
వన్యప్రాణుల సంరక్షణలో అనంత్ అంబానీ చేస్తున్న విశేష కృషిని బాగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ప్రశంసించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నేతృత్వంలోని ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారా ‘జీవ్ మే శివ్ హై’ అనే దృక్పథంతో పని చేస్తుందని చెప్పారు. ధీరేంద్ర శాస్త్రి వంతారా చేస్తున్న కృషిని కొనియాడుతూ వీడియో విడుదల చేశారు. అదికాస్తా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వీడియోలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం..‘జీవ్ మే హి శివ్ హై.. ప్రతి జీవంలో శివుడు ఉంటాడు. ఇది అన్ని జీవుల్లో దైవిక ఉనికిని గుర్తించే తత్వం. ఎన్నో కారణాలవల్ల సంరక్షణకు నోచుకోని జంతువులకు కొత్త జీవితాన్ని అందించే కేంద్రం వంతారా ఎంతో కృషి చేస్తోంది. వంతారా అంటే ‘అటవీ నక్షత్రం’. దీని పేరుకు తగినట్లుగానే ఎన్నో వన్యప్రాణులను రక్షిస్తోంది. ఇందుకు అనంత్ అంబానీ అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. వంతారా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వణ్యప్రాణుల సంరక్షణ చర్యలకు ప్రేరణ ఇస్తోంది. మానవాళికి సమస్త జీవరాశుల సంరక్షణ స్ఫూర్తిని పెంపొందిస్తోంది’ అని తెలిపారు.
వంతారా
అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ కేర్ సెంటర్‌లో 240కి పైగా ఏనుగులను రక్షించారు. అల్లోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్(చైనాలో మాదిరి సుదులతో గుచ్చి రోగాన్ని నయం చేయడం) వైద్యాన్ని సమ్మిళితం చేసే అధునాతన పశువైద్య చికిత్సలను వంతారాలో అందిస్తున్నారు. ఆర్థరైటిస్ చికిత్స కోసం హైడ్రోథెరపీ, గాయం నయం చేయడానికి హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్ వంటి ప్రత్యేక సదుపాయాలున్నాయి.
ఇదీ చదవండి: హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!
‘ప్రాణి మిత్ర’గా గుర్తింపు
అనంత్ అంబానీకి జంతు సంరక్షణలో చేస్తున్న కృషికి గుర్తుగా ఇటీవల భారతదేశపు అత్యున్నత గౌరవమైన ప్రతిష్టాత్మక ‘ప్రాణి మిత్ర’ జాతీయ పురస్కారం లభించింది. ప్రాణి మిత్ర జాతీయ పురస్కారం జంతు సంరక్షణ విభాగంలో అందించే అత్యున్నత పురస్కారం. జంతువుల శ్రేయస్సుకు అవార్డు గ్రహీతలు చేసిన అసాధారణ కృషిని ఇది గుర్తిస్తుంది. గత ఐదేళ్లలో జంతు సంక్షేమానికి విశేష కృషి చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాల కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment