అనాథలైన ఇద్దరు పిల్లలు
పల్లడంలో కలకలం
సేలం : పల్లడంలో అనుమానాస్పద రీతిలో భార్య, భర్త మృతి చెందగా ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తిరుపూర్ జిల్లా పల్లడం సమీపంలో చిన్నకరై లక్ష్మీ నగర్‌లో కోడి మాంసం దుకాణం నడుపుతున్న వ్యక్తి సిలంబరసన్ (38). ఇతని భార్య అకిలాండేశ్వరి (28). వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ఈ స్థితిలో సోమవారం ఎప్పటిలాగే పనులు ముగించుకుని రాత్రి ఇంటిలో సిలంబరసన్ కుటుంబంతో నిద్రించారు. మంగళవారం ఉదయం నిద్రలేచిన కుమార్తెకు ఉరి వేసుకుని వేలాడుతూ తండ్రి, కత్తులతో నరికిన స్థితిలో రక్తపు మడుగులో తల్లి మృతదేహాలుగా పడి ఉండడం చూసి బోరున విలపించింది. సమాచారం అందుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక పోలీసు సూపరింటెండెంట్ సురేష్ అధ్యక్షతన పోలీసులు దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి ఆధారాలను సేకరించారు.
భార్యను హత్య చేసి తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తల్లిదండ్రులను ఒక్కసారిగా కోల్పోయి అనాథలై విలపిస్తున్న పిల్లలను చూసి గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు. ఇదే ప్రాంతంలో ఇటీవల తల్లి, తండ్రి, కుమారుడు దారుణ హత్యకు గురైన సంఘటన మరువక ముందే భార్య, భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment