తమిళనాడులోని నీలగిరి అటవీప్రాంతంలో ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో (ఎలిఫెంట్ కారిడార్) నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన 11 రిసార్టులు, హోటల్స్ నిర్మాణాల్ని 48 గంటల్లో నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి గజరాజుల రక్షణ అంశం చర్చనీయాంశంగా మారింది. దేశంలోని ఎలిఫెంట్ కారిడార్లలో మూడింట రెండు వంతులు రక్షణ లేని రహదారులు, రైల్వే ట్రాక్‌ల మీదుగానే సాగుతున్నాయని ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 101 ఏనుగులు సంచరించే ప్రాంతాలు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో ఏనుగులు సంచరించడానికి వాటికి హక్కు ఉందని దానిని ఎవరూ కాలరాయకూడదంటూ గత ఏడాది కొందరు వన్యప్రాణ నిపుణులు రైట్ ఆఫ్ పాసేజ్ పేరుతో ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదికను వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ) ప్రచురించింది. ఒకవైపు రైల్వే ట్రాక్‌లు, వాహనాల కింద పడి ఎన్నో ఏనుగులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే, మరోవైపు గజరాజులు పంట పొలాల్లోకి ప్రవేశించి నాశనం చేయడం, మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీయడం కూడా జరుగుతోంది. ఒక్క ఉత్తర బెంగాల్‌లోనే ఏనుగుల దాడిలో ప్రతీ ఏటా 40 నుంచి 50 మంది చనిపోతున్నారు.
అభివృద్ధి పేరుతో అడవుల్ని ఇష్టారాజ్యంగా నరికేస్తూ ఉండడం, ఏనుగుల కారిడార్లలోనూ నిర్మాణాలు చేపట్టడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయని ఆ నివేదిక అంచనా వేసింది. ఈ కారిడార్లను కాపాడుకునే చర్యలు తీసుకోకపోతే అటు ఏనుగులు, ఇటు మనుషుల ప్రాణాలకు ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం ఏనుగులు సంచరించే కారిడార్ల విస్తీర్ణాన్ని, ఇప్పుడు ఉన్న విస్తీర్ణాన్ని పోల్చి చూస్తే ఏడాదికేడాది అది కుంచించుకుపోవడం ఆందోళన పెంచుతోంది. 2005లో 45 శాతం కారిడార్లు ఒక్క కిలోమీటర్ కంటే తక్కువ ఉంటే, 2017 నాటికి 74 శాతం కారిడార్లు ఒక్క కిలోమీటర్ కంటే తక్కువకి పరిమితమైపోయాయి. అంటే ఈ పన్నెండేళ్ల కాలంలో ఏ స్థాయిలో ఏనుగులు సంచరించే ప్రాంతాల్ని మనం ఆక్రమించామో అర్థంచేసుకోవచ్చు.
ఏనుగులు ప్రతీ ఏడాది సంచరించే ప్రాంతం – 350–500 చదరపు కిలోమీటర్లు
దేశవ్యాప్తంగా ఉన్న ఎలిఫెంట్ కారిడార్లు 101
దక్షిణ భారత్‌లో 28
మధ్య భారతంలో 25
ఈశాన్య భారతంలో 23
వాయవ్య భారతంలో 11
పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో 14
ఏనుగుల మందలు తరచు కనిపించేవి 70శాతం కారిడార్లలో ఏనుగులకు ముప్పు ఎలా ?
20 శాతం కారిడార్లు రైల్వే ట్రాకుల మీదుగా ఉన్నాయి
ప్రతీ మూడు కారిడర్లలో రెండింటిలో పంటలు తగుల బెట్టడం వంటి కార్యకలాపాలకు వినియోగిస్తూ ఉండడంతో గజరాజులు గజగజలాడుతున్నాయి.
1987–2017 మధ్య కాలంలో 277 ప్రమాదాల్లో రైళ్ల కింద పడిపోవడం వల్ల ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి.
12 శాతం కారిడార్లలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతూ ఉండడంతో గజరాజులకు రక్షణ లేకుండా పోయింది.
ఏనుగుల రక్షణ ఎలా ?
ఏనుగుల కారిడార్లలో ఆక్రమణల్ని తొలగించడం జరిగే పని కాదు కానీ వాటి సంరక్షణలో అందరినీ భాగస్వామ్యుల్ని చేయాలి. ఏనుగులు హాయిగా సంచరించాలంటే వాహనాల కోసం కనీసం 20 కారిడార్లలో ఓవర్ పాస్‌ల నిర్మాణమైనా జరగాల్సిన అవసరం ఉంది. ఏనుగులు సంచారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థానికులే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని బెంగుళూరుకు చెందిన పర్యావరణవేత్త పరమేశ మల్లెగౌడ అభిప్రాయపడ్డారు.
కుప్పంలో పరిస్థితేంటి ?
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో విస్తరించిన కారిడార్లలో మూడు దశాబ్దాల క్రితం ఏనుగులు విపరీతంగా సంచరించి పంటలకు తీవ్ర నష్టం కలిగించేవి. కోలార్ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం, క్రిష్ణగిరి, హోసూర్, బెన్నర్‌ఘట్ట, ముదుమలై మీదుగా ఏనుగులు మందలు మందలుగా సంచరిస్తూ ఉండేవి. చిత్తూరు జిల్లాలోని పీలేరు డివిజన్‌లో అడవులు వేగంగా తరిగిపోతూ ఉండడంతో చాలా ఏనుగులు శేషాచలం అడువుల్లోకి వెళ్లిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఏనుగులు తమకూ ముప్పు ఉందని గ్రహించాయో ఏమో, తామే సొంతంగా ఒక కారిడార్ ఏర్పాటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా తలకోన నుంచి కడప జిల్లా రాజంపేట వైపు ఈ ఏనుగుల మంద వెళ్లిపోయాయి. మళ్లీ అవి కుప్పం ప్రాంతంవైపు తొంగి కూడా చూడలేదు. అదే విధంగా 2014లో కుప్పం ప్రాంతంలో 28 ఏనుగుల మంద మల్లనూర్ స్టేషన్ వైపు వస్తూ ఉండడం గమనించిన రైల్వే అధికారులు అవి సురక్షితంగా ట్రాక్‌లు దాటేలా చర్యలు తీసుకోవడంతో ఆ గజరాజులు హాయిగా ఆగ్నేయ దిశగా ఉన్న కౌండిన్య వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత అవెప్పుడూ రైల్వే ట్రాక్‌ల్ని దాటడానికి ప్రయత్నించలేదు. స్థానికులు, అటవీ శాఖ అధికారులు కాస్త శ్రద్ధ వహిస్తే ఏనుగులకి రక్షణ కల్పించడం పెద్ద విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment