Talakona Forest
-
శేషాచలం సానువుల్లో....
భ్రమణ కాంక్షే అసలైన మానవ కాంక్ష అని పెద్దలు అంటారు. తిరిగినవారే గెలుస్తారు అని కూడా అంటారు. నాలుగు వైపులకు వెళ్లకపోతే, నాలుగు దిశలలో నడవకపోతే బతుకు బావిలా మారుతుంది. కనుచూపు కురచబారుతుంది. ‘ఎదగాలంటే తిరగాలి’ అంటారు భూమన అభినయ్ రెడ్డి. అతనికి శేషాచలం కొండలు కొట్టిన పిండి. పదిహేనేళ్ల కిందట బ్రహ్మదేవుని గుండంకు చేసిన తొలి ట్రెక్కింగ్ నుంచి ఇటీవల తలకోనతో మొదలెట్టి యుద్ధగళ వరకు వారం రోజుల పాటు శేషాచలం అడవుల్లో సాగిన ట్రెక్కింగ్ వరకు అతడు పోగు చేసుకున్న అనుభూతులు ఎన్నో. వాటిలో కొన్ని ఇవి. ‘పదేళ్ల క్రితం మా అమ్మ రేవతి ‘యుద్ధగళ’కు వెళ్లి వచ్చి, ఆ విశేషాలు చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని సందర్శించాలను కున్నాను. అందురూ నడిచే మార్గంలో కాకుండా కొత్తదారిలో ఆ తీర్థానికి వెళ్లాలనుకున్నాను. ట్రెక్కింగ్ చేసే ఔత్సాహికులతో కలిసి యుద్ధగళకు పయనమయ్యాను. యుద్ధగళ ట్రెక్కింగ్ అడుగడుగునా ఆశ్చర్యంతో పాటు ఆనందానుభూతిని కలిగించింది. వారం రోజులు అడవిలోనే! యాభై మందితో సాగిన మా ట్రెక్కింగ్ యాత్ర.. శేషాచలం కొండలకు పడమర దిక్కున ఉన్న తలకోన నుంచి తాబేలు బావి, యుద్ధగళ, మూడేళ్ల కురవ, కంగుమడుగు, ఆదిమానుబండలు, ఎర్రంరెడ్డి మడుగు మీదుగా వైఎస్సార్ కడప జిల్లాలోని కుక్కలదొడ్డి వరకు సాగింది. ఎత్తైన తలకోన జలపాతాన్ని తనివి తీరా చూసుకుంటూ, ఆ కొండ ఎక్కి నాగరికత ఆనవాళ్లకు దూరంగా వారం రోజులు అడవిలోనే గడిపాం. నా చిరకాల కాంక్షను తీర్చే నడక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే మహావృక్షాలు, మానవ అలికిడికి భయపడి పారిపోయే జంతు జాలాలు, లెక్కలేనన్ని వృక్షజాతులు ఈ శేషాచలం అడవుల్లో ఉన్నాయి. జలపాత సోయగాల తలకోన అక్టోబర్ 8న ఉదయం తిరుపతి నుంచి తెల్లవారుజామునే బయల్దేరి తలకోనకు వెళ్ళాం. ఒక్కొక్కరి వీపుమీద దాదాపు ఇరవై కిలోల బరువుతో కొండపైకి నడక మొదలు పెట్టాం. రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతమైన తలకోన అందాలను, ఆ జలపాత సోయగాలను వీక్షిస్తూ ఆ కొండ కొసకు చేరాం. ఉదయం తొమ్మిదైంది. అప్పుడు కానీ మాకు సూర్యదర్శనం కాలేదు. అలా అడవిలో నాలుగు గంటలు నడిచాక మాకు అడ్డంగా ప్రవహిస్తున్న ఏరు కనిపించింది. ఆ ఏరు ప్రవాహానికి ఎదురుగా వెళితే తాంబేలేరు కనిపించింది. కొండపైన అంత ఎత్తులో ఎంతో స్వచ్ఛమైన నీళ్లు.! ఇక నేరుగా యుద్ధగళ తీర్థానికి వెళ్లాం. బొట్లు బొట్లుగా.. యుద్ధగళ యుద్ధగళ తీర్థంలో శ్రీవేంకటేశ్వర స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ గీసిన హనుమంతుడి బొమ్మలు చూశాం. ఆ రాత్రికి అక్కడే బసచేశాం. అడవిన కాసిన వెన్నెలను మేం తనివితీరా అనుభవించాం. మర్నాడు యుద్ధగళ తీర్థం దిగువున ఉన్న విష్ణుగుండంలోకి దిగాం. ఎనిమిది వందల మీటర్ల లోపలికి తాడు సాయంతో కిందకు దిగాం. అదొక గొప్ప అనుభూతి. మధ్యాహ్నం యుద్ధగళ తీర్థం సమీపంలో పెట్రోగ్లిఫ్‌లుగా పిలిచే చిత్రాలను పెద్ద బండపై ఉలితో చెక్కి ఉండడాన్ని చూశాం. ఆ చిత్రాలను ఎన్నో సామాజిక, సాంస్కతిక, మార్మిక అంశాలను పొందపరిచారు. ఉరకడానికి సిద్ధంగా ఉన్న రెండు ఆంబోతులు, ఒక గణాచారి ఈ చిత్రసంచయానికి హైలైట్. ఈ చిత్రాలపై పూర్తిస్థాయిలో పురావస్తు శాస్త్ర పరిశీలన జరగాల్సి ఉంది. పరిశోధన జరిగితే అదిమానవునికి సంబంధించిన ఆనవాళ్లు మరిన్ని బయటపడచ్చు. సాయంత్రం తిరిగి మడుగు వద్దకు వచ్చాం. యుద్ధగళ అసలు పేరు రుద్రగళ. ఆ తీర్థంలో రాత్రి నిద్రించినప్పుడు అందులో బొట్లు బొట్లుగా పడే నీళ్లు యుద్ధ శబ్దాలను తలపించేటట్టు ఉంటాయి. అందుకే ఈ తీర్థానికి యుద్ధగళ అని పేరొచ్చింది. మూడేర్ల కురవ.. కంగుమడుగు కంగుమడుగుకు సమీపంలో మూడేర్ల కురవ అనే ఏరు ఉంది. మూడు ప్రాంతాల నుంచి వచ్చే ఏర్లు కలిసి ప్రవహించడం వల్ల దీనికా పేరొచ్చింది. మరుసటి రోజు కంగు మడుగుకు ప్రయాణమయ్యాం. కంగు మడుగు పెద్ద ఏరు. ఏనుగులు నీటి కోసం, జలకాలాడటం కోసం వస్తాయి. కనుకే ఏనుగుల రాకను గమనిస్తూ ఉండాలి. అవి వచ్చి పడ్డాయంటే, తప్పించుకోవడం కష్టమే. ఇక్కడ ఏనుగులు సంచరించిన ఆనవాళ్లను గమనించాం. ఇక్కడ అటవీ శాఖ వారి బేస్ క్యాంప్ కూడా ఉంది. ఆ రాత్రి కంగుమడుగు ప్రాంతంలోనే బస చేశాం. తెల్లని వెన్నెల్లో.. అరిమాను బండలు మరుసటి రోజు ఉదయమే మళ్లీ మా నడక. మ«ధ్యాహ్నానికి అరిమాను బండలకు చేరుకోగలిగాం. అదొక ఎత్తైన ప్రదేశం. పౌర్ణమికి సరిగ్గా రెండు రోజులు ముందు కావడంతో ఆ రాత్రి చందమామ కురిపించే తెల్లని వెన్నెల ఎంత చల్లగా ఉందో. మరుసటి రోజు అరిమాను బండ కింద నుంచి గద్దలపీతుగుండం వెళ్లాం. ఇక్కడ కొన్ని గద్దలు సంచరించడం మాకు కనిపించింది. ఈ గుండానికి రెండు కిలోమీటర్ల దూరంలో మరో అద్బుతమైన సుందర ప్రదేశం బూడిదపునుకు. ఇది రమణీమైన గుండం. లేలేత సూర్యకిరణాలు నీటిని తాకుతున్న సుందర దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆదిమానవుడు గీసిన చిత్రాలు ఇక్కడ కూడా చరిత్ర పూర్వయుగం నాటి ఆదిమానవుడు గీసిన చిత్రాలు ఉన్నాయి. అనంతరం ఓ నాలుగు వందల మీటర్ల దూరాన్ని చిన్న కొండల మధ్య నడిచాం. అక్కడ ఓ చిత్రం మా కంటపడింది. అది ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లను తెలియజేసేది. జంతువులను వేటాతున్న మహిళల చిత్రం చూసి అబ్బుర పడ్డాం. సాయంత్రం ఆరిమానుబండకు తిరిగి వచ్చాం. రాత్రి అక్కడే బస చేశాం. నీటి మడుగుల్లో దీపాలు మా అడవి యాత్రలో ప్రయాణం ఆఖరి ఘట్టానికి చేరింది. బూడిదపునుకు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రమరెడ్డి మడుగుకు మరుసటి రోజు నడక ప్రారంభించాం. ఆ రోజంతా అక్కడే గడిపాం. అక్కడ దగ్గర దగ్గరగానే రెండు మడుగులున్నాయి. ఆ రోజు పున్నమి. మడుగులను దీపాలతో అలంకరించాం. ఆ దీపాల ప్రతిబింబాలతో మడుగులు చూడచక్కగా ఉన్నాయి. కళ్లార్పకుండా ఎంత సేపైనా చూడాలనిపించేంత అద్భుతంగా వెలుగొందాయి. పౌర్ణమి రాత్రి నీటిలో దాదాపు మూడు గంటల పాటు తనివితీరా గడిపాం. మా యాత్రలో ఆ చివరి రాత్రి ఎర్రమరెడ్డి మడుగు వద్దే గడిచింది. మరునాడు సోమవారం ఉదయం అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా కుక్కల దొడ్డికి చేరుకున్నాం.’ అని ముగించాడు అభినయ్. జీవవైవిధ్యం అన్ని సదుపాయాలూ ఉన్న నగరాలను, కాంక్రీటు వనాలను వదిలి అచ్చమైన, స్వచ్ఛమైన అడవిలోకి నడుచుకుంటూ వెళ్లి వారం రోజుల పాటు ఉండటం గొప్ప అనుభూతి. ప్రకృతితో లీనమైపోవడం, ప్రకృతిపైన ప్రేమను పెంచుకోవడం, అడవి అంటే ఇష్టం పెంచుకోవడం, అడవులను కాపాడాలన్న భావన కలిగించుకోవడం స్వయంగా అనుభూతించాం. మానవ మనుగడకు అడవుల రక్షణ, వాటిలోని జంతుజాలం రక్షణ ఎంతగా ఉపకరిస్తాయో స్వయంగా తెలుసుకున్నాం. – భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి -
గజరాజులకి దారేది ?
తమిళనాడులోని నీలగిరి అటవీప్రాంతంలో ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో (ఎలిఫెంట్ కారిడార్) నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన 11 రిసార్టులు, హోటల్స్ నిర్మాణాల్ని 48 గంటల్లో నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి గజరాజుల రక్షణ అంశం చర్చనీయాంశంగా మారింది. దేశంలోని ఎలిఫెంట్ కారిడార్లలో మూడింట రెండు వంతులు రక్షణ లేని రహదారులు, రైల్వే ట్రాక్‌ల మీదుగానే సాగుతున్నాయని ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 101 ఏనుగులు సంచరించే ప్రాంతాలు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో ఏనుగులు సంచరించడానికి వాటికి హక్కు ఉందని దానిని ఎవరూ కాలరాయకూడదంటూ గత ఏడాది కొందరు వన్యప్రాణ నిపుణులు రైట్ ఆఫ్ పాసేజ్ పేరుతో ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదికను వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ) ప్రచురించింది. ఒకవైపు రైల్వే ట్రాక్‌లు, వాహనాల కింద పడి ఎన్నో ఏనుగులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే, మరోవైపు గజరాజులు పంట పొలాల్లోకి ప్రవేశించి నాశనం చేయడం, మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీయడం కూడా జరుగుతోంది. ఒక్క ఉత్తర బెంగాల్లోనే ఏనుగుల దాడిలో ప్రతీ ఏటా 40 నుంచి 50 మంది చనిపోతున్నారు. అభివృద్ధి పేరుతో అడవుల్ని ఇష్టారాజ్యంగా నరికేస్తూ ఉండడం, ఏనుగుల కారిడార్లలోనూ నిర్మాణాలు చేపట్టడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయని ఆ నివేదిక అంచనా వేసింది. ఈ కారిడార్లను కాపాడుకునే చర్యలు తీసుకోకపోతే అటు ఏనుగులు, ఇటు మనుషుల ప్రాణాలకు ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం ఏనుగులు సంచరించే కారిడార్ల విస్తీర్ణాన్ని, ఇప్పుడు ఉన్న విస్తీర్ణాన్ని పోల్చి చూస్తే ఏడాదికేడాది అది కుంచించుకుపోవడం ఆందోళన పెంచుతోంది. 2005లో 45 శాతం కారిడార్లు ఒక్క కిలోమీటర్ కంటే తక్కువ ఉంటే, 2017 నాటికి 74 శాతం కారిడార్లు ఒక్క కిలోమీటర్ కంటే తక్కువకి పరిమితమైపోయాయి. అంటే ఈ పన్నెండేళ్ల కాలంలో ఏ స్థాయిలో ఏనుగులు సంచరించే ప్రాంతాల్ని మనం ఆక్రమించామో అర్థంచేసుకోవచ్చు. ఏనుగులు ప్రతీ ఏడాది సంచరించే ప్రాంతం – 350–500 చదరపు కిలోమీటర్లు దేశవ్యాప్తంగా ఉన్న ఎలిఫెంట్ కారిడార్లు 101 దక్షిణ భారత్‌లో 28 మధ్య భారతంలో 25 ఈశాన్య భారతంలో 23 వాయవ్య భారతంలో 11 పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో 14 ఏనుగుల మందలు తరచు కనిపించేవి 70శాతం కారిడార్లలో ఏనుగులకు ముప్పు ఎలా ? 20 శాతం కారిడార్లు రైల్వే ట్రాకుల మీదుగా ఉన్నాయి ప్రతీ మూడు కారిడర్లలో రెండింటిలో పంటలు తగుల బెట్టడం వంటి కార్యకలాపాలకు వినియోగిస్తూ ఉండడంతో గజరాజులు గజగజలాడుతున్నాయి. 1987–2017 మధ్య కాలంలో 277 ప్రమాదాల్లో రైళ్ల కింద పడిపోవడం వల్ల ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. 12 శాతం కారిడార్లలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతూ ఉండడంతో గజరాజులకు రక్షణ లేకుండా పోయింది. ఏనుగుల రక్షణ ఎలా ? ఏనుగుల కారిడార్లలో ఆక్రమణల్ని తొలగించడం జరిగే పని కాదు కానీ వాటి సంరక్షణలో అందరినీ భాగస్వామ్యుల్ని చేయాలి. ఏనుగులు హాయిగా సంచరించాలంటే వాహనాల కోసం కనీసం 20 కారిడార్లలో ఓవర్ పాస్‌ల నిర్మాణమైనా జరగాల్సిన అవసరం ఉంది. ఏనుగులు సంచారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థానికులే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని బెంగుళూరుకు చెందిన పర్యావరణవేత్త పరమేశ మల్లెగౌడ అభిప్రాయపడ్డారు. కుప్పంలో పరిస్థితేంటి ? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో విస్తరించిన కారిడార్లలో మూడు దశాబ్దాల క్రితం ఏనుగులు విపరీతంగా సంచరించి పంటలకు తీవ్ర నష్టం కలిగించేవి. కోలార్ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం, క్రిష్ణగిరి, హోసూర్, బెన్నర్ఘట్ట, ముదుమలై మీదుగా ఏనుగులు మందలు మందలుగా సంచరిస్తూ ఉండేవి. చిత్తూరు జిల్లాలోని పీలేరు డివిజన్లో అడవులు వేగంగా తరిగిపోతూ ఉండడంతో చాలా ఏనుగులు శేషాచలం అడువుల్లోకి వెళ్లిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఏనుగులు తమకూ ముప్పు ఉందని గ్రహించాయో ఏమో, తామే సొంతంగా ఒక కారిడార్ ఏర్పాటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా తలకోన నుంచి కడప జిల్లా రాజంపేట వైపు ఈ ఏనుగుల మంద వెళ్లిపోయాయి. మళ్లీ అవి కుప్పం ప్రాంతంవైపు తొంగి కూడా చూడలేదు. అదే విధంగా 2014లో కుప్పం ప్రాంతంలో 28 ఏనుగుల మంద మల్లనూర్ స్టేషన్ వైపు వస్తూ ఉండడం గమనించిన రైల్వే అధికారులు అవి సురక్షితంగా ట్రాక్‌లు దాటేలా చర్యలు తీసుకోవడంతో ఆ గజరాజులు హాయిగా ఆగ్నేయ దిశగా ఉన్న కౌండిన్య వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత అవెప్పుడూ రైల్వే ట్రాక్ల్ని దాటడానికి ప్రయత్నించలేదు. స్థానికులు, అటవీ శాఖ అధికారులు కాస్త శ్రద్ధ వహిస్తే ఏనుగులకి రక్షణ కల్పించడం పెద్ద విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పథకం ప్రకారమే హత్య
భాకరాపేట : తలకోనలో యువకుడిని పథకం ప్రకారమే హత్య చేశారని, ఇందులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని పీలేరు రూరల్ సీఐ కె.నరసింహమూర్తి తెలిపారు. ఆయన గురువారం భాకరాపేటలోని సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15న ఎర్రావారిపాళెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో యువకుడు హత్యకు గురయ్యాడని తెలిపారు. మొదట గుర్తు తెలియని యువకుడిగా కేసు నమోదు చేశామన్నారు. ఎర్రావారిపాళెం, భాకరాపేట ఎస్ఐలు గోపి, రవినాయక్ కేసు దర్యాప్తు చేపట్టి మృతుడు రొంపిచెర్ల మండలం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన హసన్‌షా కుమారుడు ఇమ్రాన్ (20)గా గుర్తించినట్టు చెప్పారు. అతని సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులు అయేషా, అస్మా, టిప్పుసుల్తాన్, బావాజాన్(పఠాన్‌బావాజీ)ను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కుమార్తెను వేధిస్తున్నాడని.. రొంపిచెర్ల మండలం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన అయేషా కుమార్తెను ఇమ్రాన్ వేధించేవాడు. దీంతో వారు రొంపిచెర్ల నుంచి కదిరికి వెళ్లిపోయారు. అక్కడ కూలి పనులు చేసుకునే వారు. ఇమ్రాన్ వారి ఫోన్ నంబరు తెలుసుకుని వేధింపులకు పాల్పడేవాడు. అతన్ని అయేషా, ఆమె అన్న టిప్పుసుల్తాన్ వారించారు. అయినా ఫలితం లేదు. దీనికితోడు అయేషా మరిది బావాజాన్‌కు, ఇమ్రాన్ కుటుంబానికి పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్‌ను అడ్డు తొలగించుకోవాలని కదిరిలో ఉన్న అయేషా చెల్లెలు అస్మా, రొంపిచెర్లలో ఉన్న టిప్పుసుల్తాన్, అయేషా మరిది బావాజాన్‌తో కలిసి పథకం పన్నారు. ఇందులో భాగంగా అస్మాను మదనపల్లెకు చెందిన అమ్మాయిగా పరిచయం చేశారు. కదిరికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి ఆధారాలతో సిమ్ కార్డు తీసుకుని అస్మా ఇమ్రాన్‌తో మాట్లాడేలా చేశారు. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి.. ఆటోలో వెళుతుండగానే కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇమ్రాన్‌తో తాగించారు. అనంతరం తలకోనలోని అటవీ అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అక్కడ అయేషా, టిప్పుసుల్తాన్ ఉండిపోయారు. అస్మా, ఇమ్రాన్ ఏకాంతం కోసం అడవిలోకి వెళతామని చెప్పి అటువైపు ఎవరు రాకుండా బావాజాన్‌ను కాపలా ఉంచారు. ఆ వెనుకనే టిప్పు సుల్తాన్, ఆయేషా చేరుకున్నారు. నిద్రమత్తులోకి జారుకున్న ఇమ్రాన్ కళ్లలో కారం పొడి చల్లారు. అతన్ని అస్మా, టిప్పుసుల్తాన్ పట్టుకోగా అయేషా గొంతు కోసి చంపేశారు. ఇమ్రాన్ సెల్‌ఫోన్‌ను, హత్యకు వాడిన వస్తువులను కొండారెడ్డిగారిపల్లె సమీపంలో చెక్‌డ్యామ్ వద్ద కాల్చివేసి ఆధారాలు లేకుండా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. హార్సిలీహిల్స్‌లో హత్యకు పథకం.. పథకంలో భాగంగా ఇమ్రాన్‌ను హార్సిల్‌హిల్స్‌కు రావాలని కోరారు. అంతదూరం తాను రాలేనని, తలకోనకైతే వస్తానని ఇమ్రాన్ చెప్పడంతో పథకం మార్చుకున్నారు. ఈ నెల 15న తలకోనకు వస్తానని ఇమ్రాన్ చెప్పడంతో అక్కడే చంపేయాలనుకున్నారు. ఈ నెల 14న కదిరి నుంచి అస్మా, అయేషా రొంపిచెర్లకు చేరుకున్నారు. టిప్పు సుల్తాన్, బావాజాన్‌తో కలిసి హత్యకు అవసరమైన కత్తి, రెండు ద్విచక్ర వాహనాలు, కారంపొడి, చేతికి, కాళ్లకు గ్లౌజులు, హెల్మెట్, బురకాలు సేకరించుకున్నారు. అందరూ కలిసి ఎర్రావారిపాళెం చేరుకున్నారు. బావాజాన్ ముందుగా తలకోనకు వెళ్లిపోయాడు. మిగిలిన వారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఎర్రావారిపాళెంలో ఉంచి ఆటోను బాడుగకు మాట్లాడుకున్నారు. టిప్పు సుల్తాన్ ఆడవారిలాగా బురకా, చేతికి, కాళ్లకు గ్లౌజులు వేసుకుని అయెషా, అస్మా, ఇమ్రాన్‌తో కలిసి తలకోనకు బయలుదేరారు. మృతుడి బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన భాకరాపేట ఇమ్రాన్‌ను చంపిన నిందితులను భాకరాపేటకు తీసుకొచ్చారని తెలుసుకున్న మృతుడి బంధువులు పెద్దయెత్తున అక్కడికి చేరుకున్నారు. అన్యాయంగా ఇమ్రాన్‌ను చంపేశారని, వారిని మీరే ఇక్కడే చంపేయండి సార్ అంటూ నినాదాలు చేశారు. లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్ వద్ద గందరగోళం నెలకొనడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సీఐ నరసింహమూర్తి రొంపిచెర్ల వాసులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య నిందితులను పీలేరు కోర్టుకు తరలించారు. హత్య కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. -
తలకోనలో కూంబింగ్
చిత్తూరు (ఎర్రావారిపాలెం) : చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలంలోని తలకోన అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలో ఓ చోట డంపింగ్ చేసిన సుమారు రూ.25 లక్షల విలువ చేసే 240 కేజీల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలంతా వేలూరు జిల్లా అద్దెకుప్పానికి చెందిన వారిగా గుర్తించారు. -
జోరు పెంచిన బాలయ్య