ముగిసిన పిక్నిక్
Published Thu, Feb 6 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
సాక్షి, చెన్నై: వన్యప్రాణులకు మానసికోల్లాసం అవసరమేనని గుర్తిం చిన తమిళనాడు ప్రభుత్వం 2003 సంవత్సరంలో ఏనుగులకు పునరావాస శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో ఆలయ ఏనుగులను, ఇతర వ్యక్తుల పర్యవేక్షణలో ఉన్న ఏనుగులను ఒక చోటికి తరలించి వాటికి కావాల్సిన ఆహారాన్ని అందించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, శారీరక ఉత్తేజాన్ని కలిగించే విధంగా కార్యక్రమాలను చేపట్టడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశం. ప్రతి ఏటా పిక్నిక్‌లాగా గజరాజులకు ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు.
శిబిరం: ఏనుగుల్లో గజానందాన్ని కల్పించే విధంగా పునరావాస కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో ఆరంభం అయింది. కోయంబత్తూరు జిల్లా, మేట్టు పాళయం తాలుకా, తేక్కం పట్టి గ్రామం, వనభద్ర కాళియమ్మన్ ఆలయం సమీపంలోని భవానీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి వంద ఏనుగులు తరలి వచ్చాయి. 48 రోజుల పాటు ఇక్కడ స్నేహితుల్లా, సన్నిహితుల్లా, బంధువుల్లా కలసిమెలసి తిరిగాయి. ఏనుగులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన ఆహారం ఇచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించారు. కాగా ఏనుగులను సంరక్షించే మావటిలకు సైతం శిబిరంలో ప్రత్యేక సదుపాయాలను కల్పించారు.
చెరకు, అరటి, యాపిల్, కొబ్బరి మట్టలతో పాటు రాగి, బయో బూస్ట్ లాంటి బలమైన ఆహారాన్ని ఏనుగులకు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ శిబిరంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపిన గజరాజులు ఇక, తమ దారి తాము వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యూరుు.ముగిసిన శిబిరం: మంగళవారం శిబిరం ముగిసింది. ఇక గజరాజులను ఆయా ఆలయాలకు, ఆయా ప్రాంతాలకు, జూలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ముదుమలై శరణాలయం నుంచి బయటకు వెళ్లేందుకు గజరాజులు మారాం చేశాయి. ఏదో ఒక ఆలయంలోనో, జంతు ప్రదర్శన శాలలోనో ఒంటరిగా ఉండాల్సి వస్తుందన్న మనో వేదన ఆ గజరాజుల్లో నెలకొంది. లారీలు ఎక్కేందుకు మారాం చేశాయి. కొన్ని గజరాజులు అయితే, తమతో సన్నిహితంగా ఉన్న మరో గజరాజును ఆప్యాయంగా పలకరిస్తున్ననట్టు, వీడ్కోలు పలుకుతున్నట్టుగా కన్నీళ్లు పెడుతూ, తొండాన్ని పెన వేసుకుంటూ అక్కడి నుంచి కదిలాయి.
తిరుపత్తురు, తిరువారూర్ ఆలయాల నుంచి వచ్చిన ఏనుగులు శివగామి, ధర్మమ్మా అయితే, కన్నీళ్లు పెట్టుకుంటూ మరీ వీడ్కోలు తీసుకోవడం అక్కడి వారిని కలచి వేసింది. అతి కష్టం మీద ఆయా ప్రాంతాలకు అన్ని గజరాజుల్ని అధికారులు పంపించేశారు. ఇక పిక్నిక్ ముగియడంతో, మళ్లీ ఈ అవకాశం కోసం మరో పది నెలలు గజరాజులు వేచిచూడాల్సిందే. అదే సమయంలో పిక్నిక్‌కు వచ్చిన గజరాజులకు అడవీ ఎనుగుల నుంచి ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు నాలుగు గుమ్కి ఏనుగులు రప్పించారు. ఈ ఏనుగులు అడుగు తీసి బయట పెట్టేందుకు మారాం చేయడంతో ఆ నాలుగింటిని శరణాలయంలోనే ఉంచేశారు. వాటికి మదం తగ్గిన తర్వాత బయటకు పంపించేందుకు నిర్ణయించారు. వండలూరు జూ నుంచి వెళ్లిన శరవణన్ అనే గున్న ఏనుగును టాప్సిలిప్‌కు పంపించేశారు.
Advertisement
Advertisement