిక రూపొందిస్తున్నాం. - రాఘవయ్య, డీఎఫ్ఓ, అనంతపురం -
సూర్య @42
మే నెల ముగుస్తున్న సమయంలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. తన ప్రచండ కిరణాలతో భయపెడుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడిమి తీవ్రంగా ఉంటోంది. శుక్రవారం జిల్లాలో ఏకంగా 42.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మండుతున్న ఎండకు మనుషులతోపాటు వన్యప్రాణులూ విలవిల్లాడాయి. దాహార్తి తీర్చుకునేందుకు చెరువులు, కుంటల వైపు పరుగులు తీశాయి. గొంతు తడుపుకునేందుకు ఓ వానరం శుక్రవారం మహానంది పుణ్యక్షేత్రంలో పుష్కరిణిని ఆశ్రయించింది. అతి కష్టమ్మీద తన దాహార్తిని తీర్చుకుంది. -
అడవిలో అగ్నికీలలు
తగలబడుతున్న భారీ వృక్షాలు {పాణాలు కోల్పోతున్న వన్యప్రాణులు ఏటా 1500కు పైగా ప్రమాదాలు పర్యావరణానికి పెద్ద ఎత్తున చేటు కొయ్యూరు, న్యూస్‌లైన్: నిత్యం పచ్చగా కళకళలాడే తూర్పుకనుమల్లో అగ్గి రేగింది. సంబంధిత అధికారులు చొరవ చూపకపోవడం తో విలువైన వృక్షాలతోపాటు వన్యప్రాణులు కాలిబూడిదవుతున్నాయి. జీకే వీధి మండలం దబ్బకోట ప్రాంతం, డుంబ్రిగుడకు సమీపంలోని పెద్దపాడు కొండలు మూడు రోజు లుగా కాలిపోతున్నాయి. పరి సర గ్రా మస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలి తం లేకపోతోంది. తామంతా అడవిలో వ్యవసాయ పనుల్లో ఉండగా మంటలు ఎగిసిపడితే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 53 శాతం విసీ ్తర్ణం కలిగి ఉన్న విశాఖ మన్యంలో అగ్నిప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నా యి. వేసవిలో ఆకురాల్చే చెట్లు తూర్పుకనుమల్లో ఎక్కువ. మార్చి-ఏప్రిల్ మధ్యలో ఈ రాలిన ఆకులు ఎండిపోతాయి. అడవి లోకి వెళ్లే గిరిజనులు లేదా పశువుల కాపరు లు ఆకులను తగులబెడతారు. దీంతో పక్క నే ఉన్న భారీవృక్షాలకు కూడా మంటలు తాకి విలువైన కలప బూడిదైపోతోంది. మన్యంలో ఐదున్నర లక్షల హెక్టార్లకు పైబడి అడవులు ఉన్నాయి. ఇందులో సు మారు లక్ష హెక్టార్లలో దట్టమైన అడవి ఉంది. కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకచోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అటవీ శాఖ పెద్దగా స్పందించడంలేదు. కొన్నిచో ట్ల ప్రమాదాల నివారణకు కొన్ని చోట్ల తవ్వకపోవడంతో ఇలాంటి దావానలం వ్యాపిస్తోంది. ఈ మంటల్లో కొన్నిచోట్ల ఔషధ మొక్కలు కూడా కాలిపోతున్నాయి. అటవీ శాఖ నివేదిక ప్రకారం ఏడాదిలో 1,500కు పైగా అగ్నిప్రమాదాలు అడవుల్లో చోటుచేసుకుంటున్నాయి. దాదాపు 30శాతానికి పైగా అడవులు అగ్నిప్రమాదంలో నష్టపోతున్నాయి. దీనికితోడు చెట్లను నరికి న తర్వాత మోడులను కాల్చడం కూడా అట వీ నాశనానికి కారణమవుతోంది. దీంతో వాతావరణ కాలుష్యం ఏర్పడడమేకాకుం డా వన్యప్రాణులు సైతం మరణిస్తున్నా యి. దీనిపై ‘న్యూస్‌లైన్’ నర్సీపట్నం డీఎ ఫ్వో లక్ష్మణ్‌ను సంప్రదించగా విశాఖమన్యంలో అంత ఎక్కువగా ప్రమాదాలు జరి గే అవకాశం లేదన్నారు. ప్రమాదం జరిగి నా ఎండిపోయిన ఆకులు కాలుతాయి త ప్ప చెట్లకు ప్రమాదం ఉండదన్నారు. శేషాచలం అడవులకు ఇక్కడి అడవులకు వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. -
నల్లమల రక్షణకు చర్యలు
పెద్దదోర్నాల, న్యూస్‌లైన్: వనాలు..వన్యప్రాణులు ప్రకృతి వరాలు. అడవులను సంరక్షించడం మన కర్తవ్యం. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలో ప్రాముఖ్యత సంతరించుకున్న నల్లమల అభయారణ్యాల పరిరక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమూల్యమైన వృక్ష సంపద ను స్మగ్లర్ల బారి నుంచి కాపాడేందుకు, వన్యప్రాణులను వేటగాళ్ల నుంచి రక్షించేందుకు, వేసవిలో అగ్నికీలల నుంచి అటవీప్రాంతాన్ని సంరక్షించేందుకు ఆ శాఖాధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. జీవ వైవిధ్యానికి నెలవు... నల్లమల అడవులు ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ, గుంటూరు జిల్లాల్లో 9 వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 3,568 చ.కిమీలను కేంద్ర ప్రభుత్వం 1983లో అభయారణ్యంగా ప్రకటించింది. అభయారణ్యంలో పులులతో పాటు చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, హైనాలు, నెమళ్లతో పాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఎన్నోరకాల వృక్షాలు, ఔషధ మొక్కలు ఉన్నాయి. వేసవిలో జరిగే అగ్నిప్రమాదాల వల్ల వృక్ష సంపదకు భారీస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో వాటిని సంరక్షించేందుకు అటవీ ప్రాంతంలో ఫైర్లైన్లు, బేస్‌క్యాంపులను ఏర్పాటు చేశారు. బేస్‌క్యాంపులతో నిరంతర నిఘా: డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన బేస్‌క్యాంపులు అటవీ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. దోర్నాల రేంజ్ పరిధిలో రోళ్లపెంట, తుమ్మలబయలు, చిన్నమంతనాల, పెదారుట్ల, కుదప, పెద్దపెంట, ఎదురుపడియ, గంజివారిపల్లె ఫారెస్టు రేంజ్ పరిధిలో పాలుట్ల, ఇష్టకామేశ్వరి ఆలయం, యర్రగొండపాలెం రేంజ్లో పెద్దమ్మ గిరిజన గూడెం, దద్దనాల ప్రాంతాల్లో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టారు. ఒక్కో బేస్ క్యాంప్ బృందంలో ఏడుగురు సభ్యులుంటారు. వారిలో అటవీశాఖకు సంబంధించి ఏబీఓలు, మిగిలిన ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లున్నారు. దీంతో పాటు క్యాంప్ సెక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇద్దరు స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది అటవీ సంరక్షణ నిమిత్తం రేంజి పరిధిలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేక వాహనం, సమాచార వ్యవస్థను పటిష్ట పరిచేందుకు వైర్లెస్ నెట్‌వర్క్‌తో కూడిన వాకీటాకీలు సమకూర్చారు. అటవీ శాఖకు సహకరించండి: శ్రీనివాసులు, రేంజి అధికారి, పెద్దదోర్నాల నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణించే వాహనాలు వేగ నియంత్రణ పాటించాలి. అడవుల్లో అగ్గి నివారణకు అభయార ణ్యంలో అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను నిషేధించాం. అలాగే అటవీ గ్రామాల ప్రజలు, శ్రీశైలం మల్లన్న సన్నిధికి వెళ్లే వారు అడవిలో అగ్గి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా అగ్గి కనపడితే దాన్ని ఆర్పేందుకు అటవీశాఖకు సహకరించాలి. -
అభయారణ్యంలో.. భయం భయంగా..
పెద్దదోర్నాల, న్యూస్‌లైన్ : అడవుల్లో చెట్లను విచక్షణ లేకుండా నరికేయడంతో వన్యప్రాణులకు రక్షణ కరువవుతోంది. అడవుల్లో నీరు, ఆహారం దొరక్కపోవడంతో కొన్ని ప్రాంతాల్లో జంతువులు జనవాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇలా వచ్చిన జంతువులు మానవ మృగాల ఉచ్చులో చిక్కి బలవుతున్నాయి. రోడ్లను దాటే క్రమంలో అతి వేగంగా వెళ్లే వాహనాల కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. మనుషుల్లా పశుపక్ష్యాదులకూ అది వర్తిస్తుంది. వన్యప్రాణులు, అటవీ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి బాధ్యతగా అధికారులకు సహకరించాలి. లేదంటే జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అతివేగానికి బలవుతున్న జంతువులు ఘాట్ రోడ్లలో వాహనాలపై వేగ నియంత్రణ ఉన్నా.. కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి వన్యప్రాణుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. రోడ్లపై అటూఇటూ స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల మరణానికి కారకులవుతున్నారు. అభయారణ్యంలో ఇటువంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటుండటంతో వన్యప్రాణుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన తల్లితో పాటు రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. చిరుతకు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలజికల్ పార్క్‌కు తరలించారు. 2012 ఫిబ్రవరి 16వ తేదీన కర్నూలు రోడ్డులోని పెద్ద మంతనాల సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో జింక మృత్యువాత పడింది. మృతిచెందిన జింక మాంసాన్ని సేకరించిన నల్లగుంట్ల, అయ్యన్నకుంటకు చెందిన కొందరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2012 ఫిబ్రవరి 20వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు దాటుతున్న చారల దుప్పిని వేగంగా వస్తున్న ఓ వాహనం ఢీకొనడంతో దుప్పి రెండు కాళ్లు నలిగిపోయాయి. 2013 నవంబర్ 28వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని పెద్దచేమ బీట్ పరిధిలో రోడ్డు దాటుతున్న ఓ జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కడుపులోని బిడ్డతో సహా జింక మృత్యువాతపడింది. కొన్నేళ్ల క్రితం హర్యానాకు చెందిన ఓ ముఠా అభయారణ్యంలోని ఓ పెద్దపులిని, ఎలుగుబంటిని హతమార్చింది. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. చెంచు కుంట సమీపంలో చిరుత తమ మేకలను చంపుతోందంటూ కొందరు గొర్రెల కాపరులు చనిపోయిన మేక కళేబరంలో విషం పెట్టడంతో.. దాన్ని తిన్న ఓ చిరుత మృత్యువాతపడింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై ఎటువంటి సాక్ష్యాలు లభించకపోవడంతో ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు. విషం తిని మరణించిన చిరుత సంఘటన మరవక ముందే ల క్ష్మీపురం వద్ద సాగర్ కాలువ నీటిలో ఓ చిరుత మృతదేహం కొట్టుకొచ్చింది. ఇవే కాకుండా ఘాట్ రోడ్లలో జరిగిన ప్రమాదాల్లో ఎన్నో జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. సాక్ష్యాలను సమర్పించడంలో అధికారుల వైపల్యం.. వణ్యప్రాణులు, అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడాలంటే నిజ నిర్ధారణకు అవసరమయ్యే సాక్ష్యాలను న్యాయస్థానాలకు సమర్పించాల్చిన అవసరం ఉంది. వైల్డ్ లైఫ్ యాక్ట్, అటవీ చట్టాల ఉల్లంఘన, అక్రమార్కులకు విధించే శిక్షలు, సిబ్బంది ప్రాథమిక విధులు, తదిత ర అంశాలపై అటవీ శాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు.. నేరపరిశోధనలో మాత్రం వెనుకబడుతున్నారు. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయకపోవడం, నేరారోపణకు సంబంధించి సరైన సాక్ష్యాలను కోర్టు ఎదుట ప్రవేశపెట్టకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కేసులు బలహీనపడుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో నేర ప్రవృత్తి ఉన్న దుండగులు బరితె గించి విలువైన వనసంపదను తరలించడంతో పాటు, వన్యప్రాణులపై దాడులకు తెగబడుతున్నారు. అటవీ సిబ్బంది విధి నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుని దోషులను గుర్తించి శిక్షలుపడేలా చేయగలిగితే వనాలను, వణ్యప్రాణాలన కాపాడుకోగలం. -
ముగిసిన పిక్నిక్
సాక్షి, చెన్నై: వన్యప్రాణులకు మానసికోల్లాసం అవసరమేనని గుర్తిం చిన తమిళనాడు ప్రభుత్వం 2003 సంవత్సరంలో ఏనుగులకు పునరావాస శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో ఆలయ ఏనుగులను, ఇతర వ్యక్తుల పర్యవేక్షణలో ఉన్న ఏనుగులను ఒక చోటికి తరలించి వాటికి కావాల్సిన ఆహారాన్ని అందించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, శారీరక ఉత్తేజాన్ని కలిగించే విధంగా కార్యక్రమాలను చేపట్టడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశం. ప్రతి ఏటా పిక్నిక్‌లాగా గజరాజులకు ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. శిబిరం: ఏనుగుల్లో గజానందాన్ని కల్పించే విధంగా పునరావాస కేంద్రం గత ఏడాది డిసెంబర్లో ఆరంభం అయింది. కోయంబత్తూరు జిల్లా, మేట్టు పాళయం తాలుకా, తేక్కం పట్టి గ్రామం, వనభద్ర కాళియమ్మన్ ఆలయం సమీపంలోని భవానీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి వంద ఏనుగులు తరలి వచ్చాయి. 48 రోజుల పాటు ఇక్కడ స్నేహితుల్లా, సన్నిహితుల్లా, బంధువుల్లా కలసిమెలసి తిరిగాయి. ఏనుగులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన ఆహారం ఇచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించారు. కాగా ఏనుగులను సంరక్షించే మావటిలకు సైతం శిబిరంలో ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. చెరకు, అరటి, యాపిల్, కొబ్బరి మట్టలతో పాటు రాగి, బయో బూస్ట్ లాంటి బలమైన ఆహారాన్ని ఏనుగులకు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ శిబిరంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపిన గజరాజులు ఇక, తమ దారి తాము వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యూరుు.ముగిసిన శిబిరం: మంగళవారం శిబిరం ముగిసింది. ఇక గజరాజులను ఆయా ఆలయాలకు, ఆయా ప్రాంతాలకు, జూలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ముదుమలై శరణాలయం నుంచి బయటకు వెళ్లేందుకు గజరాజులు మారాం చేశాయి. ఏదో ఒక ఆలయంలోనో, జంతు ప్రదర్శన శాలలోనో ఒంటరిగా ఉండాల్సి వస్తుందన్న మనో వేదన ఆ గజరాజుల్లో నెలకొంది. లారీలు ఎక్కేందుకు మారాం చేశాయి. కొన్ని గజరాజులు అయితే, తమతో సన్నిహితంగా ఉన్న మరో గజరాజును ఆప్యాయంగా పలకరిస్తున్ననట్టు, వీడ్కోలు పలుకుతున్నట్టుగా కన్నీళ్లు పెడుతూ, తొండాన్ని పెన వేసుకుంటూ అక్కడి నుంచి కదిలాయి. తిరుపత్తురు, తిరువారూర్ ఆలయాల నుంచి వచ్చిన ఏనుగులు శివగామి, ధర్మమ్మా అయితే, కన్నీళ్లు పెట్టుకుంటూ మరీ వీడ్కోలు తీసుకోవడం అక్కడి వారిని కలచి వేసింది. అతి కష్టం మీద ఆయా ప్రాంతాలకు అన్ని గజరాజుల్ని అధికారులు పంపించేశారు. ఇక పిక్నిక్ ముగియడంతో, మళ్లీ ఈ అవకాశం కోసం మరో పది నెలలు గజరాజులు వేచిచూడాల్సిందే. అదే సమయంలో పిక్నిక్కు వచ్చిన గజరాజులకు అడవీ ఎనుగుల నుంచి ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు నాలుగు గుమ్కి ఏనుగులు రప్పించారు. ఈ ఏనుగులు అడుగు తీసి బయట పెట్టేందుకు మారాం చేయడంతో ఆ నాలుగింటిని శరణాలయంలోనే ఉంచేశారు. వాటికి మదం తగ్గిన తర్వాత బయటకు పంపించేందుకు నిర్ణయించారు. వండలూరు జూ నుంచి వెళ్లిన శరవణన్ అనే గున్న ఏనుగును టాప్సిలిప్కు పంపించేశారు. -
వాట్ ఎన్ ఐడియా
లింగంపేట, న్యూస్‌లైన్ : అడవులు అంతరించిపోతుండడం, అటవీ భూములు ఆక్రమణలకు గురవుతుండడం, వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుండడంతో ఆ శాఖ అధికారులపై అనేక విమర్శలు వచ్చాయి. ఎక్కువగా గిరిజనులే అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. వారు చెట్లను నరికి, భూములను చదు ను చేసి పంటలు పండిస్తున్నారు. అధికారులు కేసులు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు. అటవీ శాఖ అధికారులకు గిరిజనుల భాష రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు ఏం చెబుతున్నారో.. గిరిజనులు ఏం సమాధానం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. దీంతో గిరిజనులు అధికారులపై దాడులు చేసిన సంఘటనలూ ఉన్నాయి. ఈ పరిస్థితిని నిరోధించడానికి అటవీ శాఖ అధికారులు కసరత్తు చేశారు. వారికి ఓ ఐడియా తట్టింది. అడవులను ఆక్రమిస్తున్న గిరిజనులకే అటవీ భూముల సంరక్షణ బాధ్యత అప్పగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని భావించారు. వెంటనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంపులో ఐదుగురు నిరుద్యోగ గిరిజనులను ఎంపిక చేసి ఉద్యోగావకాశాలు కల్పించారు. జనవరి నుంచి బేస్ క్యాంపులు పనిచేస్తున్నాయి. గతేడాది అటవీ భూముల ఆక్రమణలు ఎక్కువగా జరిగిన లింగంపేట మండలం ఎక్కపల్లి తండా(ఎల్లారెడ్డి రేంజ్‌లోని బొల్లారం సెక్షన్లో ఉంది)లో అదే తండాకు చెందిన మున్యానాయక్ అనే యువకుడిని టీంలీడర్‌గా నియమించి బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇలా జిల్లాలో ఏడు క్యాంపులు పనిచేస్తున్నాయి. అదే విధంగా అటవీ శాఖలో కొత్తగా స్ట్రైకింగ్ ఫోర్స్ పేరిట మరికొన్ని బృందాలను కూడా నియమించారు. ఈ విధానం వల్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు అడవులను, అటవీభూములను, వన్యప్రాణులను సంరక్షించవచ్చన్నది అటవీ అధికారుల ఆలోచన.