
కె.జి. రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇకపై ఏనుగులనూ పెంపుడు జంతువులుగా పెంచుకునే వీలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అమ్యూజ్‌మెంట్ పార్కుల అభివృద్ధి పేరుతో ఏనుగులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తరలించుకోవచ్చు కూడా. మానవ అవసరాలకు సైతం ఏనుగులను ఉపయోగించుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన తాజా సవరణలు ఇందుకు వీలు కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్)–1972 చట్టంలో చేసిన సవరణలకు ఆమోదముద్ర పడింది.
వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2022కు రాజ్యసభ సైతం గత నెల 19న ఆమోదముద్ర వేయడంతో ఏనుగులను సొంత అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు మరింత అధికారికం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మతపరమైన, ఇతర అవసరాల కోసం ఏనుగులను తరలించేందుకు ప్రత్యేకంగా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తాజా సవరణలో పేర్కొన్నారు.
ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో అమ్యూజ్‌మెంట్, జూ పార్కుల ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుందని కొందరు చెబుతుండగా.. తాజా సవరణలపై పర్యావరణ వేత్తలు, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలయన్స్ సంస్థ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్న అమ్యూజ్‌మెంట్ పార్కుకు ఏనుగులను తరలించేందుకు ఈ తాజా సవరణలు తోడ్పడతాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు అనధికారికంగానే..!
దేశంలో మానవ అవసరాలకు ఏనుగులను ఉపయోగించుకోవడం ఎప్పటినుంచో ఉంది. సర్కస్‌లలో ఏనుగులతో ఫీట్లు చేయించడం, కొండ ప్రాంతాల్లో భారీ దుంగలను లాగేందుకు ఏనుగులను ఉపయోగించుకోవడం జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ విధంగా సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్న ఏనుగుల సంఖ్య 2,675 వరకు ఉంది. ఇందులో కేవలం 1,251 ఏనుగులకు సంబంధించి మాత్రమే యాజమాన్య హక్కులను వాటిని వినియోగిసుస్తున్న వ్యక్తులు చూపుతున్నారు.
ప్రధానంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రక్షణ అవసరాలతో పాటు బరువైన మొద్దులను లాగేందుకు ఏనుగులను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది. అయితే, 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సొంత అవసరాలకు ఏనుగులను వినియోగించడం నిషేధించబడింది. అయినప్పటికీ ఈ వ్యవహారం ఇంకా అనధికారికంగానే కొన్ని రాష్ట్రాల్లో సాగిపోతోంది. అలా చేయడం ఏనుగులను బానిసలుగా మార్చడమేనని, వాటిని గంటల తరబడి నిలబెట్టడం, తరలింపు సమయంలో రోజుల తరబడి ప్రయాణం వంటివి వాటిని క్షోభకు గురి చేస్తాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు.
ఆ మినహాయింపుతో..
వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) చట్టాన్ని 1972లో రూపొందించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని సవరణలు చేసింది. వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2021 పేరుతో కొన్ని సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2021లోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగా.. అది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చేరింది. తాజాగా రాజ్యసభలో కూడా ఆమోదం పొందటంతో త్వరలో వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) బిల్లు–2022 కాస్తా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్ట రూపంలో అమల్లోకి రానుంది. గతంలో ఉన్న చట్టంలో ఏనుగులను సంరక్షించేందుకు అనేక అంశాలు తోడ్పడేవని.. తాజాగా చట్టంలో సెక్షన్ 43(2) ప్రొవిజన్ చేర్చడంతో చిక్కు వచ్చిపడిందని చెబుతున్నారు.
పాత చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి లేకుండా ఏ అడవి జంతువునైనా కలిగి ఉంటే అది వేటాడటం కిందకు వస్తుంది. కానీ.. విద్య, శాస్త్ర పరిశోధనల కోసం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో ఏనుగులను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అది కూడా సెక్షన్ 12 నిబంధనలకు లోబడి మాత్రమేనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా వినియోగించుకునే వెసులుబాటు కూడా ఆయా జంతువుల సంరక్షణ కేంద్రంగానే జరగాలని పేర్కొన్నారు. అయితే, తాజా సవరణల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రంగా అనే అంశాన్ని మినహాయించారనే ఆరోపణలున్నాయి.
సులభంగా తరలించేందుకేనా!
దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏనుగులను సులభంగా తరలించేందుకు ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ప్రధానంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మానవ అవసరాలకు ఉపయోగించుకునే (కేప్టివ్) ఏనుగులున్నాయి. వీటిని గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రదేశాలకు తరలించేందుకే కేంద్రం కొత్త చట్టం కేంద్రం తెచ్చిందనేది ప్రధాన ఆరోపణ.
గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్న అమ్యూజ్‌మెంట్ పార్కులతో పాటు కేరళలలోని దేవస్థానాల్లో ఏనుగులను ఉపయోగించేందుకు తాజా సవరణల అసలు ఉద్దేశమనేది పర్యావరణ ప్రేమికుల ఆందోళన. తద్వారా సహజసిద్ధంగా ఏర్పడిన ఏనుగు కారిడార్లను చెరిపివేయడం సరికాదని పేర్కొంటున్నారు. చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తాజా మార్పుల వెనుక ఉన్న అసలు కారణం తెలిసే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment